Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

మనిషిని బతికించేది శ్వాస కాదు - ఆశ

Manishini batikinchedi shwasa kaadu aasha: bhaskarabatla

మీ కుటుంబ నేపధ్యం ఏమిటి? అనుకునే కవి అయ్యారా - అనుకోకుండానా ? ఆనాటి మీ అనుభవాలన్నీ చెప్పండి.
మా నాన్న గారు పౌరహిత్యం చేసేవారు. నాకు చిన్నప్పటి నుంచీ శ్రీ శ్రీ, తిలక్, గద్దర్ అంటే పిచ్చి. బడిలో పుస్తకాల మీద ' భాస్కరభట్ల, రచయిత ' అని వ్రాసుకునేవాడిని. వ్రాసే పని తప్ప వేరే ధ్యాస లేదు. అక్షరాలు వ్రాయడం, చదవడం ఇష్టం. రాజమండ్రి లో ఇన్నీస్ పేట, సీతంపేటల్లో ఉన్న గ్రంధాలయాలు నాకిష్టమైన ప్రదేశాలు. తెలుగంటే ప్రాణం. చిన్నప్పటి నించి తెలుగు మాధ్యమంలోనే చదివాను. ఇంటర్ లో CET (కామర్స్, ఎకనామిక్స్, తెలుగు) నా గ్రూప్. డిగ్రీ లో PHT (పాలిటిక్స్, హిస్టరీ, తెలుగు). అసలలాంటి గ్రూపులు ఉంటాయని కూడా చాలామందికి తెలియదు . కవి సమ్మేళనాలకు వెళ్ళడం, అవధానాలు చూడడం ఒక వ్యసనం. మేడసాని మోహన్, మాడుగుల నాగఫణిశర్మ అవధానాలంటే మా చుట్టుపక్కల ఎక్కడ జరిగినా పరిగెట్టు కెళ్ళేవాడిని. పద్యాలు చదవడం, వినడం ఇష్టం ఉన్నా వ్రాయాలంటే గౌరవంతో కూడిన భయం. నాకు భావ ప్రధానమైన వచనకవిత్వమే ఇష్టం. అందులో ' ఆర్ద్రత' నా కిష్టమైన అంశం.
ఇంట్లో నాన్న గారికి వచన కవిత్వం అంటే పడేది కాదు. ఛందస్సు, వ్యాకరణం ఉన్న పద్యమే కవిత్వం అనేవారు. నా రాతలకి చిరాకుపడేవారు. 'రుద్రవీణ' సినిమా చూసినప్పుడు నన్ను చిరంజీవి లోనూ, నాన్న గారిని జెమినీ గణేషన్ లోనూ చూసుకున్నాను. ఆ సినిమా నాకు చాలా ఇష్టం.
ఇక 10 వ తరగతిలో ఉండగా తెలుగు విశ్వ విద్యాలయం వాళ్ళు రాజమండ్రి లో 'సాహిత్య పీఠం' పెట్టారు. అందులో కవి సమ్మేళనానికి వెళ్ళాను. అందరూ M.Phil, Phd చదివిన వాళ్ళు - మధ్యలో నేను. మొత్తానికి కవిత చదివాను. ఒక hand bag  బహుమతిగా ఇచ్చారు. అది ఇప్పటికీ ఉంది. అప్పుడు చదివిన కవిత ప్రాధమిక దశలో ఉందని తర్వాత ఎప్పుడో అర్ధమైంది. అనకాపల్లి గౌరీ గ్రంధాలయం స్వర్ణోత్సవాల సందర్భంగా కవితల పోటీలో పాల్గొంటే 'ప్రోత్సాహక పురస్కారం' వచ్చింది. దానిని డా. సినారె చేతుల మీదుగా అందుకోవడం కవిగా నేను మరిచిపోలేని సంఘటన.

మరి ప్రవృత్తిగా మొదలైన రచనని వృత్తిగా ఎలా మలచుకున్నారు ?
ఇంటర్ లో ఉండగా అమ్మని డబ్బులడిగి అశోకా బ్లేడ్ కొనుక్కొని గెడ్డం గీసుకుంటున్నాను. అప్పుడు అనిపించింది - 'గెడ్డం గీసుకుంటున్నానంటే పెద్దవాణ్ణి అయ్యాను కదా.. అమ్మా నాన్నల మీద ఆధారపడకుండా మనం కూడా సంపాదన మొదలు పెట్టాలి కదా' అని.
ఆ రోజే ఈనాడు కార్యాలయానికి వెళ్లి ఉద్యోగం ఇమ్మని అడిగాను. అప్పటి వరకు నేను వ్రాసినది, చూపించి ఇంకేం వ్రాయగలనో కూడా చెప్పుకున్నాను. లోకల్ రిపోర్టర్ గా నియమించారు. రూ. 126/- నా తొలి సంపాదన. తర్వాత రాజమండ్రి సాంస్కృతిక కార్యక్రమాల విలేఖరిగా పదవోన్నతి ఇచ్చారు. అలా పనిచేస్తూనే డిగ్రీ చదివాను. ఫైనల్ ఇయర్ లో సితార లో ఉద్యోగం. చదువు ఆపేసి సంపాదనే ముఖ్యమనుకుని ఉద్యోగంలో చేరిపోయాను.

మరి సినిమా రంగ ప్రవేశం ఎలా జరిగింది ?
ఒకసారి తనికెళ్ల భరణి గారు తమ ఇంట్లో ఒక వేడుకలో పాత్రికేయుల్లో కవిత్వం వ్రాయగలిగే వాళ్ళని పిలిపించి కవి సమ్మేళనం పెట్టారు. అప్పటికే నేను జర్నలిజం వదిలేసి సినిమా పాట వ్రాయాలనే నిర్ణయంతో రెండు, మూడు సినిమాల్లో వ్రాసాను. 'గొప్పింటల్లుడు' నా తొలి చిత్రం. ఇక భరణి గారింట్లో గోదావరి మీద కవిత చదివాను.
" నా దమనుల్లో సిరల్లో రక్తం కాదు ప్రవహించేది గోదావరే..!"
.... అంటూ మొదలుపెట్టి ' ఇగిరిపోని మంచి గంధమా.. వాడిపోని పారిజాతమా' అని ముగించాను.
ఆ మధ్యలో ఉన్న కొన్ని ఆర్ద్రమైన పంక్తులకి అక్కడే ఉన్న చక్రి ఏడ్చేశాడు.
'ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం' సినిమాలో నా చేత పాట రాయించాలని చక్రి పూరీ జగన్నాధ్ కి సిఫార్సు చేశాడు. అప్పటికే నేను పూరీ జగన్ కి పరిచయం అయ్యాను. బద్రి స్క్రిప్ట్ రాసుకుంటున్నప్పుడు ఒకాయన ద్వారా కలిశాను. ఆయనకు కుడా నాకొక పాట ఇవ్వాలని మనసులో ఉంది. అలా నాకు ' రామ సక్కని బంగారు బొమ్మ...' పాట వ్రాసాను. ఆ సినిమా విడుదల కాకుండానే ఈనాడు ఉద్యోగం పూర్తిగా వదిలేశాను. పాటకి రూ. 5000/- సంపాదన. ' నెలకో పాట రాదా!' అనుకున్నాను. వస్తుందన్న ధీమాతో తెగ తిరగడం మొదలుపెట్టాను. నేను తిరగని సినిమా ఆఫీసు లేదు. సెక్యూరిటీ గార్డులు కూడా అంత తిరిగుండరు .

నిజంగా నెలకో పాట వచ్చిందా ?
కాస్త కష్టమయింది. ఆంధ్రభూమి శాస్త్రిగారి దగ్గరకెళ్ళి ప్రియదర్శని శీర్షిక దగ్గర నించి అన్ని శీర్షికలకి కావల్సిన వ్యాసాలు ఒక 50 దాకా ఇచ్చాను. అందుకు నా భార్య చేసిన సాయం అంతా ఇంతా కాదు. తాను వంటింటి చిట్కాల వంటివి రాస్తే నేను చివరకు ఆ వ్యాసాలకి సొగసులు అద్ది ఆంధ్రభూమికి ఇచ్చేవాడిని. నెలకు రూ. 7000/- ఇచ్చేవారు. దాంతో ఇల్లు గడిచేది. ఆ పైన ప్రయత్నాలు వేసుకునేవాడిని.


రాసిన ప్రతి పాటకి పారితోషికం వచ్చేదా ?
చాలా మంది ఎగ్గొట్టారు.. తొలి నాళ్ళల్లో.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
 

కవులకి మహిళాభిమానులు ఎక్కువగా ఉంటారని చాలామంది అపోహ పడుతుంటారు. అపోహేనా?
అపోహ కాదు. కవి పేరు వినిపించేలా చేస్తే. మహిళలనే కాదు ఎవరైనా అభిమానులు తయారవడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో రేడియోలో సినిమా పాటలు వచ్చినప్పుడు కవి పేరు చెప్పేవారు. ఇప్పడు F.M ల్లో చెప్పడం లేదు. అందుకే గీత రచయితలు జనానికి తెలిసినా వాళ్ళు వ్రాసిన పాటలేమిటో తెలుసుకోలేకపోతున్నారు. కనుక అభిమానులని సంపాదించుకోవడం కష్టమే.

ఇన్ని రకాల పాటలు, ఇన్ని భావాలు పలికించడానికి నిత్యం మీరు చేసే సాధన?
చదవడం. ఉదయం లేచి పేపర్ లో ప్రతీ పదం చదువుతా. కధలు, కవితలు, అన్నీ.... ఈనాడు 'తెలుగు వెలుగు' ని వదలను. ఈ మధ్యన చదివిన కధల్లో 'జీవం' అనే కధ బాగా నచ్చింది. ఆ రచయిత పేరు ఇంకా నచ్చింది - 'స్కై బాబా' అట. నేను పుస్తకాలు కొంటూనే ఉంటా, చదువుతూనే ఉంటా.

ఇష్టమైన రచనని వృత్తిగా చేసుకున్నారు బానే వుంది.. కానీ ఇష్టం వచ్చినట్టు రాసుకునే వీలుందా సినిమా కవిగా ?
మనకు ఏం తెలుసు అన్న దానికంటే ఎదుటి వాడికి ఏం తెలుసు అన్న దాని మీదే ఈ వృత్తి ఆధారపడి ఉంటుంది. ఒకసారి నేనొక పాట రాశాను. 'నువ్వు మహనీతిగ ఉంటే లోకమే బాగవుతుందా! పంచదారెంత వేస్తున్నా కడలి నీరు ఉప్పే' నిర్మాత బాలేదన్నాడు. ఎందుకని అడిగితే 'కడలి' అంటే జనానికి తెలీదన్నాడు. అసలా పంక్తుల్నే తీసేయమన్నాడు. నాకు జనం కోసం పాట రాయడం ఇష్టం. సినిమా పాట లక్ష్యమే జనానికి చేరడం. కానీ 'కడలి' అంటే అర్ధంకానంత స్థాయిలో జనం లేరని నా అభిప్రాయం. ఇలాంటి సందర్భాలు అప్పుడప్పుడూ చిరాకు పెడుతుంటాయి.

సంప్రదాయ కుటుంబం నుంచి వచ్చిన మీ రాతల్లో లేబర్ భాష దొర్లుతుంటుందని ఒక విమర్శ ఉంది. మీరేమంటారు?
అది విమర్శ కాదు. ప్రశంసే. పైన చెప్పాను కదా. నా లక్ష్యమే లేబర్ జనానికి నచ్చేలా రాయడం. వాళ్లే సినిమాని 2-3 సార్లు చూసేది. ఇక్కడ ఒక విషయం అర్ధం చేసుకోవాలి. సినిమాల్లో జడ్జి వేషాలు వేసే వాళ్లకి ఆ వేషాలే ఇస్తారు. నా మధ్యతరగతి దౌర్భాగ్యం వల్ల తొలినాళ్లలో అటువంటి మాస్ పాటలు రాసే అవకాశాలే చేజిక్కుంచు కున్నాను... నాకు వేటూరి స్ఫూర్తి. లేబర్ భాషలోనూ రాశాను. 'బొమ్మను గీస్తే నీలా ఉంది...' లాంటి పాటలూ రాస్తున్నాను. అయితే ఈ మధ్య మాత్రం ఎవరైనా 1 mass 1 item వ్రాయమంటే ఆ రెండింటి బదులు ఒక మెలోడీ ఇమ్మంటున్నాను. అలా అంటే. ' మెలోడీ రాయడానికి చాలా మంది ఉన్నారు సార్. మాకు మీ గోదావరి వెటకారంతో ఉండే మాస్ పాటలే కావాలి' అంటున్నారు. ఇది ప్రశంసా? విమర్శా? అంటే ఏం చెప్పను. అయితే ఎప్పటికైనా ఇంకా మంచిపాటలు రాసే అవకాశాలోస్తాయనే ఆశతో ఉన్నాను. మనిషిని బతికించేది శ్వాస కాదు - ఆశ : నేను తెలుగువాడిగా పుట్టినందుకు గర్వపడుతున్నాను.

రామజోగయ్య శాస్త్రితో మీకు పడదని పరిశ్రమలో ఒక టాక్ ఉంది. మీ స్పందన?
నాకు ఏ కవి మీదా కోపం గానీ ద్వేషం గానీ లేవు. అతన్ని 'Dhee' సినిమాకి పరిచయం చేసింది నేనే. అప్పటికి 'యువసేన' ఇంకా 2-3 సినిమాలు వరకు రాశాడు. చక్రి ఫోన్ చేసి తొందరగా పాట రాయమని నన్ను ఫోర్స్ చేస్తే నాకు కుదరక రామజోగయ్య శాస్త్రిని refer చేశా. నాకు రామజోగయ్యంటే ఇష్టం లేకపోతే ఆ పని ఎందుకు చేస్తా. నాకు పోటీలో ఉండే ఆలోచన లేదు. పాటని అనుభవించి రాయటం ఇష్టం తప్ప.. అర్జెన్సీ అంటే నా వల్ల కాదు. వేరే ఎవరూ పడకపోవటం లేదు. మా నాన్నగారు 'కవిత్వం కూడు పెడుతుందా?' అనడగారు 'అవును' అని నిరూపించడమే నా లక్ష్యం. అదే చేస్తున్నాను.

మరిన్ని సినిమా కబుర్లు
vichitrala vamshi