Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajaya devam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam
ఆముక్తమాల్యద'

తన భక్తుని విజయాన్ని తన విజయముగా భావించిన భక్తవత్సలుడైన శ్రీహరి, తన భక్తునికి జరుగుతున్నఅపూర్వసత్కారాన్ని కనులారా చూడడంకోసం ఆకాశవీధులలో ప్రత్యక్షమైనాడు. అది చూసిన విష్ణుచిత్తుడుఆయనను యిలా ప్రస్తుతించాడు.

జయ జయ దానవ దారణ కారణ శార్జ్ఞ్గ రథాంగ గదాసిధరా 
జయ జయ చంద్ర దినేంద్ర శతాయుత సాంద్ర శరీర మహః ప్రసరా
జయ జయ తామరసోదర సోదర చారు పదోజ్ఝిత గాంగ ఝరా
జయ జయ కేశవ కేశి నిషూదన శౌరి శరజ్జలజాక్ష హరీ   

దానవుల సంహారానికి కారణమైనవాడా, శార్జ్ఞ్గము అనే ధనుస్సును, చక్రమును(రథాంగము)కౌమోదకి అనే గదను, నందకము అనే ఖడ్గమును ధరించినవాడా నీకు జయము! అయుతి అంటే పదివేలు.శతఅయుతి అంటే పదివేల వందలు, అంటే పదిలక్షలు. పది లక్షలమంది చంద్రుల చల్లదనాన్ని,పదిలక్షలమంది సూర్యుల తేజస్సును కలబోసి వెలువరించే కాంతిని కలిగిన శరీరమును కలిగినవాడానీకు జయము! తన భక్తుల పట్ల చల్లని వెన్నెల వంటి కరుణను వర్షించడంలో చంద్రుని గుణమునుకలిగినవాడు. తన శత్రువుల పట్ల తీక్షణమైన తేజస్సును, వేడిమిని, ప్రభావాన్ని కలిగించడంలోసూర్యునివంటి వాడు, కనుక చంద్రుని, సూర్యుని కలబోసిన కాంతిని వెలువరించే దేహమును కలిగినవాడు. ఈ విశేషణము కూడా ప్రత్యేకమైనది.

గోదాదేవి తన 'తిరుప్పావై' పాశురంలో మొట్టమొదటి పాశురంలోనే ' కదిర్ మదియంబోల్ ముగత్తాన్'అన్నది, పరమాత్ముడిని. అంటే చంద్రునివంటి, సుర్యునివంటి ముఖమును కలిగినవాడు అని, అదేభావాన్నియథాతథంగా ఇక్కడ ఈ దివ్యమైన సంక్షిప్త స్తోత్రములో, కవిరాజవిరాజితము అనే ఛందస్సులో వెలువరించాడుశ్రీకృష్ణదేవరాయలు. అంతే కాదు, అల్లసాని పెద్దనవారు తమ 'మనుచరిత్రము'లో చివరలో యిదే పద్యాన్నివ్రాశారు, స్వారోచిష మనువు శ్రీ మహావిష్ణువును స్తుతి చేసిన సందర్భములో. ఇది కూడా ఉద్దేశపూర్వకముగా చేసినదే. ఇందుకు రెండు కారణాలు ఈ  యసకర్త ఉద్దేశములో. మొదటిది, మహా వైష్ణవుడు ఐన రాయలు'తిరుప్పావై'ని హృదయస్థము చేసినవాడు అనడంలో సందేహము లేదు కనుక గోదాదేవి వెలువరించినభావాన్ని అందిపుచ్చుకున్నాడు, యిది గోదాదేవి పరిణయ గాథ కనుక. రెండవది, స్వప్నములో తను చూసిన శ్రీమహావిష్ణువు రూపము అంతకుముందు తను విన్న పెద్దనవారి పద్యాన్ని గుర్తుకుతెచ్చింది రాయలవారికి. మనము కలగంటున్నప్పుడు ఆ కలలో చూస్తున్న దృశ్యాలకు అంతకు ముందు మనముచూసిన దృశ్యాలు, విన్న విషయాలు  కలిసిపోయి కనిపించడం లోక సామాన్యమైన విషయము. అలా తనమనసులో ముద్రించుకుపోయిన పద్యము, తనకు అంకితము చేయబడిన గ్రంథములోని పద్యము కనుకఅది తన సొత్తే అన్న చిలిపి ఊహతో పెనవేసుకుపోయిన సార్వభౌమ లక్షణము కనుక, పెద్దనమీది ప్రేమ,గౌరవములు ఇలా వ్యక్తము చేయడం కోసం రెండు మూడు పదాలను మాత్రమే మార్చి ఇలా వాడుకున్నాడుఆ పద్యాన్ని.

విష్ణుచిత్తులవారు చేసిన రెండు మహత్కార్యాలు విష్ణు మహత్యాన్ని ప్రపంచంలో చాటడం, తను చాటడం మాత్రమే కాక ఇంకా అద్భుతంగా,  ప్రత్యక్షంగా, సాధనా మార్గంలో గురువులాగా ప్రపంచానికి మధురభక్తి మార్గాన్ని బోధించడానికి గోదాదేవిని పుత్రికగా పొందడం. మొదటిది  అంటే మహావిష్ణు మహత్యాన్నివెల్లడి చేయడం ఐపోయింది, ఇక మిగిలింది గోదాదేవిని కుమార్తెగా పొందడం,  ఆమెను  పరమాత్మునికి ఇల్లాలుగా చేయడం, కనుక రాయల మనసు వెంటనే గోదాదేవివైపు వెళ్ళింది, అందువలన ఆమె రచించిన పాశురాన్ని అన్యాపదేశంగా ప్రస్తావించాడు. భావి కథనూ సూచించాడు. ఇక పద్యపు భావాన్ని పరిశీలిద్దాము. దేవగంగానదీ ప్రవాహమును వెలువరించిన, తామర పూవుఉదరములో నివసించే లక్ష్మీదేవికి సోదరుడైన చంద్రుని వంటి, చంద్రుని వెన్నెల వంటి పాదమును కలిగినవాడా నీకు జయము! గోలోకబృందావన నివాసి ఐన శ్రీకృష్ణుని పాదమునుండి గంగా దేవి ఉద్భవించింది అని దేవీ భాగవతములో వ్యాసమహర్షి చెప్పాడు. ఆ పురాణరహస్యాన్ని ఇక్కడ ప్రస్తావించాడు రాయలు. కేశవా, నీకు జయము. సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి, అంటే సర్వదేవతలకూ ఉద్దేశించిన నమస్కారములు కేశవునికే చెందుతాయి అని. ఎందుకంటే కేశవ నామములోని కకార, శకార, వకారములకు బ్రహ్మవిష్ణు మహేశ్వరులు ప్రతీకలు, ఆ త్రిమూర్తుల తత్త్వమే సమస్త దేవతలలోనూ నిండి ఉంది కనుక, కేశవా! నీకుజయము అన్నాడు విష్ణుచిత్తుడు. కేశి అనే రాక్షసుడిని సంహరించినవాడా, శరత్కాలములో వికసించిన కమలములవంటి కనులు కలిగినవాడా, హరీ! నీకు జయము అని మంగళాశాసనం చేశాడు విష్ణుచిత్తుడు.అద్భుతమైన సంగీత మాధుర్యానికి ఉదాహరణ ఈ చిన్ని స్తోత్రము, రాయల సంగీత సాహిత్య సమలంకృత  రచనా విన్యాసానికి గీటురాయి.ఇక్కడ విష్ణుచిత్తులవారి ద్వారా దశావతార వర్ణన  చేసిన అద్భుతమైన పద్యాలను రాయలు అందించాడు.అన్నీ సాధ్యము కాదు కనుక ముచ్చటగా మూడు పద్యాలనూ మాత్రం రుచి చూద్దాము.

దివిజద్వేషి నుదారవారిచరమూర్తిం ద్రుంచి చాతుర్య మొ
ప్పవడిం జౌకపుఁ దెల్ల కౌచుగమి దంభం బొంద మైఁ దాల్చి వే
దవిశుద్ధాక్షరపంక్తిఁ గ్రమ్మఱఁగ వేధం జేర్చెదో నాఁగఁ ద
ద్భువనం బబ్ధిసితాంబుబిందు లలమంబ్రోద్యద్రుచిం దాఁటవే

నీవు మత్స్యావతారమును ధరించి, వేదములను అపహరించిన రాక్షసుని సంహరించి, అప్పటికప్పుడే ఆ వేదములను తిరిగి బ్రహ్మకు అప్పగించడానికి అన్నట్లు వేగంగా వెళ్తుంటే ఆ వేగ సంచారానికి ఉవ్వెత్తున ఎగిసిన సముద్ర జలములు సత్యలోకాన్ని ఆక్రమిస్తుండగా, నీవు ఆ లోకాన్ని దాటితివి, అప్పుడు నీ మీనశరీరముమీది పొలుసులు తెల్లగా మెరుస్తూ శుద్ధ జ్ఞానపు చినుకులైన వేదపు పలుకులవలె తళతళలాడుతూ ఉన్నవి!

పవిధారాపతనంబుఁ గైకొనని యప్పౌలస్త్యుమైసప్తధా
తువులం దూఱఁ బరిశ్రమంబునకు నుద్యోగించె నా సప్తసా
లవిభేదం బొనరించి నిలవక సలీలంజన్న యుష్మన్మరు 
జ్జవనాస్త్రం బొసఁగు న్సిరుల్ రఘుకుల స్వామీ రమావల్లభా!    

వజ్రాయుధపు వాడి అంచుల దెబ్బలను కూడా లెక్కచేయని ఉక్కు శరీరుడు రావణుని సప్త ధాతువులను అవలీలగా ఛేదించి నీకు సంతోషాన్ని చేకూరుస్తాను, నా బలం మీద, నా మాటలమీద నమ్మకం లేకుంటే , ఇదిగో చూడు అని సుగ్రీవునికి నమ్మకం కలగడంకోసం నీవు ప్రయోగించిన నీ బాణం, సప్త సాలవ్రుక్షములనూ ఛేదించి అవతలికి దూసుకుపోయిన నీ రామబాణం మాకు సిరులను ప్రసాదించును గాక రామచంద్రా, లక్ష్మీపతీ! రామచంద్రుడిని రమావల్లభా, లక్ష్మీ పతీ అని సంబోధించడం విచిత్రంగా ఉండొచ్చు, గానీ వాల్మీకి వారు 'సీతా శ్రీరివ రూపిణీ!' సీత సాక్షాత్తూ శ్రీమహాలక్ష్మియే అని పలికారు, దాన్ని ఇక్కడ చమత్కారంగా ధ్వనిస్తున్నాడు శ్రీకృష్ణదేవరాయలు.    

ఆయత యుష్మదాక్రుతి కరాగ్ర నగాంచలవాంత వారి ధా
రాయుతచంద్ర కాంత ఫలకావళి బింబిత యై వెలుంగ నా
రాయణమూర్తి మత్కవచ రత్నముచే బరిరక్షఁ గాంచె నా 
నోయదువీర! వృష్టిఁ బసి యూఱడ బ్రోవవె సప్తరాత్రముల్

దేవేంద్రుడు నీమీద కోపముతో ఏడు రాత్రులు ఏకధారగా వర్షమును కురిపించినప్పుడు, గోవర్ధన పర్వతమును చేతి వ్రేలి కొసన ధరించి గోపకులను, గోవులను కాపాడినప్పుడు, నీ చేతివ్రేలి మీదుగా, పర్వతము మీదుగా,ఆ పర్వతమునందున్న చంద్రకాంత శిలలమీదుగా ఆ వర్షపు చినుకులు చుట్టూ జారిపోతున్నప్పుడు ఆ నీటి ధారలలో నీ రూపే ప్రతిబింబించి ఎటు చూసిననూ నీ రూపే కనిపించి, చుట్టూ నీ నారాయణమూర్తి ఒక కవచముగా, ఆ నారాయణకవచము ఆ గోవులను గోపకులను రక్షించినదేమో అన్నట్లు వెలుగొందినావుస్వామీ! నారాయణుడు అంటే నారములయందు అంటే నీటియందు నివశించేవాడు కనుక నారాయణుడునీటిలో ప్రతిఫలించి కనిపించడం వలన నారాయణమూర్తి అనేది ఆయనకు సార్ధక నామధేయము ఐంది,నీటిలో కనిపించడంవలన అంటున్నాడు రాయలు.

(కొనసాగింపు వచ్చే వారం)

***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
sudhamadhuram