Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview

చివ‌రి సినిమా కూడా త్రివిక్ర‌మ్‌తో చేయాల‌ని ఉంది - స‌మంత‌

ప‌ద్ధ‌తిగా క‌నిపిస్తూనే కుర్రాళ్ల గుండెల్లో అల‌జ‌డి రేపే టాలెంటు స‌మంత‌లో కావ‌ల్సినంత ఉంది. అందుకే మ‌న హీరోల‌దంరికీ స‌మంత కావాలి.గ్లామ‌ర్ పాళ్లు త‌గ్గ‌కుండా.. న‌ట‌న‌ని విడిచిపెట్ట‌కుండా త‌న పాత్ర‌ని పండించే స‌త్తా సమంత‌కు ఉంది.. అందుకే ద‌ర్శ‌కుల‌కూ స‌మంతే కావాలి. స‌మంత ఉంది క‌దా అని థియేట‌ర్ల‌కు వ‌చ్చేసే ప్రేక్ష‌కులూ ఉన్నారు.. అందుకే నిర్మాత‌ల‌కూ స‌మంత కావాలి. కాబ‌ట్టే స‌మంత కాల్షీట్లు ఇప్పుడు.. ఎప్పుడూ హాట్ కేకులే. న‌వ‌త‌రం క‌థానాయిక‌లు పోటీ ఇస్తున్నా, వాళ్ల మ‌ధ్య త‌న శైలి చూపిస్తూనే ఉంది స‌మంత‌. ప్ర‌స్తుతం స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి కోసం తొలిసారి అల్లు అర్జున్‌తో జ‌త క‌ట్టింది. ఈ సంద‌ర్భంగా స‌మంత‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* హాయ్ స‌మంత‌..
- హాయ్‌..

* మ‌రో హిట్టు మీ ఖాతాలో వేసుకొన్న‌ట్టేనా..?
- దాదాపుగా వేసుకొన్న‌ట్టే. వ‌సూళ్లు చూస్తున్నారు క‌దా.. ?  క‌లక్ష‌న్ల కుంభ వృష్టి కురుస్తోంది.  ఓవ‌ర్సీస్‌లో ప‌ది ల‌క్ష‌ల డాల‌ర్లు వసూలు చేసింది. ఓవ‌ర్సీస్‌లో ఈ మైలు రాయిని దాటిన ఆరో తెలుగు సినిమా ఇది.. ఐ యామ్ సో హ్యాపీ..

* సినిమా చూశారా?
- విడుద‌లైన రెండో రోజు థియేట‌ర్లో చూశా.

* డివైడ్ టాక్ భ‌య‌పెట్ట‌లేదా?
- నిజం చెప్ప‌నా??  సినిమా విడుద‌లైన తొలి రోజు.. ఒకొక్క‌రూ ఒక్కోలా స్పందించారు. కొంతమంది సినిమా బాగుంది.. అంటే, ఇంకొంత మంది బాలేద‌న్నారు. నిజంగానే భ‌య‌ప‌డ్డాను. అయితే త్రివిక్రమ్ సినిమాలన్నీ స్లోగా జ‌నంలోకి వెళ్తాయి. స‌త్య‌మూర్తి సినిమా విడుద‌లై నాలుగు రోజుల‌య్యింది. వ‌సూళ్లు అదిరిపోయాయి. ఇప్పుడు అంద‌రూ బాగుంది అంటున్నారు. ఫ్యామిలీ ఆడియ‌న్స్‌కీ ఈ సినిమా త‌ప్ప‌కుండా న‌చ్చుతుంది. వాళ్లంద‌రూ ఆద‌రిస్తే ఈ సినిమా సూప‌ర్ హిట్ అవ్వ‌డం ఖాయం.

* డ‌యాబెటిక్ పేషెంట్‌లా న‌టించారు..  రిస్క్ క‌దా..?
-  హీరోయిన్ల‌ను మ‌నం తెర‌పైనే చూస్తాం. బ‌య‌ట మాలాంటి క్యారెక్ట‌ర్లు మీకు క‌నిపించ‌వు. ప్ర‌తి ఒక్క‌రిలోనూ ఓ స‌మ‌స్య ఉంటుంది.  అలాంట‌ప్పుడు క‌థానాయిక‌ని డ‌యాబెటిక్ పేషెంట్‌గా చూపిస్తే త‌ప్పేంటి అనిపించింది.

* త్రివిక్ర‌మ్‌తో రెండో సినిమా.. ఎలా ఉందీ అనుభ‌వం?
- నా ఫేవ‌రెట్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్‌. ఆయ‌న నాకు స్నేహితుడిలా అనిపిస్తారు. నా ఫీలింగ్స్‌, నా స‌మ‌స్య‌లు అన్నీ ఆయ‌న‌తో పంచుకొంటా.  మంచి మంచి స‌ల‌హాలిస్తుంటారు. అత్తారింటికి దారేది సినిమాని నేను క‌థ విన‌కుండానే ఓకే చేశా. ఇప్పుడూ అంతే. అయితే త్రివిక్ర‌మ్ గారు నాకు క‌థ చెప్పారు. విన‌గానే న‌చ్చేసింది.  ఈ సినిమాని తీర్చిదిద్దిన విధానం నాకు చాలా బాగా న‌చ్చింది. ఆయ‌న సంభాష‌ణ‌ల గురించి చెప్ప‌న‌వ‌సరం లేదు. విలువ‌లున్న ఓ సినిమా తీశారాయ‌న‌. ఇంకా ఆయ‌న‌తో బోలెడ‌న్ని సినిమాలు చేయాల‌ని వుంది. నా చివ‌రి సినిమా కూడా ఆయ‌నతో చేస్తే బాగుంటుంద‌నిపిస్తుంది.

* మీ ప్రాముఖ్యం దేనికి..?  క‌థ‌, ద‌ర్శ‌కుడా?
- క‌చ్చితంగా ద‌ర్శ‌కుడే. ఆ త‌ర‌వాతే క‌థ‌. ఎందుకంటే ఓ మామూలు క‌థ‌ని కూడా మంచి ద‌ర్శ‌కులు అద్భుతంగా తీయ‌గ‌ల‌రు.

* ఈమ‌ధ్య గ్లామ‌ర్ పాత్ర‌ల‌కే ప‌రిమిత‌మైన‌ట్టు అనిపించ‌డం లేదా?
- ఔనూ.. అదీ క‌రెక్టే. త్వ‌ర‌లోనే ఓ కొత్త స‌మంత‌ని చూస్తారు.

* అదే.. ఎప్పుడు?
- విక్ర‌మ్‌తో క‌ల‌సి ఓ సినిమా చేస్తున్నా. అందులో నా పాత్ర సూప‌ర్బ్‌గా ఉంటుంది. నేపాలీ అమ్మాయిలా న‌టిస్తున్నా. ఫైట్లూ చేస్తా. నా పాత్ర‌కు విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుతాయి.

* బ‌న్నీతో క‌ల‌సి తొలిసారి న‌టించారు. న‌టుడిగా బ‌న్నీ ఎలా అనిపించాడు?    
- బ‌న్నీ చాలా హార్డ్ వ‌ర్క‌ర్‌. అత‌ని నుంచి చాలా నేర్చుకొన్నా. సెట్లో ఎంతో క‌ష్డ‌ప‌డుతుంటాడు. ద‌ర్శ‌కుడు షాట్  ఓకే అన‌గానే నేను ఒక్క నిమిషం కూడా అక్క‌డ ఉండ‌ను. బ‌య‌ట‌కు వ‌చ్చేస్తా. కానీ బ‌న్నీ మాత్రం... వ‌న్ మోర్ చేద్దామా అని అడుగుతాడు. త‌న డైలాగ్ ఉన్నా లేకున్నా సెట్లో డిసిప్లెన్‌గా ఉంటాడు. నేనైతే అల్ల‌రి చేస్తూ కూర్చుంటా.

* తెలుగులో దూకుడు త‌గ్గిన‌ట్టుంది..?
- అదేం లేదండీ.. నాకు రావ‌ల్సిన అవ‌కాశాలు నాకొస్తున్నాయి. ప‌రిశ్ర‌మ‌కు వ‌చ్చి ఐదేళ్ల‌య్యింది. ఇంకా రొటీన్ పాత్ర‌లే చేస్తూ కూర్చుంటే బోర్. అందుకే సెలెక్టీవ్‌గా ఉన్నా. .

* అంతే త‌ప్ప స‌మంత‌కు పోటీ లేదంటారు..
- ఆ మాట చ‌చ్చినా అన‌ను. పోటీ ఉంది.. ఎందుకు లేదు. పోటీ ఉంటేనే క‌దా.. ఆట‌లో మ‌జా తెలిసేది. ప‌రిశ్ర‌మ‌లో నాకు స్నేహితులు చాలామంది ఉన్నారు. కానీ ప్ర‌తి క‌థానాయిక‌నీ నేను పోటీగానే తీసుకొంటా.

* మీ విజ‌యాల‌కు కార‌ణం.. అదృష్టమా, ప్ర‌తిభా?
- రెండింటిలో అదృష్టానికే ఎక్కువ మార్కులేస్తా. ఎందుకంటే నాకంటే ప్ర‌తిభావంతులు ప‌రిశ్ర‌మ‌లో చాలామంది ఉన్నారు.

* త‌దుప‌రి తెలుగు సినిమా?
- ఓ సినిమా ఒప్పుకొన్నా. అయితే ఇప్పుడు చెప్ప‌కూడ‌దు. నేనెప్పుడూ ఆ సినిమా చేస్తున్నా... ఈ సినిమా చేస్తున్నా అని చెప్పుకోను. సెట్‌కి వెళ్లాకే వివ‌రాలు చెబుతా. ఇప్పుడూ అంతే.

* ఓకే.. ఆల్ ది బెస్ట్‌..
- థ్యాంక్యూ...

 

- కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
movie review