Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

సాధారణంగా పోస్టూమార్టాలు, ఏదో “అనుమానాస్పద సందర్భాల్లో”, ఎవరైనా మరణిస్తే , కారణాలు తెలిసికోడానికి చేసే ప్రక్రియ. ఇదో ఆనవాయితీ. కానీ, నిజ జీవితాల్లో, ప్రతీ దానికీ , ఎవడికి తోచింది, వారు చెప్పడంకూడా, ఈ కోవలోకే వస్తుంది.. దానికి ఓ అర్ధం పర్ధం ఉండదు. ఆ క్షణంలో ఏం తోస్తే అది అనేసేయడం. పైగా ప్రతీవారికీ, అవతలివాడికి ఏదైనా “కష్టం” వచ్చిందంటే చాలు,, ఆ విషయంలో మనకున్న “తెలివితేటలు” ప్రదర్శించాలనుకుంటారు. ఆ జరిగిన సంఘటనతో, ఇవతలివాడికి ఏ విధమైన అవగాహనా లేకపోయినా సరే, నోరుందికదా అని ఏదో ఒకటి వాగేయడం. పైగా, ఇవతలివాడు, అసందర్భంగా మాట్టాడినా, ఏమీ అనకూడదు. ఈ పెద్దమనిషి,  చాలా సందర్భాల్లో, తన వయసు అడ్డుపెట్టుకుని, ఎడా పెడా సలహాలిచ్చేస్తూంటాడు. మరీ, ఎవరైనా ధైర్యం చేసి కాదూ కూడదూ అనాలని ప్రయత్నించాలని చూసినా, ఉపయోగం శూన్యం.  “ అదేమిటీ.. పెద్దాయనేదో చెప్తున్నారు కదా.. ఒప్పుకోడానికేం రోగం..” అంటారు. అక్కడికేదో ఈ పెద్దమనిషికి ప్రపంచంలోని ప్రతీ విషయం కూలంకషంగా తెలుసని కాదు... పాపం అదో అలవాటు.. తన అస్థిత్వాన్ని తెలియచేసే ఓ ప్రయత్నం, అని అర్ధం చేసికుంటే, ఏ గొడవా ఉండదు, ఎవ్వరూ పట్టించుకోనఖ్ఖర్లేదు, అందరూ సుఖపడతారు.

రోడ్డుమీద స్కూటరు మీద వెళ్తూ, ఏదో ప్రమాదం జరిగిందే అనుకోండి, చాలామంది దృష్టి, ఆ వాహన చోదకుడు వేసికోవాల్సిన శిరస్త్రాణం (  helmet)  మీదకే వెళ్తుంది. ముందుగా, ఆ వార్త చదవగానే, ప్రతీవాడి నోటంటా వచ్చే స్పందన దాని గురించే.  చాలా నగరాల్లో, నూటికి యాభైమంది,  ఈ హెల్మెట్లు పెట్టుకోవడమనేది చేయనే చేయరు. అందరికీ, తెలుసు, దాని ఉపయోగం. పైగా ప్రతీవారూ, తాము వాడకపోవడాన్ని సమర్ధిస్తూ, ఏదో కారణం చెప్పేవారే.

ఏ కార్యక్రమానికో వెళ్ళాల్సొచ్చినప్పుడు. ఏ కారణం చేతనో, సరైన టైముకి చేరలేకపోతే, ప్రతీవాడూ సలహా ఇచ్చేవాడే—“ అరే మీరు ఆ బస్సు/ట్రైను పట్టుకున్నారా.. ఫలానాది పట్టుకుంటే, ఓ రెండు మూడు గంటలు ముందే వచ్చేవారే...”. దేశంలోని రవాణా సౌకర్యాల గురించి, వీరికి అపారమైన తెలివితేటలున్నాయంత బిల్డప్పు ఇచ్చేయడం.

అన్నిటిలోకీ ముఖ్యమైన పోస్టుమార్టం, పరీక్షకెళ్ళొచ్చిన ప్రతీ విద్యార్ధీ బలైపోతూంటాడు. వాడు పరీక్ష ఎలా వ్రాసినా, లెక్కల పేపరు విషయంలో మాత్రం, వీడు  రాసిన ఆన్సర్ , ఇంటికి తీసికొచ్చిన ప్రశ్నాపత్రం మీద ఉండాల్సిందే.  పరీక్షాఫలితాలొచ్చిన తరువాత ఎలాగూ తెలుస్తుంది కదా, అప్పటిదాకా ఉండొచ్చుగా, అబ్బే ఈలోపులోనే, వాడికొచ్చే మార్కులు తెలిసిపోవాలి. దీనితో , ఏమౌతుందంటే, బుధ్ధిగా రాసే తన తోటి విద్యార్ధిని అడిగి, తను వ్రాసిన ఆన్సర్ రాసి చూపించడం. కనీసం పరీక్షా ఫలితాలొచ్చేదాకా అయినా ప్రశాంతంగా ఉండొచ్చు. ఈ రోజుల్లో  సిటీబస్సుల్లో ప్రయాణాలు చేస్తున్నప్పుడు, ఏదో ఓ సందర్భంలో, విలువైన వస్తువులు, జేబు దొంగల పాలవుతూంటాయి.

ఉదాహరణకి,  ఏ కాలేజీనుంచో, స్కూలునుంచో  సిటీబస్సులో వస్తూ, వాళ్ళ నాన్న ఇచ్చిన డబ్బులు దొంగిలించబడ్డాయనుకోండి, ఇంట్టికొచ్చిన తరువాత వీడి పనైపోయిందే. “బ్యాక్ పాకెట్ లో ఉన్న పర్సు ఎవడో తీసేస్తుంటే అంత స్పర్శ లేకుండా ఉన్నావా... అసలు ఒంటిమీద తెలివుంటే కదా, ఏ ఆడపిల్లకో పోజులిస్తూండుంటావు.. అంత రష్ గా ఉంటే, ఏ రిక్షాయో ఎక్కిరావొచ్చుగా...” అని.మళ్ళీ అదే తండ్రిగారు, అదే కొడుకుని, ఓసారి రిక్షా ఎక్కివచ్చినందుకు నానా చివాట్లూ వేసిన సందర్భం మర్చిపోవడం. “ ఈమాత్రం దూరానికి నీకు రిక్షా కావాల్సొచ్చిందా... అప్పనంగా డబ్బులొస్తూంటే, రిక్షాలేమిటీ, టాక్సీల్లో కూడా వస్తావు, అసలు డబ్బు విలువేమిటో తెలుస్తోందా.. అవునులే, సంపాదిస్తే కదా తెలిసేదీ...” అని ! ఇలా ఎడ్డెం అంటే తెడ్డెం అని పోస్టుమార్టాలు చూస్తూనే ఉంటాము.

అసలు ఈ పోస్టుమార్టాల వలనే, జీవితంలో ప్రశాంతత అనేది కరువైపోయింది. జరిగిపోయినదాని గురించి జుట్టు పీక్కుంటే వచ్చేదేమైనా ఉందా పోనీ? అయినా సరే ప్రతీ విషయాన్నీ కూలంకషంగా రివ్యూ చేయడం కొంతమందికి ఓ అలవాటు.జరిగినదాంట్లో తప్పొప్పులు బేరీజువేసికుంటేనే కదా, భవిష్యత్తులో , ఆ తప్పులు చేయకుండా చూసుకునేదీ అంటారు కొందరు. నిజమే ఆ మాట. కానీ, అన్నీ తెలిసికూడా, అదే తప్పుని చేసేవాడిని ఏం చేస్తారు? మళ్ళీ అప్పుడు “మెట్టవేదాంతం “ లోకి దిగిపోతారు. వాడికలా రాసిపెట్టుంటే మనమేచేస్తాం లెండి అని వదిలేస్తారు. అలాంటప్పుడు, ఈ కంఠశోష ఎందుకుటా? అదో కాలక్షేపం....

మరిన్ని శీర్షికలు
jyotishyam - vignaanam