Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ: డిన్నర్ కి హోటల్ కి నల్ల, తెల్ల డ్రస్సులతో వచ్చి ఒకే ప్లేటు లో రెండు స్పూనులతో భోంచేస్తున్న హీరో హీరోయిన్లను అందరూ ఆశ్చర్యం తో చూస్తుంటారు... ఆ తరువాత...  

జెన్బా వచ్చేం. స్టేషన్లో అక్కడా ఉన్నారు జనం. స్టేషనుకెదురుగా ఎత్తయిన కొండలు ఎంత అద్భుతం అనిపించేలా, ఆ కొండల మీద అక్కడా అక్కడా ఇళ్ళు.

జెన్బా స్టేషన్ని ఆన్చి ఒక పాతకాలం నాటి రైల్వే స్టేషను కనిపించింది. కాస్సేపటికి దూరంగా కనిపిస్తున్న కొండ మధ్యలోంచి ఒక బొగ్గు ఇంజను రెండు ఎర్రటి కంపార్ట్ మెంట్లని లాక్కొచ్చింది. దాన్నిండా టూరిస్టులు.

షూటింగ్ మొదలైంది.

జార్జి ప్రసాద్, యోగి, మిగతా అంతా ఆ పాతకాలం స్టేషను పక్కన బారుంటే అందులో కెళ్ళి కూర్చున్నారు. హెర్బల్ బీరట అది ఆర్డర్ చేసేడు వేణు గారు.

టూరిస్టులని ఎక్కించుకుని ఈ ట్రెయినెటు వెళ్తుందీ..? అనడిగాడు.

“ఆకెన్సీ” అన్నాడు.

“ఈ కొండకి అవతల పక్క ఇక్కడ షూటింగ్ అయ్యాకా మేం షిఫ్టయ్యేది అటే, మీరు సరదాగా ఈ ట్రెయినెక్కి వచ్చేయ్యగూడదూ..?” అన్నాడు జార్జి ప్రసాదు.

“మీరెళ్తే నేనూ వస్తాను” అన్నాడు గోవిందు. “నేను కూడా” అన్నాడు చందర్రావు.

అరవై యూరోలు తీసుకుని నలుగురికి టిక్కెట్లు కొనుక్కొచ్చాడు డ్రైవర్ ఉల్ఫీ. ఆ టిక్కెట్లు పాతకాలం నాటివి. చిన్న చిన్న అట్టముక్కల్లాగున్నాయి.

మా నలుగురికీ కాస్త దూరంగా ఒక ముసలాయన కూర్చున్నాడు. బాగా వయసైన మనిషి పైన జర్కిన్ లోపల స్వెట్టర్. ఇంకా లోపల షర్టూ, బాగా లోపల బనియన్ వేసుకున్నాడు. తల మీద హేట్ ఉంది. షూ లేసులు గట్టిగా బిగించాడు. కట్టుడు పళ్ళు ఒక సారి తీసి మళ్ళీ పెట్టుకున్నాడు. ఈలోగా ఒక ప్రేమ జంట చేరింది. మాటాడ్తే చాలు ముద్దులు పెట్టేసుకుంటున్నారు వాళ్ళు.

ఓ రెండు పెట్టెల నిండా జనం నిండాకా మరి బయల్దేరింది రైలు. పాత కాలం గటప్ లో వచ్చిన టిక్కెట్ కలెక్టర్ పంచ్ చేస్తున్నాడు.పైన ఉడ్ ఫ్లాంటేషన్సూ, ఏపిల్ తోటలూ దాటుకుంటూ కొండ పైకి ఎక్కుతున్న రైలు బండి. పోను పోను అడవిలోకి చొచ్చుకుని పోవడంతో గాలి చల్లగా వీస్తుంది. ఆ అడివిలో చిన్న చిన్న దారులు కనిపించాయి. ఒక చోట నల్లటి వేన్ లో కూర్చున్న ఇద్దరు అందమైన అమ్మాయిలు పెట్లో ఉన్న అందర్నీ చూసి చేతులూపారు.

“ఎలాగుందండీ వాతావరణం..?” గోవిందునడిగాడు యోగి.

“చాలా గొప్పగా ఉందండి. నాకయితే రెండు కళ్ళు చాలడం లేదు” అన్నాడు గోవిందు.

మరి నన్నడగరేం అన్నట్టు చూసిన చూసిన చందర్రావుని “మీకెలాగుంది..?” అన్నాడు.

“మా రాజమండ్రి దగ్గర కడియం రైల్వే ట్రాక్ పక్కన కూడా ఇలాగే పచ్చగా ఉంటది” అన్నాడు.

నలభై అయిదు నిమిషాలకి ఈబెన్ స్టేషన్లో కొచ్చాగింది రైలు. కౌబాయ్ సిమిల్లో రైల్వే స్టేషన్లాగుందది. అంతలో ఎదురుగా వస్తున్న ఇంకో రైలు దీనికెదురుగా వచ్చి ఆగింది. వీళ్ళక్కిన ట్రైన్ ఇంజన్ ఈ స్టేషన్ దాకా వెనకాల ఉంది. దాన్ని డీలింగ్ చేసి ముందుకి తగిలించారు.ట్రైను ముందుకి కదిలింది.

మూవ్ రాక్ స్టేషను రాగానే కూర్చున్న ముసలాయనా, ప్రేమికులూ దిగిపోయారు. టికెట్ కలెక్టరొచ్చి టిక్కెట్లు చూసి నెక్ట్స్ స్టేషన్లో దిగాలి మీరు అని చెప్పి వెళ్ళిపోయాడు.

రైలు మళ్ళీ కదిలింది.

వెళ్తున్న రైలుకి ఎడం పక్కన రోడ్డు మైదానాల్లో అక్కడక్కడా అందమైన ఇళ్ళు. రైలు ఇంకొంచెం ముందుకెళ్ళగానే కళ్ళు చెదిరిపోయేంత అందమైన లేక్. “ఆకెన్సీలేక్” అంటే అదేనట. ఆ లేక్ లో కట్టబడి ఉన్న ఒకే ఒక అందమైన ఇల్లు. దాని మీద తివాగ్ (TIWAG) అని రాసుంది.

ఏంటింత పచ్చగా ఉంది ఎక్కడైనా ఏ ఎండిన చెట్టన్నా ఉంటే బాగుడ్ను అనిపించేంత పచ్చదనం, నీలం ఆకాశం, చల్లగా వీస్తున్న గాలి. మొత్తానికి అద్భుతం అనిపించే వాతారణం బాగుంది.

ఆ ప్రాచీనమైన స్టేషన్లో బెంచీ మీద ఒంటరిగా కూర్చుని వయోలిన్ వాయించుకుంటున్నట్టు ఫీలై అటు పక్కకి పరుగెడ్తున్న వాడల్లా రైలు కదలడంతో వెనక్కొచ్చేశాడు.

ట్రైన్ ఇంజన్ మళ్ళీ వెనక్కి మార్చారు.

మధ్యాహ్నం 2:35 అయ్యింది. అఖరి స్టేషన్ కి చేరాక వేణుకి ఫోన్ చేశారు. మీరు దిగిన స్టేషన్నుంచి మూడు కిలోమీటర్ల దూరం నడిచి రండి. ఈ లోగా అక్కడికి నేనొచ్చేస్తా అన్నాడు వేణు.

మెయిన్ రోడ్ లో కార్లు పక్కనే కొంచెం కింద సైకిళ్ళ దారి, పక్కనే కాలి బాట. కుడి పక్క నీలం నీళ్ళతో లేక్. దాని మధ్యలో డబల్ డెక్కర్, మొత్తం లేక్ అంతా తిప్పుతుంది. పది యూరోలంట.

నడుచుకుంటూ ముందుకెళ్తున్న వీళ్ళకి టెలిపోన్ బూత్ కనిపించే సరికి ఆగిపోయిన్ చందర్రావు ఒక్క నిమిషమండి, ఊరికి ఫోను మాటాడుకోవాలని వెళ్ళి జేబులో ఉన్న కార్డు ఫోన్ కింద గేప్ లోకి తోసి నెంబర్ డయల్ చేసేసి కాస్సేపయ్యాకా “హలో... హలో ఏవండీ హలో ఇండియా అండీ..? నేను... జర్మనీ అవతల ఆస్ట్రియాలో ఈ ఊరి పేరేంట్రా గోవిందూ, ఈడికి తెలీదంటండీ. హలో ఇండియా అండీ...? ఇండియా కాదు రాజమండ్రి అంటారా..., నాకదే కావాల్రా రంకు మొగుడా... ఎవరూ ఒరే అబ్బిగా ఒరే ఎదవా నేన్రా మీ నాన్నని ఫారన్నించిరా... ఏంటీ రాంగ్ నంబరా..? మరిందాకట్నించీ చెప్పవేరా ఎదవా” అనేలోపు కార్డయిపోయింది.

“ఇంత తొందరగా అయిపోయిందేంటి...? ఖర్మ ఏం ఫారినో ఏం గోలో” అని తిట్టుకుంటుండగా నీలం రంగు కారు నడుపుకుంటూ వచ్చిన వేణు వీళ్ళని ఎక్కించుకుని లేక్ కి అవతల పక్కకి తీసుకెళ్ళాడు. షూటింగ్ అక్కడ జరుగుతుంది.

స్టాంపింగ్ కోసమొచ్చిన వేణుగారి మనిషి రాజశేఖర్రెడ్డి భోజనాలు పెట్టాడు. ఆ రోజు శనివారం పాతికేళ్ళ నించి ఆ పూట వెజిటేరియన్ తిని రాత్రి ఉపవాసం ఉంటున్న జీవన్ ఆ రోజు నాన్ వెజిటేరియన్ తినాల్సి వచ్చింది. వేరే ఏం లేవు వాళ్ళ దగ్గర.నీలం రంగు కారు చెట్టు కింద ఆపి సీటు వెనక్కి లాక్కున్న వేణుగారు నిద్రపోతున్నారు. జ్వరం వచ్చిందట. అటు చూస్తే హైదరాబాదు ఫోన్లు మాటాడుకుంటున్నాడు యోగి.ఓ గంట తర్వాత లేచిన వేణు వీళ్ళని తీసుకుని బయలుదేరాడు. దారో హాల్ అని ఒక ఏరు తగిలింది. అది హిస్టారికల్ ప్లేసట. దాని హిస్టరీని తర్వాత చెపుతానన్నాడు వేణు.

“ఏవండీ వేణు గారూ, ఆ సందీపూ, ప్రణయ్ తో పాటు ఇంకో ముగ్గురొచ్చారు మనతో వీళ్ళెవరూ సినిమా ఫీల్డుకి సంబంధించిన వాళ్ళు కాదు. మాతో పాటు ఎందుకొచ్చేరు అనడిగితే స్టాంపింగ్ కోసం అనంటున్నారు. ఏంటది..?” అనడిగాడు యోగి.

“అదా... వాళ్ళంతా ఎంబిఏ చేసిన మనుషులు అమెరికా వీసా ఈజీగా వస్తుంది. అందుకని వాళ్ళ సొంత ఖర్చులతో మనతో పాటొస్తుంటారు..... ఇలాగ ట్రిప్పుకి ఒకో బేచ్ వస్తుంటారు” అన్నాడు వేణు.

“మీకెలా తెల్సు వీళ్ళంతా..?”

“మా ఫ్రెండ్స్ ద్వారానో, బంధువుల ద్వారానో వస్తుంటారు.”

సాయంత్రం అయిదు గంటల ప్రాంతంలో ఏగ్జమ్స్ వచ్చాం.

అక్టోబర్ – 9

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika