Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
sahiteevanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

Happy Ugadi

కవితాప్రియు - -సిరాశ్రీ

me with rallabandi - sirasri

1996-98 ప్రాంతం. నేను బందరులో డిగ్రీ చదివే రోజులు. తెల్లవారుజామున ట్యూషన్ నుంచి వస్తున్నప్పుడు ఒక ఇంట్లోంచి శ్రుతిబధ్ధమైన పద్యగానం వినపడేది. ఒక్కోసారి కాసేపక్కడ ఆగి విని వెళ్లేవాడిని.  ఒక రోజు మా ఇంటికి కాస్త దగ్గర్లో L.I.C బిల్డింగ్ లో ఏదో సభ. లౌడ్ స్పీకర్లలోంచి వక్తల మాటలన్నీ వద్దన్నా కర్ణభేరీలను ఛేదిస్తున్నాయి. ఇంతలో ఒక గొంతు వినిపించింది. స్వచ్చమైన భాష, ప్రవాహం లాంటి ఉపన్యాసం...అది ఆ గొంతే! రోజూ పొద్దున్న పద్యాలు పాడే గొంతే. ప్రాచీన తెలుగు సాహిత్యం గురించి, "కుందమాల" అనే సంస్కృత గ్రంథం గురించి చాలా విషయాలు తెలిసాయి నాకు ఆ ఒక్క ఉపన్యాస శ్రవణంతో. ఉపన్యాసం ముగిసింది. ఇంతకీ ఎవరీయన అనుకుంటుండగా.... "ఇంతటి గొప్ప ఉపన్యాసం చేసి మా ప్రాంగణంలో సరస్వతీదేవిని నడిపించిన సాంఘిక సంక్షేమ శాఖ అధికారి, అవధాని డా|| రాళ్లబండి కవితా ప్రసాద్ గారికి ధన్యవాదాలు" అనే వాక్యం వినపడింది.

ఒకరోజు బందరు టవున్ హాల్ లో అష్టాదశావధానం అని ప్రచారం... అవధాని డా రాళ్లబండి కవితా ప్రసాద్. అరగంట ముందే వెళ్లి కూర్చున్నాను. పెద్దగా జనం లేరు. అవధానం అంటే నాకు గొప్ప గానీ, అందరికీ అంత ఉండదులే అని సరిపెట్టుకున్నాను. అది అష్టాదశావధానం. 18 మంది పృఛ్ఛకులు. రాళ్లబండి వేదిక మీదకొచ్చారు. చూడగానే దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆయన వినయంతో కూడిన చిరునవ్వు, సభకు నమస్కరించిన తీరు. ధిషణాహంకారం ఆయన శరీరభాషలో ఏమాత్రం కనపడలేదు. ఇక అవధానం మొదలైంది. ఆయన పాడుతున్న పద్యాల ధాటికి పావుగంటలో హాలు నిండిపోయింది. అప్పుడు వచ్చిన వాళ్లకి నిలబడడానికి కూడా చోటు దొరకలేదు. రాళ్లబండి గారి చమత్కారాలకి, హాస్య ధోరణికి, సమయస్ఫూర్తికి జనం చప్పట్లు. ఆ సభలోనే ఏదో సందర్భం వచ్చి "ఆరేసుకోబోయి పారేసుకున్నాను...కోకెత్తుకెళ్లింది కొండగాలి" అనేది సీసపద్యపాదం అన్నారు. గణాలు, యతులు చూసుకుంటే నిజమే అనిపించింది. ఆయనపట్ల ఆసక్తి ఇంకాస్త పెరిగింది.

ఆయనని పరిచయం చేసుకుని పద్యవిద్యలోని మెళకువలు తెలుసుకోవాలని అనుకున్నాను. ఇంతలోనే ఆయన ఆ ఊరి నుంచి బదిలీ అయిపోయారని ఎవరో చెప్పారు. నిట్టూర్చి నా పనుల్లో నేను పడ్డాను. 7-8 ఏళ్ల తర్వాత నేను హైద్రాబాదులో స్థిరపడ్డాను. మా పెదనాన్నగారు ప్రముఖ రచయిత శ్రీ సి. ఎస్. రావుగారితో కలిసి ఏదో పనిమీద రవీంద్రభారతిలో ఉన్న సాంస్కృతిక శాఖ కార్యాలయానికి వెళ్లాను. బయట ఆర్వీ ప్రసాద్ రాజు అని బోర్డు ఉంది. లోపకెళ్లి చూస్తే సీటులో రాళ్లబండి కవితాప్రసాద్. అప్పుడు తెలిసింది కవితా ప్రసాద్ గారి అసలు పేరు ప్రసాద్ రాజు అని. మాటల్లో బందరు ప్రస్తావన, ఆయన ఇంట్లోంచి వినపడే పద్యాలు, అప్పటి అవధానంలోని పద్యాల విషయాలు అన్నీ గుర్తుచేసాను. సంతోషపడి విన్నారు. ఇక తర్వాత-తర్వాత ఆయనకి వీలు దొరికినప్పుడల్లా ముచ్చటించే ప్రయత్నాలు చేశాను. పద్యం, ఛందస్సు అంటే చాలు.. ఆయన తన పనులు యాంత్రికంగా చేసుకుంటూ మనసు మాత్రం సాహిత్యం మీదే పెట్టేవారు. మొత్తానికి ఆయనతో చాలా సంభాషణలు చేసుకునే అవకాశం కలిగింది.

ఒకసారి ఆయన భాషా రహస్యాలు, ఛందస్సు, అవధాన విద్య కొత్త తరం వారికి చేరడంలేదని కంటతడి పెట్టిన సందర్భం నేను ఎప్పటికీ మర్చిపోలేనిది. పై పై మాటలుగా కాకుండా హృదంతరాళాలనుంచి పెల్లుబికిన భావం అది. పదవీ విరమణ చేసాక శేషజీవితం భాష, అవధాన, పద్య విద్యావ్యాప్తికి కేటాయించాలనుకున్నాని కూడా చెప్పారు.

ఆయన రాసిన "అవధానవిద్య- ఆరంభ వికాసాలు" అనే పుస్తకం ఇచ్చారు. అది చదివి దానికో సమీక్ష రాసి ఆయనకి చూపించాను. ఒక వెబ్సైట్లో ఆ సమీక్ష పెడితే విపరీతమైన స్పందన వచ్చింది ఆయనకి. ఆ సమీక్షకి ముక్తాయింపుగా ఆయనపై ఒక శుధ్ధమధ్యాక్కర కూడా ఇలా రాసాను.

సుకవితా ప్రియురాళ్ళబండి
సుధలూరు గొనిపోవ రండి
సకలమౌ కళలన్ని కాచి
శాస్త్రాలు వడబోచి చూచి
శ్లోకాలనెన్నో రచించి
శోధించి ఛందం మధించి
వికసితంబాయె మీ హృదయం
వెలుగీనె ఓ కొత్త ఉదయం

...అలా మా సాహితీ బంధం ఇంకాస్త బలపడింది.

ఒకరోజు నన్ను ఆయన, "మీరు అవధానం చేయొచ్చు కదా" అన్నారు.

"అమ్మో! నావల్ల ఎక్కడౌతుంది సార్" అన్నాను.

"మీరు చేయగలరు. ఛందస్సు తెల్సు. ఆశువుగా పద్యాలు చెప్పగలరు. సాధన చేస్తే సరిపోతుంది" అన్నారు.

"నాకు ఫలానావి తెలుసు అని మీకు తెలిసింది కానీ, తెలియనివి ఎన్నున్నాయో నాకు తెలుసండీ. అందుకే అంటున్నాను. నాకు కష్టం" అని బదులిచ్చాను.

"నేను ఇంకొన్నేళ్లల్లో రిటైర్ అవుతాను. అప్పుడు అంతా ఖాళీయే. ఒక 6 నెలలు మీరు నేను చెప్పినట్టు చేస్తే చాలు. అవధాని అయిపోతారు. అప్పటి వరకు పద్యపఠనం, రచన కొనసాగించండి" అని చెప్పారు.

నేను నవ్వేసాను.

"ఐ మీనిట్" అని ముగించారు.

అలా సాగుతున్న ప్రయాణం వారితో వేదికలు పంచుకునే దాకా వచ్చింది.

"ఒకసారి సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ కి రండి" అన్నారు మొన్నీమధ్య కలిసినప్పుడు.

"మళ్లీ పాత శాఖకు మారారా?" అనడిగాను.

"అలవాటేగా. మళ్లీ బదిలీ అయ్యాను" అంటూ నవ్వేసారు.

అమెరికా నుంచి నాట్స్ (NATS) వారు నాకు ఒక రాత్రి ఫోన్ చేసి డా|| రాళ్లబండి గారిచేత రాబోయే వేడుకలకు లాస్ ఏంజిల్స్ లో అవధానం చేయించాలని గజల్ శ్రీనివాస్ గారు ప్రతిపాదించారని, కనుక ఆయనతో మాట్లాడి డేట్స్ బ్లాక్ చేయమన్నారు. సంతోషమనిపించింది. వెంటనే ఫోన్ చేసి విషయం చెప్పాను. "తప్పకుండా సిరాశ్రీ గారు. సంతోషం. అయితే మరింత వివరంగా రేపు మాట్లాడతాను. శివరాత్రి కదా. ఉపవాస, జాగారాల్లో ఉంటాను. రేపు ఒక్కసారి కేలండర్ చూసుకుని చెప్తా" అన్నారు.

రాళ్లబండి గారి నుంచి మళ్లీ ఫోన్ లేదు. నేనే చేశాను 5 రోజుల తర్వాత. చాలా సంతోషంగా, "వస్తున్నాను అని చెప్పేయండి. అవధానంతో పాటు, ఆశుకవితాధార కూడా పెడదాం. అవధానం అయితే 8 మందికే పాల్గొనే అవకాశం ఉంటుంది. ఆశుకవితాధార కూడ పెడితే ప్రేక్షకులు కూడా పాల్గొనచ్చు. గంట అది-అరగంట ఇది" అన్నారు.

NATS వారికి చెప్తే "డన్. అలాగే చేద్దాం. ఇదే విషయాన్ని ఒక్కసారి "పద్మభూషణ్" వరప్రసాద్ రెడ్డి గారికి కూడా చెప్పేయండి. వారు మన ముఖ్య సలహాదారు" అన్నారు. సరే అని అన్నీ కంఫర్మ్ చేస్తూ వివరంగా మాట్లాడాలని మర్నాడు రాత్రి రాళ్లబండి గారికి ఫోన్ చేసాను. ఎత్తలేదు. మేసేజ్ పెట్టాను. రిప్లై లేదు. తెల్లవారింది. తీరిగ్గా వరప్రసాదరెడ్డి గారికి ఫోన్ చేసి NATS వారు చెప్పమన్న విషయం చెప్పాను.దానికి ఆయన "రాళ్లబండి గారు రాలేకపోవచ్చు. ఆయన హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యారు. గుండెపోటు వచ్చిందట" అన్నారు. నేను షాక్ అయ్యాను. పేపర్ తిరగేస్తే విషయం అదే. వెంటనే కేర్ హాస్పిటల్ కి వెళ్లాను. ఆయన్ని చూడ్డానికి లేదు. వాళ్లబ్బాయితో మాట్లాడాను.

"కోలుకుంటున్నారు, భయం లేదు", అన్నాడు.

దాంతో ఊపిరి పీల్చుకుని మళ్లీ దైనందినంలో పడ్డాను.

మొన్న రాత్రి డా| రాళ్లబండి గారి "పద్యమండపం" నా షెల్ఫ్ లో కంటపడితే కాసేపు తిరగేసాను. నాకు చాలా ఇష్టమైన పుస్తకం అది. ఎప్పుడూ పెద్దగా పట్టించుకోని ఆ పుస్తకంలోని ఒక పద్యం ఎందుకో తనవైపుకు లాక్కుంది. అది ఇది:

"ఆకులచేత కప్పబడి హాయిగ నిద్దురవోయినట్లుగా

నే కనుమూయగావలయు నిర్జనమైన అరణ్యమందునన్నాకయి అశ్రువొక్కటయినన్ ధర పైనను రాలరాదు, యేశోక వియోగగీతికలు సోకగరాదు సమాధిమృత్తికన్"

మనసు అదోలా అనిపించింది. ఇదెందుకు కనిపించిందా అనుకున్నాను. ఎందుకో మరొక్కసారి ఆయనకోసం హాస్పిటల్ కి వెళ్లాలనిపించింది. సోమవారం వెళ్లాలనుకున్నాను. కానీ ఆదివారం రాత్రి దుర్వార్త వినాల్సొచ్చింది. సోమవారం అనుకున్నట్టుగానే ఆయన్ను చూసాను. వేయి తీగలతో రాగాలు పలికి, పలికి అలసిపోయిన సరస్వతీదేవి వీణ కాసేపు విశ్రమించినట్టుగా ఉంది ఆయన్ని చూస్తే. వారి మీద గౌరవంతో పై పద్యంలోని వారి కోరికను మన్నించి కళ్లను చీల్చుకుని వచ్చే ప్రయత్నం చేస్తున్న అశ్రువులను కన్నుల వెనుకే ఆవిరి చేసే ప్రయత్నం చేస్తున్నాను.

వారు ఎక్కడికీ పోలేదు. అలవాటేగా. మళ్లీ బదిలీ అయ్యారంతే...!

-సిరాశ్రీ

మరిన్ని శీర్షికలు
Chintakaya-Chinna Chepalu Curry (చింతకాయ - చిన్న చేపలు )