Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> కథలు >> ఈ తరం

ee taram

అమ్మాయి ఫోను చేసిందా,,,?కూరగాయల సంచీ రమ చేతికిస్తూ అడిగాను.ఈ ప్రశ్న ఏ పదో సారో అడుగుతున్నానని నాకు తెలుసు.రెండు రోజుల నుండీ కూతురు ఫోను చెయ్యకపోతే ఆ మాత్రం ఆరాటం సహజమే కదా!

ఆ..చేసింది..దానికి ఉద్యోగం  కూడా వచ్చిందిట,ఇక్కడవదిలేసి వెళ్ళిన ఉద్యోగం  కంటే జీతం ఎక్కువట కాస్త కోపం గా చెప్పింది  ఇల్లాలు. 'కూతురికి ఉద్యోగం వస్తే ఆ కోపం ఏమిటోయ్"? అన్నాను..డానికి ఉద్యోగం వచ్చిందని కాదు నాకు కోపం,ఆ చంటి దానిని వదిలి అది ఇప్పుడు అలా ఆఫీసుకు వెళ్ళాలా,అంత అవసరం ఏమొచ్చిందిట అసలు? చంటిదానిని ఎవరు చూసారు అంటే అల్లుడి ఆఫీసు దగ్గర క్రష్ లో వేస్తానంటుంది.

అంత చిన్న పిల్ల ఇప్పుడూ కన్న తల్లి కి దూరం గా ఉండటం అవసరమా రోజంతా? అదే మాటంటే ఈరోజుల్లో ఇవన్నీ మామూలే అంటుంది. అయినా నువ్వు చెయ్యట్లేదూ ఉద్యోగం నా చిన్నప్పటినుండీ అంది" అని తన కోపాన్నంతా వెళ్ళగక్కింది నా అర్ధాంగి రమ.వెంటనే తనే మళ్ళీ అందుకుని నాకంటే అత్తయ్యగారు ఉన్నారు చంటి పిల్లని చూసుకోవడానికి ఇంట్లో. దానికెవరు ఉన్నారుట ఆ పరాయి దేశం లో అని సణుక్కుంటూ లోపలకి వెళ్ళింది.

అయినా నేను మాట్లాడతానుండు అని నా ఏకైక ముద్దుల కూతురు సరయు కి ఫోను చేసాను. చెప్పలేదు కదూ సరయు మాకు పెళ్ళయిన నాలుగేళ్ళకి పుట్టింది.

అప్పటి ఆర్ధిక పరిస్థితులవల్ల ఒక్కళ్ళే చాలనుకుని ముద్దు గా పెంచాము. అలా అనీ ది ఏనాడూ హద్దులు దాటలేదు. చక్కగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుంది బెంగుళూరు లో. మాంచి సంబంధం చూసి పెళ్ళిచేసాము.

ఈ మధ్యే కూతురూ అల్లుడూ మనవరాలూ విదేశం వెళ్ళారు. ఫోను తియ్యగానే "డాడీ, నాకు ఉద్యోగం వచ్చింది,కాస్త దూరమే గానీ జీతం బాగుంది, సాన్వి ని క్రష్ లో వేద్దామనుకుంటున్నాము,నేను రెండు వారాల్లో జాయిన్ అవ్వాలి రేపే వెళ్ళి క్రష్ చూసొస్తాను " అని గడగడా చెప్పుకుపోయింది.

"అప్పుడే దానికి అవన్నీ ఎందుకమ్మా,ఎవరూ లేనట్లు, నేనో మీ అమ్మో వచ్చి కొన్నాళ్ళుంటాము,అప్పుడు చూడచ్చు క్రష్ సంగతి" అన్నాను. "వావ్,దట్స్ వెరీ గుడ్,డాడీ,ఎవరొస్తారో చెప్పండీ,వెంకట్ టికెట్స్ బుక్ చేస్తాడు,మళ్ళీ మాట్లాడతాను సాన్వి లేచింది" అంటూ ఫోను పెట్టేసింది.పక్కనే నిల్చున్న ఇల్లలి మొహం లో నిరసన నా ద్రుష్టి దాటి పోలేదు. "అదికాదోయ్,పరాయి దేశం లో ఉంది కదా,కాస్త దానికి సాయం గా ఉందాము కొన్ని రోజులు ఎవరో ఒకరము" అని నసిగాను.

చూడండి, అత్తయ్యగారిని వదిలి నేను వెళ్ళలేను,వెళ్ళినా ఆవిడకి అన్నీ వేళకి అమిరాయో లేదో అని టెన్షను, పైగా స్కూల్లో పరీక్షల సీజన్ ఇప్పుడు నాకు కుదరదు, ఇక మీ సంగతి సరే సరి ఇక్కడ గ్లాసు తీసి అక్కడ  పెట్టని మీరు మనవరాలిని ఏమి చూసుకుంటారు?ఇవన్నీ ఆలోచించకుండా వారాలిచ్చేసారు కూతురికి" అంది.

తను చెప్పిందీ నిజమే.కానీ కూతురి మీద ఉన్న ప్రేమ అన్నింటినీ జయించేసింది. "నేను వెళ్తానులేవోయ్, ఓ మూడు  నెలలపాటు శలవు పెట్టి" అన్నాను.

స్కూల్లో శలవలిచ్చాకా నువ్వు బయలుదేరి వెళ్దువుగాని  గాని,నేను కామేశం దగ్గర ఉంటాను ఓ నెలరోజుల పాటు,ఏమీ కాదు.చక్కగా నువ్వూ అబ్బాయీ మనవరాలితో గడిపి వీలైతే చుట్టు పక్కల ప్రదేశాలు చూసి రండి అంది ఇందాకటినుండీ మా వాదన వింటున్న అమ్మ.  అమ్మ కూడా కాస్త సర్ది చెప్పేసరికి అయిష్టంగానే ఒప్పుకుంది రమ. టైము కి మందులు అవీ వేసుకుంటానని,ఎట్టి పరిస్థితులలోనూ మర్చిపోనని నేను తనకి చెప్పాకా కాస్త తన మొహంలో ఊరట కనిపించింది.

అమ్మా, తనూ  కలిసి  నా ప్రయాణానికి కావాల్సిన ఏర్పాట్లు చేసారు. పొద్దున్నే మాగాయ ముక్కలు తరిగి, ఒడియాలకి పిండి అదీ తయారు చేసి  తను స్కూలు కి వెళ్తే వాటిని ఎండలో పెట్టడం అమ్మ పని.

పచ్చళ్ళు,అల్లుడికి  ఇష్టమని మామిడి కాయ ఒరుగులు,జంతికలు ఇంకాసిని పిండి వంటలు తయారయ్యాయి నా ప్రయాణం దగ్గర పడేసరికి.మధ్య మధ్యలో అమ్మాయి అల్లుడూ ఫోను చేస్తూనే ఉన్నారు.

డాడీకి డాక్టర్ వాకింగ్ చెయ్యమన్నారు కదా, ఇక్కడ హాయిగా ఉంటుంది వాటన్నింటికీ అని కూతురు చెప్పేసరికి "హమ్మయ్య, ఇక్కడ చెయ్యని పని అక్కడ చేస్తారు లే" అని రమ ఆనందపడింది.

మొత్తానికి ఆరోజు రానే వచ్చింది. ఎయిర్ పోర్టు లో నేను లోపలకి వెళ్ళేటప్పుడు ఆరోగ్యం జాగ్రత్త అని కళ్ళల్లో సన్నటి కన్నీటి పొరతో రమ చెప్పడం నన్ను కదిలించింది.

******

ఇంటికి వెళ్ళగానే మనవరాలు కాళ్ళని చుట్టేసింది తాతయ్య అని ముద్దు గా పిలుస్తూ. వీళ్లుండేది ఓ టూ బెడ్రూం అపార్ట్ మెంట్ .ఇంటి నలువైపులా పచ్చటి చెట్లు.ప్రాణానికి హాయిగా అనిపించింది ఆ వాతావరణాన్ని చూడగానే.

టెంపరరీ గా ఓ పనమ్మాయిని కుదుర్చింది సరయు. ఆ అమ్మాయి వచ్చి ఇల్లంతా శుభ్రం చేసి రాత్రికి కావాల్సిన కూరలు అవీ తరిగి వెళ్తోంది. కాస్త కొత్త పరిసరాలకి అలవాటు పడటానికి ఓ రెంద్రోజులు పట్టింది. ఇంతలో అమ్మాయి ఆఫీసుకి వెళ్ళేరోజు రానే వచ్చింది.

అమ్మాయి అఫీసుకి వెళ్ళగానే మనవరాలు లేచింది.లేవ గానే అమ్మాయి రాసిచ్చిన టైం టేబుల్ ప్రకారం అన్నీ చేసి ఇద్దరమూ కాసేపు ఆడుకున్నాము. భోజనం పెట్టగానే మనవరాలు పడుకుంది. తీరికగా భోజనానికి కూర్చోగానే రమ ఫోను. అమ్మాయి దగ్గరకి వెళ్ళాకా అసలు నన్ను మర్చిపోయారు అంటూ నిష్టూరాలాడింది.

పాపం తను చెప్పినదీ కరక్టే, ఈ వారం లో ఓ రెండు సార్లు ఫోను చేసానేమో అంతే. బిజీ అనే కంటే ఇక్కడ ఫోనుతో ఇండియా ఫోను ఎలా చేసుకోవాలో తెలియకపోవడం అసలు కారణం.

ఏమి చేస్తున్నారు అంది. భోజనం చేస్తున్నాను అన్నాను. ఇక్కడ అంతా బాగానే ఉంది నువ్వేమీ కంగారు పడకు అని చెప్పి అమ్మతో మాట్లాడి ఫోను పెట్టేసి భోజనం చేసి కాస్త నడూము వాలుద్దామనుకునే లోపు మనవరాలు లేచింది.

దానికి తినడానికి ఏమైనా ఇచ్చి సాయంత్రమయ్యాకా ఇద్దరమూ కిందకి వెళ్ళాము. కాసేపటికి కూతురూ అల్లుడూ వచ్చారు. డాడీ ఏమీ ఇబ్బంది అవ్వలేదు గా అంది రాగానే సరయు. లేదమ్మా అసలు పనేమి ఉందని, సాన్వి ని చూసుకోవడం తప్ప అన్నాను.ఓ నెల రోజులు దాదాపు ఇలాగే గడచిపోయాయి.

****************

మెల్లిగా సరయు బిజీ అయిపోయింది ఆఫీసులో. వీకెండ్స్ కూడా వెళ్ళాసొస్తోంది. మెల్లిగా కిచెన్ పని కూడా కొద్ది కొద్దిగా చెయ్యాల్సొస్తోంది. చంటి దానికి  నాకూ భోజనం నేనే తయారు చెయ్యాల్సి వస్తోంది ఎప్పుడైనా సరయు హడావిడీగా వెళ్ళిపోతే.సాన్వి కూడా నడక అదీ నేర్చుకుని కుదురుగా ఉండటం లేదు. కాస్త ఇబ్బంది అనిపిస్తోంది అలవాటు లేని అవపోసన.

ఒకరోజు సరయు ఆఫీసు నుండి వచ్చేసరికి నేనూ సాన్వి కింద పార్కు లో ఉన్నాము ఆడుకుంటూ. సరయు విసురుగా వచ్చి "డాదీ ఎనిమిదవుతోంది,ఇంకా ఇక్కడే ఉన్నారేంటి,కాస్త ఇంటికెళ్ళి కుక్కర్ పెట్టచ్చు కదా నేను ఏడింటి కల్లా రాకపోతే అలా పార్కు లో అజిత్ వాళ్ళ తాతగారితో సొల్లు కబుర్లు చెప్పే బదులు" అంది.

ఒక్క సారి ఈ హటాత్ప్రనిణామానికి నివ్వెరపోయాను. అజిత్ వాళ్ళ తాతగారు అజిత్ ని తీసుకుని వెళ్ళిపోవడం ఇంకా బాధనిపించింది.ఆరోజు రాత్రి చిటపటలాడుతూనే ఉంది సరయు. కాం గా భోజనం చేసి పడుకుందామని మంచమెక్కానే కానీ ఇందాకా జరిగినదే కళ్ళముందు కదలాడుతోంది.

రోజూ ఏడింటికల్లా నేనూ మనవరాలూ ఇంటికొచ్చెస్తాము.ఈరోజు సాన్వి ఎందుకో పార్కు నుండి ఇంటికి రానంది. సరే ఆడుకుంటోంది కదా అని అక్కడే కూర్చున్నాను ఇంతలో పక్క బ్లాకు లో ఉండే ఓ  కన్నడ  పెద్దాయన వచ్చి పరిచయం చేసుకున్నారు. ఇంతలో సరయు వచ్చి అలా అనేసరికి మనసు బాధనిపించింది. రమ కిఫోను చేసి చెప్దామనుకున్నా కానీ బాధపడుతుందని ఊరుకున్నాను. ఓ ఆదివారం ఇంట్లో రిలాక్స్ అవుతున్న సరయు ని అడిగాను, ఇక్కడకి మలేషియా దగ్గరే అని విన్నాను, ప్యాకేజీ టూరు ఏమైనా ఉంటుందా మీకు వీలయినావీకెండ్ వెళ్ళి వస్తాను అన్నాను.

అల్లుడు  ఏదో చెప్పబోయేంతలో చూద్దాము లెండి డాడీ అంది సరయు ముక్తసరిగా. ఆరోజు రాత్రి సరయు ఫోను లో  "మా డాడీ కి అర్జెంటు గా మలేషియా చూసెయ్యాలని బుద్ధి పుట్టింది. ఇండియా  నుండి వాచిన వాళ్ళందరికీ ఇదేమి పిచ్చో అర్ధం కాదు" అనడం నా చెవిన పడింది.సరేలెమ్మని ఊరుకున్నాను. ఇంతలో పనమ్మాయి ఏదో కారణంతో రావడం మానేసింది. ఇంకో అమ్మాయిని చూడటానికి సరయు కి టైముండట్లేదు. పోనీ నాకు పార్కు లో తెలుసున్న వాళ్ళని కనుక్కోమంటావా అంటే "అది అంత ఈజీ కాడు డాడీ, నేనుచూస్తా గా" అంటుంది.ని జం చెప్పొద్దూ పని ఎక్కువయిపోతోంది. పొద్దున్నే అమ్మాయి టిఫిన్ చేసి పెట్టి వెళ్ళిపోతోంది తనూ అల్లుడు బయట తినెస్తా మంటూ. నాకు మనవరాలికి భోజన బాధ్యత నాదన్నమాట. ఎలాగో చేస్తున్నాను. పాపం అది కూడా బానే అలవాటు పడింది నా వంట కి.

ఒకరోజు రాత్రి రెడీ మిక్స్ తో పులిహోర కలపబోతున్న సరయు ని అడిగాను, రెండు రోజుల నుండీ అదే కదమ్మా తింటున్నాము, ఏ కొత్తిమీరో పుదీనాయో  పచ్చడీ చేసుకుంటే అన్నం లోకి సరిపోతుంది కదా అన్నాను."డాడీ, నేను ఆఫీసులో అలసిపోయి వస్తాను. ఇవన్నీ చెయ్యలేను" అంది వెంటనే అల్లుడొచ్చి "మేము ఇలా ఏదుంటే అది తినెస్తాము మామయ్యా, ప్లీజ్ ఏమీ అనుకోకండి అనేసరికి నొరు మెదపలేక ఆకలి లేదని చెప్పి మజ్జిగ తాగి పడుకున్నాను.

మరునాడు ఆఫీసుకి బయలు దేరుతున్న సరయు ని కాస్త ఆ ఇడ్లీ ప్లేటు లో పెట్టి వెళ్ళమ్మా పూజ చేసుకొస్తాను అనగానే "మీరు అమ్మ దగ్గర చెలాయించినట్లు అంటే కుదరదు డాడీ, పెట్టుకోండి, ఏమనుకోవద్దు" అని చెప్పి వెళ్ళిపోయింది.ఏమిటీ స్వయం గా  కన్న కూతురినే దూరం చేసుకుంటున్నానా అనిపించింది. ఇక ఉండబట్టలేక రమ కి ఫోను చేసి నువ్వు బయలుదేరి రాగలవా నాకు బోరుకొడుతోంది అని అడిగాను. మా తమ్ముడు కామేశం తన అత్తగారికి బాలేదని ఊరెళ్ళడం వల్ల తనొచ్చేవరకూ అంటే ఓ వారం వరకూ బయలుదేరలేను అని చెప్పి  విషయం అడిగింది.

ఏమీ లేదు ఒక్కడీనే కదా ఏమీ తోచట్లేదు అని కాస్త పిచ్చా పాటీ మాట్లాడి ఫోను పెట్టేసాను.ఓ నాల్రోజుల తరువాత అల్లుడు హాడావిడిగా వచ్చాడు. మామయ్యగారూ ఇప్పుడే అత్తయ్య ఫోను చేసారు మీ అమ్మగారికి ఒంట్లో బాగాలేదని.మీకు ఈ రాత్రికి బయలుదేరుతున్నారు అనగానే కాళ్ళూ చేతులూ ఆడలేదు నాకు.

రమ కి ఫోను చేసాను.అత్తయ్య గారికి బాలేదు మీరు వెంటనే బయలుదేరండి అని చెప్పిదంతే.

""డాడీ,ఏమైన అయినా  కానీ ఓ పదిహేను రోజులలో అన్ని కార్యక్రమాలు అయిపోతాయి మీరు వచ్చెస్తారు కదా, నేను ఓ మూడు వారాలు ఇంటి నుండి పని చెయ్యడానికి పర్మిషన్ తీసుకున్నాను. ఇంకో వారం చంటి దానిని వెంకట్  చూసుకుంటాడు, వచ్చ్చేటప్పుడు అమ్మ ని తీసుకు రండి అని అంటున్న సరయు కేసి ఆశ్చర్యం గా చూసాను. తనని ఎత్తుకుని పెంచిన తన బామ్మ గురించేనా సరయూ ఇలా మాట్లాడు తోంది అని. ఇండీయా లో దిగి అయిర్ పోర్టు బయటకి వచ్చేసరికి తమ్ముడు కామేశం కనిపించాడు. వాడేమీ పెద్దగా మాట్లాడకపోయేసరికి నా కాళ్ళూ చేతులూ ఆడలేదు. ఇంటి ముందు ట్యాక్సీ  దిగి చూస్తే నేను ఊహించినట్లు ఏమీ లేకపోవడం తో ఊపిరి పీల్చుకున్నాను.

అమ్మ గదిలోకి పరుగున వెళ్ళాను. అమ్మ తన ఆల్ టైం ఫేవరెట్ రామాయణాన్ని దీక్ష గా చదువుతోంది. నన్ను చూసి ఎలా ఉన్నావు రా,మనవరాలు,మనవడు చంటిది ఎలా ఉన్నారు అంది.

నాకసలు ఏమీ అర్ధం కావట్లేదు. స్నానం చేసి కాఫీ తాగుతూ పడక్కుర్చీలో కూర్చోగానే ప్రాణం లేచొచ్చినట్లనిపించింది. ఇంతలో రమ కూడా కాఫీ తెచ్చుకుని కూర్చుంది.

వెయ్యి ప్రశ్నలు ఒకేసారి సంధించినట్లున్న నా చూపులని అర్ధం చేసుకుని చిరునవ్వు నవ్వింది. "చూడండి, అత్తయ్యగారు బాగానే ఉన్నారు, అబద్ధం చెప్పి మిమ్మల్ని పిలిపించినందుకు క్షమించండి అని మొదలుపెట్టింది.

ఇలా చెప్పుకుపోసాగింది. "మీరు అక్కడకి వెళ్ళిన ఓ నెల తరువాత మీ మాటలలో నిరాసక్తత గమనించాను. ఏదో చెప్పాలనుకుని తమాయించుకోవడం  లో వచ్చిన మీ తడబాటూ నాకు తెలిసింది. చాలా సార్లు ఫోను చేసి ఏమి వండావోయ్ ఈ రోజు అని అడుగుతోంటేనే అర్ధమయ్యింది మీకు అక్కడ జరుగుబాటు సరిగ్గా లేదని"

ఆ మధ్య సరయు ఫోను చేసి "అమ్మా,డాడీ ని వీ ఆర్ ఎస్ తీసుకోమనమ్మా,నువ్వూ ఓ రెణ్ణెల్లు శలవు పెట్టి వచ్చెయ్యి" అని ఉచిత సలహా కూడా పారేసింది. అవన్నీ చేస్తే వచ్చే పరిణామాలు నాకు తెలుసు.మన పిల్లలని పెంచి పెళ్ళి చెయ్యడం వరకే మన బాధ్యత. వాళ్ళ పిల్లల బాధ్యతలు కూడా నెత్తికెక్కించుకుని పరస్పర గౌరవం,ప్రేమ  పోగొట్టుకున్న ఎన్నో జంటలు నాకు తెలుసు. నిజం గా మన సరయు ఉద్యోగం చెయ్యనిదే ఇల్లు గడవని పరిస్థితయితే నేనే ముందు వెళ్ళి ఉండేదానిని దాని దగ్గరకి. కానీ చెయ్యాలి అనుకోవడం తన చాయిస్. పిల్ల ని ఎక్కడ వదిలి వెళ్తుంది అంత సేపు పిల్ల ఉండగలదా లాంటివి చూసుకోవాల్సినవి వాళ్ళు. మధ్యలో మనము వెళ్తే బాధ పడాల్సింది మనమే. ఇది సినిమా కాదండీ జీవితం. పిల్లలు తమ తప్పులు తెల్సుకుని చివరకి క్షమాపణ చెప్పడం అందరూ కలిసిపోవడం జరగని పని.కొన్నాళ్ళు బాగుంటుందేమో కానీ పరిస్థితి మరలా మొదటికే వస్తుంది రెండు మూడు నెలల తరువాత. మీరు అక్కడ ఇమడలేకపోతున్నారని అర్ధమయ్యింది. క్రష్ లో సీటు కోసం ఇంకో నెలయినా ఆగాలి అని అది చెప్పిన  తరువాత కూడా నాన్నగారిని పంపించెయ్యమ్మా అని అడగలేను కదా .అత్తయ్యగారితో మాట్లాడే నేను వెంకట్ కి ఫోను చేసాను” అని చెప్పింది. కాస్త కాఫీ ఇవ్వమ్మా  అన్న  అమ్మ కేక విని లోపలకి వెళ్తున్న రమ నా కళ్ళకి ఓ సైకాలజిస్ట్ లా కనిపించింది

మరిన్ని కథలు
aunty...uncle