Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : విశాల బర్త్ డే కి వెళతాడు విరాట్. ఆమె తల్లి అతడ్నెంతో ఆదరిస్తుంది...విశాల-విరాట్ ఇద్దరూ కల్సి కారులో కుమారస్వామి ఆలయానికి వెళ్తారు అక్కడ సహస్ర వీళ్ళని చూస్తుంది....ఆ తర్వాత....

‘‘విరాట్ ఈ క్షణం నుంచి అక్కను కాపాడుకునే బాధ్యత నీకే కాదు నాకు ఉంది. ఏ అవసరం వచ్చినా నీవెంట నేనూ వున్నానని మర్చిపోకు’’ అంటూ భరోసా ఇచ్చింది విశాల.

అంతలో కారు విశాల ఇంటికి చేరుకుంది. కారు దిగి విశాల వద్ద ఆమె తల్లి కాంచనమాల వద్ద శలవు తీసుకొని తన బైక్ మీద ఇంటికి బయలుదేరుతుండగా చందూ ఫోన్ చేసాడు. సహస్ర క్షేమంగా ఇంటికి చేరుకుందని. ఆమెను ఫాలో చేస్తున్న యిద్దరూ కూడా వచ్చేసారని చెప్పాడు. అప్పటిగ్గాని విరాట్ మనసు కుదుట పడలేదు. బైక్ స్టార్ట్ చేసి బయలుదేరాడు.ఇంటికి తిరిగి వస్తూనే దీక్షను కౌగిలించుకొని చిన్నపిల్లలా బావురుమని ఏడ్చేసింది సహస్ర.

ఇద్దరూ సహస్ర బెడ్రూంలోవున్నారు.సహస్రను ఎలా ఓదార్చాలో తెలీక కాస్సేపు మౌనంగా వుండిపోయింది దీక్ష. సహస్రను అలా చూస్తుంటే గుండె తరుక్కు పోతోంది.

‘‘ఏమిటే యిది చిన్న పిల్లలా? ఎంతో ధైర్య సాహసాలు కలిగిన నువ్వేనా ఇలా డీలా పడిపోయి ఏడుస్తున్నావ్ వూరుకో’’ అంటూ ఓదార్చింది.

‘‘ఎన్ని వున్నా నేనూ ఆడపిల్లనే గదా! మర్చిపోలేకపోతున్నాను’’ అంది రుద్ద కంఠంతో.‘‘ఇంటికొచ్చి ఏడుస్తు కూచున్నావ్? అసలేం జరిగిందే?’’ ఏమీ తెలీనట్టు అడిగింది దీక్ష, కాని అప్పటికే చందూ ఫోన్ చేయటం వలన దీక్షకు అంతా తెలుసు.

‘‘ఎక్కడికి పోయావో నువ్వు రాలేదు. మనసు ప్రశాంతంగా ఉంటుందని వడపళని గుడికి వెళ్ళాను. నేను వెళ్ళేసరికే విశాలతో విరాట్ గుడికి వచ్చి ఇద్దరూ బయట కారు వద్దకొస్తూ కన్పించారు’’ అంటూ కళ్ళు తుడుచుకొని జరిగిందంతా చెప్పింది సహస్ర.

‘‘నిన్ను చూసిన విరాట్ దగ్గరకు రాబోయాడంటున్నావ్. వాళ్ళని చూసి కూడ వెనక్కి రావటం వల్ల ప్రయోజనం ఏమిటి? ఇద్దర్నీఅక్కడే నిలదీయక పోయావా?’’ అంది దీక్ష.

‘‘అందువల్ల నలుగురిలో గుడి ముందు అల్లరి గావటం తప్ప లాభం ఏమీ ఉండదు. ఆపైన దుఖాన్ని ఆపుకోలేక వచ్చేసాను.’’‘‘వాళ్ళను చూసి నువ్వు పారిపోయి రావటం ఏమిటి? ఇలా అయితే ఆ విశాల ఎవరో తన వివరాలు ఏమిటో ఎలా తెలుస్తాయి? అసలా అమ్మాయి ఎలాంటిది? మంచిదేనా? ఏ ఉద్దేశంతో విరాట్ వెంట తిరుగుతోంది? అసలు విరాట్ మనసులో ఏముంది? ఇవన్నీ తెలియాలంటే వాళ్ళతో మాట్లాడాలి గదా? ’’

‘‘ఏమో? నాకా క్షణంలో మాట్లాడాలనిపించలేదు’’ అంటూ చెమరుస్తున్న కళ్ళు తుడుచుకుంది సహస్ర.

ఒక్క క్షణం ఆలోచించింది దీక్ష.

‘‘ఒకె నాకో విషయం స్పష్టంగా చెప్పవే. నువ్వు విరాట్ ని మనసారా ప్రేమిస్తున్నావా లేదా?’’ అడిగింది.

అవునన్నట్టు తలూపింది సహస్ర

‘‘విరాట్ విశాలకు దగ్గరైపోయాడని నీ బాధ. అంతేగా? ’’

‘‘అవును’’

‘‘అలాగని విరాట్ కి దూరంగా వుండ గలవా? ’’

‘‘అంత శక్తి నాకు లేదు’’

‘‘మరెందుకు బాధ పడతావ్? విశాల వెంట వున్నందున విరాట్ కు నీ మీద ప్రేమ తగ్గిందని ఎలా అనుకుంటావ్? నీకు చాలా సార్లు ఫోన్ చేసాడు. నువ్వు లిఫ్ట్ చేయలేదు. గుడి దగ్గర పక్కన విశాల వున్నా పట్టించుకోకుండా నిన్ను చూడగానే ఆత్రంగా నీ కోసం వచ్చాడు. నువ్వే మాట్లాడకుండా వచ్చావ్. నా ఉద్దేశం ప్రకారమైతే నువ్వు విరాట్ ప్రేమను శంకించాల్సిన పని లేదు’’

‘‘ఎందుకు లేదు? విశాల సంగతేమిటి? వాళ్ళది స్నేహం కాదు. ప్రేమ’’

‘‘ఒకె విశాలనూ ప్రేమిస్తున్నాడనుకుందాం. ఆ అమ్మాయి మంచిదయిఉండి తనకీ కాస్త ప్రేమ పంచితే నీకొచ్చే నష్టం ఏమిటి? వేరేగా అనుకోకు వాస్తవం మాట్లాడుకుందాం.

మనం మొక్కే దేవుళ్ళనే చూడు మురుగన్ గుడికి వెళ్ళావ్. ఆయనకు శ్రీవళ్ళి దేవసేన అని యిద్దరు భార్యలు. శివుడ్నితీసుకో ఆయనకి ఇద్దరు భార్యలు, వెంకటేశ్వరస్వామికి ఇద్దరు. ఇక ఆ గోపాల కృష్ణుడికయితే ఎనమండుగురు భార్యలు. ఇలా ఇద్దరు భార్యలున్న దేవతల్ని మాత్రం పడి పడి మొక్కుతాం. మన కళ్ళ ముందు ఎవరన్నా ఇద్దరు భార్యల్ని చేసుకుంటే ఇష్ట పడం.

ఇలాగని నేను ఇద్దరు భార్యల్ని చేసుకోడాన్నో లేక బహు భార్యత్వాన్నో సమర్ధిస్తున్నానని కాదు. సందర్భాన్ని బట్టి ఒక్కో సారి తప్పని పరిస్థితి ఏర్పడ వచ్చు. అది న్యాయమైందైతే మనమూ ఆమోదించక తప్పదు కదా?విరాట్ విశాల మోజులో పడి నిన్న శ్రద్ధ చేస్తున్నాడని నువ్వు ఫీలవుతున్నావ్. కాని అనుక్షణం నిన్నెలా కాపాడుకోవాలని విరాట్ తపిస్తున్నాడు. తన తండ్రి వెంకట రత్నం నాయుడు గారు తనను పట్టి వెనక్కి తీసుకు రమ్మని పంపించిన వాళ్ళని ప్రస్తుతం తన వద్దే ఉంచుకున్నాడు. నీ కోసం... నీకు తెలుసో లేదో మనం బయట కెళ్ళి ఇంటికొచ్చే వరకు విరాట్ మనుషులిద్దరు మనల్ని ముఖ్యంగా నిన్ను ఫాలో అవుతూ ఎప్పటికప్పుడు పరిస్థితుల్ని గమనిస్తున్నారు. నాకెలా తెలుసనకు, చందూ చెప్పాడు. ఈ రోజు కూడ సాయంకాలం నేను బయట కెళ్ళింది చందూ తోనే. అలాగే నిన్ను తీసుకెళ్ళాలని వచ్చిన కదిరేషన్ వాడి మనుషుల కోసం, నిన్ను చంపాలని గాలిస్తున్న ధనగిరి వాడి మనుషుల జాడ తెలుసుకోడానికి మునుసామి మనుషులు ఓ పక్క సిటీలో గాలిస్తున్నారు. ఇదంతా నీ మీద ప్రేమ లేకుండానే చేస్తున్నాడంటావా? ఇవేమీ తెలుసుకోకుండా నువ్విలా ఏడుస్తూ కూచోవడం ఏం బాగలేదు. తెలుసా? ’’ అంటూ దీక్ష మందలిస్తుంటే సహస్ర కాస్సేపు మౌనంగా ఉండి పోయింది.

ఆమె మనసులో అంతర్మథనం జరుగుతోంది.

ఆలోచిస్తోంది...

తీవ్రంగా ఆలోచిస్తోంది....

దీక్ష మాటలు వాస్తవాన్ని ప్రతిబింభిస్తున్నాయి.

విరాట్ తన కోసం తీసుకుంటున్న జాగ్రత్తలు వింటుంటే గర్వంగానూ ధైర్యంగానూ ఉంది. కాని పరిష్కారం ఏమిటనేది తోచటం లేదు.

‘‘అయితే నన్నేం చేయమంటావే? నాతో బాటు విశాలనూ పెళ్ళి చేసుకుంటానంటే సరే అనాలా?’’ అంది లేచి బురఖా తీసి పక్కన పడేస్తూ.‘‘ఆ మాట నేననటం లేదు’’ అంది వెంటనే దీక్ష.

‘‘ప్రతి సమస్యకో ఓ పరిష్కారం ఉంటుంది. అందుకు ప్రయత్నించకుండా ఇలా నువ్వు బేలగా ఏడుస్తు నీలో నువ్వు కుమిలి పోవటం మంచిది కాదంటాను. ఈ సమస్య పరిష్కారం కావాలంటే అది మీ ముగ్గురి అవగాహన మీద ఆధార పడి ఉంది. మీ ముగ్గురు కూచుని చర్చించుకుంటే చిక్కు ముడి తొలగి పోతుందంటాను. అప్పుడు మీరు కాస్సేపు తిట్టుకున్నా అరుచుకున్నా మనసు తేలికై ప్రశాంతంగా వుంటుంది. నువ్వు సరే నంటే ఆ ఏర్పాటు నేను చేస్తాను. రేపే విశాలను తీసుకొని ఇక్కడికి రమ్మని విరాట్ కి చెప్తాను’’ అంటూ వివరించింది.‘‘రేపు అంటే మళ్ళీ డ్యూటీకి లీవ్ పెట్టాలి. వద్దులే. నీ మాట కాదనలేక సరే అంటున్నాను. కాని రేపు కాదు. వచ్చే మంగళ వారం మనకి సెలవు గదా. ఆ రోజు కూచుందాం’’ అంది సహస్ర.

‘‘అంటే ఏమిటే? నీ కోసం వాళ్ళు సెలవు పెట్టాలి. నువ్వు మాత్రం సెలవు పెట్టనంటావ్. ఎంతయినా నీకు స్వార్ధం ఎక్కువే ’’ అంటూ దీక్ష నవ్వుతుంటే సహస్ర కూడ తేలిక పడ్డ మనసుతో తనూ నవ్వింది.

సరైన సమయంలో సరైన సలహా యిచ్చి ధైర్యం చెప్పే ఫ్రెండు పక్కనుండటం కూడ అదృష్టమనే చెప్పాలి. దీక్ష ఓదార్పు సలహా సహస్రకు బాధను దూరం చేసి కొత్త ఉత్సాహాల్నిచ్చాయి. త్వరలోనే విరాట్ విశాల యిద్దర్నీ దీక్ష ఇంటికి రప్పించి తాడో పేడో తేల్చేయాలని నిర్ణయించుకుంది. కాని...

అంత వరకు గాకుండా...

ఈ లోపలే అలాంటి ఒక సందర్భం వస్తుందని...

ఆ క్షణంలో సహస్రకుగాని దీక్షకు గాని తెలీదు...

ఆవిడ పేరు సుకుమారి...

వయసు నలభై సంవత్సరాలు...

మనిషి కాస్త పొడవు సరిపడా లావుతో ఎర్రగా అందంగా వుంటుంది. పొందికైన రూపం. కొద్దిగా చదువు సంస్కారం కలిగిన స్త్రీ. సుకుమారి, చక్కని మాటకారి, అణకువ విధేయత ఆమె స్వభావం. ఆమెతో ఎవరు మాట్లాడినా మళ్ళి మళ్ళి మాట్లాడాలనుకుంటారు. అంతటి మంచితనం ఆమె సొంతం. ఈ సుకుమారి లజ్ కార్నర్ లోని షాపింగ్ మాల్ లో నే సేల్స్ వుమన్ గా పని చేస్తోంది. సహస్ర దీక్షల కన్నా సీనియర్.

సుకుమారికి ఇంటర్ చదువుతున్న ఒక కూతురు, తొమ్మిదో తరగతి చదువుకొంటున్న ఒక కొడుకు వున్నారు. ఆమె జీ యన్ చెట్టి రోడ్డులోఉంటోంది.

అటువంటి సుకుమారిది ఓ విచిత్రమైన జీవితం...

ఆమె భర్త పేరు అరుణాచలం

అరుణాచలం కి తండ్రి సంపాదించి ఇచ్చిన రెండు ఇళ్ళున్నాయి. ఒకటి ఇక్కడ జి యన్ చెట్టి రోడ్ లో ఉంది. రెండో యిల్లు అయన వరంలో వుంది. ఆ యిల్లు అద్దె కిచ్చి భార్యా భర్త లిద్దరూ ఇక్కడ కాపురం ఉండే వారు.అరుణా చలం మంచి వాడే...

ఆర్టిసిలో సిటీ సర్వీస్ డ్రయివర్ గా చేసే వాడు. ఏ లోటులేని జీవితం. సంసారం సుఖంగా సాగి పోతోంది. ఇద్దరు పిల్లలు పుట్టారు. క్రమంగా వాళ్ళు పెద్ద వాళ్ళవుతూ బాగా చదువు కుంటున్నారు.

జీవితం ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో చెప్పలేం. ఉన్నట్టుండి సుకుమారి జీవితం కష్టాల మలుపులో ప్రవేశించింది. చెడు సావాసాలు మొదలై ఆమె భర్తలో మార్పు వచ్చింది. అరుణా చలం తాగుడు కి అలవాటు పడ్డాడు. మరో స్త్రీకి దగ్గరయ్యాడు. ఇంటి ఖర్చులకి డబ్బులివ్వటం తగ్గి పోతోంది. తరచు గొడవలు. భార్యను కొట్టేవాడు. వేధించేవాడు. అందిన చోట అప్పులు చేసి కుటుంబాన్ని పట్టించుకోవటం మానేసాడు. దాంతో కుటుంబ బాధ్యత సుకుమారి మీద పడిన్ది.

ఈ పరిస్థితుల్లో వేరే దారి లేక షాపింగ్ మాల్లో ఉద్యోగానికి చేరింది. అరుణా చలం తాగి వచ్చి అర్ధరాత్రి పిల్లల్ని కూడ కొట్టే వాడు. డబ్బులిమ్మని వేధించే వాడు. ఇక ఆ బాధలు పడలేక గృహ హింస చట్టం కింద అరుణా చలం మీద పోలీస్ కేసు పెట్టి విడాకులు కోరుతూ కోర్టుకెక్కింది సుకుమారి. సంవత్సరం క్రితం కోర్టు అరుణా చలం సుకుమారి దంపతులకు విడాకులు మంజూరు చేస్తూ పిల్లల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకొని వారుంటున్నఇంటిని సుకుమారికి చెందేలా తీర్పు చెప్పింది.

ఆ తర్వాత అరుణా చలం రెండో ఇంటిని అమ్ముకొని తనకు నచ్చిన స్త్రీతో చెన్నై వదిలి వెళ్ళి పోయినట్టు తెలిసింది. ప్రస్తుతం అతనెక్కడ ఉండేది ఎవరికీ తెలీదు. కోర్టు తీర్పుకు ముందే తాగి బస్సు నడుపుతున్నాడనే అభియోగం మీద ఆర్టిసి అధికారులు అతడ్ని విధుల నుంచి తొలగించారు.

ఆ తర్వాత అప్పులు వాళ్ళు కొందరు సుకుమారిని బెదిరించి ఎలాగైనా ఇల్లు రాయించుకోవాలని చూసారు. కాని సుకుమారి వాళ్ళెవరినీ లెక్క చేయకుండా నిలదొక్కుకుంది. ఇంటి మీద వచ్చే కొద్ది పాటి అద్దె డబ్బులు తన ఉద్యోగం వల్ల వచ్చే జీతం డబ్బుతో పిల్లల్నిపెంచుకొంటూ గుట్టుగా పరువుగా బతుకుతోంది సుకుమారి.

షాపింగ్ మాల్ లో సహస్ర, దీక్షలు సుకుమారిని ఆంటీ అని ఆప్యాయంగా పిలుస్తారు. ఆ చనువుతో తన ఇంటి విషయాలన్నీ వాళ్ళకు చెప్పేది. ఆ విధంగా సుకుమారి గురించి సహస్ర దీక్షలకు చాలా విషయాలు తెలుసు.

********                 ********                 ********                 ********               

అటువంటి జియన్ చెట్టి రోడ్ లో...

ఎప్పటి లాగే ఆ రోజు కూడ...

బస్ దిగి ఇంటికి త్వరగా చేరుకోవాలని వడి వడిగా నడుస్తోంది. అంతలో ఇద్దరు యువకులు ఆమె దారికి అడ్డం వచ్చారు. పాతికేళ్ళు మించని కుర్రాళ్ళు వాళ్ళు. రఫ్ గా వున్నారు.

‘‘ ఏయ్...........అన్న పిలుస్తున్నాడు పద ’’ అన్నాడు మొరటుగా ఒకడు. సుకుమారికి అర్ధం కాలేదు.

‘‘ఎవర్రా మీరు? ఎవడ్రా మీ అన్నా పోకిరి వెధవల్లారా తప్పు కోండి’’ అంటూ తప్పించుకు పోబోయింది.

‘‘ఏమిటి? అన్న పిలుస్తున్నాడంటే వినబళ్ళా?’’ అంటూ రెండో వాడు ఆమె జబ్బ పట్టి వెనక్కి లాగాడు. మరుక్షణం వాడి చెంప ఛెళ్ళు మనిపించింది సుకుమారి కోపంతో భగ్గుమంటూ.

‘‘ఎవడ్రా నువ్వు నీ అమ్మ లాంటిదాన్ని. అమర్యాదగా మాట్లాడుతావా. పళ్ళు రాలి పోతాయ్. జాగ్రత్త’’ అనరిచింది.

ఇంతలో...

‘‘దాంతో మాటలేమిట్రా ఇటు లాక్కురండి’’ అంటూ చీకట్లోంచి ఓ గొంతు గరగరలాడిన్ది.ఆ గొంతు వింటూనే అదిరి పడి...అటు చూసింది సుకుమారి...

వీధి లైటు కాంతి చాలా తక్కువ వుందక్కడ...

ఆ చిరు చీకట్లలో ఆగుంది జీప్ ఒకటి.

జీప్ మీద కూర్చున్నాడు బలిష్టమైన వ్యక్తి. జీప్ లో వేరే అర డజను మంది ఉన్నారు.  వాళ్ళు కూడా జీప్ దిగి వెళ్ళి పారిపోవాలని చూస్తున్న సుకుమారిని లాక్కొచ్చి అతడి ముందు నిలబెట్టారు.

ఆ దృఢకాయుడి పేరు శిఖామణి.

తేనాం పేటకు చెందిన పేరు మోసిన గుండా.

ఈ శిఖా మణి మనిషి నల్లగా ఆరడుగుల ఎత్తున పహిల్వాన్ లా వుంటాడు. బోడి గుండు, చెవులకు బంగారు రింగులు. మెడలో గోల్డ్ చైను ఉంటుంది. ఎప్పుడూ నలుపు రంగు ప్యాంటు షర్టుతో తిరుగుతుంటాడు. వీడి పేరు చెప్తే తేనాం పేట ఏరియాలో భయపడని వారుండరు. దాదాగిరీ చేయటం, దందా పనులు చేయటం వీడి పని. అవసరానికి అప్పులిచ్చి అధిక వడ్డీ గుంజుతాడు. చెప్పినంతా యివ్వక పోతే కాలో చెయ్యో తీసేస్తాడు. వాడి మీద అనేక కేసులున్నాయి.

అప్పట్లో సుకుమారి భర్త అరుణా చలం శిఖామణి వద్ద ఏభై వేలు తీసుకున్నాట్ట. వడ్డీతో సహా అది లక్ష రూపాయలైంది. ఆ డబ్బు తీర్చమని సుకుమారిని వేధిస్తున్నాడు. ఆ బాకీకి తనకు ఎలాంటి సబంధం లేదంటున్నా విన్పించుకోవటం లేదు.

ఆమెను చూసి వెకిలిగా నవ్వుతూ జీప్ దిగాడు శిఖామణి.

‘‘ఏమిటి కంగారు పడుతున్నావ్? మీ బాకీ కోసం ఇంకా ఎన్ని రోజులు తిరగాలి నేను? మర్యాదగా బాకీ తీర్చమన్నాను. నువ్వు వినలేదు. కాబట్టి నేనో నిర్ణయానికొచ్చాను’’ అంటూ భుజం మీద చెయ్యేసాడు.

ఆ చేతిని విదిల్చి కొట్టింది సుకుమారి.

‘‘నీ నిర్ణయంతో నాకేం పని?’’ అంటూ గద్దించింది.

‘‘నా మొగుడికి సంవత్సరం క్రితమే విడాకులిచ్చాను. నేను నా పిల్లలు గుట్టుగా బతుకుతున్నాం. దయచేసి నన్ను అల్లరి చేయకు. నీకు దండం పెడతాను. నా మొగుడు చేసిన అప్పులకు నేను బాద్యురాల్ని కాను. ఆడదాన్ని అంత బాకీ ఎలా తీర్చగలను’’ అంది కన్నీళ్ళతో అర్థిస్తూ.

‘‘నీ కన్నీళ్ళు నన్ను మార్చ లేవు. నాకు డబ్బు ముఖ్యం. నీ మొగుడికి నేను అప్పిచ్చే నాటికి మీరు కలిసే ఉన్నారు. కాబట్టి నా బాకీ తీర్చాల్సిన బాధ్యత నీకూ వుంది. నీ మొగుడు గుట్టు చప్పుడు గాకుండా ఇల్లమ్ముకొని చెన్నై వదిలి ఎటో వెళ్ళి పోయాడు. వాడ్నెలాగూ పట్టుకోలేం. అంచేత నువ్వే బాకీ తీర్చాలి. వయసులో మిసమిసలాడుతున్నావ్? డబ్బు రూపేణా గాకుండా మరోలా బాకీ తీర్చొచ్చు. పద ఓ సంవత్సరం పాటు నా అడ్డాలోనే పక్కనుండి బాకీ తీర్చిపో. దీన్ని జీప్ ఎక్కించండ్రా’’ అన్నాడు శిఖామణి.

ఆ మాటతో సుకుమారికి.

ఒక్క సారిగా గుండె ఆగినంత పనయింది.

‘‘వద్దు వద్దు, అంత పని చేయకు. నీకు దండం పెడతాను. నా బిడ్డలు అనాధలయి పోతారు. నా జీవితం నాశనం చేయకు’’ అంటూ బావురు మంటూ కన్నీళ్ళతో అర్ధించింది.

‘‘ఈ బుద్ధి మర్యాద నా బాకీ తీర్చమని అడిగినప్పుడుండాలి. ఇప్పుడు కాదు. ఈ శిఖామణి ఒక నిర్ణయానికొస్తే దానికి తిరుగు లేదు. నువ్వు పైసా బాకీ తీర్చక్కర్లేదు. నాతో ఉండు. అంతే. చూస్తారేం రా... ఎత్తి జీప్ లో పడేయండి’’ అనరిచాడు.

తనను పట్టుకో బోయిన వాళ్ళని విదిల్చి కొట్టి పారిపోవాలని చూసింది సుకుమారి. వెంటనే ఆమె జుత్తు పట్టి వెనక్కి లాగాడు శిఖామణి. ఇంతలో...

‘‘ఆగు’’ అంటూ ఒక యువతి గొంతు చిరుత పులి ఘర్జనలా విన్పించి ఉలికి పడ్డారంతా.

ఆ రోజు ఉదయం..

‘‘పిల్లల స్కూలు ఫీజుకి చాలా ఇబ్బందిగా వుంది ఓ రెండు వేలు సర్ద గలవా? జీతం రాగానే ఇచ్చేస్తాను’’ అంటూ షాపింగ్ మాల్ లో సహస్రను అడిగింది సుకుమారి.

ఎంతో అవసరమైతే గాని సుకుమారి అడగదు.

‘‘అలాగే ఆన్టీ సాయంత్రం వెళ్ళేటప్పుడు అడగండి యిస్తాను’’ అంది సహస్ర.

షాపింగ్ మాల్ లో సహస్ర అంటే ఎవరికీ తెలీదు. అంతా ఆమెను సుసా అని పిలుస్తారు. ముందు జాగ్రత్తతో అక్కడ తన పేరును సుసాగా మార్చుకుంది. సుసా అనగానే తనను ముస్లిం అమ్మాయే అనుకుంటారనీ అందుకే ముఖానికి చున్నీ చుట్టుకొని వస్తోందని అనుకుంటారని అలా చేసింది. కాబట్టి ఇప్పుడు బురఖాలో తిరుగుతున్న సుసాగా ఆమెను ఎవరూ ఇంత వరకు అనుమానించలేదు. దీక్ష పేరు మార్చుకోలేదు గాని ఆమె బురఖా ధరించినా ఎవరూ పట్టించుకోరు.

ఇలా ఉండగా ఉదయం డబ్బులడిగిన సుకుమారి ఆ సంగతి మర్చిపోయి డ్యూటీ దిగి బస్ లో వెళ్ళిపోయింది. దాంతో డబ్బు ఎంత అవసరమో ఏమిటో దారిలో డబ్బులిచ్చి వెళ్ళి పోదామనే ఉద్దేశంతో స్కూటీని జియన్ చెట్టి రోడ్ కి పోనిచ్చింది సహస్ర.దూరంలో ఉండగానే వీధి లైట్ల కింద...

నడుచుకుంటూ పోతున్న సుకుమారిని చూసారిద్దరు..

ఇంకా ఇరవై సెకన్లలో సుకుమారిని చేరుకోవచ్చనగా సడెన్ గా స్కూటీని పక్కకు తీసి ఆపింది సహస్ర.

‘‘ఏమైంది ఇక్కడే ఆపేసావ్?’’ అడిగింది వెనక కూచున్న దీక్ష.

‘‘అటు చూడు. ఎవరో ఇద్దరు యువకులు ఆన్టీని ఆపిి గొడవ చేస్తున్నారు’’ అంది సహస్ర.

అక్కడికి సుమారు రెండు వందల గజాల దూరంలోనే జరుగుతోందా సంఘటన. దీక్ష చూస్తుండగానే సుకుమారి ఒకడి చెంప మీద కొట్టింది. ఆమెను బలవంతంగా పక్కకు లాక్కు పోతున్నారు.

అక్కడ వీధిలైటు కాంతి...

రోడ్ వైపే ఎక్కువ ఫోకస్ అవుతోంది.

వెనక పక్క ఖాళీ స్థలంలో మసక చీకటిగా వుంది. ఆ చీకట్లలో ఒక జీపు, మరి కొందరు కన్పిస్తున్నారు. రోడ్ లో పోతున్న వెహికిల్స్  లైట్ల కాంతిలో ఆ జీప్ మీద కూచున్న తేనాంపేట మణిని చూసి ఉలికి పడిన్ది దీక్ష.

‘‘మై గాడ్, వాళ్ళు తేనాం పేట శిఖామణి మనుషులు. శిఖామణి కూడ అక్కడే ఉన్నాడు. అన్టీని శిఖామణి అల్లరి చేస్తున్నాడు. బహుశ బాకీ కోసం బెదిరిస్తున్నట్టున్నారు’’ అంది కంగారు పడుతూ దీక్ష.

‘‘బెదిరించటం లేదు. వాడేదో దుర్మార్గం ఆలోచనతోటే వచ్చినట్టుంది’’ అంటూ స్కూటీ దిగింది సహస్ర.

‘‘నువ్వెక్కడికే?’’ అంది కంగారుగా దీక్ష.

‘‘అక్కడికే, ఏం జరుగుతోందో చూసొస్తాను.’’

.....................................ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా..........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra