Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు శీర్షికలు సినిమా కార్టూన్లు
nirantharam

ఈ సంచికలో >> కథలు >> దెబ్బకుదెబ్బ

debbakudebba

 సుందరరామయ్య ఆస్తుల వివరాలు బయటకి పొక్కగానే యావత్ రాష్ట్రం ముందు ముక్కున వేలేసుకుంది. ఆ తర్వాత తీరిగ్గా ఆశ్చర్యంతో కళ్ళింతలు చేసుకుని రెప్పలు వేయడమే మరిచిపోయింది. "ఇది కలో ....నిజమో?" తేలని సందిగ్ధతతో దిక్కు తోచని స్థితిలో పడిపోయింది.

 రెండ్రోజులుగా రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అతి పెద్ద వార్త అది.

ఈ న్యూస్ తాటికాయంత అక్షరాల్తో పత్రికల్లో పతాక శీర్షికలుగా.... ఎలక్ట్రానిక్ మీడియాలో హాఫెనవర్ ప్రొగ్రామ్ ల రూపేణా ప్రాచుర్యం పొంది తద్వారా అశేష జనాన్ని విశేషంగా ఆకర్షించింది. దాంతో.... ఏ ఊళ్ళో ఎక్కడ ఏ నలుగురు గుమికూడినా అక్కడ అనివార్యంగా సంభాషణల మధ్యలో సుందరరామయ్య ఆస్తుల చిట్టా చర్చకు వచ్చి చేరేది.

ఆ క్రమంలో సుందరరామయ్యకు 'జై ' కొట్టేవాళ్ళు కొందరైతే .... 'ప్చ్...!'  అంటూ ప్రగాడ సానుభూతి ప్రకటించేవాళ్ళు మరికొందరు.

'ఇదేం డెమోక్రసీ... వట్టి భయోక్రసీ' అంటూ నోటికొచ్చిన తిట్లూ శాపనార్ధాలతో వర్తమాన సమాజాన్ని చిత్రిక పట్టేవాళ్లు కొందరైతే... 'మంచి మనుషులకు రోజులా ఇవి?' అంటూ తూర్పూరపట్టేవాళ్లు మరికొందరు. 'కర్ర ఉన్నవాడిదే బర్రె... డబ్బు ఉన్నవాడిదే రాజ్యం' అంటూ లోకరీతిని వ్యక్తపరిచేవాళ్లు ఇంకొందరు. "సుందరరామయ్య ఆస్తులు కేవలం ఇవేనా... ఎవరికీ తెలియనివి ఇంకేమైనా ఉన్నాయా" మీడియాని తమ కాల్స్ తో ఠారెత్తించే నిత్య శంకితులు మరికొందరు.

ఏం తిన్నాడో... ఎలా ఉన్నాడో ఇరుగుపొరుగుకి తెలీకుండా ఇన్నాళ్ళూ గుట్టుగా, గుంభనగా రోజులు వెళ్లమార్చిన సుందరరామయ్య బతుకిపుడు బస్టాండ్ అయింది. పేట్రేగిపోయిన 'ఫోర్త్ ఎస్టేట్' ప్రచారం పుణ్యమాని వేడివేడి పకోడీ లాంటి వార్తగా మారి రచ్చరచ్చ అయింది. జనం నోళ్ళలో పడిన అప్పడం, వడియంలా నజ్జు నుజ్జయింది.
 
పదిహేనేళ్ళుగా ప్రయిమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయుడిగా పనిచేస్తున్న సుందరరామయ్య ఇంకా అద్దె ఇంట్లోనే కాపురముంటున్నాడు. నిద్రలోనైనా సొంతింటి కల కనేందుకు సాహసించలేని అర్భకుడైన ఆయన ఇప్పటికీ ప్రతి నెల చివర్లో కుటుంబావసరాల కోసం నూటికి అయిదు రూపాయల చొప్పున వడ్డీకి అప్పులు చేస్తూనే ఉన్నాడు. అంతేకాదు... ఆయన పిల్లలిద్దరూ గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుతున్నారు. వాళ్ల చదువులకయ్యే కొద్దిపాటి ఫీజుల్ని సైతం సకాలంలో చెల్లించలేని దుర్బర దారిద్ర్యంలో సుందరరామయ్య నానా అవస్థలు పడుతున్నాడు.
 
ఇక, ఆయన బ్యాంక్ బాలెన్స్... 'జీరో'. ఇలాటి 'దరిద్రనారాయణుడు' ఎన్నికల్లో ఎలా పోటీ చేస్తాడు? పోటీ చేసినా ఎలా ప్రచారం చేస్తాడు?

' బతికున్నంతకాలం నలుగురితో మంచిగా ఉన్నా, లేకున్నా చనిపోయిన తర్వాత మోసేందుకు కనీసం నలుగురైనా వెంట వచ్చేలా బతకాలి' అని మనకో సామెత. దాన్నే కాస్త ఇటుగా మారిస్తే... ఎన్నికల్లో అభ్యర్ధుల్లో ఒక్కడిగా బరిలోకి దిగి పోటీ చేస్తున్నా... ప్రచారంలో తన వెంట కనీసం నలుగురినైనా తిప్పుకోగలిగే నేర్పు, ఓర్పు ఉండి తీరాల్సిందే. అయితే... ఈ బక్కచిక్కిన బడిపంతులు స్కూల్లో చదువుకునే పిల్లల్ని తన వెంట తిప్పుకుందామనుకున్నా... వాళ్లకి అసలు ఓటు హక్కు కూడా లేదే? వందల కోట్లకు పడగలెత్తిన వ్యాపారాలను తలపించే విధంగా ఎన్నికలు జరుగుతున్న ఘనత వహించిన ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దీశంలోని... ఈ బడిపంతులు పోటీ చేసి నెగ్గగలడా?

ఇప్పుడిదే మిలియన్ డాలర్ల ప్రశ్న. ఔను... సుందరరామయ్య అసెంబ్లీకి పోటీ చేస్తున్నాడు. అతడి దరిద్రంలాగే ప్రజలకు ఇదీ సంచలన వార్తే.
 
" రాజకీయాలు కుళ్ళు కల్మషాల్తో నిండిపోయాయంటూ నిత్యం విమర్శిస్తూ వెలివేయడం కంటే... ఆ రంగాన్ని ప్రక్షాళన చేసేందుకు సమాజంలోని అన్ని వర్గాల వాళ్ళూ రావాలి - సుందరరామయ్యగారి లాగ'. రేపటి తరాన్ని తీర్చిదిద్దే ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న ఆయన... వర్తమాన రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేక్రమంలో ఇతోధికంగా తనవంతు సేవ చేయాలనే సంకల్పంతో ఈ రంగంలోకి ప్రవేశించారు'' ఓ ప్రచారసభలో చెప్తున్నాడు ఫణిభూషణరావు. నిన్నటి వరకూ ఆ నియోజకవర్గానికి ఆయనే ఎమ్మెల్యే. మారిన రాజకీయ సామాజిక సమీకరణల నేపధ్యంలో ఫణిభూషణరావు పోటీ చేయలేని పరిస్థితి సంభవించగా... ఆ అవకాశం సుందరరామయ్యని అనూహ్యంగా వరించింది.
 
ఎన్నికల నోటిఫికేషన్ వెలువడిన తర్వాత ఓ రోజు సాయంత్రం సుందరరామయ్యగారింటికి ఓ వ్యక్తి వచ్చి - "ఎమ్మెల్యే గారు ఉన్నపాటున మిమ్మల్ని తీసుకురమ్మన్నారు" అన్నాడు.
 
" ఎందుకు?" అడిగాడు సుందరరామయ్య తడబడుతూ.

"ఏమో... తెలీదు. ముందు మీరు రండి. విషయాలన్నీ అక్కడే తెలుస్తాయి" అన్నాడు వాడు.
 
స్కూల్ ఫంక్షన్లలో ఫణిభూషణరావుకి సుందరరామయ్య చాలాసార్లు ఎదురుపడ్డాడు. ఒకట్రెండుసార్లు మాట్లాడాడు. ఓ పంద్రాగస్ట్ కి తను ప్రసంగపాటం ఎమ్మెల్యే తప్పుల్తో చదవడంతో తీవ్రమనస్తాపానికి లోనైన అనుభవం కూడా అతనికుంది. నిజానికి ఆ ఎమ్మెల్యే తన దగ్గర చదివే విద్యార్ధే అయి ఉంటే... ఆవేశంగా అతడి రెండు చెవులూ మెలేసి... గోడకుర్చీ శిక్షవేసి... చేతి బెత్తానికి పనిచెప్పి చావచితకబాదేవాడు.     ఇలా బాగా గుర్తుండే రెండు మూడు సంఘటనలు మినహా ... ఫణిభూషణరావుతో వ్యక్తిగత సంబంధబాంధవ్యాలు, స్నేహాలు, కలుసుకుని మాట్లాడే సందర్భాలు సుందరరామయ్య జీవితంలో లేనేలేవు.

'అయినా... బతకలేని ఈ బడిపంతుల్తో ఈ నియోజకవర్గపు ఎమ్మెల్యేకి పనేంటి చెప్మా! ఇపుడెందుకిలా పిలిచాడు?" ఆలోచిస్తూనే తనకోసం వచ్చిన వ్యక్తిని అనుకరిస్తూ ఎమ్మెల్యేగారింటికి వెళ్ళాడు సుందరరామయ్య.
 
"రండి... రండి" ఎదురు వచ్చి మరీ సుందరరామయ్యని గట్టిగా బలంగా కౌగలించుకున్నాడు ఫణిభూషణరావు. 'బహుశా.. అలనాటి ధుర్యోధనుడి కౌగిలి కూడా అచ్చం ఇలాగే ఉండేది కాబోలు" ఆ బిగికౌగిలి పట్టు సదలేవరకూ గాలి కూడా పీల్చలేని అసహాయతని అనుభవిస్తూ అనుకున్నాడు సుందరరామయ్య.
 
"ఏం తీసుకుంటారు... బ్రాందీ, విస్కీ, రమ్, చలిగాలులు వీస్తున్న ఇలాంటి సాయంత్రాల్లో వెచ్చగా అవి గొంతు దిగుతుంటే అక్కడెక్కడో ఉన్న స్వర్గం ఏదో సాక్షాత్తూ మన ముంగిట్లోకి వచ్చివాలుతుంది..." మధ్యాహ్నం తాగింది ఇంకా దిగలేదు కాబోలు... ఎర్రెర్రని కళ్ళతో చెప్తున్నాడు ఫణిభూషణరావు. అంతలోనే తను మాట్లాడుతోంది తప్పని గ్రహించినట్లున్నాడు - "మన్నించండి. పొరపాటు మాట్లాడినట్లున్నాను. ఎంతైనా మీరు పిల్లలకి బళ్ళో పాటాలు చెప్పే పంతుళ్లు కదా. ఇలాంటి పానీయాలకు... వ్యసనాలకు ఆమడ దూరంలోనే ఉంటారు. ఏదో బుద్ధి తక్కువై వాగేసాను..." అంటూ తనపక్కనున్న పనివాడివేపు చూపుమరల్చి- "ఓరేయ్? అయ్యగారికి ఓ ప్లేట్లో జీపిపప్పు పకోడి తీసుకురా" ఆదేశించాడు.
 
"అవన్నీ ఇపుడెందుకండి" మోమాటంగా అన్నాడు సుందరరామయ్య. వచ్చిన పనేదో ఆరా తీసి అక్కడ్నుంచి త్వరత్వరగా బయటపడదామనుకుంటున్నాడతను. అయితే... ఆ ఆలోచనల్నేమాత్రం పట్టించుకోని ఫణిభూషణరావు " దోరగా వేయించి... కాస్త కారం, మసాలా దట్టించిన జీడిపప్పు పలుకు ఒక్కోటి నోట్లో వేసుకుంటూ అన్ని విషయాలూ మాటల్లో దొర్లించేస్తున్నాడు. ప్రతివాక్యం చివర్న - "బొత్తిగా లోకం పాడైపోయింది పంతులుగారూ" అంటూ ముక్తాయింపు ఇస్తున్నాడు. ఇంతలో జీపిపప్పు పకోడి వచ్చింది. అంతకుముందు అన్నట్లుగానే సుతారంగా ఒక్కటంటే ఒక్కపలుకుని తీసుకుని అమాంతం నోట్లో వేసుకుని లొట్టలు వేస్తూ - "విలువలు పెంచేందుకు మీరెందుకు రాజకీయాల్లోకి రాకూడదూ?" అడిగాడు ఫణిభూషణరావు.

" నేనా... " ఆశ్చర్యంగా అడిగాడు సుందరరామయ్య.

" ఔను.. మీరే! తరగతిగదుల్లోనే భావి భారతపౌరుల్ని తీర్చిదిద్దే మీరే... ఈ సమాజాన్ని బాగుచేసేందుకు ఎందుకు నడుం బిగించకూడదూ" అడిగాడు ఫణిభూషణరావు. రాజకీయాలంటే తనకిష్టమేనని... విద్యార్ధిదశలో తానూ క్రియాశీలకపాత్ర పోషించానంటూనే... ప్రస్తుతం ఆరంగంలోకి వచ్చే ఆలోచన తనకు లేదని సుందరరామయ్య వినయంగా... వివరంగా చెప్పిచూసాడు. అయితే... తాను పట్టిన కుందేలుకి మూడేకాళ్లనే మొండివాడైన ఫణిభూషణరావు - "సుందరరామయ్య రాజకీయాల్లోకి రావడం ఈ నియోజకవర్గ ఓ చారిత్రిక అవసరమని" తేల్చేసాడు. తప్పనిసరిగా రాజకీయాల్లోకి రావాల్సిందేనని ఆహ్వానించేసాడు. పోటీ చేసే ఆర్ధిక స్తోమత లేదని బెంగపడొద్దని... నామినేషన్ దాఖలు దగ్గర్నుంచి ప్రచారంలో ప్రతి భాధ్యతని దగ్గరుండి తాను పర్యవేక్షిస్తానని మాట ఇచ్చేసాడు. తనకు బదులుగా అసెంబ్లీలో అడుగుపెట్టే మగాడు... మొనగాడు సుందరరామయ్యేనని ఘంటాపధంగా నొక్కివక్కాణించాడు.

"నిజానికి.. ఈసారీ పోటీచేద్దామనుకున్నా మారిన సమీకరణలనేపధ్యంలో ఈ నియోజకవర్గాన్ని మీ సామాజికవర్గానికే కేటాయించారు. అర్హుడైన అభ్యర్ధికోసం నా అనుచరులదగ్గర్నుంచీ దుర్భిణి పెట్టి అందర్నీ గాలించాను. ప్రతివారి బయోడేటా తెప్పించి కంప్యూటరీకరించి బలాలు, బలహీనతలు అంచనావేసాను. ఆ కంప్యూటర్ పరీక్షలో మీరు నెగ్గారు మాస్టారూ! అందుకే, మిమ్మల్ని నా రాజకీయవారసుడిగా... అర్హుడైన అభ్యర్ధిగా ప్రకటించాలని ఉవ్విల్లూరుతున్నాను. దయచేసి మీరు కాదనకండి" అంటూ చేతులూ కాళ్ళూ పట్టుకుని బతిమాలాడు ఫణిభూషణరావు. ఆలోచించుకోవడానికి రెండ్రోజుల వ్యవధి కావాలని అడిగిన సుందరరామయ్య... ఆ రెండ్రోజుల తర్వాత పోటీచేసేందుకు సుముఖతని వ్యక్తపరిచాడు.
 
ఓ సామాన్య బీద ఉపాధ్యాయుడి రాజకీయ అరంగ్రేటం క్షణాల మీద అలా చకచకా జరిగిపోయింది.

" రేపటితరాన్ని చక్కగా తీర్చిదిద్దగల గురుతరబాధ్యతని ఇన్నాళ్ళూ తన భుజస్కంధాలపై మోసిన సుందరరామయ్య... ఇకపై ఈ నియోజకవర్గ ప్రతినిధిగా మనందరి బాగోగుల్ని అంకితభావంతో చూస్తాడని నేను ఇంకోసారి నొక్కివక్కాణిస్తున్నాను. కాబట్టి... ప్రజలారా! ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోండి. మన సుందరరామయ్యగారికి మీ అమూల్యమైన ఓటేసి గెలిపించి... అసెంబ్లీకి పంపించండి..." మైకు ముందు గట్టిగా ఉపన్యసిస్తున్నాడు ఫణిభూషణరావు. తరతరాల తర 'గని' నిధులు సంపాదించే ఫక్తు వ్యాపార రాజకీయనేతలమధ్యలో... బతకలేని ఈ పేద బడిపంతులు నీతినిజాయితీల్తో తన ఉనికిని నిరూపించుకుంటాడా? లేక, తానూ ఆ తానులోని ముక్కేనంటూ రూటు మర్చేస్తాడా? ఏదేమైనా కాలమే జవాబు చెప్పాలని ప్రజలు తర్జనభర్జన పడుతుండగానే ఎన్నికలు పూర్తయ్యాయి. కౌంటింగ్ మొదలైంది. ఒక్కో బాలెట్ బాక్స్ తెరచి లెక్కిస్తుంటే... సుందరరామయ్య ప్రత్యర్ధుల గుండెల్లో గునపాలు దిగుతున్నాయి. పక్కలో బాంబులు పేలుతున్నాయి. వానాకాలంలో వరదఉధ్రితిలా క్షణక్షణానికి పెరుగుతూ పోటెత్తుతున్న ఓట్ల ప్రవాహంలో ఫణిభూషణరావు తడిసిముద్దవుతున్నాడు. పట్టరాని ఆనందంతో ఒక్కచోట నిలవకుండా గెంతులు వేస్తూ హోరెత్తేలా కేకలు పెడుతున్నాడు. ముందు హాల్లో కూర్చున్న సుందరరామయ్య దగ్గరికి వచ్చి మరోసారి ధుర్యోధనుడి ఉక్కుకౌగిలిని గుర్తుకు తెస్తూ అతడ్ని గట్టిగా వాటేసుకున్నాడు.
 
"పంతులుగారూ! హరహరబ్రహ్మాదులు ఎదురొచ్చినా మీ గెలుపుని ఎవ్వరూ ఆపలేరు... సాయంత్రం కౌంటింగ్ కంప్లీట్ అయ్యేసరికి మీరే విజయం సాధిస్తారు. కాదు... కాదు! మిమ్మల్ని గెలిపించడం ద్వారా నేను గెలుస్తాను. ఔను... నేనే గెలుస్తాను. కొన్ని సమీకరణల కారణంగా ఈ సీటు నాకు దక్కకపోయినా... నేను నిలబెట్టినవాడినే గెలిపించడం ద్వారా చేజారిపోతోందనుకున్న నా ఆధిపత్యాన్ని మళ్లీ నిలబెట్టుకున్నాను. ఈసారి టెక్నికల్ గా ఎమ్మెల్యేని కాకున్నా... అజమాయిషీ అంతా నాదే. నెలాఖర్లో అప్పుల్తో  గడిపే ఓ సాదాసీదా టీచర్ గా బతుకుబండిని అతిబరువుగా నడుపుకుంటున్న మిమ్మల్ని పిలిచి ఎమ్మెల్యేగా... నా రాజకీయవారసుడిగా చేసినందుకు మీరు మీ రుణం తీర్చుకుంటారని నాకు తెలుసు. నే గీసిన గీటు దాటలేరనీ.. నా మాట మీకు శిరోధార్యమవుతుందని వేరే చెప్పక్కర్లేదు. ఔను... ఎప్పటికీ ఈ నియోజకవర్గం నా పంజా నుంచి తప్పించుకోలేదు. కింగ్ ని నేనే... కింగ్ మేకర్ నీ నేనే" బాగా తాగిఉన్నాడేమో ఫణిభూషణరావు మాటలు ముద్దముద్దగా వస్తున్నాయి. అతడికి బాగా దగ్గరైన ఓ అనుచరుడు - "అన్నా... ఇక, చాలే! బాగా ఎక్కువైంది. ఇక్కడ నువ్వన్నదే శాసనం. నీమాటకెవరు ఎదురు చెప్తారే. అది వేదం కదా పంతులుగారూ" అంటూ ఫణిభూషణరావుని సముదాయిస్తున్నాడు. ఫణిభూషణరావు ప్రవర్తనకి సుందరరామయ్య ఏమాత్రం ఆశ్చర్యపోలేదు. కారణం... దశాబ్దాలుగా ఆయన గురించి అన్నీ తెలుసు. గంజాయి వ్యాపారం చేసి సంపాదించిన సొమ్ముని రాజకీయాల్లో పెట్టుబడిగా పెట్టి అంచెలంచెలుగా ఎదిగిన వ్యక్తీ ఆయన. 'పంతులుగారూ! పాలిటిక్స్ లోకి వచ్చి ప్రక్షాళన చేయరూ" అని తొలిసారి పిలిచి అభ్యర్ధించినపుడు సుందరరామయ్య మొదట కలవరపడినా... తర్వాత్తర్వాత నిభాయించుకున్నాడు. నిర్ణయం ప్రకటించడానికి తీసుకున్న రెండురోజుల వ్యవధిలో తనకు తెలిసిన పదిమందిని కలిసి మంతనాలు జరిపాడు."ఆ ఎమ్మెల్యే దుర్మార్గుడు. వాడితో పెట్టుకోకు. ఈతిబాధలున్నా కడుపులో చల్ల కదలకుండా కాలం గడిచే ఉపాధ్యాయవృత్తిలో ఉన్నావ్. రూటు మారిస్తే చేటే  " అన్నవాళ్ళూ  ఉన్నారు. అడ్డగించినవాళ్ళున్నారు.

 "ఎమ్మెల్యే కబంధహస్తాల్లోంచి  ఈ నియోజకవర్గం చేజారే అవకాశం ఇంతకాలానికి వచ్చింది. అదీ నీ చేతికందివచ్చిన సువర్ణావకాశం. వినియోగించుకుని చరిత్ర సృష్టించు" అంటూ వెన్నుతట్టి ప్రోత్సహించి ధైర్యం చెప్పినవాళ్ళూ ఉన్నారు. ఏం చేయాలన్నా ఎవరో ఒకరు తొలి అడుగువేయాల్సిందే. ఆ అడుగు వేసే అదృష్టం తనకు చిక్కింది. 'రాక్షసంగా జనాలకి కీడు చేసే యంత్రాంగం' రాజకీయం. ప్రకృతివనరులు, సర్వ సంపదల్ని మింగేసే నేతలకు ఎక్కడో అక్కడ ఎవరో ఒకరు ఫుల్ స్టాప్  పెట్టాల్సిందే... అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ ఆ ఒక్కడ్నీ నేనవుతా"ఎన్నికల్లో పోటీచేస్తాననే నిర్ణయం చెప్పడానికి ముందు సుందరరామయ్య మనసులోనే ప్రతిన పూనాడు. డబ్బు, పరపతి వినియోగిస్తూ ఫణిభూషణరావు వెనకనుండి రాజకీయాన్ని నడిపిస్తున్నా... సామాన్యులెంతోమంది సుందరరామయ్యలో తమని తాము చూసుకున్నారు. సాదాసీదా వ్యక్తికి అందని ద్రాక్షలా అగుపించే రాజకీయ రంగంలోకి బక్కపలచని ఉపాధ్యాయుడొకడు చొచ్చుకురావడం ఇటు విద్యార్థుల్ని... ముఖ్యంగా యువతని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో... ఓ నిశబ్ద విప్లవం సుందరరామయ్య గెలుపునకు సరికొత్త ద్వారాలు తెరచింది.

కౌంటింగ్ ముగిసాక... సుందరరామయ్య విజయం సాధించడాన్న వార్త నేల నాలుగు చెరగులకు ఆఘమేఘాలమీద వ్యాపించింది.

ఆ తర్వాతే అసలు టార్చర్ మొదలైంది.

"నిజానికి మీకు రాజకీయ జన్మనిచ్చింది నేను. లేకుంటే... అదే ప్రయిమరీ పాటశాలలో చాలీచాలని వేతనాల్తో ఇబ్బందిపడే పంతులుగానే జీవితాన్ని వెళ్లదీసేవాళ్ళు. నా బదులు మిమ్మల్ని అసెంబ్లీకి మెట్లెక్కించి సమాజంలో తిరుగులేని హోదా కల్పించాను. అందుకు ప్రతిగా మీరు నే గీచిన గీటు దాటకూడదు. ఎమ్మెల్యేగా ప్రతినెలా వేలల్లో ముడుపులు, లక్షల్లో కమీషన్లు కోట్లలో అవినీతి సొమ్ము ఎలా సంపాదించుకోవాలో వెనుకనుంచి మిమ్మల్ని నడిపిస్తాను. ఆ ముడుపుల సొమ్ము ఎయిటీ, ట్వంటీగా పంచుకుందాం" వీలుచిక్కినప్పుడల్లా ఈ విషయాన్ని సుందరరామయ్య చెవులకు ఎక్కేలా విడమర్చి చెప్తున్నాడు ఫణిభూషణరావు.

అంతేకాదు - "ఎడారిలో కూడా ఇసుక అమ్మేయగల మార్కెటింగ్ నిపుణులు ఇవాళ్టి ప్రజాప్రతినిధులు. ఏదో సేవ చేస్తున్నామనే హడావుడితో ప్రెస్ లో కనిపించడం ఒక ఎత్తు... నియోజకవర్గంలో ఉన్న అన్ని వనరుల్ని ఎడాపెడా దోచేయడం మరోఎత్తు. అయిదేళ్ళ పదవీకాలం అనుకున్నా... ప్రతిపక్షం ఎపుడెలా విరుచుకుపడుతుందో... చాపకింద నీరులా మధ్యంతరం ఎప్పుడొస్తుందో... ఏ అవినీతి ఆరోపణల్తో ఏ ఎమ్మెల్యే ఎపుడు కుర్చీనుంచి దిగిపోతాడో... ఎవరికీ తెలీదు. అందుకే... దీపమున్నప్పుడే ఇల్లు సర్దుకోవాలి" కురుక్షేత్ర సంగ్రామసమయంలో అర్జునుడికి శ్రీకృష్ణుడు గీతబోధ చేస్తున్నంత శ్రద్ధగా ఫణిభూషణరావు క్లాస్ పీకుతున్నాడు. ఎన్నోసంవత్సరాలుగా పిల్లలకి పాటాలు చెప్పిన సుందరరామయ్య ఇపుడీ క్షణంలో క్రమశిక్షణగల ఓ పిల్లాడిలా మారిపోయి ఫణిభూషణరావు మాటల్ని శ్రద్ధగా విన్నాడు.

ఓరోజు - ఫణిభూషణరావుతో సహా కొంతమంది వ్యక్తులు సుందరరామయ్యతో డిస్కస్ చేస్తూ వెయ్యిరూపాయల నోట్ల కట్టల్ని ఆఫర్ చేస్తుండగా... హటాత్తుగా ఎసిబి అధికారులు గదిలోకి దూసుకొచ్చారు. అంతా అవాక్కయి చూస్తుండగా... టేబుల్ పై ఉన్న ఆ నోట్ల కట్టల్ని సీల్ చేసి... టోల్ గేట్ కి సంబంధించిన కాంట్రాక్ట్ వ్యవహారంపై ఎమ్మెల్యేకి ముడుపులు ఇవ్వచూపినందుకు ఫణిభూషణరావుతో సహా నలుగురిని అరెస్ట్ చేస్తున్నామంటూ ఆ అధికారులు మీడియా ముందు ప్రకటించారు.

"మరి, ముడుపులు తీసుకున్నందుకు సుందరరామయ్యగారిని కూడా అరెస్ట్ చేస్తున్నారా?" ఓ పత్రికా ప్రతినిధి ప్రశ్న అది.

"నిజానికి... ఈ నాటక సూత్రధారి ఆయనే. ఫణిభూషణరావు నిత్యం చేస్తున్న వత్తిళ్లతో సహా... ముడుపులు, కమీషన్ల అవినీతి వ్యవహారాల్ని పూసగుచ్చినట్టు చెప్పారు. అంతే కాదు... ఓరోజు ఈ మాజీ ఎమ్మెల్యే చేసిన గీతబోధకి సంబంధించిన ఆడియో టేప్ కూడా సుందరరామయ్యగారు మాకు అందించారు. ఇపుడు మరిన్ని సాక్షాలతో రెడ్ హ్యాండెడ్ గా ఈ అవినీతి సామ్రాట్ లను అదుపులోకి తీసుకున్నాం" చెప్పాడు ఎసిబి ఉన్నతాధికారి. చివర్లో సుందరరామయ్య మీడియాతో మాట్లాడుతూ - " ఈ ఎమ్మెల్యే నిప్పుతో తలగోక్కున్నాడు. తానే గెలిపించానంటూ... తన చెప్పుచేతల్లోనే ఉండాలంటూ తన అవినీతితో నన్నూ చెడపాలని ప్రయత్నించాడు. పోటీ చేసే ముందు ఈ పరిస్థితినీ, ఇలాంటి వత్తిళ్ళని ఊహించాను. 'టిట్ ఫర్ టాట్'... కుక్కకాటుకి చెప్పుదెబ్బ తప్పదనుకున్నా. ఇపుడు జరిగిందదే. అవినీతి డబ్బుకి నాలాటి టీచర్ అమ్ముడుపోతాడనుకోవడం... ఫణిభూషణరావు తెలివితక్కువతనం. ఆ తెలివితక్కువతనానికి జైలు ఊచలు లెక్కపెడుతూ అతడు మూల్యం చెల్లించుకోకతప్పదు" అన్నాడు.

మరిన్ని కథలు