Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
avee - ivee

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతి పథం - పులివర్తి కృష్ణ మూర్తి

రామాయణంలో మానవుడి నిత్య జీవితంలో ఆచరింపదగిన, పాటించదగిన ఎన్నో సూక్తులు నిమిడి వున్నాయి. ప్రారంభంలోనే నారద మహర్షి వాల్మీకి మహర్షికి, అసలు పరిపూర్ణ మానవుడు ఎలా వుండాలో వివరించాడు. పరిపూర్ణత్వ సూచకములు, జీవన్ముక్తుని లక్షణాలు, జగత్కళ్యాణం కాంక్షించే గుణాలూ, సర్వోపనిషత్సార లక్షణాలు, ఉన్నత మానవ లక్షణాలు అనబడే పదునారు గుణాలు కలిగిన మానవుడు ఉన్నాడా అని అడిగితే, నారదుల వారు శ్రీరాముని పేరు చెప్పారట. ఇందులో మొదటగా కృతజ్ఞత అనేది. కొందరు కృతజ్ఞత అంటే సత్యమును అంగీకరించడమే అనేది కద్దు. 

అయితే సర్వసాధారణంగా అందరికీ తెల్సిన మాట - 'చేసిన మేలు మరువకుండుట ' పెద్ద జంతువు చిన్న జంతువును హింసించడం ఒక విధంగా ప్రకృతి ధర్మంగా మనం చూస్తున్నా, ఇక మానవులమని చెప్పుకుంటూ కుటిలత్వముతో బలవంతులు బలహీనులను బాధించడం చూస్తూనే వున్నాం. ఇలాంటి రాక్షస గుణాలను మార్చనంతకాలమూ మానవజాతి మనుగడకు అవకాశం లేదు. సూక్తులంటే ఒక విధంగా జీవన సత్యాలేకదా! రామాయణం పఠనం వలన  మానవాభ్యుదయం జరుగుతుంది. ఈనాటి సమాజంలోని ఈ సౌకర్యాలు ఎన్నోవేలమంది , ఎన్నెన్నో సంవత్సరాల శ్రమయొక్క ఫలితమేనని మనం గ్రహించి, ఈ దేశానికి మనవంతు సేవ గావించగలిగితే అంతకన్నా కృతజ్ఞత మరొకటుండదు.

క్షమ గురించి రామాయణంలో ఎంతో మనోజ్ఞంగా చెప్పబడింది. కుశనాభుడు అన్న మాటలు వినండి ఒకసారి.

క్షమయు జనుల కాభరణము క్షమయు కీర్తి
క్షమయు ధర్మంబు క్షమయు సజ్జన గుణంబు
క్షమయు యజ్ఞంబు క్షమయు మోక్షంబు క్షమయు
సకల దాననంబు క్షమయందె జగము నిలుచు

అర్హులైన వారికి దానం చేయడం వలన , సత్య ప్రవర్తన వలనా, యజ్ఞాలను ఆచరించడం వలనా, కలిగేటటువంటి మహా ఫలాన్నే క్షమాగుణం కలిగి వుండడం వలన లభిస్తాయి. క్షమ పరమ ధర్మము. క్షమ యశస్కరము. ఒకవిధంగా ఈ జగత్తు అంతా క్షమ మీదనే ఆధారపడి ఉంది.ప్రతి కాండలోనూ ఏదో ఒక సందేశం వుంది. యజ్ఞ రక్షణకై విశ్వామిత్రుని వెంట రాముని పంపను అన్న దశరథుడి మాటలకు నొచ్చుకున్న వశిష్టుల ఆయనతో ప్రతిజ్ఞ చేసి తదుపరి మాట నిలబెట్టుకొనకపోవడం తగదని చెప్పారు. ఆ విధంగా మాట నిలబెట్టుకోలేనివారు అశ్వమేధ యాగఫలము  బావులు, చెరువులూ త్రవ్వించుటవంటి ధర్మ కార్యాలను ఆచరించినా కూడా ఫలము దక్కదన్నారు.అరణ్యానికి వెళ్తున్న లక్ష్మణుడు తల్లికి నమస్కరింపగా, ఆమె కుమారునికి చెప్పిన మాటలు గుర్తుంచుకోదగినవి.లక్ష్మణా ! శ్రీరాముని నీ తండ్రియైన దశరథునిగా భావింపుము. సీతాదేవిని నన్నుగా తలంపుము. నీకు అడవే ఆయోధ్య.  అలా భావిస్తూ హాయిగా వెళ్ళిరా అంటూ దీవించింది.  ఇక  పితృవాక్య  పరిపాలన  విషయంలో రామాయణంలో ఒక  పెద్దపీట వేశారు. పితృ సేవకు ఎంతో ప్రాముఖ్యం వుంది.

తండ్రి మాటను శిరసావహించిన వాడెవ్వడూ ధర్మము వలన పతనము కాడు. లోకంలోని పురుషార్థాలలో ధర్మము అగ్రగణ్యము. ధర్మానికి సత్యమే ఆధారం కాగా అత్యుత్తమమైన పిత్రాజ్ఞ ధర్మమునకు సమ్మతమైనది.. ఇక ఇలా పలికిన రాముడు ధర్మార్థ కామ ఫలాలన్నీ ధర్మాన్ని ఆచరించడం వలన సిద్ధించును. ధర్మము ధర్మపత్ని వంటిది. భార్య అనుకూలమైనదైతే ధర్మార్థ కామములు నెరవేరుతాయి. ఆమె తనవంతుగా అతిథి సత్కారాలు జరిపేందుకు దోహదపడుతుంది. పత్నిగా అతని కోరికలను తీరుస్తుంది. పుత్ర సంతానాన్ని కని ఉత్తమ లోక ప్రాప్తికి సాధకురాలవుతుంది. భార్య ఎన్ని వ్రతాలూ, ఉపవాసాలూ ఎంతగా ఆచరించినా కూడా , అందరిలో ఉత్తమురాలిగా పేరు గడించినా, భర్తను అనుసరించుతూ ఆయనకు సేవలు చేయనిచో ఆ స్త్రీకి నరకము తప్పదని చెప్పాలి. ఇల్లాలుగా ఆమె కేవలం భర్తకు శుశ్రూషలు గావించినచో చాలు ఉత్తమమైన స్వర్గ గతులు ప్రాప్తిస్తాయి. ఇక ఆ ఇల్లాలు దేవతలను పూజించడంకన్నా పూజ్యులైన బ్రాహ్మణులను గౌరవింపకున్నా పరవాలేదు.

ఈ విషయాలను రాముడు రాముడే స్వయంగా కౌసల్యా మాతకు , భర్త శుశ్రూషయే ముఖ్యముగా చెబుతూ దశరథ మహారాజుకు సపర్యలు గావుంచుతూ తరించాలని విన్నవించిన తీరు భార్యాభర్తలు విధిగా తెల్సుకోవలసిన జీవన రహస్యమిది.

వాల్మీకి మహర్షి రామాయణంలోని అన్ని పాత్రల ద్వారా ధర్మ సూత్రాలను మనకు అందించారు. ఉదాహరణకు భరతుడు సామాన్యంగా మానవాళికి ఎలాంటి దోషాలు ప్రాప్తిస్తాయో అయోధ్యా కాండలో వివరిస్తారు. తను రాముని వనవాసానికి పంపాలన్న కోరిక వున్నట్లయితే , ఎలాంటి దోషాలో చెబుతూ, పౌరుల స్వార్థ పూరిత దుశ్చర్యలచే పచ్చని కుటుంబాలూ, సమాజము ఏ విధంగా కకావికలమవుతుందో చెబుతూ అట్టి చర్యల వలన దోషం ప్రాప్తిస్తుంది అంటాడు. పాపాత్ములకు సేవ చేయడం వలన సూర్య భగవానునికి ఎదురుగా నిలిచి మలమూత్ర్రాదులను విసర్జించడం వలన నిద్రపోతున్న ఆవును కాలితో తన్నడం వలన విపరీతంగా సేవలు చేయించుకుని యజమాని సేవకునకు తగిన శ్రమ ఫలాన్ని ఇవ్వకపోవడం వలనా కలిగే పాపం తనకూ ప్రాప్తిస్తుందంటాడు భరతుడు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా కొన్ని కొన్ని విషయాలను ప్రజాక్షేమ పరంగా మననం గావించుకోవాలంటాదు. పన్నులు వసూలు చేస్తూ ప్రభుత్వపరంగా పాలకులు ప్రజల బాగోగులను పట్టించుకొనకుండుట మహాపాపంగా చెప్పబడింది. అంతేకాదు. విద్యార్థుల విషయంలో కూడా ఇలా చెప్పారు.

సమర్ధుడైన గురువు ఎంతో ప్రేమగా శాస్త్రార్థాలను బోధిస్తూ వుంటే శిష్యులు అశ్రద్ధగా వినడమూ, ఉపదేశాలను విస్మరించడము కూడా భరతుడు ఒక పాపంగానే పేర్కొన్నాడు. విశ్వాసపాత్రులైన సేవకులను మధ్యలోనే తొలగించడం పాపం. రాజునూ, స్త్రీలనూ, బాలబాలికలనూ వయోధికులనూచంపడం వలన మహా పాపం కలుగుతుంది. తప్పుడు మార్గాల్లో అక్రమంగా ఆర్జించిన ధనం దొంగలపాలుగానీ, అగ్నిపాలుగానీ వరదల్లో నాశనమవుతుంది...క్రితం జన్మలో మహాపాపం చేసుకున్న వారు ఈ జన్మలో దరిద్రులై పుడతారు. వారికి సంతానం అధికంగా వుంటుంది. విపరీతమైన రోగాలపాలవుతారు. ఈ విధమయిన కష్టాలతో నరకయాతన  అనుభవిస్తారు. నేటిరోజుల్లో వింతవింత  రోగాలూ, మందులే కనిపెట్టని రోగాలూ, మనకు ఎక్కువగా తారసపడుతున్నాయి. నానాటికీ ఆసుపత్రుల సంఖ్య పెరిగిపోతూంది. దీనికి కారణాలను  మనకు రామాయణం చెప్పకనే చెప్పింది. కేవలం రామచరితను ఒక కథగానే గాకుండా ప్రతి శ్లోకాన్ని పదేపదే మననం గావించుకోవాల్సి వుంది. జీవన గమనంలో సదా అప్రమత్తులై మసలుకోవాల్సి వుంది మనం.

మరిన్ని శీర్షికలు
jyotishyam-vignanam