Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
interview

ఈ సంచికలో >> సినిమా >>

చిత్ర సమీక్ష

movie review

చిత్రం: ఓకే బంగారం
తారాగణం: దుల్కర్‌ సల్మాన్‌, నిత్యామీనన్‌, ప్రకాష్‌రాజ్‌ తదితరులు
చాయాగ్రహణం: పి.సి.శ్రీరాం
సంగీతం: ఎ.ఆర్‌. రెహమాన్‌
దర్శకత్వం: మణిరత్నం
నిర్మాత: దిల్‌ రాజు
విడుదల తేదీ: 17 ఏప్రియల్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే
ఆది (దుల్కర్‌ సల్మాన్‌) ముంబై రైల్వే స్టేషన్‌లో తార (నిత్యామీనన్‌)ని కలుస్తాడు. ఆ తర్వాత ఓ వెడ్డింగ్‌ ఫంక్షన్‌లో మళ్ళీ ఇద్దరూ కలుసుకుంటారు. ఇద్దరి మనసులూ కలుస్తాయి. ఇంకో వైపు ఆది, గణపతి ` భవానీ (ప్రకాష్‌రాజ్‌ లీలా శాంసన్‌)లతో కలిసి ఓ ఇంట్లో వుంటాడు. ఆది, తారల మధ్య పరిచయం లివ్‌ ఇన్‌ రిలేషన్‌షిప్‌కి దారి తీస్తుంది. కొన్నాళ్ళ తర్వాత ఆది ప్రాజెక్ట్‌ పని మీద అమెరికా వెళ్ళాల్సి వస్తుంది. ఆర్కిటెక్ట్‌ అయిన తార ప్యారిస్‌ వెళ్ళాలనుకుంటుంది. అప్పుడే ప్రేమ గురించీ, వైవాహిక బంధం గురించి తెలుసుకుని, తమ మధ్య వున్న బంధం గురించి అర్థం చేసుకోవడం మొదలు పెడ్తారు ఆది, తార. దానికి గణపతి, భవానీల అనుబంధం మరింత బలాన్నిస్తుంది. చివరికి ఆది, తార వైవాహిక బంధంతో ఒక్కటవుతారా? లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ విషయంలో గణపతిని ఒప్పించిన వీరిద్దరూ, వైవాహిక బంధమే గొప్పదని తెలుసుకుంటారా? అన్నది తెరపై చూడాలి

మొత్తంగా చెప్పాలంటే
దుల్కర్‌ సల్మాన్‌ నేటితరం యూత్‌కి నచ్చే ఫీచర్స్‌తో ఉన్నాడు. నటన పరంగానూ మంచి మార్కులేయించుకున్నాడు. హావభావాలు బాగున్నాయి. నేటితరం యూత్‌ దుల్కర్‌ సల్మాన్‌తో కనెక్ట్‌ అవుతారు. హీరోయిన్‌ నిత్యామీనన్‌ మారోమారు అద్భుతన నటనా ప్రతిభతో ఆకట్టుకుంటుంది. ఏ సినిమాలో ఎలాంటి పాత్ర ఇచ్చినా, దానికి పూర్తి న్యాయం చేసే నిత్యామీనన్‌, ఈ సినిమాలో చెలరేగిపోయిందని చెప్పడం అతిశయోక్తి కాదు. గణపతి లాంటి పాత్ర దొరికితే ఆ పాత్రకు తాను ఎంత గొప్పగా న్యాయం చేయగలడో ప్రకాష్‌ రాజ్‌ మరోమారు నిరూపించుకున్నాడు. కెరీర్‌ బెస్ట్‌ పెర్ఫామెన్సెస్‌ ఎన్నో ఇచ్చేసిన ప్రకాష్‌, తన కెరీర్‌లో మరో మంచి పాత్రను ఈ సినిమాలో చేశాడు. లీలా శాంసన్‌ పేషెంట్‌గా పరిమితమైన పాత్రలోనే ఆకట్టుకుంది. మిగతా పాత్రధారులంతా తమ పాత్రల పరిధుల మేర నటించారు.

ఇది వరకు ఇలాంటి కథాంశంతో ఎన్నో సినిమాలు రావడంతో, నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందో ప్రేక్షకుడు ఈజీగానే అర్థం చేసుకుంటాడని తెలిసీ, తనదైన టేకింగ్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్‌ చెయ్యాలనుకున్నాడు దర్శకుడు మణిరత్నం. ఆ క్రమంలో ఆయన చాలావరకు సక్సెస్‌ అయ్యాడు. కథనంతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దర్శకుడి విజన్‌కి తగ్గట్టుగా సినిమాటోగ్రాఫర్‌ మంచి ఔట్‌పుట్‌ ఇచ్చాడు. సంగీతం సినిమాకి అదనపు ఆకర్షణ. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బావుంది. పాటలు వినడానికీ, తెరపై చూడ్డానికీ బాగున్నాయి. డైలాగ్స్‌ కూడా ఆకట్టుకుంటాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌, కాస్ట్యూమ్స్‌ డిపార్ట్‌మెంట్‌ సినిమా మూడ్‌కి తగినట్లుగా తమ పని తాము చేసి, దర్శకుడికి సహకరించాయి. ఎడిటింగ్‌ ఓకే.ఫస్టాఫ్‌లో లివ్‌ ఇన్‌ రిలేషన్‌ షిప్‌ని ఆడియన్స్‌, ముఖ్యంగా యూత్‌ ఎంజాయ్‌ చేస్తారు. సరదా సరదాగా తొలి సగం సాగిపోతుంది. రెండో సగం మొదలయ్యాక సినిమాలో ఫీల్‌ ఎక్కువవుతుంది. ఆ ఫీల్‌ని ఆడియన్‌ ఎంజాయ్‌ చేయగలిగేలా మణిరత్నం టేకింగ్‌ ఉంది. అయితే ఫస్టాఫ్‌లో అక్కడక్కడా బోరింగ్‌గా అనిపిస్తుంది. సెకెండాఫ్‌లోనూ అంతే. ఈ చిన్న మైనస్‌లను పక్కన పెడితే, ఫీల్‌ గుడ్‌ మూవీగానే ‘ఓకే బంగారం’ను చూడొచ్చు. క్లాస్‌ ఆడియన్స్‌ మెచ్చే ఈ సినిమా, మాస్‌ ఆడియన్స్‌కి మింగుడు పడటం కొంచెం కష్టం.

ఒక్క మాటలో చెప్పాలంటే
క్లాస్‌కి ఓకే బంగారం

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 12 - Kodite Kottalira Six Kottali - Tagore