Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

Happy Ugadi

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 

జరిగిన కథ : స్వయంగా ముఖ్యమంత్రే ఫోన్ చేసి విరాట్ తో మాట్లాడుతారు. విరాట్ చందు, దీక్ష, సహస్రలు కలిసి బయటకెళతారు. అక్కడ విరాట్ ఒక్కడే ఉన్న సమయంలో విశాల వచ్చి పలకరించి, ఎమోషన్లో అతడి గట్టిగా వాటేసుకుంటుంది...ఆ సీన్ కాస్తా సహస్ర, దీక్షల కంటబడుతుంది... ఆ తరవాత.....

‘‘ఒకే. ఆ తర్వాతే అనుకో. ఇప్పుడా అమ్మాయి ఇక్కడే వుంది. కాస్సేపట్లో వాళ్ళు వచ్చేస్తారు.  మనల్నిలా చూస్తే బాగుండదు. ఫోన్‌లో వివరంగా చెప్తాను.  ఈ విజిటింగ్‌  కార్డ్‌  తీసుకొని వెళ్ళిపో.  విశాలా ప్లీజ్‌.’’  విషయం చెప్పేసాడు.  విజిటింగ్‌  కార్డ్‌ కూడా ఇచ్చాడు. దాన్ని భద్రంగా దాచుకుంది విశాల.  కాని వెళ్ళిపోలేదు.  ‘‘నేనా అమ్మాయిని చూడాలి.  ఇక్కడే వుంటాను’’  అంది.

తల మీద పిడుగుపడ్డట్టుగా  కంగారు పడిపోయాడు విరాట్‌.

‘‘వద్దు విశాల. నా మాట విను. వెళ్ళిపో’’ బ్రతిమాలాడు.

‘‘కంగారుపడకు విరాట్‌. నేను నీ ఫ్రండ్‌నని చెప్పు.  నేనేమీ తన మీద అసూయపడను.  నీ ప్రేమను పొందిన  అధృష్టవంతురాల్ని నాకు మాత్రం చూడాలనుండదా?’’  అంటూ అతడి భుజం మీద చెయ్యేసి కళ్ళలోకి చూసింది.

సరిగ్గా అప్పుడే ఫ్యాన్సీ స్టోర్‌లోంచి సహస్ర దీక్షలు చెరో కేరీబేగ్‌ తో బయటికొస్తున్నారు. వాళ్ళ వెనకే చందూ వస్తున్నాడు. ఫ్యాన్సీ స్టోర్‌ మెట్లు దిగుతుండగానే ముందుగా విరాట్‌  పక్కన యువతిని సహస్ర చూసేసింది.

‘‘అన్నయ్యా అటు చూడు.  విరాట్‌  భుజం మీద చెయ్చేసి మరీ అంత క్లోజ్‌ గా మాట్లాడుతోంది ఎవరా అమ్మాయి?’’ అంటూ వున్న చోటే ఆగిపోతూ చందూని పిలిచి అడిగింది.

చూడగానే షాకయి పోయాడు చందూ.

ఏం చెప్పాలో అర్థం కాలేదు.

ఓర్నాయనో.  ఈ టైం లో విశాల ఇక్కడుందేమిటి?  ఒరే విరాట్‌  నిప్పును పక్కన పెట్టుకున్నావేంట్రా బాబూ. చేతులు కాలుతాయో వీపు కాలుతుందో తెలీటం లేదే.  సహస్రకి ఏం చెప్పాలి మనుసులోనే అతలాకుతలమై పోయాడు.

‘‘సహస్ర అడుగుతుందిగా చెప్పు చందూ ఎవరామె?’’ అంది దీక్ష.

‘‘అదే ఆలోచిస్తున్నాను.  నాకు తెలీదు’’  తప్పించుకోడానికి మరో దారిలేక అడ్డంగా బొంకాడు.

సహస్ర ముఖంలో రంగులు మారిపోయాయి.

‘‘పదండి.  ఎవరో తెలుసుకుందాం’’ అంటూ విసవిసా దీక్షను తీసుకొని ముందుకెళ్ళి పోయింది. ఎందుకైనా మంచిదని కాస్త వెనగ్గా అనుసరించాడు చందూ.

‘‘నీ ఫ్రండు చందూ వస్తున్నాడు.  నీ లవర్‌  ఎక్కడ?’’  విరాట్‌ని అడిగింది విశాల.

‘‘అదో బురఖాల్లో వస్తున్న యిద్దరిలో ఒకరు చందూ లవర్‌.  ఒకరు నా లవర్‌’’  చెప్పాడు విరాట్‌.

‘‘మీరు ముస్లిం యువతుల్ని లవ్‌ చేసారా!’’

‘‘లేదు లేదు.  కొన్ని కారణాల వలన వాళ్ళు బురఖాల్లో వస్తున్నారు.  నీకు వివరంగా తర్వాత చెప్తాను’’  అంటూ బదులిచ్చాడు విరాట్‌.అప్పటికే విశాలకు ఎడంగా జరిగాడు విరాట్‌.

‘‘ఎవరీ అమ్మాయి?’’  వస్తూనే సీరియస్‌గా అడిగింది సహస్ర.

‘‘తను విశాల అని నా ఫ్రండు.  అనుకోకుండా ఇక్కడ కలిసింది.  నిన్ను చూడాలని ఆగింది’’  తడబడకుండా బదులిచ్చాడు విరాట్‌. సహస్ర కళ్ళలో అనుమానం ఛాయలు తొంగి చూస్తున్నాయి.

‘‘నిజంగా ఫ్రండేనా?  లేక అంతకుమించి...!’’

‘‘ఛ ఛ నిజంగా ఫ్రండే.  అరే చందూ నీకు తెలుసుగా.  చెప్పవేంట్రా?’’

‘‘అవునవును నాకు తెలుసు.  ఫ్రండే.  టైమవుతోంది. వెళ్దాం పదండి’’  అన్నాడు హడావిడిపడుతూ చందూ.‘‘అన్నయ్యా ఇందాక అడిగితే తెలీదన్నావ్‌?’’ నిలదీసింది సహస్ర.

‘‘ఏం లేదమ్మ అప్పుడు దూరంలో వున్నాంగదా గుర్తు తెలీలేదు’’  అంటూ సమర్థించుకున్నాడు. దీక్ష వాళ్ళ మధ్యన ప్రేక్షకురాలిగా ఉండిపోయింది.  సహస్ర ముఖం చూడాలని విశాల చూస్తోంది.  ముఖం మీద క్లాత్‌  మూలంగా కళ్ళు మాత్రమే కన్పిస్తున్నాయి.‘‘విరాట్‌ చెప్పాకే గుర్తొచ్చిందా?’’ అంది సహస్ర. అనటమే కాదు ముఖానికి అడ్డంగా వున్న క్లాత్‌ని లేపి తలమీద కు వేసుకొని విశాల వంక చూసింది.  ముఖం చూడాలనుకున్న విశాల కోరికయితే దీరింది గాని ఆ వెనకే ఆ ముఖాన్ని ప్రకటనలో చూసిన విషయం గుర్తొచ్చి విస్తుపోయింది.‘‘హలో.....  నీ పేరేమేటి?’’ అడిగింది సహస్ర.

‘‘నా పేరు విశాల...  నేను విరాట్‌  ఫ్రండ్‌ని’’  అంది విశాల.

‘‘పెళ్ళి కాని అబ్బాయి అమ్మాయిల ఫ్రండ్‌ షిప్‌ని అర్థం చేసుకోలేనంత పిచ్చిదాన్ని కాను.  తనకి కేవలం ఫ్రండు మాత్రమేనని నా మీద ఒట్టేసి చెప్పు’’‘‘ఒట్టు?  యూ సిల్లీ.....  నాకయితే వాటి మీద నమ్మకం లేదు.  కాని నీ తృప్తి కోసం వేస్తాను.  కాని విరాట్‌  నా ఫ్రండు గాబట్టి అతని మీదో` అతని లవర్‌ గానీ మీదో ఒట్టేయలేను. కాబట్టి అదో...  ఆ విమానాశ్రయం మీద ఒట్టు.  చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌  మీదొట్టు. నుంగం బాకంలోని వళ్ళువర్‌ కొట్టం మీదొట్టు,  మెరీనా బీచ్‌ మీదొట్టు,  కావాలంటే అడయారు మర్రిచెట్టు మీద కూడా ఒట్టేసి చెప్తున్నాను. నేను విరాట్‌కి ఫ్రండ్‌ని మాత్రమే. చాలా?’’  అంది విశాల.

అయినా సహస్ర ముఖంలో సందేహఛాయలు పోలేదు.విరాట్‌  భయం విరాట్‌ది.సహస్ర ముఖం నలుగురికీ కన్పించటం మంచిది కాదు.‘‘సహస్ర ప్లీజ్‌ .  ఏమిటా సందేహం?  ముందు ముఖం మీది కి క్లాత్‌ వేసుకో’’ అంటూ హెచ్చరించాడు.

క్లాత్‌ ముఖం మీదికి లాక్కుంది సహస్ర. కాని` ‘‘లేదు మీరు నిజం చెప్పటం లేదు నేను వెళ్తున్నాను’’  అంటూ గిరుక్కున తిరిగి వడివడిగా రోడ్‌ వైపు అడుగులేసింది.

‘‘సహస్ర ఆగు చెప్పేది విను’’  అంటూ వెనక నుంచి విరాట్‌  పిలుస్తున్నా విన్పించుకోలేదు. వెనకే పరుగెత్తుకొచ్చిన దీక్ష తనను చేరే లోపలే అటుగా వచ్చిన ఆటో ఎక్కేసింది.

అతంకుముందే భోంచేసి వెనక్కి వస్తున్న బిచ్చగాడి వేషంలోని మురడన్‌  ముత్తు ఏంటా గొడవనుకొంటూ ఆగి చూస్తున్నాడు. సహస్ర ముఖం మీది క్లాత్‌  తీయగానే వాడు గుర్తుపట్టేసాడు.  సహస్ర తమ కంటపడకపోడాని కారణం ఏమిటో అప్పటికి అర్థమైంది వాడికి.  విరాట్‌ ఆమె లవరని,  పేపర్‌  ప్రకటనిచ్చింది అతడేననీ గ్రహించాడు. సహస్ర కన్పించినందుకు ఆనందంతో ఉక్కిరిబిక్కిరైపోయాడు.

ఎప్పుడైతే విశాల ఆటోలో బయలుదేరిందో ఆ వెనకే తనూ ఒక ఆటో పట్టుకుని ఫాలో చేస్తూ చక చకా తన కుర్రాళ్ళకి ఫోన్లు కొట్టనారంభించాడు.  ఈ లోపల`

‘‘చందూ..  సహస్ర అలిగి వెళ్లిపోతోంది.  మీ యిద్దరూ ఆ ఆటోని ఫాలో చేసి ఆపండి.  నేను వచ్చేస్తున్నాను’’ అన్నాడు విరాట్‌.వెంటనే స్కూటీ మీద...

చందూ దీక్షలు బయలుదేరారు.

‘‘సారీ విరాట్‌  అయాం సారీ.  తను మరీ ఇంత పెన్సిటివ్‌  అనుకోలేదు’’  అంది జరిగిందానికి నొచ్చుకుంటూ విశాల.

‘‘ఇట్సాల్‌ రైట్‌. నేను బయలుదేరతాను’’ అన్నాడు విరాట్‌.

‘‘అంటే పేపర్‌లో ఆ ప్రకటనిచ్చింది నువ్వేనా?’’  ఉండబట్టలేక అడిగేసింది విశాల.

వినిచిన్నగా నవ్వాడు విరాట్‌.

‘‘యా....  ఆ ప్రకటనిచ్చింది నేనే,  బట్‌  దటీజ్‌ లాంగ్‌ స్టోరీ. ఇప్పుడు చెప్పటం కుదరదు. తర్వాత చెప్తాను’’ అన్నాడు.‘‘ఫోన్‌  చేస్తావ్‌గా?’’‘‘హూ..... ’’

‘‘ఎలా చేస్తావ్‌  నా ఫోన్‌  నంబర్‌  నీ దగ్గర లేదుగా?’’  అంటూ తనవేనిటీ బ్యాగ్‌ లోంచి తన విజిటింగ్‌ కార్డు తీసి విరాట్‌ కిచ్చింది విశాల. కాదనకుండా తీసుకొని తన వేలెట్‌లో భద్రం చేసాడు విరాట్‌.

‘‘ఒకె ఇప్పుడ్రు నువ్వున్న పరిస్థితిలో కాఫీకి కూడరమ్మన లేను.  ముందు త్వరగా వెళ్ళి తన అలకతీర్చు.  త్వరగా బయలుదేరు’’  అంది.‘‘ఒకె సీ యు’’  అంటూ బైక్‌ స్టార్ట్‌ చేసుకొని బయలు దేరాడు విరాట్‌. అతడి బైక్‌ అటె వెళ్ళగానే తన కారులో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది విశాల.

ఇదే టైంలో...

అంతవరకు అవతల వేన్‌లో వెయిట్‌ చేస్తున్న మునిసామి బృందం విరాట్‌ బైక్‌ బయలుదేరగానే తమ వేన్‌ ని ముందుకు పోనిచ్చారు. కాస్త ఎడంగా విరాట్‌ బైక్‌ని  ఫాలో చేయనారంభించారు.

అలిగి ఆటోలో వెళ్ళిపోతున్న సహస్రకి...

చాలా బాధగా వుంది.

మాట మాటకీ...

ఉబికివస్తున్న కన్నీళ్ళని తుడుచుకుంటోంది.

కళ్ళ ముందు...

విరాట్‌ భుజం మీద చనువుగా చెయ్యేసి మాటాడుతున్న అందమైన విశాల రూపమే కనబడుతోంది. అది కేవలం స్నేహమైతే అంత చనువెలా వస్తుంది?  పైగా అందమైన అమ్మాయి.  తన జీవితంలో మరో అమ్మాయి కూడ వుందని,  విరాట్‌  ఇంతవరకు తనతో చెప్పనే లేదు.  విరాట్‌ పక్కన మరో అమ్మాయిని వూహించుకోలేకపోతోంది. బిగ్గరగా ఏడవాలనుంది కాని ఏడవలేకపోతోంది. ఆటోలో పోతూ ఏడిస్తే చూసే వాళ్ళు తనను కిడ్నాప్‌ చేస్తున్నారని ఆటోవాడ్ని సందేహించే ప్రమాదం వుంది.  ఇక విరాట్‌తో మాట్లాడకూడదు. అయిందేదో అయింది. ఇక తను జాగ్రత్తలో తనుండటం మంచిది.

మనసులోనే పరిపరివిధాలా ఆలోచిస్తూ...

దుఖ్ఖాన్ని దిగమింగుతోంది సహస్ర...

ఇంతలో ఆటో ఒక జంక్షన్‌ దాటింది. అది అలా దాటిందో లేదో ఇలా రెడ్‌  సిగ్నల్‌ పడిరది. ట్రాఫిక్‌ ఆగింది. వెనకే మరో ఆటోలో ఫాలో అవుతున్న ముత్తు ‘‘పోనీ... ఆటో వెళ్ళిపోతోంది’’

‘‘ఎక్కడికి పోయేది...  సిగ్నల్‌ పడిరది. పచ్చలైటు పడేవరకు పడుండాల్సిందే’’  అన్నాడు విసుగ్గా డ్రయివరు.‘‘ఛ... అదృష్టంఇంతలోనేముఖంచాటేయాలా? అమ్మాకరుమారియమ్మాత్వరగాసిగ్నల్‌ పడేలాచూడు తల్లీ’’ అనరిచాడు ముత్తు.ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడ నిలిచి పోయింది. ఇంజన్ల మోత హారన్ల గోల మధ్య ఎవరేం మాట్లాడుతున్నారో వినిపించటం లేదు. అంతలో గ్రీన్‌ సిగ్నల్‌ పడిట్రాఫిక్‌ మూవ్‌ అయింది. మురడన్‌ ముత్తు వున్న ఆటో పక్క నుంచే చందూ నడుపుతున్న స్కూటీ రివ్వున ముందుకెళ్ళిపోవటం ముత్తుకు తెలీదు. చూసుంటే చందూ వెంటపడేవాడే.

సిగ్నల్‌  దాటి చాల సేపు వీధుల్లో గాలించినా ఎక్కడా సహస్ర ఎక్కిన ఆటో జాడ తెలీలేదు. దాంతో విసుగుచెంది ఒక కాకా హోటల్‌ దగ్గర ఆటో దిగిపోయి పంపించేసాడు ముత్తూ.  ఈ లోపల అతడ్ని వెతుక్కుంటూ తలో ఆటో ఎక్కి అక్కడికి వచ్చి చేరుకున్నారు మిగిలిన కుర్రాళ్ళు. అందరికీ టీ ఆర్డర్‌  చేసాడు ముత్తూ.

‘‘ఏమైందన్నా ఆ అమ్మాయి ఆచూకి తెలిసిందా?’’  ఆత్రంగా అడిగాడొకడు.‘‘సిగ్నల్‌  దగ్గర ఆటో మిస్సయింది.  ఇక అడ్రసేం తెలుస్తుంది.  కొంచెంలో మిస్సయింది.  కాని....  ఆమె దూరంలో లేదు. ఈ ప్రాంతంలోనే ఎక్కడో ఉంది.  బురఖాలో తిరుగుతోంది.  గుర్తు పట్టడం కష్టం. జాగ్రత్తగా వెతకాలి.  ఇవాల్టి నుండి ఈ పరిసరాల్లోనే మన డ్యూటీ. అరేలింగుస్వామి,  నువ్వు ఎగువన సిగ్నల్స్‌  దగ్గర ఉండరా.  అరే మారియప్పా నువ్వు ఆ కన్పించే మార్కెట్‌ దగ్గర అడుక్కో’’ అంటూ అందరికీ ఎవరెక్కడ వుండి సహస్రను గాలించాలో వివరించాడు ముత్తు.టీ తాగి అంతా తమ తమ చోటుకి బయలుదేరారు.  వాళ్ళను పంపించి తను కాలి నడకన పక్క కాలనీ వైపు బయలు దేరాడు ముత్తూ.‘‘ఆపు..........  ఆటో ఆపు................’’  సహస్ర వెళ్తున్న ఆటో పక్కగా తన స్కూటీని పోనిస్తూ పెద్దగా అరిచాడు చందూ.చందూని దీక్షను చూడగానే ఆటో ఆపవయ్యా అంది సహస్ర.  వెంటనే ఆటోని పక్కకు తీసి ఆపాడు ఆటోవాలా. వెంటనే స్కూటీ దిగిపోయి ఆటో లోకి వచ్చేసింది దీక్ష.

‘‘ఏయ్‌  దీక్షా ఇదన్యాయం,  నువ్వటెళ్ళిపోయావేంటీ’’  అరిచాడు చందూ.

‘‘నా పుట్టినరోజు నాడు నా ఫ్రండుని ఏడిపించారు. నిన్ను నీ ఫ్రెండూని క్షమించను.’’

‘‘ఓర్నాయనో, ఇదేమిటి.... మధ్య నేనేం చేసాను.’’

‘‘ఏం చేశావని ఆడుగుతున్నావా....... ఆ పిల్ల గురించి నీకు తెలీకుండా వుంటుందా?  ఎందుకు చెప్పలేదు?  మీ ముఖం మాకు చూపించకండ. ఆటో పోనీ’’  అంది.

‘‘ఇదన్యాయం...  అక్రమం...  నా మాటవిను....’’

‘‘గోటు హెల్‌’’

ఆటో బయలుదేరింది.

ఇక దుఖం ఆపుకోలేక...

దీక్షను కౌగిలించుకొని చిన్నగా ఏడ్చేసింది సహస్ర.

‘‘వూరుకోవే.  ఇప్పుడేమైందని.  ఈ మగాళ్ళింతే.  మాయగాళ్ళని సరిపెట్టుకోడమే.  బాధపడకు’’ అంటూ ఓదార్చింది దీక్ష.

ఆటోని ఫాలో అవుతూ... అరుస్తూనే వున్నాడు చందూ.

అతడి మాటల్ని అమ్మాయిలు పట్టించుకోలేదు.

ఆటో గోస్వామి కాలనీ లో ప్రవేశించింది.

ఆటోకి డబ్బులిచ్చి పంపించేసి తాళం తీసి ఇంట్లోకి నడిచారు సహస్ర దీక్షలు.  స్కూటీని లోనకు తెచ్చి చందూ వచ్చే లోపు వీధి తలుపు మూసేసింది దీక్ష.

‘‘దీక్షా ప్లీజ్‌ తలుపు తెరువ్‌’’ అరిచాడు చందూ.

‘‘నో’’ అంది లోపట్నుంచి దీక్ష.

‘‘ఇక ఈ ఇంటి తలుపులు మీకు శాశ్వతంగా మూసుకు పోయాయి.  ఇంకెప్పుడూ ఇటు రావద్దు.  వెళ్ళిపో’’  అంది కటువుగా.‘‘స్కూటీ తాళాలు?’’

‘‘కిటికీ లోంచి లోనపడెయ్‌’’

కోపంగా తాళాలను కిటికీలోకి విసిరేసాడు చందూ.

‘‘ఇంతగా బ్రతిమాలుతున్నా పట్టించుకోవడం లేదంటే మీరు ఆడోళ్ళా?  కాదు.   బండరాళ్ళు. ఏం జరిగిందో తెలుసుకోకుండానే నన్ను నా ఫ్రెండ్‌ని అనుమానించారు.  సందేహించారు. దీనికి ఓ రోజు మీరు బాధ పడక తప్పదు. ఈ క్షణం నుంచి నేనే మిమ్మల్ని బహిష్కరిస్తున్నాను. విరాట్‌ ఇటు వస్తానన్నా రానివ్వను.  ఇంతగా మమ్మల్ని అవమానించాక ఇంకా మీతో మాకు పనేమిటి?  గుడ్‌ బై.’’

బయట నుంచే ఆవేశంతో అరిచి...   కోపంగా వీధిలోకొచ్చి తమ ఇంటి దిశగా నడక ఆరంభించాడు చందూ.

చివరిగా విశాల వద్ద నుండి బైక్‌ మీద బయలు దేరిన విరాట్‌  క్రమంగా సిగ్నల్స్‌ను దాటాడు.  ఒక వేన్‌ తనను ఫాలో అవుతోందని అతడికి తెలీదు.  అలిగి వెళ్ళిపోతున్న సహస్ర మీది ఆలోచనల్తో పరిసరాల్ని గమనించే స్థితిలో లేడు విరాట్‌.

సిగ్నల్స్‌  దాటగానే త్వరగా గోస్వామి కాలనీకి చేరుకోవాలని బైక్‌ని లెఫ్ట్‌ లోని ఒక వీధిలోకి పోనిచ్చాడు. అది కాస్త ఇరుకు వీధి...అయినా కూడ వదల్లేదు మునుసామి.

‘‘పోనీ...  ఆ బైక్‌  ఎటు పోతే అటుపోనీ’’  అనరిచాడు.

డ్రయివరు పోనిచ్చాడు.

ఎలాగో మూడు ఫర్లాంగుల దూరం పోగలిగారు.  అక్కడ నుండి విరాట్‌  పక్కనున్న సన్నటి సందు గుండా బైక్‌ మీద రివ్వున లోనకెళ్ళిపోయాడు.  బైక్‌ గాబట్టి వెళ్ళిపోయింది అంత పెద్ద వేన్‌  ఆ సందులోకి ఎలా పోతుంది...?

‘‘ఏం చేద్దాం?’’  అడిగాడు డ్రయివరు.

‘‘నువ్వాగు చెప్తాను’’  అంటూ తల బయట పెట్టి అటుగా పోతున్న ఒక యువకుడ్ని దగ్గరకు పిలిచాడు మునుసామి.

‘‘బాబూ ఈ సందులో పోతే ఎక్కడికి పోతుంది?’’ అడిగాడు.

ఆ యువకుడు ఆ సందుని వేన్‌ని లోపలున్న వాళ్ళని విచిత్రంగా చూసాడు.

‘‘మీకేమన్నా పిచ్చా? ఇంత వేన్‌ ఆ సందులోకి ఎలా పోతుంది?’’ అనడిగాడు.

‘‘వెళ్ళదు గాబట్టే నిన్నడుగుతున్నానోయ్‌.

‘‘గోస్వామి కాలనీకి పోడానికి ఇదే దగ్గర దారి.’’

వేన్‌ ముందుకు కదిలింది.

ఆ క్షణంలో తామంతా విరాట్‌ను సమీపిస్తున్నట్టుగా వేన్‌లో ఎవరికీ తెలీదు.  క్రమంగా కాలనీ గేటు ను సమీపించింది వేన్‌.‘‘ఏమిట్రా ఇళ్ళన్నీ ఒకే డిజైన్‌లో భలే అందంగా వున్నాయిక్కడ? ’’ అన్నాడు చుట్టూ చూస్తూ మునుసామి.

‘‘అవును.  కాలనీ మొత్తం ఇళ్ళన్నీ ఫారెన్‌  స్టయిల్లో కట్టారు’’  అన్నాడు డ్రయివరు.  వేన్‌  లెఫ్ట్‌కి తిరిగి మొదటి వీధిలోకి ఎంటరయింది. తిరిగీ తిరగ్గానే మూడో నంబరు ఇంటి గేటు ముందు ఆగున్న బైక్‌  వాళ్ళ కంటబడిరది. అదే నంబరు. అదే ఫారెన్‌ బైక్‌.

‘‘దొరికి పోయాడన్నా!  చినబాబు దొరికిపోయాడు’’ ఆనందం పట్టలేక పెద్దగా అరిచాడు బండశివ.

విరాట్‌  బైక్‌ కాలనీ గేటులోకి వస్తుండగా కోపంగా నడుచుకుంటూ వస్తున్న చందూ కన్పించి బైక్‌  ఆపాడు.

‘‘ఏమైంది?  నడిచొస్తున్నావేంటీ?  వాళ్ళద్దరూ ఇంట్లో వున్నారా’’ అడిగాడు.

‘‘ఊ వాళ్ళు క్షేమంగానే ఇంటికి చేరుకున్నారు.  మనం కూడ ఇంటికి పోదాం పద’’  అన్నాడు చందూ.‘‘నువ్వు పద. నేనోసారి వెళ్ళి మాట్లాడి వస్తాను’’ అన్నాడు విరాట్‌.

‘‘వద్దు. వెళ్ళొద్దు. ముందు ఇంటికి పద’’ అంటూ బైక్‌  వెనక కూచున్నాడు చందూ.వాడింత సీరియస్‌గా ఉండటాన్ని...విరాట్‌  ఎప్పుడూ చూళ్ళేదు. వీధిలో ఎందుకులే అని బైక్‌ని ఇంటికి పోనిచ్చాడు.‘ఇప్పుడైనా చెప్పరా.  నిన్నేమన్నా అన్నారా? ఎందుకంత కోపం?’’  లోనకు రాగానే అడిగాడు.

‘‘కోపం కాదు కడుపు మంట.  నన్నేమన్నా బాధ పడే వాడ్నికాదు. నిన్ను నీ ప్రేమని శంకించారు.’’

‘‘సహస్ర ఏమన్నా అందా?’’

‘‘తనేమీ మాట్లాడలేదు.  కాని దీక్ష. దానికేమైంది? నా పుట్టినరోజు నా ఫ్రండుని ఏడిపించారు నిన్ను నీ ఫ్రండును క్షమించను అంది. మీ ముఖం మాకు చూపించొద్దు అంది. అయినా సిగ్గు లేకుండా ఇంటిదాకా వెళ్ళాను.  తలుపులు మూసేసింది దీక్ష. ఈ ఇంటి తలుపులు శాశ్వతంగా మీకు మూసుకుపోయాయి.  ఇంకెప్పుడూ ఇటు రావద్దు అంది. స్కూటీ తాళాలు కిటికీలోకి విసిరేసి వచ్చాను. ఇక మీదట నువ్వు ఆ యింటికెళ్తానన్నా వెళ్ళనివ్వనని సవాల్‌  విసిరి నాలుగు మాటలు దులిపి మరీ వచ్చేసాను. ఇక నువ్వటు వెళ్ళకు.’’ ‘‘ఏమిట్రా చందూ ఇది. సహస్ర బాధ పడుతుందని తనేదో తొందర పడి ఉంటుంది. నువ్వు కూడ ఏమిటి? ఇప్పుడున్న పరిస్థితిలో సహస్రను ఒంటరిగా వదిలేస్తామా? ఎంత ప్రమాదమో తెలుసా?  తనను చంపాలని మధురై నుంచి అళగిరి బేచ్‌ చెన్నై వచ్చినట్టుగా ధర్మ ఫోన్‌ చేసి చెప్పాడు,  వాళ్ళలో యిద్దరు బెస్ట్‌ షూటర్స్‌ కూడ వున్నారట...’’

‘‘నిజమేరా.  ఆ బుద్ది వాళ్ళకుండాలి గదా?  విశాల నీతో కాస్త చనువుగా వున్నందుకే ఇంతగా అనుమానిస్తుందే. నువ్వు సహస్రని లవ్‌ చేస్తున్నావని తెలిసినా విశాల ఎంత నిబ్బరంగా వుంది? ఎంత ప్రశాంతంగా వుంది? నువ్వు కాదన్నా నీ చుట్టూ తిరుగుతోంది.  కాని సహస్ర... తన కోసం ఎంత చేస్తున్నావ్‌? ఎంత రిస్క్‌? అయినా ఎదిరించడానికి సిద్దంగా వున్నావ్‌. అలాంటి నిన్ను, నీ ఫ్రెండ్‌గా నన్నూ వాళ్ళంత దారుణంగా అవమానించాల్సిన పని లేదు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika