Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : దీక్ష, సహస్రలకు బురఖాలు ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లోనూ వాటిని ధరించాల్సిందేనని గట్టిగా చెప్పి పంపుతాడు విరాట్. ముఖ్యమంత్రి సెల్విచెందామరై స్వయంగా దేవయానితో సహస్ర విషయం వాకబు చేసి విరాట్ ఫోన్ నంబర్ కనుక్కుని దేవయానితో ఫోన్ చేయిస్తుంది...................ఆ తర్వాత....

‘‘నమస్తే  మేడం... చెప్పండి నాతో మాట్లాడాలన్నారట’’  అడిగాడు.

‘‘అవును. సహస్ర గురించి తెలుసుకోవాలని ఫోన్‌ చేయమన్నాను.  ఆ అమ్మాయి ఏమైంది?  ఎలా తప్పిపోయింది? మీ యిద్దరూ లవ్‌ చేసుకున్నారా?’’ అడిగింది సియం.

‘‘మేడం.  సహస్ర నేనూ లవ్‌లో ఉన్న మాట నిజం. నా మీద అలిగి తను వెళ్ళిపోయింది. నేనిచ్చిన ప్రకటన చూడగానే తిరిగి వచ్చేసింది. సో... సహస్ర గురించి కంగారుపడాల్సిందేమి లేదు’’  చెప్పాడు

‘‘బాబూ.... నీ పేరేమిటి?’’ అడిగిందామె.

‘‘సారీ మేడం మీక్కావలసిన ఇన్ఫర్మేషన్‌  చెప్పాను.  ఇక నా పేరుతో పనేముంది?  సహస్ర నేనూ ఉంటున్న అడ్రసు తెలుసుకోవాలని మీ ఉద్దేశం కావచ్చు. బట్‌ మా సేప్టీ మేం చేసుకోవాలిగా, సో..... అవేం అడక్కండి. చెప్పను. అంతేకాదు సహస్ర గురించి మీరింతగా ఆరాతీస్తున్నారంటే జర్నలిస్టు లహరి రచయిత్రి సహస్ర ఇద్దరూ ఒకరేనని మీకు తెలిసేఉంటుంది.  యా మై కరక్ట్‌?’’

‘‘యస్‌ యు ఆర్‌ కరక్ట్‌’’  అంటూ చిన్నగా నవ్వింది సీఎం.

‘‘నువ్వెవరో గాని చాలా ఇంటెలిజెంట్‌వని అర్ధమవుతుంది.  కాదంటే సహస్రకు మా నుంచి అపకారం జరగవచ్చని నువ్వు సందేహిస్తున్నట్టుంది. ఆమెను కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే నీకు ఫోన్‌ చేసాను.  మధురై మహదేవనాయకర్‌  మాకు మా పార్టీకి చాలా ముఖ్యమైన వ్యక్తి.  ఆయన కూతురు సహస్ర క్షేమం మాకు ముఖ్యం. నువ్వు సందేహించాల్సిన పనిలేదు.

నీకు తెలుసో తెలీదో సహస్ర కన్పిస్తే అరెస్ట్‌ చేసి పోలీస్టేషన్‌లో వుంచి కేసుబుక్‌  చేయమని చెన్నై పోలీస్‌  కమీషనర్‌  నుండి పోలీసులకు ఆర్డర్స్‌ ఇష్యూ అయినట్టు ఇంత క్రితమే తెలిసింది.  కారణం తెలుసుకోడానికి కమీషనర్‌ని పిలిపిస్తున్నాను.  మీరు ఒంటరిగా సిటీలో తిరగటం క్షేమం కాదు.  కారణాలు నీకు ప్రత్యేకించి చెప్పక్కర్లేదునుకుంటాను.’’

‘‘అక్కర్లేదు మేడం.  అంతా నాకు తెలుసు’’.  అంటూ మాటలకు అడ్డం వచ్చాడు విరాట్‌.

‘‘మా మీద చూపిస్తున్న అభిమానానికి ఆదరణకి కృతజ్ఞడ్ని.  మీరు మీ ప్రభుత్వం.  పోలీసులు ఆ కోణం నుంచే మా గురించి ఆలోచిస్తున్నారు. నా అభిప్రాయం కరక్టయితే కంటబడిన మరుక్షణం త్యాగరాజన్‌  మనుషులు లహరిని చంపేస్తారని మీరు గ్రహించి ఉండాలి.  అయితే ఇవి గాక మాకింకా చాలా సమస్యలున్నాయి మేడం. వాటి నుండి బయటపడేవరకు మా వివరాలు చెప్పలేను. సారీ..... మేడం బట్‌ రక్షణ విషయంలో మా జాగ్రత్తలో మేమున్నాం. కంగారు పడాల్సింది లేదు’’  అన్నాడు.

‘‘ఒకె... నీ పేరు అడ్రసు చెప్పొద్దు. సహస్రతో ఒకసారి మాట్లాడ్డం వీలవుతుందా?’’

‘‘వీలుకాదు మేడం.  తను వేరే చోట వుంది. తన వద్ద సెల్‌ఫోన్‌  లేదు.’’

‘‘ఒకె మిస్టర్‌ నువ్వింతగా చెప్పాక ఇక నిన్ను వత్తిడి చేయను కాని...  నా నుంచి మీకు ఏ సాయం కావాలన్నా అర్ధరాత్రి ఫోన్‌చేసినా మీకు తక్షణ సాయం అందే ఏర్పాటుచేస్తాను.  నన్ను నమ్ము.  నా పర్సనల్‌  నంబరిస్తాను నోట్‌  చేసుకో....’’

కాదనలేక సియం చెప్పిన నంబర్‌ను

తన సెల్‌ ఫోన్‌లో ఫీడ్‌  చేసుకున్నాడు విరాట్‌

సెల్‌ లైన్‌ కట్‌ చేసి దేవయానికి తిరిగిస్తూ చిన్నగా నవ్వింది సియం.

‘‘ఏమంటున్నాడు మేడం,  వాళ్ళు ఎక్కడున్నారట?’’  ఆసక్తిగా అడిగింది దేవయాని.

‘‘చెప్పటానికి నిరాకరించాడు.’’

‘‘వ్వాట్‌.......... మీతో చెప్పటానికేమిటి?’’  తెల్లబోయింది దేవయాని.

‘‘ఏమిటీ అంటే?  ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళు ఎవరినీ నమ్మేట్టులేరు.  అంతే.  బట్‌  ఈ కుర్రాడు ఎవడో గాని అతని వాయిస్‌ ఫ్రీక్వెన్సీని బట్టి చూస్తే ఇతను అన్నిటికీ సమర్ధుడనిపిస్తోంది.  స్థిరమైన అభిప్రాయాలు గలవాడు.  భయమంటే తెలీనివాడు.  శతృవు మీద వ్యూహ ప్రతి వ్యూహాలు చేయటంలో సమర్ధుడు. ప్రేమకోసం ప్రపంచాన్ని ఎదిరించే సాహసి అన్పిస్తోంది.  సహస్రను కాపాడుకోడానికి తమ రక్షణలో తామున్నారట.  కంగారుపడాల్సిందేమీ లేదంటున్నాడు. ఎందుకైనా మంచిదని నా పర్సనల్‌ నెంబరిచ్చాను.  ఈ అబ్బాయి చాలా తెలివైన వాడు.  ఇక వాళ్ళ గురించి వదిలేసి కమీసనర్‌  గారు ఏం చెప్తారో విని దాన్ని బట్టి ఒక నిర్ణయం తీసుకుందాం’’ అంటూ వివరించింది.ఇంతలో చెన్నై సిటీ కమీషనర్‌  ఆఫ్‌  పోలీస్‌  వచ్చి బయట వెయిట్‌  చేస్తున్నారని సెక్రటరీ వచ్చి చెప్పగానే వెంటనే లోనికి రప్పించమన్నారు సి యం.వస్తూనే ఫార్మాలిటీగా సి యం కు సెల్యూట్‌  చేసాడు.  ఆరుగుల పొడవున చాలా హుందాగానూ గంభీరంగా నూ వున్న నడివయసు వ్యక్తి కమీషనర్‌.

‘‘రండి కమీషనర్‌  గారూ మీతో ముఖ్యమైన విషయం ఒకటి మాట్లాడాలి,  కూచోండి’’ అంది చెందామరై.

‘‘ఫరవాలేదు మేడం.  విషయం ఏమిటో చెప్పండి’’  అన్నాడు ఎదురుగా నిలబడుతూ కమీషనర్‌.

‘‘నాకో విషయం తెలియాలి. ఈ ప్రకటనలో యువతి?... ఈ ప్రకటన మీరు చూసారుగా?’’

‘‘చూసాను మేడం’’

‘‘ఈ అమ్మాయి ఎక్కడ కన్పించినా వెంటనే అరెస్ట్‌ చేసి కేసుబుక్‌  చేయమని మీరు ఆర్డర్స్‌  ఇష్యూ చేసారని విన్నాను.  అందుక్కారణం తెలుసుకోవాలనుకుంటున్నాను. చెప్పండి కమీషనర్‌ గారూ ఆ కుర్రాడెవరో తన ప్రియురాల్ని పట్టిస్తే కోటి అంటూ ప్రకటనిస్తే మీరు అమ్మాయి మీద అరెస్ట్‌ వారంట్‌  ఇష్యూ చేసారు ఎందుకు?’’  సీరియస్‌గా ప్రశ్నించింది  సియం.

‘‘అందుకు రెండు ప్రధాన కారణాలున్నాయి మేడం. ఈ అమ్మాయి తండ్రి మహదేవనాయకర్‌. తన కూతురు లక్ష్మీ సహస్ర ఆరు మాసాలయినా కన్పించటం లేదు ఆమె చెన్నైలో ఉన్నట్టు ఈ ప్రకటన మూలంగా తెలిసింది గాబట్టి ఆమె చెన్నైలో ఎక్కడ వున్నా పట్టుకొని మధురై తన ఇంటికి పంపించవలసిందిగా మధురై పోలీస్‌ స్టేషన్ లో కంప్లయింట్‌  ఇవ్వటంతో బాటు మా కార్యాలయాని క్కూడ అభ్యర్ధిస్తూ లెటరు వ్రాసాడు.  ఇది మొదటి కారణం.

రెండో కారణం ఈ అమ్మాయి మధురైలో పది మందిని దారుణంగా కొట్టిపారిపోయిందనీ,  వాళ్ళలో ముగ్గురింకా ఆస్పత్రిలో కోమాలో ఉన్నారనీ, ఈ అమ్మాయి మీద మధురై పోలీస్‌  స్టేషన్ లో అరెస్ట్‌  వారంట్‌ ఉందనీ కాబట్టి చెన్నైలో ఈ అమ్మాయిని అరెస్ట్‌ చేసి కేసుబుక్‌  చేసి మధురై పోలీసులకు అప్పగించమని అక్కడి ఎ యస్‌ పి ప్రకాష్‌ స్పెషల్‌ గా రిక్వెస్ట్‌  చేయటం జరిగింది.  ఈ రెండు కారణాల దృష్ట్యా ఈ ఆర్డర్స్‌  ఇష్యూ చేయాల్సొచ్చింది మేడం’’ . అంటూ వివరించాడు గుహనాథన్‌.

‘ఆ అమ్మాయి చేతిలో దెబ్బతిన్నవాళ్ళు ఎవరో మీకు తెలుసా?’’  సూటిగా అడిగింది సి యం చెందామరై. ‘‘తెలీదు మేడం’’‘‘ప్రముఖ జర్నలిస్టు లహరి ఈ అమ్మాయేనని మీకు తెలుసా ?  అది కూడ తెలీదా?’’

‘‘తెలీదు మేడం!’’

‘‘ఆ ఎ యస్‌ పి ప్రకాష్‌  మీద దాడి జరిగి ప్రస్తుతం హాస్పిటల్లో వున్న సంగతి తెలుసా?’’

‘‘తెలుసు మేడం’’

‘‘అతడు మీ మేనల్లుడు గాబట్టి అతని మాటలకి ప్రాధాన్యత నిచ్చారా?’’

‘‘మేడం...’’  కమీషనర్‌  షాక్‌ తింటూ గొణిగాడు.

‘‘ఇంకేం చెప్పకండి.  ఏమీ తెలుసుకోకుండా అరెస్ట్‌  వారెంట్‌  ఎలా ఇష్యూ చేసారు?  మీ మేనల్లుడు అక్కడ కుంభకోణాల పుట్ట. జగన్మోహన్‌ కి ఫర్‌ గా పనిచేస్తున్నసంగతి కూడ మీకు తెలీదు.  కోర్టు బయటే తనను చంపాలని ప్రయత్నించిన జగన్మోహన్‌  మనుషుల్ని ఆత్మ రక్షణ కోసం ఆ అమ్మాయి కొట్టి తప్పించుకు పారిపోతే,  క్రిమినల్‌ మీద కేసుపెట్టినట్టు ఆ అమ్మాయి మీదే కేసు పెట్టడానికి మీ డిపార్ట్‌మెంట్‌  సిగ్గుపడాలి.  కనీసం హోం మినిస్టర్‌తో కూడ సంప్రదించకుండా మీరీ నిర్ణయం ఎలా తీసుకున్నారు అర్ధంగావటం లేదు.’’సి యం మాటలు కమీషనర్‌కు చమటలు పుట్టించాయి.  అసలీ సహస్ర విషయంలో సి యం కింత ఇంట్రస్టున్న సంగతే తనకు తెలీదు.  తెలిసుంటే మేనల్లుడు ఎ యస్‌ పి ప్రకాష్‌  మాటలు నమ్మి తను బుక్కయిపోయేవాడు కాదు.  లోతుకు వెళ్తే తను చాలా ఇబ్బందుల్లో పడతాడు. తనకింత వరకు మధురై నుండి డిపార్ట్‌మెంట్‌ పరంగా ఆ కేసుల తాలూకు పేపర్స్‌  ఏవీ చేరలేదు.  తప్పు ఒప్పేసుకోవటం మంచిది.

‘‘సారీ ....  అయం సారీ మేడం.  పొరబాటు జరిగింది.  వెంటనే ఆర్డర్స్‌  కాన్సిల్‌  చేయిస్తాను’’.  ఎలాగో గొంతు పెకల్చి సమాధానం చెప్పాడు.‘‘ఇది మీరు కావాలని చేసారా పొరబాటున చేసారా అనేది నాకనవసరం అరెస్ట్‌  జరక్కూడదు.  ఈ అమ్మాయి వెంట ఆమె ప్రియుడు ఉంటాడు. వాళ్ళిద్దరూ ఎక్కడ కన్పించినా సగౌరవంగా నా వద్దకు తీసుకురావాలి.  అవసరమైతే మీ డిపార్ట్‌మెంట్‌  ఆ యిద్దరికీ రక్షణ కల్పించాలి.  మరో విషయం.

వీళ్ళ కోసం మధురై నుంచి గాని ఇతర ప్రాంతాల నుంచి గాని కొన్ని అరాచక శక్తులు నగరంలో ప్రవేశంచే ప్రమాదం వుంది.  నగర ప్రశాంతతకి ఎలాంటి భంగం జరక్కూడదు. సిటీకి వచ్చే అన్ని మార్గాల్లోను చెక్‌పోస్టుల్ని అలర్ట్‌ చేయండి.  నగరంలోని లాడ్జిలు, హోటళ్ళను అలర్ట్‌గా ఉండేలా చూడండి’’.

‘‘ఒకె మేడం. వెంటనే ఆ ఏర్పాట్లు చేయిస్తాను.  వస్తాను మేడం’’ అంటూ ఫార్మలిటీ ప్రకారం తిరిగి సెల్యూట్‌ చేసి చాలురా బాబు అనుకుంటూ వచ్చినంత హడావుడిగానూ వెళ్ళిపోయాడు కమీషనర్‌ .

అయితే ఇప్పటికే లేటయిందని రావలసిన వాళ్ళంతా సిటీకి వచ్చేసి అక్కడక్కడా సెటిలయి సహస్ర కోసం విరాట్‌  కోసం గాలిస్తున్నారని ఎవరికీతెలీదు.

ఆ రోజు మధురై నుంచి బయలుదేరిన రెండు బేచీల్లోను ఎట్టయప్పన్‌  పంపించిన ధనగిరి బేచ్‌ ముందుగా చెన్నై చేరుకుంది. ధనగిరి చాలా తెలివైన వాడు. ముందు చూపు ఎక్కువ.  అంతా గ్రూప్‌గా ఒకే లాడ్జిలో దిగటం క్షేమం కాదని వాడికి తెలుసు.  తన మనుషుల్ని ఇద్దరిద్దరుగా విడగొట్టి వడపళని,  కోడంబాక్కం, నుంగంబాక్కం లాడ్జిల్లో ఉండేలా పంపించి తను పాండీబజార్‌లో సెటిలయ్యాడు.  ప్రతి ఉదయం తనే వచ్చి పికప్‌ చేసుకునేలా ఏర్పాటుచేసి తమ వెహికిల్‌ని తన వెంటే ఉంచుకున్నాడు.

వాళ్ళ వెనకే కాస్త ఆలస్యంగా సిటీ కి వచ్చిన వాళ్ళు కోయంబత్తూర్‌  నుంచి విరాట్‌ కోసం వచ్చిన మునుసామి బేచ్‌. వాళ్ళంతా రెండు గ్రూపులుగా విడిపోయి సెయింట్‌ థామస్‌  మౌంట్‌ లో ఎదురు బొదురుగా వుండే రెండు హొటళ్ళలో రూమ్‌లు తీసుకొని సెటిలయ్యారు.ఒక మహదేవనాయకర్‌  సహస్ర కోసం పంపించిన కదిరేషన్‌ బృందం అడయారులోని ఒక లాడ్జిలో సెటిలయ్యారు.

కోయంబత్తూర్‌కు చెందిన పిక్‌పాకెట్‌  బేచ్‌  మురడన్‌  ముత్తూ నేతృత్వంలో బిచ్చగాళ్ళు గా మారి అప్పటికేమీ నంబాక్కం ఏర్‌ పోర్ట్‌ పరిసరాల్లో కాలనీలు బస్టాండ్లు అంతటా సహస్ర కోసం గాలించటం మొదలు పెట్టారు.  నాలుగు రోజులు గడిచి పోయాయి కాని సహస్ర కనబలేదు వాళ్ళకు. అలాగే చెన్నై చేరుకున్నమూడు బేచ్‌లూ కూడా తమ వాహనాల్లో సిటీ వీధుల్లో తిరిగుతూ గాలింపు ఆరంభించారు. ఇదిలా వుంటే మరోపక్క పోలీసులు సిటీకి వచ్చే అన్ని మార్గాల్లోనూ తనిఖీలు ముమ్మరం చేసారు.

రాత్రి వేళ లాడ్జిల కొచ్చి బసచేసిన వాళ్ళని విచారించి పోతున్నారు.  ఈ పరిస్థితుల్లో మరో నాలుగు రోజులు ప్రశాంతంగా గడిచి పోయాయి.ఈ లోపల దీక్ష పుట్టిన రోజు వచ్చింది.ముగ్గురికీ ఈ సందర్భంగా ట్రీట్‌  ఇవ్వాలనుకుంది దీక్ష.  మధ్యాహ్నం లంచ్‌కు ఏర్‌ పోర్టు సమీపంలోని ఖరీధైన ఒక రెస్టారెంట్‌కు బయలుదేరారు.ఏర్‌పోర్ట్‌  పరిసరాల్లో మురడన్‌ ముత్తూబేచ్‌ అంతా ముస్టి వాళ్ళ వేషంలో సంచరిస్తూ వారం రోజులు పైగా సహస్ర ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నారు.

I              I                     I

అప్పటికి పావుగంట క్రితమే విరాట్‌ బైక్‌  రెస్టారెంట్‌ పార్కింగ్‌లో ఆగింది. అతడి వెనక బురఖా ధరించిన సహస్ర కూచునుంది.  ఆ వెనకే చందూ నడుపుతున్న స్కూటీ వచ్చి బైక్‌  పక్కనే ఆగింది. అతడి వెనక దీక్ష వుంది. ఆమె కూడా బురఖాలోనే వుంది.నలుగురూ రెస్టారెంట్‌  ఎంట్రన్స్‌ వైపు నడిచారు. సరిగ్గా వాళ్ళ పక్కనుంచే  ముష్టి వాడి  వేషంలోని మురడన్‌  ముత్తు ఎగువన సాదా హోటల్లో భోం చేయడానికి వెళ్ళాడు. కాని తామంతా వెదుకుతున్న సహస్ర పక్కనే ఉందని వాడికి తెలీదు.

కాసేపట్లో ఆర్డర్‌  చేసిన అయిటమ్స్‌  అన్నీ టేబుల్‌  మీది కొచ్చాయి.  వెజ్‌ నాన్‌వెజ్‌తో కూడిన అద్భుతమైన వంటకాలు.  కబుర్లు చెప్పుకుంటూ భోం చేసారంతా.

సుమారు రెండు గంటల ప్రాంతానికి బిల్లు పే చేసి బయటకొచ్చారు.  అప్పటికింకా అటు భోజనానికి వెళ్ళిన ముత్తు వెనక్కి రాలేదు. ఇటు ఆ ప్రాంతంలోనే వేన్‌ పెట్టుకొన్న మునుసామి మందు కొట్టి బిర్యానీ తినగానే మత్తుగా గురకతీసి నిద్రపోతున్నాడు.  బార్‌లో వున్న అతడి మనుషులింకా వెనక్కి రాలేదు. వస్తే పార్కింగ్‌ లోని విరాట్‌ని ఖచ్చితంగా గుర్తుపట్టేవాళ్ళు. ఈ లోపల`

‘‘ఏయ్‌  దీక్షా అటు చూడవే. అక్కడేదో పెద్ద ఫాన్సీ స్టోరుంది వెళ్దామా?’’ అంది సహస్ర.

‘‘ఏం కావాలి?’’ అడిగాడు విరాట్‌.

‘‘నచ్చినవి ఏముంటే అవి తెచ్చుకొంటాం. ఇక్కడే ఉండండి.  త్వరగా వచ్చేస్తాం.’’  అంటూ దీక్షతో అటు కదిలింది సహస్ర. ఎందుకయినా మంచిదని చందూని వాళ్ళ వెంట పంపించి తను బైక్‌ దగ్గర ఉండిపోయాడు విరాట్‌.  వెళ్ళిన ముగ్గురూ స్టోర్‌లోకి పోవటం చూస్తూనే వున్నాడు. ఇంతలో`

విలాసవంతమైన కారొకటి హంసలా దూసుకొచ్చి విరాట్‌ సమీపంలో ఆగింది.

యధాలాపంగా అటు చూసిన విరాట్‌`

సడెన్‌గా సునామీ వచ్చి మీద పడుతున్నట్టుగా...  అదిపడ్డాడు.

ఆ కారులో వచ్చింది వేరెవరో కాదు.

విశాల!

డ్రైవింగ్‌  సీట్లోంచి దిగి`

సుడిగాలిలా తన వైపే వచ్చేస్తోంది.

చీర జాకెట్‌ లో షోకేసులో బొమ్మలా ఈ రోజు మరింత అందంగా ఉంది. చివరిగా ఆ రోజు ఎగ్మోర్‌  రైల్వేస్టేషన్‌ కలవడమే. తర్వాత బైక్‌ సర్వీసు నుంచి రావటంతో ట్రైన్‌కి వెళ్ళాల్సిన అవసరం లేకపోయింది. సడెన్‌గా తిరిగి ఇప్పుడు ప్రత్యక్షమైంది. అదీ టైమ్‌ గాని టైమ్‌లో.ఓరి దేవుడా! ఈ టైమ్‌లో దీన్నిపంపించావేంటయ్యా బాబు. దీన్ని నా పక్కన సహస్ర చూసిందంటే వూహించని ఉత్పాతాలు జరిగిపోతాయి. ఏం చేయాలి?’’ అనుకుంటూ ముఖం పక్కకు తిప్పుకోబోయి కూడా ఆగిపోయాడు.సందేహం లేదు.తన్నిక్కడ పార్కింగ్‌లో నిలబడటం చూసే కారునిటు మళ్ళించింది విశాల.  తప్పించుకొనే ఛాన్సేలేదు.‘దేవుడా దేవుడా.  సహస్ర వచ్చేలోన విశాలను పంపించేయి స్వామీ.  నీకు నూరు కొబ్బరికాయలు కొడతాను’  అని మనసులోనే దేవుడికి మొక్కుకొంటూ విశాలను చూసి విష్‌ చేసాడు.అతి సమీపంగా`ఎదురుగా వచ్చి నిలబడిరది విశాల.‘‘హలో విశాల... ఎలా వున్నావ్‌?  ఏమిటి అనుకోకుండా ఇటుపక్క?’’ పొడి పొడిగా పలకరించాడు.ఆమె బదులు చెప్పలేదు.

అతడ్నే చూస్తోంది.

ఆమె కళ్ళల్లో జలపాతంలా`

దూకడానికి సిద్ధంగా ఉంది కన్నీరు.

అందంలో మార్పు రాలేదు గాని`

ఏదో బెంగతో వున్నట్టు మనిషి కాస్త చిక్కింది.

‘‘అంతేనా?  నాతో మాట్లాడ్డానికి నికింకేం మాటలు లేవా?’’ అంది రుద్ద కంఠంతో.  విరాట్‌  నిశ్చేష్టుడయ్యాడు.

‘‘విశాల.. ప్లీజ్‌... నేను చెప్పేది విను..’’ అన్నాడు.

‘‘ఏం వినమంటావ్‌?  నా మనసు వినటం లేదే.  ఏం చేయను? , నీకు చెప్పాల్సిందంతా సిగ్గు విడిచి అప్పుడే చెప్పాను. నువ్వు పెళ్ళి చేసుకున్న ఉంచుకున్నా ఏం చేసుకున్నా నేను నీ దాన్ని.  నా పిల్లలకి నువ్వు తండ్రి కావాలి.  నిన్ను ప్రేమించిన మనసు మరో మగాడ్ని అంగీకరించదన్నాను.  నా అభ్యర్థనల్లో ఒక్కటీ తీర్చలేవా? మాట్లాడు విరాట్‌.  నీవు కన్పిస్తావన్న ఆశతో పిచ్చిదానిలా ప్రతి రోజు గాలిస్తున్నాను. అదే ఎగ్మోర్‌  స్టేషన్‌కొచ్చి నీ కోసం ఎన్ని రోజులు నిరీక్షించానో తెలుసా. నీ ఫోన్‌ తెలీదు. అడ్రస్‌ తెలీదు. ఇక కనబడవేమో చచ్చిపోవాలనుకున్నాను తెలుసా?’’  అంటూ ఇక దుఃఖాన్ని ఆపుకోలేక సడెన్‌గా అతడి ఛాతిని చుట్టుకుపోతూ గుండెల్లో ముఖం దాచుకొని ఏడ్చేసింది.

కొద్ది క్షణాల పాటు`

అచేతనుడైపోయాడు విరాట్‌.ఆమెను వారించలేక పోగా అప్రయత్నంగా అతడి చేతులు ఆమెను బంధించి వీపు నిమిరి ఓదార్చాయి. అతడి కళ్ళలోనూ నీరు చేరాయి.

విశాలను తేలిగ్గా తీసుకున్నాడు.  మనం ప్రేమించే వాళ్ళ కోసం ఎంతగా ఆరాటపడతామో మనల్ని ప్రేమించే వాళ్ళు అంతగా ఆరాటపడతారని తెలుసుకోలేక పోయాడు. విశాల ఇంత డీప్‌గా తనను లవ్‌ చేస్తుందనుకోలేదు. మనసు బాధతో విలవిల్లాడిరది.

సరిగ్గా ఇదే సమయంలో`

అక్కడ బార్‌లో కెళ్ళిన మునుసామి మనుషులు వేన్‌ వద్ద కొచ్చారు.  వాళ్ళలో ముందుగా బండశివ ఇటు పక్క పార్కింగ్‌లో ఒకమ్మాయి కౌగిట వున్న విరాట్‌ని చూసి గుర్తించాడు.  వెంటనే మిగతా వాళ్ళని అలర్ట్‌  చేస్తూ వేన్‌లో మత్తుగా నిద్రపోతున్న మునుసామిని లేపాడు.విరాట్‌  కన్పించాడనగానే`

మునుసామి మత్తు మంచులా కరిగిపోయింది.

కళ్ళు నులుముకుంటూ దిగ్గున లేచి కూచున్నాడు.  విరాట్‌ను గుర్తుపట్టి వేన్‌  దిగాడు.

‘‘వచ్చిన పనయిపోయింది.  పదండి చినబాబుతో మాటాడి వెంటనే కోయంబత్తూరు తీసుకెళ్ళిపోదాం’’  అన్నాడు ఉత్సాహంగా బండశివ.‘‘బుద్ధి లేకుండా మాట్లాడకు.  నువ్వో నేనో పిలిస్తే వచ్చేస్తాడనుకొన్నావా?  ముందా అమ్మాయి ఎవరో చూడండి.  పేపర్లో ప్రకటనిచ్చిన అమ్మాయి తనేనా?’’ అన్నాడు మునుసామి.

‘‘ఆ పిల్లగాకుంటే కౌగిలించుకుంటాడా ఏంటి? తనే అయుంటుంది’’ అన్నాడు డ్రయివర్‌.‘‘లేదు లేదు ఈ అమ్మాయి ప్రకటనలో ఉన్న పిల్ల కాదు’’  అన్నాడు కంగారుగా బండశివ.  మునుసామి ఆలోచించాడు.

‘‘ఒరే...   ఇప్పుడే  మనం చినబాబు ఎదుట పడ్డం మంచిది కాడు.  ప్రకటనలో  పిల్ల ఎవరు,  ఈ అమ్మాయి ఎవరు?  చినబాబు పరిస్థితి ఏంటో తెలుసుకోవాలి.  అంతా వేనెక్కండి.  రెడీగా ఉందాం. చినబాబుని ఫాలో చేసి ముందు అడ్రసేంటో  తెలుసుకుందాం. గెట్‌ రెడీ’’  అన్నాడు.

అంతే.

క్షణాల్లో  అంతా వేన్‌ లోకి చేరిపోయారు.  డ్రయివరు  వేన్‌ ని దూకించటానికి రెడీగా కూచున్నాడు.

ఈ లోపల`

‘‘మాట్లాడు విరాట్‌.  ఇంకా మౌనం వహిస్తావా?  నేను నీ ఆస్థి నాశించానా,  సొత్తు నాశించానా...  నా ఆస్థి మొత్తం నీకే ఇస్తానన్నాను. నిన్ను దక్కించుకోవాలంటే ఇంకేమివ్వగలను’’ అంది కౌగిలి వదిలి పైట చెంగుతో కన్నీళ్ళు తుడుచుకుంటూ విశాల.

‘‘విశాలా..  నీకెలా చెప్పాలో అర్థం గావటం లేదు.  నీతో పరిచయానికి ముందే నేను లవ్‌లో వున్నాను’’

‘‘అబద్ధం.  అప్పటికి నువ్వెవరినీ ప్రేమించ లేదు’’

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika