Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

ఇంతలో కిచెన్ లోంచి ఒక నడి వయస్సు స్త్రీ బయటికొచ్చింది. ముఖాన బొట్టు లేదు. విభూది వుంది. చూడగానే నమస్కరించాలన్పించేంత పొందికైన రూపం. ఆమెలో విశాల పోలికలు కన్పిస్తున్నాయి. ‘‘మా అమ్మగారు’’ పరిచయం చేసింది విశాల. ‘‘నమస్తే ఆన్టీ’’ అంటూ నమస్కరించాడు విరాట్.

‘‘నమస్తే బాబూ... అర్ధమై పోయింది. విరాట్... నువ్వే కదూ?’’ అంది నవ్వుతూ ఆమె.

‘‘కరక్ట్ గా వూహించావ్ మమ్మీ’’ అంది ఉత్సాహంగా విశాల.

‘‘ఇందులో వూహించటానికేముంది? నువ్వు చేయి పట్టి తీసుకొస్తున్నావంటే విరాట్ గాక ఎవరై ఉంటారు. ఆ పైన నువ్వు నా ముందు పొగిడిదాని కన్నా అబ్బాయి చాలా రెట్లు బాగున్నాడు. పదండి. కాస్సేపట్లో వస్తాను’’ అందావిడ.

విశాల తన గురించి తల్లితో కూడ చెప్పేసిందని విరాట్ కి అర్ధమైంది. విరాట్ ని మెట్ల మీదుగా మేడ మీది తన బెడ్ రూమ్ కి తీసుకెళ్తూ ` ‘‘డాడీ లేరు. నాకు మా మమ్మీకి నేను తప్ప మా కెవ్వరూ లేరు. బంధువులు చాలా మంది ఉన్నారట. కాని ఎవరూ రారు. ఎవరెక్కడున్నారో కూడా మాకు తెలీదు. ఎందుకంటే మా మమ్మీ డాడీలది లవ్ మేరేజ్.  ఇరు తరుపు వాళ్ళు అంగీకరించక పోవటంతో ఒంటరిగా చెన్నై వచ్చి ఇక్కడ సెటలయ్యారు’’ అంది.

విరాట్ కు తమ ఇల్లంతా తిప్పి చూపించింది విశాల. ఎక్కడ చూసినా ఖరీధైన ఫర్నిచర్ తో నీట్ గా అందంగా వుంది ఇల్లు.

వచ్చే ముందు..

ఎలాగయినా విశాలకు నచ్చ చెప్పి తనను మర్చి పొమ్మని మనుసు మార్చాలని వచ్చాడు.

విశాలకు తండ్రి లేడు.

తల్లి కాంచన మాల తను యిద్దరే ఒకరి కొకరు తోడుగా వుంటున్నారు. ఇప్పుడు తను కాదంటే ఆ బాధలో విశాల అఘాయిత్యం చేసుకుంటే... ‘‘ఏమిటాలోచిస్తున్నావ్?’’ అడిగింది విశాల.

‘‘ఏం లేదు’’

‘‘నేను అందంగా లేనా?’’ అడిగింది.

‘‘ఎవరన్నారు? చాలా అందంగా వున్నావ్’’

‘‘చాలా అంటే.... ’’

‘‘నీ పుట్టిన రోజుకి వేరే ఎవరినీ పిలవ లేదా? మీ స్టాఫ్ ని గా ని ఫ్రెండ్స్ ని గానీ’ ’అడిగాడు.

‘‘లేదు’’ అంది విశాల.

‘‘చెప్పాగా. నువ్వొస్తానంటే నే పుట్టిన రోజు లేదంటే లేదు. నువ్వొస్తే అంతా వచ్చినట్టే. స్టాఫ్ ని కూడ ఎవరినీ పిలవ లేదు. కాని ఉదయం అందరికీ స్వీట్లు పంచి ఒక నెల జీతం బోనస్ గా ఇచ్చాను.

‘‘మంచి పని చేసావ్,  ఓకె కేక్ కట్ చేస్తే ఓ పనయి పోతుందిగా. మీ మమ్మీని పిలు’’ అన్నాడు విరాట్.

‘‘ఏంటి? అప్పుడే వెళ్ళి పోదామనా?’’ అంది నిష్టూరంగా విశాల.

‘‘ఈ పూట నాతో ఉంటున్నావ్. మనం బయటి కెళ్తున్నాం’’

‘‘ ఎక్కడికి ’’

‘‘ చెప్తాగా. ఇప్పుడే వస్తాను’’ అంటూ వెళ్ళింది విశాల.  కాస్సేపటికి విశాల వెంట తల్లి కాంచన మాల, ఇంటి నౌకర్లు పని వాళ్ళు ఓ ఆరుగురు అంతా వచ్చారు.

టేబుల్ ని గది మధ్యకు లాగి. కేక్ బాక్స్ మీద మూత తీసి టేబుల్  మధ్య ఉంచారు. కేకు మధ్యన లోటస్ కొవ్వొత్తి ఉంచ బడిన్ది. విరాట్ కొవ్వొత్తి వెలిగించాడు. క్షణాల్లో స్లో గా పద్మం వికసిస్తున్నట్టు లోటస్ రేకులు విచ్చుకున్నాయి. కొవ్వొత్తి ప్రకాశంగా వెలగ సాగింది.‘‘ఏంటీ అంతా సైలంట్ గా వున్నారు? హేపీ బర్త్ డే చెప్పరా?’ అని నవ్వుతూ ముందుగా విరాట్  ‘‘హేపీ బర్త్ డే టూ యూ....’’అన్నాడు. అతడితో శృతి కలిపారంతా.

‘‘హేపీ బర్త్ డే టూ యూ విశాలా!’’ అనగానే హాలు చప్పట్లతో మారు మోగింది. ఆ ఆనందం మధ్య విశాల ముఖం పువ్వులా వెలిగిపోతుండగా కొవ్వొత్తి ఊది. చాకుతో కేక్ ని ముక్కలుగా కట్ చేసింది. ఒక ముక్కను తీసి విశాల నోటికి అందించాడు విరాట్. విశాల మరో ముక్కను తీసి విరాట్ నోటికి అందించబోతుంటే వారించాడు విరాట్. ‘‘ప్రత్యక్ష దైవం మమ్మీ. ముందు మమ్మీ’’ అన్నాడు. ఆ మాటతో పెద్దావిడ ముఖం మరింత ప్రసన్నమైంది. విశాల తన తల్లికి కేక్ తినిపించాక విరాట్ కి అందించింది. తర్వాత మిగిలిన కేక్ ను పని వాళ్ళకు పంచింది.

‘‘త్వరగా మీరు వస్తే పాయసం తీసుకుందురు గాని’’ అని చెప్పి ముందుగా ఆవిడ, వెనకే పని వాళ్ళు అంతా వెళ్ళి పోయారు. ఇప్పుడక్కడ విరాట్ విశాల యిద్దరే మిగిలారు. విరాట్ జేబులోంచి చిన్న ప్లాస్టిక్ బాక్స్ ను తీసి విశాల చేతిలో వుంచాడు. ‘‘ఏంటది?’’ అడిగింది విశాల.‘‘నీ  పుట్టిన రోజుకి నా స్మాల్ గిఫ్ట్’’ అన్నాడు.

బాక్స్ తెరిచి చూసింది విశాల. లోన అందమైన గోల్డ్ డైమండ్ రింగ్ వుంది.

విశాల సంతోషంగా చూసింది.

‘‘చేతికివ్వటం కాదు నువ్వే వేలికి తొడుగు’’ అంది.

ముచ్చట పడుతోందని బాక్స్ లోంచి రింగ్ తీసి ఆమె ఉంగరం వేలికి తొడిగాడు. పొడవుగా అందంగా వుండే ఆమె చేతి వేళ్ళకు మరింత కళ వచ్చింది. వెంటనే తన మద్య వేలు గోల్డ్ రింగ్ తీసి విరాట్ చేయి అందుకుని అతడి ఉంగరం వేలికి తొడిగింది విశాల.‘‘విశాల నాకు నగలంటే ఇష్టం వుండదు’’ అంటూ విరాట్ తీసేయ బోతే వారించింది విశాల.

‘‘నీకు ఇష్టం లేక పోయినా ఇది నువ్వు తీయ కూడదు. ఎందుకో తెలుసా? మనకి సగం పెళ్ళి అయి పోయినట్టే’’ అంటూ అందంగా నవ్వింది.ఉలికి పడ్డాడు విరాట్.

‘‘విశాలా జోక్ చేయకు. వెళ్ళేమిటి?’’ అన్నాడు.

‘‘ఏమిటో ఇంకా అర్ధం కాలేదా? నిశ్చితార్ధం నాడు వధూ వరుల చేత ఉంగరాలు మార్పిస్తారు ఎందుకు? సగం పెళ్ళి అయినట్టే అని. అలాగే క్రిస్టియన్లు ఉంగరాలు మార్చుకొని పెళ్ళి చేసుకుంటారు. ఇప్పుడు మనం చేసిందేమిటి? ఉంగరాలు మార్చుకున్నాం. దీన్నేమంటారు? పెళ్ళి కాదా?’’ అంటూ విశాల తన భుజం మీద వాలి పోతుంటే అప్పటిగ్గాని లాజిక్కు విరాట్ కి అర్ధం కాలేదు.

తనేదో సింపుల్ గా ఉంటుందని గిఫ్ట్ గా ఉంగరం తెస్తే తెలివిగా ఉంగరాలు మార్పించి తనను బంధీ చేసింది విశాల. ‘‘నువ్వు చాలా తెలివైన దానివి’’ అంటూ నవ్వాడు.

‘‘నీ కన్నా కాదులే. ఈ ఉంగరాలు ఎప్పుడూ చేతినుండాల్సిందే. తీయకూడదు. ప్రామిస్ చెయ్?’’

‘‘ఒకె తీయన్లే. పద కిందకు వెళ్దాం’’ అన్నాడు.

ఇద్దరూ కిందకు వచ్చే సరికి వేడి గారెలు వేడి వేడి పాయసం సిద్దంగా ఉంచింది కాంచన మాల. చెరో రెండు గారెలు తిని పాయసం తాగారు.‘‘మనిద్దరం కలిసి నా పుట్టిన రోజున గుడికి వస్తానని వడపళని మురుగన్ కి మొక్కుకున్నాను. కాదంటే కుదరదు. బైక్ ఇక్కడే ఉంచు. నా కార్లో వెళ్తున్నాం’’ అంది విశాల.

ఇష్టం లేక పోయినా.తప్పదనుకొంటూ...కారు స్టార్ట్ చేసాడు విరాట్.అప్పటికి టైం సాయంత్రం ఆరు గంటలు దాటింది.

* * * * * * *                                * * * * * * *                            * * * * * * *                             * * * * * * *

షాపింగ్ మాల్ లో పర్మిషన్ తీసు కొని ఆరు గంటలకే డ్యూటీ దిగి బయటకొచ్చేసింది సహస్ర. చాలా రోజులయింది మనసు బాగుండటం లేదు. సాయంత్రం గుడికి వెళ్ళాలని ఉదయమే అనుకుంది. సరిగ్గా సమయానికి దీక్ష ఎక్కడికో వెళ్ళింది. మూడు గంటలకి వెళ్ళే ముందు ఫోన్ చేసి చెప్పింది. నా కోసం చూడొద్దు. లేటవచ్చు. ఇంటి కొచ్చేస్తాను. నువ్వు స్కూటీ మీద వచ్చేయ్ అంది. ఎక్కడికో ఎందుకో చెప్పలేదు.తన అనుమానం కరక్టయితే...

ఇది చందూ వద్దకి వెళ్ళుండాలి. అయితే మాత్రం తనకి భయమా? ఒక్కతే గుడికి వెళ్ళి రాలేదా? దీక్ష పక్కన లేదని...గుడికెళ్ళటం వాయిదా వేసుకోవాలా? స్కూటీ స్టార్ట్ చేసుకొని బయలు దేరింది సహస్ర. కాని ఎంత వద్దనుకున్నా మనసు విరాట్ వైపు పరుగులు తీస్తుంది.విరాట్ ఎందుకిలా చేసాడు?

విశాల ఎవరు?

ఆమెతో నిజంగా స్నేహమా?

లేక విశాలనూ ప్రేమిస్తున్నాడా?

వయసులోని ఆడ మగ సాన్నిహిత్యాన్ని

కేవలం స్నేహమంటే ఎలా నమ్మటం?

ఇంత జరిగినా విరాట్ మీది ఆలోచనలతో రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టడం లేదు. తనే అనవసరంగా తొందర పడిన్దా? తన కోసం చాలా సార్లు ఫోన్ చేసాడు. తనే అహం అడ్డొచ్చి ఫోనెత్త లేదు. ఈ సమస్యకి త్వరగా ఓ పరిష్కారం చూడకపోతే పిచ్చెక్కేలా వుంది. గుడికెళ్ళొస్తే మనసు కాస్త ప్రశాంతమవుతుందేమో?

అర్కాట్ రోడ్ లోకి సహస్ర స్కూటీ ఎంటరయ్యే సరికే చీకటి పడి వీధి దీపాలు వెలిగాయి. సరాసరి వడపళని చేరుకొని స్కూటిని గుడి వీధిలోకి పోనిచ్చింది.

వీధిలోకి ఎంటర్ కాగానే...

అంత దూరంలో అద్భుతమైన షణ్ముఖుని ఆలయ గోపురం దర్శనమిచ్చింది. గోపురంపైన ఓం శరవణ భవ అనే అక్షరాలతో బాటు కుమారస్వామి వేలాయుధం గుర్తు విధ్యుద్దీపాలతో వెలిగి ఆరి పోతూ కను విందు చేస్తున్నాయి.విద్యుద్దీప కాంతులతో...గుడి వీధి అంతా పట్ట పగల్లా వుంది.వీధికి అటు యిటు అనేక పూల అంగళ్ళు, అరటి పళ్ళు కొబ్బరి కాయలు అంగళ్ళు ఉన్నాయి. పూల పరిమళాలతో బాటు గంధం పన్నీరు అగరు వాసనలు వీధిలో షికారు చేస్తున్న భక్తుల మనసుల్ని పవరశింప చేస్తున్నాయి.భక్తుల రద్దీ సాధారణంగా వుందినెమ్మదిగా స్కూటీని గుడి దరిదాపుల వరకు పోనిచ్చింది సహస్ర. పార్కింగ్ ఇంకాస్త దూరంలో వుందనగా అంతలో వూహించని ఒక దృశ్యం కంట బడిన్ది.అంతేబ్రేక్ వేసి ఉన్న చోటే స్కూటీని ఆపేసింది.విశాల పుట్టిన రోజు సందర్భంగా గుడికి వచ్చిన విశాల విరాట్ లు సరిగ్గా అప్పుడే బయటి కొస్తున్నారు. నూతన వధూ వరుల్లా బయటి కొస్తున్నఆ జంటను చూడగానే సహస్రకు వళ్ళంతా భగ్గుమన్నట్టయింది. కోపం దుఖం నిస్సహాయత అన్నీ ముప్పేట దాడి చేస్తుండగా అలా చూస్తూండి పోయింది.

విశాల చేతి మీద స్వామికి వేసి తీసిన పూమాల వుంది. రెండో చేతిలో ప్రసాదం పూజా ద్రవ్యాలతో కూడిన వెండి సజ్జ ఉంది. ఇద్దరూ కబుర్లు చెప్పుకొంటూ నవ్వుకొంటూ తమ కారు వద్ద కొచ్చారు. విశాల కారు డోర్ తెరిచి పూల సజ్జను లోన సీట్లో ఉంచింది. పూల మాలను తీసుకెళ్ళి కారు ముందు భాగంలో అలంకరించింది. విరాట్ డ్రైవింగ్ సీట్లో కూచోబోతూ ఆగాడు.

తనకు అత్యంత సన్నిహితులైన ఎవరో తమను గమనిస్తున్న ఫీలింగ్... తనకు తెలీకుండానే మనసు కలత చెందుతోంది. ఏమైంది అనుకుంటూ యధాలాపంగా ఎదురుగా రోడ్ అవతలకు చూసి షాకయ్యాడు.

అంత దూరంలో స్కూటీ ఆగుంది...

అది దీక్ష స్కూటీ...

దాని మీద బురఖాలో ఓ అమ్మాయి ఇటే చూస్తోంది. కళ్ళు మాత్రం కన్పిస్తున్నాయి. ఎంత దూరంలో ఉన్నా ఆ సోగ కనులు తనకు గుర్తే. ఆమె సహస్ర. వెంట దీక్ష వచ్చిందో లేదో తెలీదు. బహుశ సహస్ర కూడ గుడికి వచ్చుండాలి. ఖర్మ గాక పోతే తనూ ఇప్పుడే రావాలా?‘‘ఏమైంది?’’ అచేతనంగా నిలబడి ఎటో చూస్తున్న విరాట్  భుజం తట్టి ఆడిగింది విశాల.

‘‘నువ్విక్కడే ఉండు. ఇప్పుడే వస్తాను’’ అంటూ అడ్డు వస్తున్న వెహికిల్స్ ను జనాన్ని తప్పించుకొంటూ సహస్ర స్కూటీ వైపు కదిలాడు.సహస్రకు దుఖ్ఖం ముంచుకొస్తోంది.

ప్రాణాధికమైన తన సొత్తును...

బలవంతంగా ఎవరో లాగేసుకున్న ఫీలింగ్.

విశాల మీద అసూయతో

గుండెలు మండి పోతున్నాయి...

కళ్ళు జల పాతాల్లా వర్షిస్తున్నాయి...

విరాట్ తన వైపు రావటం చూడగానే సహస్ర గుడికి వెళ్ళే ఆలోచన విరమించుకుంది. స్కూటీ ని వెనక్కి తిప్పింది. వెనక నుంచి విరాట్ పిలుస్తున్నా పట్టించు కోకుండా వెళ్ళిపోయింది వేగంగా.

హతాశుడై అటే చూస్తూ...

అక్కడే నిలబడిపోయాడు విరాట్...

వూహకు అందని సంఘటన ఇది...

అసలే విశాల విషయంలో మండి పోతుందంటే సరిగ్గా సరైన చోట తన కంట్లోనే పడాలా యిద్దరూ? అసలీం టైమ్ కి సహస్ర అక్కడి కెలా వచ్చిందో అర్ధం కాలేదు. పోనీ తమ కారుని ఫాలో చేసి వచ్చిందా అంటే........ ఛాన్సే లేదు. ఓల్డ్ మంబళం నుండి వడపళని రూట్ వేరు, లజ్ కార్నర్ నుంచి రూట్ వేరు, దారిలో తమ కారుని చూసే అవకాశం లేదు, అనుకోకుండానే తనూ గుడికి వచ్చుంటుంది తనని చూడగానే కోపంతో వెనక్కి వెళ్ళిపోయింది. అయితే విశాల సహస్రను గమనించ లేదు. అందుకే పక్కకొచ్చి ‘‘ఏమైంది?’’ అంటూ భుజం మీద చెయ్యేసింది.

విరాట్ కి కోపం నవ్వు అసహనం కాస్సేపు ఉక్కిరి బిక్కిరి చేసాయి.

‘‘పద వెళ్దాం’’ అంటూ వెను తిరిగాడు.

‘‘ఏమైందంటున్నాగా’’ కారు వద్ద కొస్తూ అడిగింది.

‘‘సహస్ర మనల్ని చూసేసింది’’ కారు డోర్ తెరుస్తూ చెప్పాడు.

ఆ మాటతో ఉలికి పడి చుట్టూ చూస్తూ...

‘‘ఎక్కడ?’’ అంది.

‘‘మనల్ని చూసి కోపంతో పిలుస్తున్నా వినకుండా వెళ్ళిపోయింది. డ్రైవింగ్ సీట్లో కూచొని డోర్ మూసాడు. వచ్చి అతని పక్కన కూచుంది విశాల.

‘‘సారీ విరాట్’’ అంది బాధ పడుతూ.

‘‘ఏయ్ నువ్వెందుకు బాధ పడతావ్? తను అర్ధం చేసుకోడానికి ఇంకా కొంత టైమ్ పడుతుంది’’ అంటూ కారు స్టార్ట్  చేసాడు.నెమ్మదిగా ముందుకు కదిలింది కారు.

‘‘పోనీ నేనోసారి వచ్చి సహస్రతో మాట్లాడనా?’’ అంది.

‘‘వద్దు, అలాంటి పిచ్చి పని చేయకు. ఈ సమస్యకు నువ్వు దూరంగా వుండు. సహస్ర ఎవరో నీకింకా తెలీదు’’ అంటూ తన సెల్ అందుకుని చందూకి ఫోన్ చేసాడు.

పది సెకన్ల తర్వాత.

అవతల ఫోన్ లిఫ్ట్ చేసాడు చందూ.

‘‘ఏరా.... ఎక్కడున్నావ్?’’ అడిగాడు.

‘‘ఇప్పుడే, దీక్షనింటి దగ్గర దించి మనింటి కొస్తున్నాను. పార్ధ సారధి గుడిలో కొత్త బైక్ కి పూజలు చేయించి అటు నుంచి అటే మెరీనా బీచ్ కెళ్ళి కాస్సేపు కూచొని వచ్చేసాం. ఇంతకీ నువ్వెక్కడున్నావ్?’’

‘‘పడపళని కోవెల దగ్గర్నుంచి ఇప్పుడే బయలుదేరాం, విశాల పుట్టిన రోజని గుడికి వచ్చాం. అనుకోకుండా ఇక్కడ మా యిద్దర్నీసహస్ర చూసేసింది. పిలుస్తున్నా విన్పించు కోకుండా గుడిలోకి వెళ్ళకుండా వెనక్కి వెళ్ళి పోయింది’’

‘‘పడక పడక మళ్ళీ తన కంటపడ్డారా! ఏమిట్రా మీ పరిస్థితి ఏమీ అర్ధం గావటం లేదు.’’

‘‘అవన్నీ తర్వాత. కోపంలో స్కూటీ మీద వస్తోంది క్షేమంగా ఇంటికి చేరిందా లేదా నాకు తెలియాలి. నువ్వు కాలనీ గేటు దగ్గరుండి కాస్త గమనించు, నేను విశాలను దించేసి వస్తాను. దీక్షకు ఫోన్ చేసి ఓ సారి సహస్రకి ఫోన్ చేయమని చెప్పు.’’

‘‘సరి నువ్వు త్వరగా రా’’ అంటూ అవతల లైన్ కట్ చేసాడు చందూ.

‘‘సహస్ర ఎవరు?’’ విరాట్ ఫోన్ పక్కన పెట్టగానే అడిగింది విశాల.

‘‘నువ్వు కథా రచయిత్రి సహస్ర కథలు ఎప్పుడన్నా చదివావా?’’

‘‘చదివాను. ఆమె కథలు చాలా బాగుంటాయి.’’

‘‘జర్నలిస్టు లహరి రాజకీయ వ్యాసాలు గాని విశ్లేషణలు గాని....’’

‘‘ఆహా.... నేనామె అభిమానిని కూడ. ఆ మధ్య మధురై జగన్మోహన్ భూ కుంభకోణాల్ని ఎంతో సాహసంతో వెలుగులోకి తెచ్చింది తనే గదా? ఇంతకీ....’’

‘‘ఆ యిద్దరూ వేరు వేరు కాదు. ఒక్కరే. ఆ ఒక్కరే నేను ప్రేమించిన సహస్ర.’’

విశాల విస్తు పోయి చూసింది.

‘‘మరీ ఆశ్చర్య పోకు!’’ అంటూ క్లుప్తంగా జరిగిందంతా వివరించాడు.

‘‘తనకు నేనంటే ప్రాణం. నాకూ అంతే. ఇప్పుడు ముఖ్యంగా నువ్వు నా లైఫ్ లోకి ఎంటయ్యావ్...’’

‘‘ఇప్పుడు అనక ఎప్పుడో...’’

‘‘ఒకె ఎంటరయ్యావ్ గదా. ఇక్కడ ప్రధాన సమస్య మన మధ్య ఎన్ని గొడవలున్నా సహస్రను కాపాడుకోవటం ముఖ్యం. బురఖాలో తిరుగుతోంది కాని లేదంటే శత్రువులు ఎప్పుడో సహస్రను గుర్తు పట్టేవారు. సహస్రకు తెలీకుండా మా మనుషులిద్దరూ ఎప్పుడూ ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని గమనిస్తున్నారు.

ఎంక్వయిరీ కమీషన్ గడువు ఆరు మాసాలు పూర్తి కావస్తోంది. ప్రభుత్వం మరో మూడు మాసాలు పొడిగించేట్టుంది. కోర్టు తిరిగి విచారణ చేపట్టే లోపలే సహస్రను అంతం చేయాలని జగన్మోహన్ పంపించిన మనుషులు చెన్నైలో తిష్టవేసి కూచున్నారు. మరో పక్క సహస్రను వెనక్కు తీసుక పోవాలని మధురై నుండి ఆమె తండ్రి పంపించిన మనుషులు సిటీలో వెదుకుతున్నారు. ఇటు నా కోసం కోయం బత్తూర్ నుంచి వచ్చిన మా వాళ్ళు ప్రస్తుతం నా దగ్గరే నాకు సాయంగా ఉన్నారు. ఇలాంటి పరిస్థితిలో సహస్ర జాబ్ మానేసి ఇంటికి పరిమితమైతే చాలా బాగుండేది. కాని వినటం లేదు, అర్ధమైందిగా నా ఆందోళన ఎందుకో. చిన్న పొరబాటు జరిగినా సహస్ర ప్రాణాలను పణంగా పెట్టాల్సి వస్తుంది’’ అంటూ విరాట్ వివరిస్తుంటే విశాల దిగ్భ్రమ చెందింది. అప్పటిగ్గాని పూర్తి విషయాలు ఆమెకు అర్ధం కాలేదు.

 

ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా.........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్