Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఎగిరిపోతే.

egiripote

లేడి అడవిలో  తిరుగుతూ  తను  స్వేచ్ఛగా సంచరిస్తున్నానని సంబరపడుతూంటుంది.  వేటగాడు తన కదలికలను నిశితంగా గమనిస్తూ  అదను చూసి వేటాడతాడని ఊహించనైనా లేదు.   వేటగాడికి   చిక్కిన తర్వాత  నిస్సహాయంగా విలవిలలాడటం తప్ప  గత్యంతరం ఉండదు 

-------------------------------------------------

‘ఎగిరిపోతే...

ఎగిరిపోతే..

ఎగిరిపోతే ఎంత బావుంటుందీ...’’

కూనిరాగాలు తీస్తూ ముస్తాబవుతోంది  చామంతి.

ఎదురుగా అద్దం.

అద్దంలో తన రూపాన్ని చూసుకుంది.

మొహానికి మందంగా పౌడర్ దట్టించింది.

ఆ తర్వాత ఒంటికున్న చీరను విప్పి పక్కన పడేసి ఇనప్పెట్టె అడుగునున్న చీర తీసింది. దాన్ని అటూ ఇటూ దులిపి భుజం మీదుగా నడుం చుట్టూ తిప్పి ..

మరోమారు  అద్దం చూసుకుంది.

ఆమెకెందుకో నచ్చలేదు. అదీకూడా తీసి పక్కన పడేసి...

మళ్లీ పెట్టె తెరిచింది.

అందులో   కనిపించింది ఇంకో చీర.

‘ ఎదవ  జీవితం. అటు తిప్పి ఇటు తిప్పినా ఉన్నవి నాలుగుచీరలు. అవి చీకిపోయి రంగు మాసిపోయాయి ’’ నిరాశగా అనుకుంది.‘‘ రేపీ పాటికి నువ్వు ఓ పెద్ద హీరోయిన్ అవుతావ్..’’ చారల చొక్కా కుర్రాడు చెప్పిన మాటలు గుర్తొచ్చాయి. బాధ మాయమైంది. మనసు ఆనందపరవశమైంది.

గబగబ ఒంటి చుట్టూ చీర కట్టుకుంది.

తమ అభిమాన హీరోయిన్ ని గుర్తుచేసుకుంది.

చీర కుచ్చిళ్లను నెమ్మదిగా కిందకు జార్చి ఉదరభాగం కనపడేలా సర్దుకుంది.

మళ్లీ అద్దంలో చూసుకుంది.

ఈ సారి సంతృప్తిగా అనిపించింది.

‘ ఎగిరిపోతే.. ఎగిరిపోతే.. ఎగిరిపోతే ఎంత బావుంటుందీ...’’ పాటందుకుంది.

చామంతిని గమనిస్తూనే ఉంది ఆమె తల్లి.

ఆమె నాలుగడుగుల దూరంలో గిన్నెలు తోముకుంటోంది.

కూతురిని ఓ కంట కనిపెడుతూనే ఉంది.

‘‘తను నాలుగిళ్లలో పాచిపని చేస్తూ వచ్చే  సంసారాన్ని లాగిస్తుంటే ఈ పిల్లకు సోకులు... సరదాలు ’’

ఎప్పటిమాదిరిగానే గొణుక్కుంది.

చామంతికి ఇవేం పట్టవు. తన ఇరుకు జీవితం అంటే రోత.

అందరి ఆడపిల్లల్లా ఉండాలనుకుంటుంది. అందంగా మేకప్ చేసుకోవాలని...  ఖరీదైన బట్టలు వేసుకోవాలని...మంచి నగలు పెట్టుకోవాలని.. ఇలా ఎన్నో ఆశలు..

నిత్యం  రోడ్డు మీద వచ్చేపోయే ఆడవాళ్లని గమనిస్తూంటుంది.

తన దురదృష్టానికి చింతిస్తూ ఉంటుంది.   

‘ఏమే.. ఎక్కడికే?’  తలుపు తీసి బయటకు వెళుతున్న కూతరుని ప్రశ్నించింది తల్లి. చామంతికి జవాబు చెప్పాలనిపించలేదు. మటన్ షాపు మస్తాన్ తో సినిమాకు వెళితే తల్లి చేసిన రాద్దాంతం ఆమెకింకా గుర్తుంది.

ఆరోజు  మస్తాన్ చెవులకు జూకాలు, గొలుసులు కొని తెచ్చిచ్చాడు. అవి అచ్చు బంగారం వాటిల్లా తళతళమెరిశాయి.

తనకు బలే సంతోషం వేసింది.

ఆటోలో సినిమాకు తీసికెళ్లాడు.

అంత పెద్ద సినిమాహాలుని చూడటం అదేమొదటిసారి.

తను ఉబ్బితబ్బిబ్బవుతుంటే.. మస్తాన్ తనను ముద్దులతో ముంచెత్తాడు.

అన్ని కొనిచ్చినందుకు తనే వాడిని ముద్దాడాల్సింది.

వాడే చొరవ తీసుకుంటే... తనకు మజాగా అనిపించింది.

ఆ తర్వాత ఇద్దరూ సినిమా చూస్తే ఒట్టు.

‘మళ్లీ వారం సినిమాకు వెళ్దామే’ అని మస్తాన్ అన్నా...  తనకు వాడితో సరదాగా గడపాలనిపించినా..

‘ ఈసారి వాడూ నువ్వూ మాట్లాడుకుంటే కాళ్లిరగ్గొడతా’  తల్లి చేసిన హెచ్చరికలు గుర్తొచ్చి ఆగిపోయింది.

మస్తాన్ గాడు రెండు మూడుసార్లు పలకరించినా తను తలదించుకుని వచ్చేసింది.

ఇప్పుడు చారల చొక్కా కుర్రాడి విషయం చెబితే

‘అమ్మో .. ఇంకేమయినా ఉందా?  అదేదో కొంప మునిగిపోయినట్టు శోకాలు పెడుతుంది. తను చెడిపోయానని శాపనార్దాలు పెడుతుంది. ఇదంతా భరించటం తన వల్లకాదు.

మనసులోనే   అనుకుంటూ కాలు బయటపెట్టింది  చామంతి.

తను ఎలాంటి పరిస్థితులకు తను ఎదుర్కోబోతోందో ఆ నిముషాన ఆమెకు ఊహకు కూడా అందలేదు. 

నాల్రోజుల క్రితం నాటి సంఘటనలు వరుసగా గుర్తొచ్చాయి.

ఆ రోజు తల్లికి జ్వరం. బయటకు రాలేని పరిస్థితి.

పనికి వెళ్లమంటూ తనను పురమాయించింది.

ఈ పనులంటే వల్లమాలిన చికాకు తనకు.

‘‘ఆ లాయరు గారి భార్య పరమగయ్యాళి. ఓ రోజు పనికి నాగా పెట్టినా నెలజీతంలో కోతేస్తుంది. పోయిరా. ఆ పక్కన మేడ మీద రెండో ఇల్లుకూడా వెళ్లు. మిగతా వాళ్లకి నేనే ఏదో ఒకటి చెప్పుకుంటాను’’ అంటూ తల్లి బలవంతం చేస్తే..

కాదనలేక బయలుదేరింది.

‘‘ అమ్మ చెప్పినట్టే లాయరు గారి భార్య గయ్యాళి.

గిన్నెలు కడిగితే జిడ్డువదల్లేదని, ఇల్లు తుడిస్తే కాఫీ మరకలు పోలేదని...

ఇలా తను చేసిన  ప్రతి పనికీ  వంకలు పెట్టి, అవే పనులు  మళ్లీ మళ్లీ చేయించింది.

బయటకొచ్చేముందు  నాలుగు ఇడ్లీలు, కాసిని  కాఫీ పోసింది.

ఆ తర్వాత

‘నీది బలే కళ గల మొహమే.  మా అమ్మాయి పరికిణీలు ఇస్తానుండు’ అంటూ పాతవి నాలుగు తీసుకొచ్చి చేతిలో పెట్టింది.

కోపాన్ని, ప్రేమని ఒకేసారి వ్యక్తం చేసిన ఆమె ప్రవర్తన  చామంతికి వింతగా అనిపించింది.

ఈ పనంతా పూర్తయ్యాక  డాబా ఇంటికి వెళ్లింది.

గ్రిల్ తలుపులు తెరిచే ఉన్నాయి.

ఎవరో చారల చొక్కా కుర్రాడు ముందు గదిలో టీవీ చూస్తూ కనిపించాడు.

తనొచ్చిన పని చెప్పగానే లోపలకి వదిలాడు.

గదులన్నీ చీపురుతో తుడిచిన తర్వాత బెడ్ రూంలోకి వెళ్లింది.

చూపు తిప్పుకోలేకపోయింది.

‘ఇల్లే ఇంద్రభవనం అనుకుంటే... ఈ గది ఇంత గొప్పగా ఉందేమిటి?’ అనుకుంది.

పేద్ద మంచం... తన జీవితంలో అంత పెద్ద మంచాన్ని చూసెరగదు. మంచం ఎదురుగా పెద్ద నిలువు టద్దం. గోడలకు రకరకాల పెయింటింగ్స్. ఎటువైపు చూడాలో అర్ధం కాక గందరగోళ పడింది.

ఆ పరుపు మీద పడుకుంటే ఎలాగుంటుందో చూడాలన్న  కోరిక కలిగింది.

బలవంతంగా అణచుకుంది.

డ్రెస్సింగ్ టేబుల్ పైన రకరకాల సీసాలు... అవన్నీ మొహానికి పూసుకునే రంగులట. టీవీల్లో చాలా సార్లు చూపెట్టారు.

ఓసారి చూస్తే పోలా? అనుకుంటూ.. దగ్గరకెళ్లితో ఓ దాని మూత తీసి చూడసాగింది.

‘‘ నీకది కావాలా?’’ ఎవరిమాటలో వినబడి ఉలిక్కిపడి వెనక్కితిరిగిచూసింది.

చారల చొక్కా కుర్రాడు.

‘‘ అవి కావాలంటే తీసుకో ’’ అంటూ తనకు దగ్గరగా వచ్చాడు.

తన చేతిలో ఉన్న సీసాను గబుక్కున డ్రెస్సింగ్ టేబుల్ పై నుంచి గబుక్కన బయటకు పరిగెత్తబోయింది.

ఆ కుర్రాడు వెళ్లనిస్తేనా? మధ్యలోనే  అడ్డుకున్నాడు.

తన కదలికలను అతను గమనిస్తున్నాడన్నవిషయం తెలిసి చామంతికి గుండె దడదడలాడింది.

ఎప్పుడెప్పుడు అక్కడ నుంచి పారిపోదామా అనిపించింది.

అతను అటూ ఇటూ కదలినవ్వలేదు.

గబుక్కున తన బాహుబంధాల్లో బిగించి ... ముఖాన్ని పెదాలతో అద్ది..

ఆ తర్వాత బలవంతంగా తన  శరీరాన్ని ఎత్తి మంచం మీదకు విసిరేశాడు.

స్వప్నలోకంలోకి పడినట్టుగా అనిపించింది ఆమెకు.

ఆ మంచం. మెత్తటి పరుపు...గాల్లో తేలుతున్నట్టుగా ఉంది.

‘ నీ అంత అందం ఎవరికీ లేదు తెలుసా... ముఖానికి మేకప్ వేస్తే ఇప్పుడున్న ఏ హీరోయిన్ నీ దరిదాపుల్లో ఉండదు ?’’ పొగడ్తలతో  ముంచెత్తాడు.

ఏం పెట్టి పెంచావ్ ఈ శరీరాన్ని ... పుష్టిగా..

గుండ్రటి భుజాలు.. నిండైన వక్షాలు..     తెగ మత్తెక్కిచ్చేస్తోంది.

డబ్బులున్న వాళ్లు మంచి శరీరాకృతి కోసం నానా కష్టాలు పడతారు. నువ్వేంటి?’’

ఇలా ఏదేదో మాట్లాడాడు.

‘‘నువ్వు ఈ ఇంట్లో పుట్టవలసిన దానివి కాదే? అంటూ తన అందాన్ని ఊళ్లో చాలా మంది పొగిడిన వాళ్లే. ఇప్పుడు ఈ కుర్రాడి నోటి నుంచి కూడా అవే మాటలు వింటుంటే  గమ్మత్తుగా అనిపించింది .

అతను  తన శరీరంతో ఇష్టారాజ్యంగా ఆడుకున్నాడు.

బిర్యానీ భోజనం... చల్లని మంచినీళ్లు.. ఆ తర్వాత డ్రెస్ టేబుల్ ముందు చెల్లాచెదురుగా పడి ఉన్న మేకప్ సామాన్లు కొన్ని  తీసి చేతిలో పెట్టి పంపాడు.

‘ అమ్మా.. నాన్న తిరుపతి వెళ్లారు. రెండ్రోజుల దాకా రారు. రేపు ఉదయం ఇదే సమయానికి వచ్చేసేయ్’’ వెళ్లే ముందు చెప్పాడు.‘ఏమయిపోయావ్?  రెండ్రోజుల నుంచీ ఎదురుచూస్తుంటే..’’ వీధిమలుపులో కనిపించి చారల చొక్కా కుర్రాడు నిలదీశాడు. రోడ్డుపక్కన మోటారు సైకిలు నిలబెట్టి పక్కగా నిలుచున్నాడు.

ఏం సమాధానం చెప్పాలో చామంతికి అర్ధం కాలేదు.

‘‘నేను పనికి వెళతా.. నువ్వింట పట్టునే ఉండు’’ అని తన తల్లి మరుసటి రోజు  బలవంతంగా తనను ఇంట్లో ఉంచేసింది.  ఆ విషయం ఎలా చెప్పాలో అర్ధం కాక తడబడుతుంటే మళ్లీ అతనే అన్నాడు.

‘‘ మా స్నేహితుడొకరు సినిమా తీస్తున్నాడు. కొత్త హీరోయిన్ కోసం వెతుకుతున్నాడు. నువ్వేం గుర్తొచ్చావు. పల్లెటూరు అమాయక అమ్మాయి పాత్రకి సరిగ్గా నువ్వు సరిపోతావు. అదే మాట వాడికి చెప్పాను. ’’

అతని మాటలు  ఆశ్చర్యాన్ని కలిగించాయి.

‘‘ తను  హీరోయిన్ గానా? నమ్మశక్యం కాకుండా ఉందే?’’ అనుకుంటుంటే..

‘‘ నువ్వేం భయపడవలసిన పనిలేదు. ఒక్కసారి వాళ్ల దగ్గరికెళితే చాలు. అంతా వాళ్లే చూసుకుంటారు.’’ ధైర్యం చెబుతున్నట్టుగా అన్నాడు. అదృష్టదేవత ఈ కుర్రాడి రూపంలో తలుపుతట్టిందనిపించింది చామంతికి. మౌనంగా అతను చెప్పేది వినసాగింది.

అతను జేబులో బొత్తిగొ కొన్ని నోట్లు తీసి ఆమె చేతిలో పెట్టాడు.

అవన్నీ ఐదొందల నోట్లు.. ఐదో, ఆరో ఉంటాయి. అవేమీ తను లెక్కపెట్టలేదు.

‘ ఈ డబ్బులతో మంచి చీరలు కొనుక్కోవచ్చు. బోలెడు మేకప్ సామాన్లు కొనుక్కోవచ్చు’ మనసులోనే లెక్కలేసుకోసాగింది. పట్టపగలే కలల్లోకి జారిపోయింది. తనో పెద్ద హీరోయిన్ అయిపోయినట్టు.. కారులో తిరుగుతున్నట్టు..

భవిష్యత్తులో తను గడపబోయే జీవితం ఆమెను ఊరించింది. ఊహాలోకంలో తేలియాడింది.

‘‘ రేపు ఇదే వేళకు వచ్చెయ్యి. రాత్రి 8 గంటలకు ముంబయ్ వెళ్లాలి. అక్కడ నీ కోసం ప్రత్యేకంగా గెస్ట్ హౌస్ ఏర్పాటు చేశారు’’.

ఇంకేదో అతను  చెబుతున్నాడు. అవేమీ ఆమె చెవినపడలేదు.

ఈ పాడు జీవితంలో నుంచి బయటపడతానన్న విషయం ఒక్కటే ఆమె తలపుల్లో మిగిలిపోయింది.

గబగబా నాలుగు మాటలు చెప్పి మోటారు సైకిలు మీద అతను వెళ్లిపోయాడు.

‘‘తనో పెద్ద హీరోయిన్ అయిపోయినట్టు.. కారులో తిరుగుతున్నట్టు..’’ ఏవేవో కలలు రాత్రి నిద్రపోతున్నప్పుడే కాదు. మెలకువలోనూ ఉక్కిరిబిక్కిరి చేశాయి.

అందుకే తల్లితో  ఒక్క మాటయినా చెప్పకుండా

ఆమె గుమ్మం దాటింది.

చారల చొక్కా కుర్రాడితో  రైలెక్కేసింది.

రైలుపరిగెడుతుంటే ఆమెలో ఉత్సాహం పరుగులు పెట్టింది.

‘ఎగిరిపోతే.. ఎగిరిపోతే.. ఎగిరిపోతే ఎంత బావుంటుంది’

ఉల్లాసంగా కూనిరాగం తీయటం ప్రారంభించింది.

ఆమె ఎదురుగా కూర్చున్న చారల చొక్కా కుర్రాడు ఎవరితోనో ఫోన్లో బేరాలాడుతున్నాడు.

తను మాటలు పక్కనున్న వాళ్లెవరికీ వినపడకూడదన్న జాగ్రత్త అతనిలో కనిపిస్తోంది.  

‘‘కొత్త పిట్ట. చాలా ఫ్రెష్ గురూ... రేపు సాయంత్రం రైల్వే స్టేషన్ దగ్గరికొచ్చెసేయ్. అమ్మాయిని నీకు హేండోవర్ చేస్తాను.’’

తన బ్యాంకు   ఖాతాలో ఎంత డబ్బులు  వేయాలో చెప్పాడు.

దానికి అవతల వ్యక్తి అభ్యంతరం చెప్పినట్టున్నాడు.

‘‘ అదేం కుదర్దు. పైసా తగ్గినా ఒప్పుకోను’’. కరాఖండీగా చెప్పాడు.

మళ్లీ అవతల వ్యక్తి ఏదో అన్నాడు.

‘‘ నువ్వు చెప్పిన  రేటుకి  ఇంత కష్టపడి ముంబయ్ దాకా రావలసిన పనిలేదు.

హైదరాబాద్ లోనే  నా పనయిపోతుంది. ’’ అని.. ‘‘ నీకిష్టం లేకపోతే చెప్పు. మొన్నామధ్య ముస్తఫా ఓ నలుగురయిదుగురు కావాలని
అడిగాడు. అతనికి పంపేస్తాను’’ గట్టిగా చెప్పాడు.

ముస్తఫా ముంబయ్ రెడ్ లైట్ ఏరియాకు అమ్మాయిలను సరఫరా చేసే బ్రోకరు. రాజకీయ నాయకులు, పోలీసులతో అతనికి బాగా పరిచయాలున్నాయి.   అండర్ వరల్డ్ తో కూడా  సంబంధాలున్నాయంటారు.

ముస్తఫా పేరు చెప్పగానే అవతల వ్యక్తి దిగొచ్చాడు.

‘‘ సరే.  డీల్ ఓకే .. నువ్వు చెప్పిన రేటు ఇచ్చేస్తా...’’ అని ఓ నిముషం ఆగి

‘‘ అన్నట్టు అరబ్ షేక్ ఒకతను ఆ మధ్య హైదరాబాద్ అమ్మాయిలను చూశాడట. మనసు పడ్డాడు.

అక్కడ అమ్మాయిలు బావుంటారు. కనీసం ఓ ముగ్గురయినా కావాలి అనడిగాడు.  ఒకర్నయినా నువ్వు  చూసి పెట్టాలి.’’చారల చొక్కా కుర్రాడు జవాబు చెప్పలేదు. అవతల వ్యక్తి చెబుతున్నది శ్రద్ధగా వింటున్నాడు.

‘‘డబ్బులు గురించి నువ్వేం ఫికర్ చెయ్యకు. మనం అడిగినంత ఇస్తాడు.  ఓకేనా...’’ అడిగాడు.

చారల చొక్కా కుర్రాడు  చుట్టూ ఉన్న వ్యక్తులను పరిశీలించసాగాడు.

అతని చూపులు  ఎదురుగా పైబెర్తుపై  పడుకుని  ఇంగ్లీషు నవల చదువుకుంటున్న అమ్మాయిపైన  నిలిచిపోయాయి.ఆమె ఒంటరిగా రైలెక్కిన విషయాన్ని అతను గ్రహించాడు.

ఆమె వేషధారణ,తీరు చూసి బహుశా ఏ సాఫ్ట్ వేర్ ఉద్యోగో అయ్యుంటుందని అనిపించింది.

ముంబయ్ వెళ్లే లోపు ఆమెను ఎలాగయినా తన దారికి తెచ్చుకోగలనన్న నమ్మకం కలిగింది.

‘‘ నీ పని అయిపోయినట్టే. డబ్బులు సిద్ధం చెయ్యి’’ అవతల వ్యక్తికి  ఫోన్లో చెప్పి

ఆ అమ్మాయినే   చూస్తూ ...

మనసులో తనకు రాబోయే డబ్బుల గురించి లెక్కలు వేసుకోసాగాడు  చారలచొక్కా కుర్రాడు. 

మరిన్ని కథలు
kudiedamaite