Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ :  అమ్మ శిష్యులకు నేర్పించే పాట వింటూ, తమ్ముడ్ని చూసుకుంటూ బుడిబుడి అడుగుల నాట్య భంగిమలతో మురిసిపోతుంటుంది చిన్నారి చంద్రకళ...నాన్న ముందు కూడా డాన్స్ చేసి చూపిస్తుంది.. ఆ తర్వాత...

సండే పొద్దున్నే ఫోన్ రింగ్ అయితే, నాన్న ఆన్సర్ చేసారు.

“ఆ, ఆ, నమస్తే, వచ్చేసారా? గుడ్.  మా  అసోషియేషన్  వాళ్ళు  వచ్చి  మిమ్మల్ని రిసీవ్  చేసారుగా !.  ఏర్పాట్లన్నీ  వాళ్ళు  చూసుకుంటారు.  కాస్త రిలాక్స్ అయ్యి,  మీ కార్యక్రమాలు కానివ్వండి.  నేను  ప్రోగ్రాం  టైంకి ముందే కలుస్తాను,” అని ఫోన్ పెట్టేసారు నాన్న. కార్టూన్స్ చూస్తూ, నాన్న మాటలు వింటున్న నాకు క్లబ్బులో  డాన్స్  ప్రోగ్రాం ఇవాళేనని అర్ధమయ్యింది.

**

లంచ్ అయ్యాక, జుట్టు పోనీటైల్ కట్టి,  నాకు ఫ్రాక్ వేయబోయింది  అమ్మ.  జడ వేసి పొడుగు బొట్టు, జుమ్కాలు పెట్టమన్నాను.  పరికిణీ  వేసి,  పాంజేబులు కూడా పెట్టమన్నాను.

“సరే, నువ్వు  డాన్స్ చూడ్డానికి వెళుతున్నావా? లేక చెయ్యడానికా?” నవ్వుతూ నన్ను రెడీ చేసింది అమ్మ.

**

ఆర్మీ-క్లబ్  ఆడిటోరియంలో  ‘వేదిక’ దగ్గర  ఏర్పాట్లు  చూడాలని పెందరాళే బయలుదేరాము.  సండే అయినా, బాబు కోసం కన్నన్ మా కూడా వచ్చాడు.  ప్రోగ్రాములంటే అతనికి ఇష్టమే...

క్లబ్ ఆడిటోరియంలో అమ్మ, బాబు ముందు వరసలో సోఫాల్లో కూర్చున్నారు.  నేను మాత్రం నాన్న చేయి  పట్టుకుని,  స్టేజీ  వెనుక  మేకప్  రూముల వైపు వెళ్ళాను.  వాటిని  ‘గ్రీన్ రూం’ అంటారని అమ్మ చెప్పింది.

నాన్నని చూడగానే ఒకాయన పరుగున వచ్చి నమస్కరించాడు.  గ్రీన్ రూం వాకిలి వద్ద ఉన్న పెద్ద కుర్చీలో కూర్చున్నారు నాన్న.“మీరూ కూర్చోండి మాష్టారూ,” అన్నారు ఆయనతో, ఎదురుగా ఉన్న కుర్చీ చూపిస్తూ.

“అయ్యా, మేజర్ గారు,  మిమ్మల్ని ఫోటోల్లో చూడడమే కాని, ఇలా స్వయంగా కలవడం సంతోషంగా ఉంది సార్.  తమరు గుంటూరులో  మా స్కూలుకి వచ్చినప్పుడు కలవలేకపోయాను.  క్షమించాలి,” అన్నాడాయన కూర్చుంటూ.

“ఔను, పోయిన సారి మేము దీపావళి  పండుగకి  గుంటూరు  వచ్చినప్పుడు, మా అమ్మాయితో మీ‘నాట్యాంజలి’ స్కూల్ కి వచ్చాను.  ఆ  సమయంలో  మీరు బయట ఊరికి  ప్రోగ్రాముకి  వెళ్ళినట్టున్నారు.  మీ  అన్నగారిని  కలిసాను,”  అన్నారు నాన్న.

“ఔను సార్.  అన్నయ్య  మీ  గురించి  అంతా చెప్పాడు,”, “ఈ పాప తమరి కుమార్తేగా! పాప గురించి కూడా చెప్పాడు,”  నా వంక చూస్తూ అడిగారు మాస్టారు.

“అవును, మా అమ్మాయి చంద్రకళ,” అన్నారు నాన్న నా భుజాల చుట్టూ చేయి వేస్తూ. “డాన్స్ మీద చాలా ఆసక్తి.  ప్రస్తుతం వాళ్ళమ్మ దగ్గర సంగీతం నేర్చుకుంటుంది,” మాస్టార్ కి నా గురించి చెప్పారు నాన్న.

“చూడు కళా, ఈయన కూచిపూడి గురువు రాఘవేంద్ర శర్మ. గుంటూరు నుంచి ఇక్కడ చెన్నైలో ప్రోగ్రాం ఇవ్వడానికి  మనమే  ఆహ్వానించాము.

నమస్కారం  చేయి,” అన్నారు నాన్న నాతో.చేతులు జోడించి, నమస్కరించాను.

“పాప పేరుకు తగ్గట్టు కళకళ లాడిపోతుంది.  ఆసక్తి  ఉంటే, మంచి డాన్సర్ అవ్వచ్చు కూడా,” అంటూ ఆశీర్వదించారు ఆయన. నాన్న నాకోసం తన పక్కనే కుర్చీ వేయించారు.  మాస్టర్  నుండి  వాళ్ళు  చేయబోయే  ప్రోగ్రాము వివరాలు అడిగి  తెలుసుకొన్నారు.  కొంత  రాసుకున్నారు కూడా.

**

మాటలయ్యాక,  మాస్టారు  తన డాన్స్  స్టూడెంట్స్ ని  పిలిచాడు.  పది  మంది  ఉన్నారు.  డాన్స్ డ్రెస్సుల్లో బాగున్నారు.  ఒకబ్బాయి కృష్ణుడులా తయారయ్యాడు.

“వీరు మేజర్. సత్యదేవ్ గారు.  కళాపోషకులే  కాదు, కళాకారులు కూడా.   వారి కాలేజీ రోజుల్లోసినిమాల్లో నటించి, అప్పట్లో  కొన్నింటికి  సహకార  దర్శకత్వం  కూడా వహించారు.  ఇప్పుడు మాత్రం,  మంచి స్థాయిలో ఉన్న ఆర్మీ ఆఫీసర్.   ఇక్కడ చెన్నైలో ఆంధ్రసభ నిర్వాహకులు కూడా.  మనలని ప్రత్యేకంగా ఆహ్వానించి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేసారు.  ఈ అవకాశాన్నిచ్చి,  ఇంత  చక్కని  ‘వేదిక’ ని ఏర్పాటు చేసిన ఆయనకి నమస్కరించండి,”  అంటూ  వాళ్ళకినాన్న  గురించి  చెప్పాడాయన.

అదంతా విన్నాక, ‘నాన్న గురించి నాకు తెలియని  గొప్పతనాలు  ఇంకా ఉన్నాయన్న మాట’  అనుకున్నాను.  హ్యాపీగా  అనిపించింది. అందరూ నాన్నకి నమస్కరించారు.  కొందరు వచ్చి నాన్న పాదాలు తాకి మరీ నమస్కరించారు.

“పోతే, ఈ బంగారపు బొమ్మ, చంద్రకళ, వారి అమ్మాయి.  వాళ్ళమ్మ సంగీత విద్వాంసురాలు.  చంద్రకళ  ఇప్పుడు సంగీతం నేర్చుకుంటుంది,”  అంటూ నాగురించి కూడా చెప్పాడాయన.

నాకు సిగ్గనిపించింది.

**
నాకు తెలిసిన వాళ్ళంతా వచ్చారు ప్రోగ్రాంకి.  చిట్టెమ్మ మామి, భాను మామి, మాలిని. అంతా   అమ్మ పక్కనే కూర్చున్నారు.  అమ్మే  వాళ్ళని  ఇన్వైట్ చేసింది...

నన్ను చూస్తూ, ”నువ్వు బాగున్నావే డాన్సర్ లా,ఇవాళనువ్వు కూడా ఓ డాన్స్ చెయ్యి,” అంది భానుమామి. నాకు  ఒక్కసారిగా  సంతోషమనిపించి,   ‘ఔనా’ అనుకున్నాను.  నాన్న తప్పక  నాకు  స్టేజ్ మీద టైం ఇవ్వగలరు కూడా....అనిపించింది..కొంచెమాగి,  నిజంగానే అమ్మనడిగాను,  “నువ్వు ఏదైనా చిన్న పాట పాడు, నేను డాన్స్ చేస్తా,” అని...

“వీలు పడదు.  మరో సారి చూద్దాం,” అంది అమ్మ.

కాసేపు బాడ్  గాఫీల్ అయ్యాను..

**

ప్రోగ్రాం మొదలయ్యింది.  సినిమాల్లో  స్క్రీన్  మీద డాన్స్  చూసే దానికంటే, ఇలా దగ్గరినుండి చూడ్డం బాగుంది...ప్రోగ్రాం అంతా కళ్ళార్పకుండా చూసాను.  చూసింది  నాకు  వచ్చేసినట్టే  అనిపించింది. డాన్స్ ప్రోగ్రాం  లోని  ప్రతి ఐటెం ఒకదాని కంటే ఒకటి బాగనిపించింది.ఇప్పటివరకు చూసిన వాటిల్లో, తరంగం-  నెమలి డాన్స్- దశావతారములు- ఎంకి డాన్స్ నచ్చాయి. ఓ చిన్నమ్మాయి చేసిన ‘గోవర్ధన గిరిధారి’పాటకి డాన్స్ చాలా బాగుంది.  ఆ పాట అమ్మ తరచు పాడుతుంది.వాళ్ళ డాన్స్ పాటలు - శ్లోకాలు కొన్ని, అమ్మ పాడేవే.  గుర్తుపట్టాను.

‘డాన్స్ చేసిన ఆ చిన్నమ్మాయి లాగా, నేనూ బాగా చెయ్యగలను’ , ‘ఇకనుంచి  మ్యూజిక్  క్లాస్ లోఅమ్మఈ  పాట  పాడేప్పుడు , నేను  డాన్స్  చేసేయ్యాల్సిందే’  అనుకున్నాను.

ప్రోగ్రాం ముగిసాక, మంచి  ప్రోగ్రాం  ఏర్పాటు  చేసారని,  అందరూ నాన్నని  మెచ్చుకున్నారు.

**

ఇంటికొచ్చేప్పుడు,  కారులో  బాబు ‘ఆకలి’ అంటూ గొడవ చేసాడు.ఎప్పుడో ప్రోగ్రాముకి ముందు,  క్లబ్బులో,  లైట్ స్నాక్  సర్వ్  చేసారు.  అప్పుడు తినడమే.  డాన్స్ చూసినంత సేపు మాత్రం నాకు ఆకలి కూడా తెలియలేదు.

**

ఇంటికొచ్చాక  భోంచేస్తూ, “వేదిక” అంటే  ఏమిటి?  వేదిక  మీదే చెయ్యాలా డాన్స్?” అడిగాను అమ్మని.

“డాన్స్  ప్రదర్శనకి,  ఆచారబద్దంగా,  అంటే  పద్దతిగా ఏర్పాటయిన ఎత్తైన ఓ ‘స్టేజ్’ అన్నమాట.  నాట్యం  చేసేవాళ్ళకి  ‘వేదిక’  లేదా ‘రంగస్థలం’ అంటే  దేవాలయమంత  పవిత్రం.  అందుకే  వేదికని  చేతులతో  అంటి, కళ్ళకద్దుకొని  ప్రదర్శన  మొదలుపెడతారు,” అంది అమ్మ.

నాకిష్టమైన మష్రూమ్ కర్రీ వడ్డిస్తూ, “మామీ అడిగింది కదాని, ఏదో ఒకలా అందరి ముందు డాన్స్ చేసేస్తానని అనకూడదు...తెలిసిందా? అంది అమ్మ నా తలపై చేయి వేసి...

“అలా ‘వేదిక’ల  మీద  నాట్యం  చెయ్యాలంటే,  ముందు  గురువు వద్ద  నేర్చుకొని,  ప్రాక్టీసు చెయ్యాలి,”  అంది నవ్వుతూ,,,

**

కిచెన్ లో నుండి అమ్మ మాటలు వినబడుతున్నాయి. పొద్దున్నే పనిపిల్ల కామాక్షిని సూపర్ మార్కెట్ కి పంపుతున్నట్టుంది.అలాగే కిచెన్ నుండి వస్తున్న ఘుమఘుమ వాసనలని బట్టి, అమ్మ ఇవాళ ఫ్రెంచ్– టోస్ట్  చేస్తుందని తెలుస్తుంది.  ఫ్రెంచ్– టోస్ట్  తో ..తప్పకుండా పుడ్డింగ్ కూడా చేస్తుంది.  స్నానం చేసి త్వరగా బయటపడాలని...బెడ్ మీద నుండి లేచాను...

**

స్నానమయి, తయారయి, దేవుడికి దణ్ణం పెట్టుకునే లోగానే,  బాబుని  తీసుకొని  బ్రేక్ఫాస్ట్ కి రమ్మని  పిలిచింది  అమ్మ.  కార్టూన్స్  చూస్తున్న  బాబుని  పిలిచి  డైనింగ్  టేబిల్ వద్దకు వెళ్లి  కూర్చున్నాను.

పుడ్డింగ్ కప్ నా ముందుంచుతూ,  “నీకు ఇవ్వాల్టి నుంచి ఓ చక్కని డాన్స్ నేర్పిస్తాను. అది నా చిన్నపుడు నేను చేసిన డాన్స్.  మంచి పాట కూడా.  సమ్మర్  కదా! నేర్చుకుని ప్రాక్టీస్ చేయి.  నా మ్యూజిక్ క్లాస్ మొదలయ్యే ముందు, రోజూ ఓ అరగంట  ప్రాక్టీసు  చేద్దాము,” అంది అమ్మ.

వెంటనే  కుర్చీ దిగి, “లవ్ యు అమ్మ,”  అంటూ అమ్మని హగ్చేసాను.

**

‘ఆధరం  మధురం వదనం మధురం
నయనం మధురం, హసితం మధురం
హృదయం మధురం, గమనం మధురం
మధురాధిపతే, అఖిలం మధురం....’

నాకిష్టమైన పాటే.  అది అమ్మ పాడుతుండగా నేను విన్న పాటే, వినీ వినీ నాకు వచ్చును కూడా! ఆ పాటకే - మీనింగ్స్ చెబుతూ,  డాన్స్ నేర్పడం  మొదలు పెట్టింది అమ్మ.

....’శ్రీ కృష్ణుని అందాలు, నడకలు, నవ్వులు ఎంతో మధురంఅంటూ మొదలవుతాయి ఆ పాటలోని అర్ధాలు.... ....

**

మరో మూడు వారాలకి,  “నీకు ఒక డాన్స్ వచ్చేసినట్టే.  బాగుంది,”  అని  అమ్మ అన్నాకే, “మరి మ్యూజిక్ క్లాస్ లో అందరి ఎదుటా చెయ్యవచ్చా?”  అని అడిగాను.

“బేషుగ్గా!  రేపే  మ్యూజిక్  క్లాస్  అయి, అందరూ వెళ్ళే ముందు  చెయ్యి,”...అంది అమ్మ...

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasini pattistE koti