Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
idee sambhavame

ఈ సంచికలో >> కథలు >> వ్యసన ప్రభావం

vyasana prabhavam

రంగరాయపురంలో ఉండే యువకులు చాలా రోజులుగా వూరి చివర ఉన్న  మర్రిచెట్టు కింద చేరి జూదం ఆడుతూ కాలక్షేపం చేయడం ప్రారంభించారు. తమ ప్రతిభకి తగ్గ ఉద్యోగం దొరకలేదన్న బాధతో కొందరు, పనీపాటు లేక సమయం గడపడం కోసం మరికొందరు, ఏ పనీ చేతకాక మరికొందరు ఆడుతున్నారు. రోజులు గడుస్తున్న కొద్దీ అదొక వ్యసనoగా  మారిపోయింది.

అదే ఊరులో ఉండే నూకయ్యది పేదకుటుంబం. కష్టపడితే కానీ పొట్ట గడవని స్థితి. ఉన్నంతలో పొదుపుగా బ్రతుకుతూ కొడుకుని చదివించాడు నూకయ్య. అతడి కొడుకు కూడా మర్రిచెట్టు కింద చేరినవాళ్ళలో ఒకడు.

నూకయ్య కొడుకు ఒక్కడే కాదు ప్రతి ఇంట్లోను అలాంటి వాళ్ళు ఉన్నారు. జూదమాడి  ధనం  పోగొట్టుకోవడం, పోయిన ధనం రాబట్టుకోవడం కోసం మళ్ళీ  పట్టుదలగా ప్రయత్నం చెయ్యడంతో  నిద్ర, ఆహారం, ఆరోగ్యం మరిచిపోయారు.

మర్రిచెట్టు ప్రక్కనే సారాయి దుకాణం తెరిచాడు ఒక వ్యాపారి. ఆటలో ధనం పోగొట్టుకున్న వాళ్ళకి అదొక ఔషదం అయింది. దాంతో చాలా మంది మద్యానికి బానిసలయ్యారు. మద్యం మత్తులో పడిన కొందరు యువకులు ఆ దారిలో వెళ్ళే  స్త్రీల పట్ల అసభ్యంగా ప్రవర్తించే వారు.  వారిలో కొందరయితే  ధనం కోసం ఏకంగా దొంగతనాలు మొదలుపెట్టారు. విలువైన వస్తువులు దొంగిలించి  దొంగ సరుకులు కొనే పొరుగూరు వ్యాపారికి అమ్మేవాళ్ళు.  ఆ ధనంతో తమ వ్యసనాలకు పెట్టుబడి పెట్టేవాళ్ళు. 

ఇదిలా ఉండగా ఆ వూరి రైతు రాజయ్య కుమారుడైన  వినయుడికి రాజకొలువులో పదవి వరించింది. అతడు చిన్నతనం నుండి గురుకులంలో విద్య అభ్యసించినవాడు. అదే ఊరులో పెరిగినట్లయితే అతడి పరిస్థితి కూడా ఏమయ్యేదో అని అతడి తండ్రి అనుమానపడేవాడు.

పదవిలో చేరిన కొద్ది రోజులకు తమ వూరు వచ్చాడు వినయుడు.  మద్యం మత్తులో తూగుతూ,  జూదమాడుతూ వ్యసనాలకి బానిసలయిన చాలా మంది యువకులను  చూసాడు. తండ్రి ద్వారా విషయం తెలుసుకుని  గ్రామపెద్దలను ఆ విషయమై ప్రశ్నించాడు.

దానికి గ్రామపెద్దలు “నీకు తెలియని  విషయాలు చాలా ఉన్నాయి.  వీటన్నిటి వెనుక పెద్దల హస్తం ఉంది. రాజాస్థానంలోని కొందరు మంత్రులే  తమ బంధువుల చేత వ్యాపారం చేయిస్తున్నారు” అని చెప్పారు.

వినయుడు తన పని ముగించుకుని రాజధానికి వెళ్ళిపోయాడు.

తరువాత రోజు సభ జరుగుతుండగా తనకు మాట్లాడే అవకాశం ఇమ్మని కోరాడు వినయుడు. రాజుగారి అనుమతి దొరకగానే తమ గ్రామంలో చూసిన సంగతి చెప్పి యువకుల ఆరోగ్యాలను  కాపాడమని  కోరాడు.

అతడి మాటలకు ఒక మంత్రి అభ్యంతరం చెప్పాడు. “కాలక్షేపం కోసం ఆడుకునే ఆటలని చూసీ  చూడనట్లు వదిలెయ్యాలి. అవన్నీ సభలో ఎందుకు చెబుతావు?” అని అడిగాడు.   మరికొందరు  మంత్రులు కూడా ఆ మంత్రికి వత్తాసు పలికారు.

మహారాజు మనోజ్ఞుడు కాసేపు ఆలోచించి ప్రధానమంత్రి వివేకుడి వైపు చూసాడు. “మంత్రిగారూ! వినయుడు చెప్పింది ఒక సమస్యే  అంటారా? దానికి మనం ఏ విధంగా స్పందించాలి? ” అని అడిగాడు.

మంత్రి చిరునవ్వు నవ్వి “మహారాజా!  ఆ విషయం ప్రస్తావించిన వినయుడినే పరిష్కారo కూడా  సూచిoచమని అడిగితే  సరిపోతుంది” అన్నాడు.

వినయుడిని ఆదేశించాడు మహారాజు.

అప్పుడు వినయుడు “యువకుల వ్యవహార సరళి చూసినప్పుడు వారు  సరదాకో, కాలక్షేపానికో చేసినట్లు లేదు. వాళ్ళంతా పూర్తిగా వ్యసనాలకి బానిసయ్యారు. రాజ్యానికి అవసరమైన యువశక్తి నిర్వీర్యమైపోవడం కళ్ళారా  చూసి అంతులేని బాధ కలిగింది. భయంకరమైన విషయాల్లో వ్యసనం ఒకటి. వ్యసనాలలో మునిగినవాడికి కార్యసిద్ధి కాదు. దేనినీ తోచనివ్వదు. చెడు చేస్తుంది.  శాంతి దొరకనివ్వదు. ఏదైనా సాధించాలనుకునే లక్ష్యం ఉన్నవాళ్ళు ఎప్పుడూ  వ్యసనానికి  లోబడకూడదు. అందువల్ల నా మనవి ఏమిటంటే మత్తుపదార్ధాలు అమ్ముతున్న వ్యాపారులను, వ్యసనాన్ని ప్రోత్సహిస్తున్న వాళ్ళని కూడా  బంధించి ఖైదు చెయ్యండి. రాజ్యంలోని యువకులందరకీ   పని కల్పించండి.  వ్యసనపరుల కోసం మానసిక వైద్యులను పంపించి వైద్యం చేయించమని కూడా అభ్యర్ధిస్తున్నాను” అన్నాడు.

వినయుడి మాటలు పూర్తయ్యేసరికి సభ చప్పట్లతో మారుమోగిoది. సభలో కొంత సేపు చర్చించిన  తరువాత తగు ఆదేశాలు జారీ చేసాడు మహారాజు.

రాజ్యమంతటా భటులను పంపించి వ్యసనాలకు కారణ మనుకున్న  వ్యాపారులను, వారికి సహకరిస్తున్న మంత్రులను బంధించారు. వ్యసనాలకి మూలకారణమని భావించిన వస్తువుల అమ్మకాలు  నిషేధించారు. మరికొన్నాళ్ళకి రాజ్యంలోని  యువకుల్లో మార్పు వచ్చింది. వినయుడి వల్ల తమ పిల్లలు బాగుపడినందుకు రాజ్య ప్రజలు ఎంతో  సంతోషించారు.

 

 

 

మరిన్ని కథలు