Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jayajayadevam

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వేంకట వరప్రసాదరావు

sahiteevanam

ఆవిధముగా ఎప్పటిలానే తన నిత్యపూజా విధిని నిర్వర్తించుకుని, ఒకరోజు మధ్యాహ్నం స్వామికి మాలను సమర్పించి ఇంటికి వెళ్తున్న విష్ణుచిత్తుని చూసి ఆ గరుడతురంగుడు, సంతుష్టాంతరంగుడు తన దేవేరిని  చూస్తూ యిలా పలికాడు.

‘యామునాచార్యుఁడొక్కఁ డు  నీ మహాత్ముఁ 
డొక్కఁడును గాదె మన్మతం బుద్ధరించి
రస్మదీయక్రుపాతిశాయమున’ ననిన
నిందిరాదేవి తనభర్త కిట్టు లనియె 

యామునాచార్యుడు ఒకడు ఈ విష్ణుచిత్తుడు ఒకడు ఈ ఇద్దరే కదా నా మతమును నా కృపాతిశయముచేత ఉద్ధరించారు అని పలికాడు. ‘ నీకెందుకయ్యా భయము? నేనున్నానుగదా, అన్నీ నేను చూసుకుంటాను, నువ్వు కేవలము నిమిత్తమాత్రుడివి, రాజసభకు వెళ్ళు, అక్కడ పండితులతో వాదించి నా మతాన్ని స్థాపించు’ అని పలికిన పలుకుల సారాంశాన్ని మరలా యిక్కడ ధ్వనిస్తున్నాడు రాయలు. వాదించేది, గెలిచేది, నిలిచేది అన్నీ తానే, తన మతమే, తన మాయయే అంతా అని భక్తులను మాధ్యమంగా చేసుకుని తానే తన లీలలను ప్రకటిస్తాడు భగవంతుడు అని చెప్తున్నాడు పరమాత్ముని పలుకులద్వారా. తన భర్త పలుకులను విన్న శ్రీమహాలక్ష్మి తన స్వామితో యిలా అన్నది.

 

ఇతని కథ యెఱిఁగినది కా
యతఁ డేమి యొనర్చె? ననిన నబ్జాక్షుం డా
శత పత్రనిలయ కిట్లను
నతివ కలం డొకఁడు మత్పదాశ్రితుఁ డాదిన్

ఇతని కథ తెలిసినదే కదా, ఆతడు ఏమి చేశాడు, ఆతని కథ ఏమిటి తెలిజేయండి స్వామీ అన్నది ఆ ‘శతపత్ర నిలయ’, వందరేకుల తామరపూవు యందు ఆసీనురాలై ఉండే శ్రీమహాలక్ష్మి. ఆ పుండరీకాక్షుడు  ఇలా అన్నాడు...‘అతివా! పూర్వము నా పదాశ్రితుడైన వాడొకడు ఉండేవాడు’... అతఁడు చిరుతనాఁడె యాచార్యకులమున వేడ్క వేదశాస్త్రవిద్య లభ్యసించు చుండ నపుడు చెలువ యిప్పటిపాండ్యనృపతి పూర్వవంశ్యుడే యొకండు వెఱ్రిశైవంబు ముదిరి మద్వినుతి వినఁడు,నతి యొనర్పఁడు మామక ప్రతిమలకును,హడె పరతత్త్వ మను, మదీయాలయముల నుత్సవంబుల కులుకు, నెయ్యురును నట్ల చెలీ! అతడు చిన్ననాడే ఆచార్యుని గృహములో సంతోషంగా వేదములను, శాస్త్రములను, కళలను అభ్యసించుచున్న ఆ సమయములోనే యిప్పటి పాండ్యరాజు యొక్క పూర్వీకుడే ఒకడు రాజుగా ఉండేవాడు.ఆ రాజుకు వీరశైవపు వెఱ్రి ముదిరిపోయి, నా కీర్తనను, ప్రశంసనే వినేవాడు కాడు! నా ప్రతిమలకు నమస్కరించేవాడు కాడు, ‘శివుడే పరతత్త్వము’ అనేవాడు, నా ఆలయములలో ఉత్సవములు జరిగితే లికిపడేవాడు, ఉసూరుమనేవాడు, ఆతని స్నేహితులు కూడా అలాంటివారే, ఆతనిలానే నన్ను ద్వేషించుకునేవారు! స్నేహితులు అనడానికి ‘నెయ్యురు’ అన్నాడు రాయలు, ‘నెయ్యము కలవారు నెయ్యురు’ అన్నమాట, విచిత్రమైన, ప్రత్యేకమైన రాయల పదప్రయోగాలకు, మారు మూలలనుండి ఏరి తెచ్చి మాటలగుదిగుచ్చే మధురమైన రాయల కవితా శైలికి యిది మరొక ఉదాహరణ! ‘ఆచార్యకులము’ అంటే గురుకులము. కులము అనే పదానికి నివాసము అనే అర్థము కూడా కనుకగురుకులం అంటే ఆచార్యుని గృహము. పూర్వకాలములో విద్యార్థులను తమ ఇళ్ళల్లో ఉంచుకుని, వారికి ఉచిత భోజన సౌకర్యాలను సమకూర్చి విద్యా ‘దానం’ చేసేవారు, ఇప్పుడు విద్యా ‘వ్యాపారం’ చేస్తున్నారు!కన్నతండ్రిలా అన్ని అవసరాలనూ గమనిస్తూ, అన్ని సౌకర్యాలను సమకూరుస్తూ విద్యాదానం చేసే గురువుగారికి పాదసేవతో మొదలెట్టి సమస్త శుశ్రూషలు శిష్యులు చేసేవారు. గురుపత్నిని, గురువుగారిని తల్లితండ్రులలా భావించేవారు! వేదవిద్యను, శాస్త్రములను, కళలను కూడా బోధించేవారు, సమగ్రమైన, సర్వతోముఖ వికాసాన్ని పొందే వ్యక్తిత్వానికి కావలసిన విద్యను నేర్పేవారు. కనుక సర్వేశ్వరుని స్పృహ, లేదూ అంటే సామాజిక స్పృహ కలిగిన సత్పురుషులు ఉండేవారు, ‘నిరాశ, నిస్పృహ’ నిండిన వాళ్ళుండేవారు కారు!    అశ్రాంత జంగమార్చా శ్రద్ధ వర్తిలు / వేదవిద్ద్విజపూజ వీటిఁగలిపి;భౌమవారపు వీరభద్ర పళ్ళెర మిడు / గృహదైవతంబు లిఱ్ఱింకు లింక;షణ్ణవతిశ్రాద్ధచయ మార బెట్టు శం / కరదాస మయ్య భక్త ప్రతతికి నాద్యంబు లైన దేవాలయంబులు వ్రాల / నవని నిరాశ మఠాలి నిలుపు; జందె

ముత్తరశైవంబుఁ జెంది త్రెంచుఁ
బతితులారాధ్య దేవళ్ళె ప్రాప్యు లనుచు
నుపనిషత్తులు వారిచే నుబ్బి వినుచు
వెండి యే జంగ మెత్తిన వెఱఁగుపడును   

ఆ మహారాజు నిరంతరమూ వేదవిదులైన పండితుల పూజ నిరసించి జంగమదేవరలను శ్రద్ధగా అర్చించేవాడు.  ఇలవేల్పులు నీరసించి, ఇంకిపోయి, భయపడగా ప్రతి మంగళవారము వీరభద్రునికి నైవేద్యపు పళ్లెరాన్ని సమర్పించేవాడు. తొంభైఆరు (షణ్ణవతి) పుణ్యతిథులను, ఆయా తిథులలో చేయాల్సిన వైదిక కర్మలను ప్రక్కనబెట్టి, శివదాసుల సమూహాలకు సంతర్పణలు పెట్టేవాడు. వేదవిద్యకు ఆదిస్థానాలైన దేవాలయాలు శిథిలములై కూలిపోతుంటే, వైరాగ్యాన్ని నిరాశను ప్రతిబింబించే మఠాలను స్థాపించేవాడు! ఉత్తర శైవాన్ని అంటే నూతనవీరశైవాన్ని అంగీకరించి జందెమును త్రెంపి పారేశేవాడు, వేదబాహ్యులైన వారిని, వీరశివారాధ్యులను చేరదగినవారు, పొందదగినవారు అని భావించి, వారిచేత కాల, అగ్ని, రుద్ర ఉపనిషత్తులను చెప్పించుకుని ఉబ్బి తబ్బిబ్బయ్యేవాడు, ఏ జంగమదేవర అయినా శివ ప్రశంస చేస్తే ఆశ్చర్యపడేవాడు, అబ్బురపడేవాడు, ఆసక్తిగా వినేవాడు.  

శివలింగము దాల్చినజననివహము
లేమైనఁ జేయ నిది పాపము
తానవుఁ గా దనఁ డాసమయము
నవు నను విప్రులక యగ్రహారములిచ్చున్

శివలింగమును ధరించిన శైవులు ఏమి చేసినా, పొరపాట్లు చేసినా, తప్పులు చేసినా ‘ యిది పాపము, యిది యుక్తము, యిది అయుక్తము, యిది చేయొచ్చు, యిది చేయకూడదు ‘ అని ఏమీ అనేవాడూ కాదు. పైపెచ్చు వారి అకృత్యాలను సమర్థించిన విప్రులకు, తనను సమర్థించిన విప్రులకు అగ్రహారాలను ఇచ్చేవాడు! అతఁడు

రాజ్యంబుఁ బాలించు నవసరమునఁ
దనవశం బైన యట్టియత్తామ్రపర్ణిఁ
గలుగు నలపుట్టరాని ముక్తామణివర
కులము మాహేశ్వరులకంధరలకుఁ దీఱె

అతడు ఆ రాజ్యాన్ని పరిపాలించే సమయములో తన అధీనములోనున్న తామ్రపర్ణినదిలో దొరికే అపూర్వమైన శ్రేష్ఠములైన ముత్యముల సమూహము అంతా ఆ మాహేశ్వరుల, శైవుల మెడలలో వ్రేలాడే రుద్రాక్షమాలలకే సరిపోయేవి! అప్పు డిచ్చకు

లగుబ్రాహ్మణౌఘ మెల్లనాత్మ
జనిభూమి విడువ లే కలికభూతి
గడ్డముల నాన రుదురాకలిడ్డ సంది
సూతసంహిత లిఱికించి చొరఁ దొడఁగిరి

అప్పుడు ఆ దేశములోని బ్రాహ్మణసమూహమంతా తమ జన్మభూమిని వదిలి వెళ్ళలేని వారు కనుక, రాజుకు ఇచ్చకాలు చేయడం కోసం (లేకుంటే ఇబ్బందులపాలు చేస్తాడు కనుక) గడ్డముల దాకా విభూతి రేఖలను పూసుకుని, రుద్రాక్షలు ధరించి,  చంకలలో ‘సూత సంహితా గ్రంధాలను’ ఇరికించుకుని, ఇకిలించుకుంటూ రాజసభకు వెళ్ళడం మొదలెట్టారు. బలవంతముగా అయినా రాజు తన నిర్ణయాలను అమలు అయ్యేట్టు చేయగలడు కనుక తామే వీరశైవమత ప్రేమికులలాగా, తమ అంతరంగానికి వ్యతిరేకముగా రాజుకు ఇష్టమైన మతాన్నే తామూ అభిమానించేవాళ్ళ లాగా, అనుసరించేవాళ్ళలాగా నటించేవారు.

శీలముఁ బట్టియు గంజా,హాల లు
పాంశున భుజించునాదముల బైటం
జాలఁడు వైవన్ విప్ర
స్ఖాలిత్యము బైట వేసి కనుగిఱపు సభన్

(శైవ)దీక్షను తీసుకుని కూడా చాటు మాటుగా గంజాయి, మద్యము తాగుతూ తిరిగే అధములను బయటపెట్టేవాడు కాడు కానీ, బ్రాహ్మణుల క్రియలలో ఏవైనా అరకొర లోపాలున్నా వాటిని బయటపెట్టి, సభలో నిలదీసి, సభికులకు కనుసైగ చేసి హేళన చేసేట్టు, నిందించేట్టు చేసి, శిక్ష వేసేవాడు. అతను యిలాంటివాడు అయితే,
ఆరాజుమహిషి నియతి
మదారాధనపరత నుండు నట్లుండియు దు
ర్వారవ్యధకుం గానదు,
పారము విభుఁ డస్మదంఘ్రి భక్తుడు కామిన్

ఆ రాజుభార్య నియమముగా నిరంతరమూ నా ఆరాధనలో మగ్నురాలై ఉండేది. తాను నా భక్తురాలై ఉండి కూడా, తన భర్త నాభక్తుడు కాదుకదా యని అంతులేని వ్యధకు గురి అవుతూ ఉండేది. మహారాజు ఎంతటి శైవుడో మహారాణి అంతటి వైష్ణవురాలు. తన భర్త శివభక్తుడు ఐనందుకన్నా విష్ణుద్వేషి ఐన కారణముగా, విష్ణుభక్తులను వేధిస్తున్న కారణముగా ఆ మహారాణి అంతులేని వేదన చెందేది.

(కొనసాగింపు వచ్చేవారము)

***వనం వేంకట వరప్రసాదరావు

మరిన్ని శీర్షికలు
weekly horoscope april 3rd to april 9th