Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

నిదురలో, నాకు .... సన్నగా అమ్మ పాట వినబడుతుంది.

”.......రామచిలుక నొకటి పెంచి ప్రేమ మాటలాడ నేర్పి….
రామరామరామ యనుచు……...

అమ్మ పాడితే ఎంతో బాగుంటుంది.  కళ్ళు తెరిచి, వెల్లకిలా తిరిగి పడుకున్నాను.  చక్కగా వినిపిస్తున్న అమ్మ గొంతుతో .... గొంతు కలిపి, సన్నగా పాడ్డం మొదలుపెట్టాను.

సిటింగ్  రూంకి   అటుపక్కనున్న హాల్లో,  రొజూ మ్యూజిక్  క్లాస్ చెబుతుంది అమ్మ.  పిల్లలకి, పెద్దవాళ్ళకి  కూడా పాట నేర్పిస్తుంది.  ఇప్పుడు సమ్మర్ హాలిడేస్లో, ప్రతిరోజూ క్లాస్ ఉంటుంది.  చాలా మంది వస్తారు నేర్చుకోడానికి.


మ్యూజిక్ క్లాస్ అయ్యేంతవరకు ఆ హాల్లోకి  రావద్దని చెప్పింది అమ్మ.   అందుకే  బోర్డ్ గేమ్స్ ఆడుకొని,  స్టోరీ బుక్   చదువుకొని,  క్లాస్ అయ్యేంత వరకు  ఎ.సి పెట్టుకొని అమ్మ రూములోనే  పడుకోవాలి.

...ఉయ్యాలలో ఉన్న తమ్ముడు నిద్ర లేస్తే  మాత్రం, వాణ్ణి జోకొట్టమంది.

**

తమ్ముడు  గుర్తొచ్చి, పక్కకు  తిరిగి చూస్తే, నిద్రపోతున్నాడు.  బాబు నోట్లో ఫీడింగ్ బాటిల్ అలాగే ఉంది.  పైకి లేచి, మంచం పక్కన ఉన్న బల్లపీట మీద కాళ్ళుంచి నిలబడి,  నేల మీదకి గెంతాను.  అలా జంప్ చేయడం నాకిష్టం.  మా ఇంట్లో లాంటి పందిరి మంచం, మాకు తెలిసిన ఇంకెవరి ఇంట్లోనూ చూడలేదు.  ఇది అమ్మ మంచం.

చప్పుడు  చేయకుండా  తమ్ముడి దగ్గరగా వెళ్ళి ఫీడింగ్ బాటిల్ పక్కకి తీసి, వాడి నోరు నాప్కిన్ తో తుడిచాను. 

తమ్ముడి  పేరు  వినోద్.   బాబు అని కూడా పిలుస్తాము..పోయిన సండే  వాడి  ఫస్ట్  బర్తడే  పార్టీ  అయింది.

బాబుని  జోకొట్టి  మెల్లగా వెనక్కి తిరిగాను.....

“....పలుకే బంగారమాయే .....” అమ్మ పాడుతుంది...

నా పాదాలు అమ్మ పాటకి అడుగులు వేస్తున్నాయి. అమ్మ వేస్తున్న తాళానికి ఓ సారి వడిగా, ఓ సారి నింపాదిగా... కదులుతున్నాయి. నాలో తెలియని ఆనందం.  చేతులు తిప్పుతూ, గెంతుతూ, గది చుట్టూ గుండ్రాలు తిరుగుతూ, అప్పుడప్పుడు  అమ్మ  బీరువా  అద్దంలో  చూసుకుంటూ  డాన్స్ చేస్తున్నాను.

**

పాట ఆగిపోయింది.  క్లాస్ అయిపోయిందన్నమాట.

“చంద్రా, ఇటూ రామ్మా,” పిలిచింది అమ్మ.

ముఖం తుడుచుకుంటూపరుగున వెళ్లాను.

మ్యూజిక్ క్లాస్ వాళ్ళంతా ఇంకా అక్కడే ఉన్నారు.  మాలిని, చిట్టెమ్మ మామి, కమలక్క. అందరూ.

“మళ్ళీ డాన్స్ చేస్తున్నావా లోపల?   ముఖమంతా చెమట పట్టేసింది,  రొప్పుతున్నావు,”  దగ్గరికి తీసుకొని, చీర కొంగుతో నా ముఖం తుడిచింది అమ్మ.

“ఆ డాన్స్ ఏదో మా ముందే చేయమనండి శారదగారు,” అంటూ నా తల మీద మెల్లగా తట్టి వెళ్ళింది చిట్టెమ్మ మామి.

“మేడమ్, మీ క్రింద ఫ్లాట్ లోనే, శివరామశర్మ గారు కూచిపూడి డాన్స్ క్లాస్ మొదలు పెడతారంట. మా చెల్లెలు వెళ్ళబోతుంది. మన చంద్రకళని కూడా పంపండి మేడమ్,” అంటూ నా బుగ్గ మీద ముద్దు పెట్టింది మాలిని..

“పాట నేర్చుకుంటుందిగా! ఎన్నని చేస్తుంది? సెకెండ్ స్టాండర్డ్ కి వెళ్ళబోతుంది కూడా,” అనేసింది అమ్మ.  ఔను..  నా యీడు వాళ్ళతో పాట  నేర్పుకుంటున్నాను.   అంతేకాదు,  అమ్మ  మిగతా  క్లాసుల్లో నేర్పే పాటలన్నీ వింటూనే ఉంటాను... పాట ఇష్టమే... కాని ఆ పాటలకి డాన్స్ చేయడం ఇంకా ఇష్టం...

నాకిప్పుడు  సెవెన్ ఇయర్స్. గురుకుల్  స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ చదివేసి, ఇప్పుడు ఇంటిదగ్గరలో ఉన్న కాన్వెంటుకి వెళ్ళబోతున్నాను.

ఇంతలో తమ్ముడు లేచినట్టున్నాడు.  ఏడుపు వినిపించింది.

“చంద్రా, బాబు నిద్రలేచాడురా,” అమ్మ నన్ను వొడి నుండి దింపి అటుగా వెళ్ళింది.

**

చీకటి పడుతుండగా, నాన్నవి  ఆర్మీకాప్ -హాండ్ స్టిక్ - ఆఫీస్ ఫైల్స్ తో హడావిడిగా పైకి వచ్చాడు,ఆర్డర్లీ కన్నన్.రోజు లాగా, వరండాలో ఓ పక్కగా ఉన్నకోట్-క్లాజెట్ లో వాటిని సర్డాడు.  అలవాటుగా  పరిగెడుతూనే  ఉంటాడు కన్నన్...

వెనకాలే నాన్న వచ్చారు.  చేతిలో ఎదో ప్యాకేజీ ఉంది.  ప్యాకేజీని వొళ్ళో ఉంచుకొనే,  తన కుర్చీలో కూర్చుని, షూజ్  తీసారు.నాన్న  విప్పిన యూనిఫారం  కోట్  కూడా అందుకొని,  దాని మీద  ఉన్న  స్టార్స్, రోప్స్ వేరు చేసి, ఆ సూట్ కూడా హాంగ్ చేసి, నాన్నకి సెల్యూట్ చేసి వెళ్ళిపోయాడు కన్నన్.

నాన్న ఫ్రెష్  అవడానికి  లోనికెళ్ళారు, చేతిలోని ప్యాకెట్ తో సహా.

రోజూలానే  బాల్కనీ లో  నుండి,  ప్లేగ్రౌండ్ లో క్రికెట్ ఆడుతున్న కిడ్స్ ని చూస్తూ,  నాన్న కోసమే వెయిట్ చేస్తున్నాను...

**

పొద్దున్నే మిలిటరీ సూట్ మీద  స్టార్స్, రోప్స్ పెట్టి, తలపై కాప్ పెట్టుకొని తయారవుతుంటే, డోర్ దగ్గర నిలబడి నాన్నని వాచ్ చేస్తాను.  ఆర్మీ జీపులో డ్యూటికి  వెళుతూ, నాన్న నాకు ‘టాటా’ చెప్పాకే లోనికి వెళ్తాను.  నాన్నని అలా ఫాలో అవడమే, నిద్ర లేచాక  రోజూ నేను చేసే ఫస్ట్పని.

నాన్న నాకు చాలా బలమున్న దేవుడులా అనిపిస్తారు. మరి నాకు ఏది కావాలన్నా తెస్తారు.అమ్మకి తమ్ముడికి కూడా.

నాన్నకి,  ఆదేష్  అనే  మరో ఆర్డర్లీ  కూడా  ఉన్నాడు.  అతను  జీపు డ్రైవ్ చేసి, బయట పనులు చేసి వెళ్ళిపోతాడు.కన్నన్  మాత్రం  ఇక్కడ క్వార్టర్స్ లో ఉంటాడు. ఎప్పుడన్నా, మా మారుతీ కార్ డ్రైవ్ చేస్తాడు.  సండే మాత్రమే అతనికి హాలిడే అంది అమ్మ.

**

నాన్న బాల్కనీ లోకి  వచ్చిన శబ్దమైతే అటుగా చూశాను.

ఫ్రెష్ అయి వచ్చి తన కుర్చీలో కూర్చున్నారు.  చేతిలో చాక్లెట్ బార్...

పరుగున దగ్గరికి వెళ్లి,నాన్న పక్కనే ఉన్న నా మోడా మీద కూర్చున్నాను.

“ఏమ్మా కళా,  రోజంతా ఏం చేసావు? అడిగారు. “నీకోసం ఫైవ్- స్టార్ చాక్లెట్,” అంటూ నా ఫేవరట్ చాక్లెట్ అందించారు.... “ఇది కాక ఇంకా వేఫర్స్, క్యాండీ తెచ్చాను.  రోజూ నేను డ్యూటీ నుంచి వచ్చాక  ఒక్కోటి  ఇస్తానుగాని, చెప్పు, ఇవాళ ఏం చేసావు?  మ్యూజిక్ క్లాస్ లో కూర్చునుంటావు,ఔనా?” అన్నారు.....

“లేదు నాన్న.  డాన్స్ చేసాను.  అప్పుడు మనం ఆ సినిమాలో చూసిన డాన్స్,  ప్రాక్టిస్  చేసాను.  చేసి చూపిస్తా,” అంటూ చాక్లెట్ టేబిల్ మీద పెట్టి,  మోడా నుండి లేచి,  వరండాలోని  చైర్,  స్టూల్ పక్కకి జరిపాను.  “పిలిచానా రావటనా .....” అని పాడుతూ, చేతులు అచ్చంగా సినిమాలో అమ్మాయిలాగానే తిప్పుతూ, అడుగులు వేస్తుంటే,  నాన్న నవ్వుతూ చప్పట్లు కొడుతున్నారు.  బాబునెత్తుకుని,  వరండాలోకి  వచ్చిన అమ్మ కూడా నా డాన్స్ చూస్తూ నిలుచుంది.

ఇంకా సంతోషంగా అడుగులు వేస్తూ, నవ్వుతూ డాన్స్ చేస్తున్నాను..  నాన్నకి కాఫీ కప్పందించి  పక్కనే కూర్చుంది అమ్మ.

వొళ్ళంతా చెమటలు పడుతున్నా, అలా డాన్స్ చేస్తూనే ఉన్నాను.....

“ఇంక చాల్లే చంద్రా. మళ్ళీ రేపు వేరే పాటకిచేద్దువులే.  ఇప్పుడు తమ్ముణ్ణి పార్క్ కి తీసుకెళతావుగా,” అంది అమ్మ నవ్వుతూ...“శభాష్ రా కళా, సినిమాలో అమ్మాయికంటే బాగా చేశావురా.  ఒక్క నవ్వే కాదు.  ముఖంలో  కోపం, అలక, కూడా చూపించావు,” నన్ను మెచ్చుకుంటూ బాబుని చేతుల్లోకి తీసుకున్నారు నాన్న.  నాకు చాలా హ్యాపీగా అనిపించింది.

‘పిలిచానా రావటనా’ కాదు.  ‘పిలిచినా బిగువటరా’.. అదీ పాట,” అంది అమ్మ మళ్ళీ నవ్వుతూ.

“అయినా మనం ఆ సినిమా చూసి రెండు వారాలయిందిగా.  ఇక  ఈ ఆదివారం ఏ పాత సినిమా తెప్పిస్తున్నారో క్లబ్ లో,”  అంది నాన్నని చూస్తూ.

“ఈ ఆదివారం డాన్స్ ప్రోగ్రాం ఉందని చెప్పానుగా! మర్చి పోయావా? అన్నారు నాన్న.

ఆర్మీ ఆంధ్ర  క్లబ్బుకి, నాన్న ప్రెసిడెంట్.  ప్రతి ఆదివారం ఏదో ఒక ప్రోగ్రాం లేదా తెలుగు సినిమా ఏర్పాటు చేస్తారు నాన్నవాళ్ళు.

ఈ  సారి  గుంటూరు నుంచి వస్తున్నారట  ఆ కూచిపూడి డాన్స్ గ్రూప్.

ఇంతలో బట్టలు  మార్చేసుకొని,  పైకి  వచ్చాడు  కన్నన్.  బాబుని  స్ట్రోలర్ లో కూర్చోబెట్టుకుని,  రోజులా  అతనితో  పార్క్ వరకు  వాకింగ్ కి  బయలుదేరాను.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్