Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
kaakoolu

ఈ సంచికలో >> శీర్షికలు >>

జ్యోతిపథం - పులివర్తి కృష్ణమూర్తి

శ్రీ సీతారాములకళ్యాణం చూతము రారండి అన్నమధుర గీతాన్ని విననివారుండరు. తెలుగు వారిలో. అంతటి మహత్తరమైన అనుభూతిని కలిగించడమేకాక సీతారాములకళ్యాణఘట్టాన్ని ఒకసారి కనులముందు నిలుపుతుంది.  ఆ తలపే ఒక అలౌకిక ఆనందాన్నికలిగిస్తుంది. కళ్యాణం ననగానే భారతదేశంలో శ్రీ సీతారాముల కళ్యాణాన్నే ప్రప్రధమంగా పేర్కొంటుంటారు. అంతటి ఆదర్శ దంపతులను ఆరాధ్య దైవాలుగా కొలిచే మనం, సీతమ్మ సౌకుమార్యాన్నీ, ఆమె అందచందాలనూ మదిలో నిలుపుకుని నేటి వధువును అలంకరించడం పరిపాటైపోయింది. వధూవరులను నేటికీ లక్ష్మీనారాయణులుగా భావించి ఉన్నతమైన గౌరవాన్ని ఇచ్చి ఆనందిస్తాము.

తెలుగు రాష్ట్రాల్లో వాడవాడలా చలువ పందిళ్ళు వేసి సీతారాముల కళ్యాణాన్ని జరిపిస్తారు. వైభోపేతంగా సాగే ఈ కళ్యాణోత్సవాలను ప్రతి వైష్ణవాలయాల్లోనే కాక శివాలయాల్లోనూ జరిపించడం విశేషం. పానకమూ, వడపప్పూ, పానకం, కొబ్బరి ముక్కలూ ప్రసాదంగా పంచుతారు. అన్నదానాలు విరివిగా జరిపిస్తారు. తెలుగింటి ఆడపడుచులు ఈ కళ్యాణోత్సవంలో పాల్గొని తమ సౌభాగ్యం కలకాలం నిలవాలని ఆ లక్ష్మీనారాయణులను కొలుస్తారు. పెళ్ళికాని ఆడపిల్లలు స్వామివారి కళ్యాణాన్ని తిలకించితే త్వరలో వారికి వివాహం జరుగుతుందని నమ్ముతారు. స్వామివారి కళ్యాణాన్ని లక్షలాదిమంది దంపతులు పెండ్లిపీటలమీద కూర్చుని జరిపించి తరిస్తారు. ఇదో ఆధ్యాత్మిక వేడుక.దశరథ మహారాజు గారు తన ముగ్గురు భార్యలు కౌసల్య, సుమిత్ర, కైకేయి సమేతంగా మిధిలా నగరానికి విచ్చేసి జనక మహారాజు ఆతిథ్యాన్ని తనివితీరా అందుకుని విశ్వామిత్ర, వశిష్టాది మహామునుల సమక్షంలో రంగరంగ వైభవంగా జరిపించి తరించారు. లోక సమ్రక్షణార్థం అవతరించిన జగదేకమోహనుడు రాముడు. పూర్ణ పురుషుడిగా, ఆదర్శమూర్తిగా ధర్మావతారుడిగా లోకానికి భార్యాభర్తలంటే ఎలా వుండాలో నిరూపించి చూపించిన  మహనీయా మూర్తులిరువురూ. లోక కళ్యాణానికై భూమిపై అవతరించిన జగదేకమోహిని సీతమ్మ వివాహం కళ్యాణకారకుడైన విశ్వంభరుడు నారాయణుడి అవతారమూర్తి రామచంద్రస్వామివారితో జరిగిన ఘట్టాన్ని అటు దేవతలూ ఇటు మానవులూ వీక్షించి తరించే అపురూప క్షణాలవి.మరువరాని మరువలేని మహత్తర క్షణాలవి. హిందూ వివాహ వ్యవస్థకు ఆదర్శంగా నిలిచిన ఈ వివాహ తంతునే నేటికీ మనం పాటిస్తున్నాము. వివాహ వేదికపై జరిగిన బాసలే గాక, పెండ్లికొడుకును చేయడం మొదలుకుని మాంగల్య ధారణా, జీలకర్ర బెల్లం పెట్టడం పాణిగ్రహణం తలంబ్రాలు ఏడడుగులు నడవడం వంటివి ఎంతో మనోహరంగా నేటికీ జరుపుకుంటూ అత్యంత పవిత్రమైన వివాహ జీవితాన్ని మనం అనుభవిస్తున్నాము. ఏకపత్నీవ్రతం అంటే ఎలా వుండాలో భార్య అంటే ఎలా వుండాలో ఈ రామాయణంలో మనకు అవగతమవుతుంది. ఈనాటి దంపతులందరూ తప్పనిసరిగా సీతారాముల కథను చదివి, వారి జీవన విధానాన్ని గమనించి ఒకరినొకరు గౌరవించుకుంటూ, ఒకరికొకరుగా జీవితమంతా తపిస్తూ రమిస్తూ సాఫల్యాన్ని పొందాలి.

భద్రాచలంలో ఈ నాటికీ మహోన్నతమైన రీతిలో జరిగే  సీతారాముల కళ్యాణాన్ని వీక్షించేందుకు దేశవిదేశాల్లోని హిందువులందరూ సంవత్సరంపాటు వేచి ఉంటారు. ఊక్కొక్క ఘట్టాన్ని పురోహితులు వివరిస్తూ మంత్రాలను పఠిస్తూ వుంటే కన్నులార్పకుండా చెవులు నిక్కించి మరీ వింటాము. మనమందరమూనూ. అంతటి పవిత్ర భావన వుంది మనందరికీనూ. ఎన్ని కష్టాలు ఎదురైనా, భార్యాభర్తలు ఎంతటి ఆత్మస్థైర్యంతో ఎదుర్కొని నిలవగలరో ఈ సీతారాములే మనకు తెలియజేసారు.

వివాహమంటేనే ఒక పెద్ద వేడుక కాగా, ఈ కళ్యాణ దంపతుల వివాహాన్ని తిలకించడమే ఒక గొప్ప అదృష్టం. ఆనందమే ఆనందం. ఈ విశ్వానికంతటికే అదొక దైవిక విచిత్రానుభూతి. ఇదొక జగద్కళ్యాణం.

శ్రీరామనవమిని ముఖ్యంగా శ్రీరాముడి పుట్టినరోజుగా జరుపుకుంటారు మరికొందరు. రాముడే దేముడిగా, మానవుడే మహనీయుడిగా ఆదర్శంగా నిలిచిన శ్రీ మహావిష్ణువు అవతారంగా భూమిపై వెలిసిన స్వామిని కళ్యాణ రామునిగా దశావతారాల్లో ముఖ్యావతారమూర్తిగా సీతారాముడిగా కొలిచి తరిద్దాం. రామనామాన్ని జపించి ముక్తిమార్గంలో పయనిద్దాం. సర్వశుభాలు కలుగుగాక.

చతుర్భుజాయ ధీరాయ
చతురాయుధ ధారిణే
సౌధర్మన యుతాయాస్తు
రామభద్రాయ మంగళం

మరిన్ని శీర్షికలు
Parkinson's Disease | Ayurvedic Treatment | Prof. Dr. Murali Manohar Chirumamilla, M.D. (Ayurveda)