Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

' సుధామ 'ధురం - సుధామ


 

దస్తూరీ తిలకం!

లానికీ, కాగితానికీ కాలం చెల్లే రోజులొచ్చేశాయి. ' పెన్ను పట్టుకుని కాగితం మీద రాయడమా ' బార్బేరియస్ ' అనుకుంటున్న జమానా వచ్చేసింది. నేరుగా కంప్యూటర్ లో కీబోర్డ్ మీద వేళ్ళు నొక్కుతూ రాసేసే రోజులొచ్చేశాయి. అన్నీ డి.టి.పి చేసేయడమే. ! ఇంగ్లీషే కాదు తెలుగు కూడా నేరుగా ఏ లేఖినియో , అక్షరమాలో , అనూ ఫాంటో ఉపయోగించి రాసేసుకోవచ్చు. ఇంక చేత్తో కలం పట్టుకోవడమే తగ్గిపోతోంది. పత్రికలలో పనిచేసేవారే కాదు ఇంట్లో కూచుని రాసే రచయిత(త్రు)లు కూడా పెన్ను, కాగితాన్ని క్రమేపీ మరిచిపోతున్నారు. సాంకేతికంగా జరిగిన గొప్ప మార్పు ఇది.

ఇక ' దస్తూరీ ' అనే మాటకు అర్థం ఎక్కడిది? చేతిరాత అనేదే కనుమరుగవుతోందంటే నాకెందుకో బాధగా ఉంది. ప్రాణవత్ చేతన , ఆత్మ ఏదో లోపిస్తుందేమో అని బెంగగా వుంటోంది. కలం పట్టి కాగితం మీద రాయడంలో వుండే సుఖం , మెదడుకు , కలానికీ కాగితానికీ మధ్య గల అనుబంధం, ఒకరి భావాలను వారి చేతిరాతలో చదువుకోవడంలో పొందే ఒక గాఢానుభూతి క్రమేపీ అవును కనుమరుగైపోతున్నాయి. ఉత్తరాలు రాసుకోవడం అనేది సెల్ ఫోన్లు, ఈ-మెయిల్స్ వచ్చాక అంతరించిపోతున్నట్లే రచయిత(త్రు)లు తమ రచనలను కాగితం మీద అక్షరాలుగా ఒక ఆలోచనాధారతో - కలం పట్టి రాయడం పోయి సాంకేతికతను అందిపుచ్చేసుకుంటున్నారు.

మా చిన్నప్పుడు తరగతిలో కాపీరైటింగ్ పుస్తకమూ ఒక తప్పనిసరి. డబుల్ రూల్ పుస్తకంలో పైన పంతులుగారు గుండ్రటి అక్షరాలతో రాసిన వాక్యాన్నో, సూక్తినో క్రింద అదేవిధంగా గుండ్రంగా రాయడం చేయాల్సి వుండేది. ప్రింటెడ్ కాపీరైటింగ్ పుస్తకాలూ వచ్చాయి. పై పంక్తి గుండ్రటి అచ్చులో వుండగా క్రిందన అభ్యర్థి అదే రీతిలో రాసే తీరుండేది. పరీక్షల్లో అందమైన దస్తూరీకి అయిదు మార్కులు అదనం అనే ఊరింపూ వుండేది.

అసలు తెలుగు అక్షరం అంటే గుండ్రంగా వుండేది. అందమైన లిపియే దస్తూరీలో జిలుగువెలుగులు పోతుండేది. పెద్దలు పిల్లలచేతిరాత పట్ల కూడా శ్రద్ధ పెట్టేవారు. లేఖల్లో గొలుసు కట్టు రాతలూ వుండేవి. అసలు ఒకరి దస్తూరీ బట్టి అనగా వారివారి చేతిరాత బట్టి వారి వారి స్వభావాన్ని అంచనా వేయడం కూడా ఒక శాస్త్రంగా అభివృద్ధి చెందింది. దస్తూరీ అభ్యాసం వల్ల మెరుగుపరుచుకోగలమన్న భావన వుండేది. దస్తూరీ అర్థం కాని బ్రహ్మరాతలూ వుంటాయి. కాదనం కానీ, స్వదస్తూరీచే సంతరించిన దాని విలువ ఎక్కువ. అది ప్రేమలేఖ కానీయండి, ఆస్తి పంపకాల వీలునామా కానివ్వండి. స్వదస్తూరీతో రాసినది ఏదయినా ఒక తిరుగులేని డాక్యుమెంట్.! ఆఖరికి సూసైడ్ నోట్ కు కూడా చేతిరాతతో రాస్తేనే చట్టప్రమాణానికీ నిలిచేది.

గోడ మీది రాతలు, తాటాకు మీది రాతలు చేత్తో రాయడంతోనే మొదలయ్యాయి. అలాగే కాగితం కనుగొన్నాక కాగితాలపై రాయడం వచ్చింది. గుటెన్ బర్గ్ అచ్చు యంత్రాన్ని కనుక్కోక ముందు అంతా, అన్నీ దస్తూరీల్లోనే. లేఖన, లేఖక సంప్రదాయమే రాజ్యమేలింది.

అచ్చు పత్రికలు ఎంత అభివృద్ధి చెందాయో ఒక దశలో లిఖిత పత్రికలు అంటే చేతిరాత పత్రికలూ అంతగా వుండేవి. తమ చేతిరాత అభివృద్ధికోసమే కాదు, తమ సాహిత్య , చిత్రకళాభిరుచులకు ప్రతీకగా లిఖిత పత్రికలు నిర్వహించిన వారు మునుపటి తరాల్లో చాలా మందే వున్నారు. పాఠశాల స్థాయిలో విజ్ఞాన జ్యోతి, కళాశాల స్థాయిలో  ' యువమిత్ర '  లిఖిత పత్రికలు నడిపానని మునుపే చెప్పాను గుర్తుందిగా! తెలుగులోనే కాదు, ఇతర భాషల్లోనూ లిఖిత పత్రికలు వచ్చాయి. జ్ఞానపీఠ గ్రహీతలయిన అజేయ్ సచ్చిదానంద హీరానంద వాత్స్యాయన్  తన 11వ యేట 1921 లోనే ' ఆనంద బిందు ' అనే లిఖిత పత్రికను నడిపాడు. అస్సామీలో బీరేంద్ర కుమార్ భట్టాచార్య , కన్నడంలో దత్తాత్రేయ రామచంద్ర బింద్రే లిఖిత పత్రికలు నిర్వహించారు. అసలు 1897 లోనే జార్జ్ వెండర్సన్ ధామస్ జాన్సన్ ' క్విల్ ' అనే చేతిరాత పత్రికను నడిపాడట.

మన తెలుగులో ఆచంట వెంకట సాంఖ్యాయన శర్మ, జయంతి గంగన్న 1903 నాటికే తొలుత లిఖిత పత్రికలు నడిపారు. క్రొవ్విడి లింగరాజు 1922 లో ఆంధ్ర యువజని, మద్దూరి అన్నపూర్ణయ్య 1929లో ' కాంగ్రెస్ ' పత్రికలను తొలుత లిఖిత పత్రికలుగా , సైక్లో స్టయిల్ పత్రికలుగా నిర్వహించారట. బాపు-ముళ్ళపూడి ' ఉదయభాను ' అంటూ తమ బాల్యంలో చేతి రాత పత్రిక నడిపారు. కొంగర జగ్గయ్య గారు ' శోభ ' అనే లిఖిత పత్రికను నిర్వహించారు. వాసిరెడ్డి సత్యనారాయణ గారు 1948 లో ' రఘు ' అనే లిఖిత సంచికను తెచ్చారు. ' మేఘమాల ' పేరున అంబికనంద్, జి.వి.పుర్ణచంద్ అలాగే జీడిగుంట శ్రీరామచంద్రమూర్తి, చొక్కాపు వెంకటరమణ, వేమూరి మధు సూదనరావు, సుగ్గం చంద్రశేఖర్, జీడిగుంట కామేశ్వర్ రావ్, వెంకట్రావ్,  వి.హనుమంతరావ్, ఇలా చెప్పుకుంటూ పోతే లిఖిత పత్రికలది అంటే చేతిరాత పత్రికలది ఒక విశేష చరిత్రే అవుతుంది.

లిఖిత పత్రికలకు దస్తూరీయే మూలం. అందమైన దస్తూరీయే దాని తొలి ఆకర్షణ. ' ముత్యాల కోవ లాంటి అక్షరాలు ' వంటి విశేష గుణాలు దస్తూరీ ప్రశంస కోసం వచ్చినవే. చేతిరాత బాగుంటే రచన ఏదైనా వెంటనే చదవబుద్ధి అవుతుంది. అందమైన ఉత్తరాలు అంటే భావాలలోనే కాదు అక్షరాల లిపిలో కూడానూ. గుండ్రటి తెలుగు అక్షరాల లిపిని వేగవంతంగా రాసుకునే వీలు కల్పిస్తూ బాపుగారు తన దస్తూరీనే ఒక లిపిగా నెలకొల్పారు. తెలుగుభాషకు, లిపికి ఒనగూడిన గొప్ప నవీకరణం, కొత్త సొబగు బాపుగారి దస్తూరీ. ఆయన బొమ్మలేకాదు, చేతిరాత కూడా ఎందరికో అనుసరణీయ మార్గమైంది.

శ్రీరమణ రాసిన ' మిధునం ' కథ మొత్తం బాపు గారు తన చేతిరాతతో రాసారు. తమకు నచ్చిన వాటిని అలా రాసుకోవడం ప్రాచీన పండితులకు కూడా అలవాటుండేది. రేడియోలో  లలితగీతాలు, సినిమాపాటలు వింటూ వాటిని పుస్తకంలో తమ స్వదస్తూరీతో రాసిపెట్టుకునేవారు ఎందరో. కొనుక్కునే స్తోమతు లేక పాఠ్యపుస్తకం మొత్తం చేతిరాతతో చూసిరాసుకున్న ఆనాటి విద్యార్థులనూ నేనెరుగుదును. అప్పుడు మరి జిరాక్స్ లూ అవీ లేవు. రాసుకునేది కూడా మరో ప్రతి అవసరమైతే కార్బన్ పేపర్ పెట్టి రాసుకోవడమే జరిగేది. సైక్లో స్టయిల్ వచ్చాక స్టెన్సిల్ పేపర్ మీద ప్రత్యేకమయిన స్టెన్సిల్ పెన్ తో రాసి మిషన్ లో పెట్టి కాపీలు తీసేవారు. జిరాక్స్ వచ్చాక ప్రతులు పొందే సౌలభ్యం పెరిగింది. చేత్తో రాసిందేకాదు, అచ్చు అయిన దానిని కూడా ఇవాళ జిరాక్స్ తీసుకోవడం జరుగుతోంది. సరే స్కానింగ్ లు, ఈ మెయిల్స్ వచ్చాక ఎవరికో జిరాక్స్ ప్రతి అందజేయాల్సిన అగత్యమూ తగ్గిపోయింది. నా ఎం.ఫిల్. సిద్ధాంత వ్యాస గ్రంధాన్ని కూడా నేను నా చేతి రాతతోనే మొత్తంగా రాసి సబ్ మిట్ చేయడం గుర్తుంది. మా తరం వారి సంగతి సరే గానీ ఇప్పటి తరంలో చూస్తే ఇలా కాగితం, కలం వినియోగించి రాసే విధానమే క్రమేపీ అంతరించి పోతోందనిపిస్తోంది. విద్యార్థులు పరీక్షల్లో తప్ప కాగితం, కలం తమ దస్తూరీ వాడుతున్న దాఖలాలు లేవు. ఆ పరీక్షా విధానాలు కూడా ఆన్ లైన్ లో జరిగే దశ వస్తున్నప్పుడు ఇక ' దస్తూరీ ' అనే మాటే భవిష్యత్ లో గగన పుష్పమవుతుందేమో!

డాక్టర్ల చేతిరాత మీద వున్నన్ని జోకులు అన్నీ ఇన్ని కావు. కొందరిది నిజంగా బ్రహ్మ రాతగా ప్రసిద్ధం. అంటే ఏమీ అర్థం కాదనే. కొందరు తాము రాసింది తామే చదవలేరు. రాసాక వారి రాతే వారికి అర్థం కాదు. " రాసినప్పుడు అదేమిటో నాకూ బ్రహ్మదేవుడికే తెలుసు. ఇప్పుడు ఆ బ్రహ్మదేవుడొక్కడికే తెలుసు " అని ఓ చమత్కారం. డాక్టర్ అయిన తన భరత రాసిన ఉత్తరాన్ని ఆయన గారి భార్య మెడికల్ షాప్ కెళ్ళి చదివించుకుందని మరో మేలం!

" నేషనల్ హాండ్ రైటింగ్ డే ' అని జనవరి 23 కాబోలు మనకు ఓ ప్రత్యేక దినోత్సవం కూడా వుంది. దస్తూరీ ఆవశ్యకత అవిస్మరణీయమని చెప్పడానికే బహుశ అది అస్తిత్వం లోకి వచ్చి వుంటుంది. నన్నడిగితే చేతిరాత లేకపోతే అది కూడా ఒక వికలత్వమే అనిపిస్తుంది. రోజుకి కనీసం డైరీలో ఓ అయిదు పంక్తులయినా మీ దస్తూరీతో రాసే అలవాటును నిలుపుకోమని, ఆ అలవాటు లేకపోతే చేసుకోమనీ నా విన్నపం.

తెలుగులో రాయడం, తెలుగులో మాట్లాడడం, తెలుగు చదవడం, తెలుగులో ఆలోచించడం అనే నాలుగు విధాలుగా అభివృద్ధిని సాధించగలిగినప్పుడే భాష అభివృద్ధి చెందుతుంది. ఏ తరం వారి వ్యక్తిత్వమయినా వికసించి తీరుతుంది.

మరిన్ని శీర్షికలు
kakoolu