Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

 జరిగిన కథ : విరాట్ నూ, విశాలనూ గుడి దగ్గర చూసిన సహస్ర ఇంటికొచ్చి ఏడుస్తూ కూర్చుంటుంది. ఆమెను ఓదారుస్తుంది దీక్ష. సహస్ర-దీక్షల కొలీగ్ సుకుమారి అనే నడివయసు స్త్రీని దారిలో అటకాయించి, ఆమె భర్త చేసిన అప్పు తీర్చమని వేధిస్తుంటారు తేనాంపేట రౌడీలు. ఆ దారిగుండా వెళ్తున్న సహస్ర-దీక్షల కంటబడుతుందా దృశ్యం...ఆ తర్వాత.....

‘‘వద్దు వద్దు. వాడసలే పెద్ద గుండా. నువ్వున్నపరిస్థితిలో ఇప్పుడిలాంటి గొడవల్లో తల దూర్చటం క్షేమం కాదు. నా మాట విను’’

‘‘వినను... ఆన్టీ అంటూ మనందరం ఎంతో ఆప్యాయంగా పిలచుకునే ఆన్టీ అక్కడ ప్రమాదకర స్థితిలో వుంటే చూస్తూ ఎలా వెళ్ళటం? అంత మంచి ఆన్టీకి సాయపడక పోతే పాపం. ఇప్పుడే వచ్చేస్తాను’’ అంటూ బురఖా తీసి దీక్షకిచ్చేసింది.ఈ రోజు చూడీదార్ లో వుంది సహస్ర.

చున్నీ తీసి పూర్వం లాగే ముఖానికి చుట్టుకుంది. ‘‘ఇంకో సారి ఆలోచించవే ఇది రౌడీలతో వ్యవహారం ’’ ఎలాగైనా సహస్రనాపాలని చూసింది దీక్ష. కాని సహస్ర వినలేదు.

‘‘ఒక వేళ గొడవ రైజయితే నువ్వు దగ్గరకు రాకు. సమస్యకు దూరంగా వుండు. లేదంటే ప్రమాదం’’ అంటూ హెచ్చరించి వడి వడి గా సుకుమారి వైపు నడిచింది.

అటే చూస్తున్న దీక్షకి...

సుకుమారి అరుపులు ఏడుపు విన వచ్చింది. సరిగా తెలీటం లేదు గాని పారిపోబోతుంటే ఆమెను జుత్తు పట్టి లాక్కొస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే దీక్షకు భయం వేసింది. గొడవ పెరక్కుండా ఉండదనిపించింది. సహస్ర క్షేమం తనకు ముఖ్యం. తను ఎంత ఫైటరయినా ఎదురుగా ఉంది తేనాం పేట రౌడీ గుంపు. ఎందుకైనా మంచిదని సెల్ అందుకొని చందూ నంబర్ కి ఫోన్ చేసింది.

వెంటనే లైన్ లో కొచ్చాడు చందూ.

‘‘ఎక్కడున్నావ్ చందూ?’’ అడిగింది.

‘‘ఇప్పుడే నా బైక్ మీద నేను విరాట్ ఇంటికి వస్తూ దారిలో వున్నాం’’

‘‘విరాట్ నీతోనే ఉన్నాడా?’’

‘‘అవును,’’

‘‘చెప్పేది జాగ్రత్తగా విను, ఇక్కడ సహస్ర ట్రబుల్లోకి ఎంటరయింది.’’ అంటూ జరిగిన విషయాన్ని చకచకా చెప్పేసింది.

‘‘ఎక్కడున్నారు మీరు?’’ కంగారుగా అడిగాడు విరాట్.

‘‘ జి యన్ చెట్టి రోడ్ లో ’’

‘‘ ఒకె కంగారు పడకు. పరిస్థితి గమనిస్తుండు. వచ్చేస్తున్నాం’’ అంటూ లైన్ కట్ చేసాడు విరాట్ .

ఇదే సమయంలో....

ఎప్పుడైతే సహస్ర స్కూటీ ఆపి దిగిందో ఆ వెంటనే అంత వరకూ వాళ్ళని ఫాలో చేసి వస్తున్న మును సామి మనుషులిద్దరూ ఆటో దిగి పంపించేసారు. వెంటనే మునుసామికి ఫోన్ చేసి పరిస్థితి రిపోర్ట్ చేసారు.

‘‘అవతలి వాళ్ళు ఎవర్రా? రౌడీలా?’’ అడిగాడు మునుసామి.‘‘తేనాం పేట పేరు మోసిన గుండా శిఖామణి వాడి మనుషులట’’ ఆటో వాడు చెప్పాడు.

‘‘ఎవరైనా గానీ సహస్ర జోలికొస్తే వదుల కూడదు. వెంటనే మనవాళ్ళని తీసుకొని వచ్చేస్తున్నాను. అవసరమైతే మీరు రంగం లోకి దిగి పోండి వచ్చేస్తున్నాం’’ అంటూ లైన్ కట్ చేసాడు మునుసామి.

ఈ లోపల మరో విశేషం జరిగింది...

చెన్నై వచ్చి లాడ్జిలో ఉంటూ సహస్ర కోసం గాలిస్తూన్న మధురై మహా దేవనాయకర్ మనుషులు కదిరేషన్ వడివేలు మిగిలిన వాళ్ళు రోజంతా ఇటు టి నగర్, ఓల్డ్ బళం, రంగ రాజ పురం పరిసరాల్ని గాలిస్తూ చీకటి పడే వరకూ ఇటే వస్తున్నారు.

ఆ పరిసరాల్లోకి వచ్చే సరికి అక్కడ చాలా మంది జనం గుంపు చేరి చూస్తుండగా మధ్యలో సినిమా షూటింగ్ లా పెద్ద ఫైట్ జరుగుతున్న దృశ్యం కంట బడిరది. కొందరు రౌడీల మధ్య ఒక అమ్మాయి అగ్ని శిఖలా మండి పడుతూ గుండాల దుమ్ము దులుపుతోంది. ఆ అమ్మాయి ఎవరో కాదు...

ఇన్ని రోజులూ తామంతా...

ఎవరి కోసం వెదుకున్నారో...

ఆ అమ్మాయి సహస్ర. అప్పటికే చున్నీ జారి పోవటంతో తిరిగి ముఖాన్ని కవర్ చేసుకునే అవకాశం లేకపోయిందామెకు.తామంతా ఆప్యాయంగా అమ్మాయి గారు అని పిలచుకునే తమ యజమాని గారాల పట్టి సహస్రను గుర్తించగానే జీప్ లోంచి దూకేసాడు కదిరేషన్.పరిస్థితి చూస్తుంటే...

చాలా ఉద్రిక్తంగా కన్పిస్తోంది...

ఎక్కడెక్కడి నుంచో రౌడీ మూకలు శర వేగంతో వచ్చి పడుతున్న సూచనలు కన్పిస్తున్నాయి.

ఆడపిల్ల ఒక్కదాన్ని చేసి అంతమంది దాడికి రావటం చూడగానే కదిరేషన్ కోపావేశంతో వీరభద్రుడిలా వూగిపోయాడు.‘‘రేయ్ ఇంకా చూస్తారేంటి! మన అమ్మాయి గార్ని ఒక్కదాన్ని చేసి వాళ్ళు తెగబడుతున్నారు. దెబ్బకి ఒకడ్ని పడగొట్టాలి. పదండి’’ అనరుస్తూ సర్రున జీప్ లోంచి ఇనుప రాడ్ ఒకటి అందుకొని శర వేగంతో సహస్రకు సాయంగా అటు పరుగెత్తాడు కదిరేషన్. వెనకే పూనకం వచ్చినట్టు బర బరా దిగి తలో ఆయుధం అందుకుని దూసుకెళ్ళి పోయారు మిగిలిన వాళ్ళు.

వడివేలు మాత్రం చివరిగా తన ఆయుధం అందుకొంటూ డ్రయివరు వంక చూసాడు.

‘‘పరిస్థితి చూస్తుంటే చాలా బీభత్సంగా మారేట్టుంది. ఏ క్షణంలోనయినా పోలీసులు రావచ్చు. ఎందుకైనా మంచిది. జీప్ ని ఆ సందులోకి పోనిచ్చి అలర్టు గా వుండు. నువ్వు రాకు. అవసరమైతే మనం పారిపోడానికి నువ్వు రెడీగా ఉంటే చాలు’’ అంటూ హెచ్చరించి బరిసె వూపుకొంటూ జనం మధ్యగా దూసుకెళ్ళి తనూ రంగంలోకి దూకేసాడు వడివేలు.

సహస్రకు సాయంగా...

ముందుగా ఫైటింగ్ లోకి ఎంటరైంది...

కదిరేషన్  గ్రూప్...

వాళ్ళ తర్వాతే సహస్ర దీక్షలను ఫాలో చేస్తూ వచ్చిన మును సామి మనుషులిద్దరూ కూడ పోరాటంలోకి ఎంటరయ్యారు.మరో అయిదు నిముషాలకు పోరాటం తీవ్ర రూపం దాలుస్తోందనగా మునుసామి బృందం వస్తూన్న వేన్ సుడిగాలిలా సంఘటనా స్థలానికి దూసుకొచ్చేసంది.వస్తూనే అరుపులు కేకలతో వేన్ లోంచి దూకేసారంతా దొమ్మిలోకి జొరబడి పోయారు. వాళ్ళ కన్నా ముందే చేతిలోని బాణా కర్రను విష్ణు చక్రం లా రివ్వు రివ్వున తిప్పుతూ జై భజరంగ భళీ అనరుస్తూ ఎడాపెడా ప్రత్యర్దుల్నివిరగ బాది, సహస్ర సమీపంలోకి వెళ్ళిపోయాడు మునుసామి.

‘‘సహస్రమ్మా, నీకొచ్చిన భయం లేదు తల్లీ. నీకు అండగా మేమంతా వచ్చేసాం. విరగ దీసెయ్ నీతో పెట్టుకుంటే ఏం జరుతుందో తేనాం పేట రౌడీలకు తెలియాలి. చితగొట్టెయ్. తర్వాత చూసుకుందాం’’ అనరిచాడు.

తీవ్రమైన పోరాటంలో తల మునకలయి వున్న సహస్ర అప్పటికే తమ మనుషులు కదిరేషన్ మిగిలిన వాళ్ళు తనకు సాయంగా రావటం గమనించింది. ఇప్పుడొచ్చిన కొత్త బేచ్ తో పరిచయం లేదు గాని వాళ్ళంతా మునుసామి మనుషులని తనకి రక్షణగా తన వెనక్కి వచ్చి అరిచిన పెద్దాయనే మునిసామి అయి వుంటాడని వూహించింది.

తనకు అండగా వీళ్ళంతా రావటంతో సహస్ర ఉత్సాహం రెట్టింపయింది. దొరికిన రౌడీని దొరికినట్టు విరగొట్టేస్తోంది. అరుపులు కేకలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం భయానకంగాను గందరగోళంగాను మారిపోయింది.

సరిగ్గా అప్పుడే...

ఎగువ నుంచి చందూ నడుపుతున్న బైక్...

శర వేగంతో అక్కడికి చేరుకుంది.

జరుగుతున్నదొమ్మీని చూడగానే మతి పోయింది. రోడ్ లో ట్రాఫిక్ నిలిచి పోయింది. జనం దూరంగా పరుగులు తీసి భయం భయంగా చూస్తున్నారు. ఉరుకులు పరుగులతో గుంపులు గుంపులుగా ఇంకా రౌడీ మూకలు వచ్చి పడుతున్నాయి. ఇది సహస్ర పొరబాటా తేనాం పేట రౌడీలు తప్పిదమా అని ఆటోచించే సమయం లేదు ముందు సహస్రను కాపాడుకొని నిరపాయంగా అవతలికి తీసుకు పోవాలి. పోలీసులు రంగ ప్రవేశం చేస్తే పరిస్థితి మరీ అధ్వాన్నంగా తయారవుతుంది.

‘‘పద నేనూ వస్తున్నాను’’ అంటూ చందూ బైక్ దిగబోతుంటే విరాట్ వారించాడు.

‘‘నీకిలాంటి ఫైటింగ్ లు దొమ్మీలు తెలీదు. పొరబాటున కూడ నువ్విందులో తల దూర్చకు. ఈ పరిసరాల్లోనే ఎక్కడో దీక్ష వుంటుంది. వెళ్ళి తననూ కూడ నీతో ఇంటికి తీసుకుపో. నేను సహస్రను మిగిలిన వాళ్ళని తీసుకొని వచ్చేస్తాను. మునుసామి మిగిలిన వాళ్ళు ఇక్కడే ఉన్నారు. భయం లేదు, ఇక్కడ్నుంచి వెంటనే దూరంగా వెళ్ళిపో క్విక్ ’’ అంటూ చందూని అక్కడ్నుంచి పంపించేసాడు విరాట్. బైక్ అటు వెళ్ళిన మరు క్షణం వేగంగా రౌడీల మధ్యకు దూసుకు పోయాడు.

సరిగ్గా ఇదే సమయంలో ఎగువ నుంచి బోగ్రోడ్ మీదుగా ధనగిరి బేచ్ ఇటే వస్తోంది. వేన్ లో ధనగిరితో బాటు షూటర్స్ విక్కీ, డైమండ్ లు కూడ వస్తున్నారు. వాళ్ళు క్కూడ సంఘటనా స్థలానికి చేరుకుంటే ఇక సందేహం లేదు అక్కడ జి యన్ చెట్టి రోడ్ లో ఒక అష్ట గ్రహకూటమి ఏర్పడినట్టే. ఇక ఆ కూటమిని చెదర గొట్టడానికి పోలీసులు ఎలాగూ రంగ ప్రవేశం తప్పదు.

ఈ              ఈ               ఈ

‘‘ఆగు!’’ అంటూ సహస్ర గొంతు వింటూనే శిఖామణితో బాటు అంతా ఉలికి పడ్డారు.

ఇంత ధైర్యంగా తమ ముందుకొచ్చింది ఎవరాని తిరిగి చూసారు. అప్పటికే శిఖామణి సుకుమారి జుత్తు పట్టి జీప్ వద్దకు లాకొచ్చేసాడు. దీనంగా అరుస్తూ ప్రార్ధిస్తూ కన్నీళ్ళతో అర్దిస్తూ వాడి కబంధ హస్తాల నుంచి బయట పడ్డానికి గింజుకుంటోంది సుకుమారి.‘‘ఏమిట్రా, చిట్టెలుక సింహం ముందుకొచ్చి అరుస్తోంది? బ్రతకాలని లేదా? దాన్నవతలకు పొమ్మనండి’’ అన్నాడు శిఖామణి విసుగ్గా. అదో పెద్ద జోక్ లా పగలపడి నవ్వారు గుండాలు.

‘‘అమ్మా సుసా, నువ్వెందుకొచ్చావమ్మా ఈ రాక్షసుల ముందుకీ. వీడు మనిషి కాదు మృగం. వెళ్ళిపోమ్మా. నా ఖర్మ ఎలా ఉంటే అలా జరుగుతుంది. వెంటనే ఇక్కడ్నుంచి వెళ్ళిపో’’ అనరిచింది సుకుమారి.

‘‘ఏం భయం లేదు’’ అంటూ మరి కాస్త ముందుకొచ్చింది సహస్ర.

‘‘ఏంటీ దౌర్జన్యం? ఆమెనెందుకు అల్లరి చేస్తున్నావ్? విడిచి పెట్టు’’ అంది కోపంగా శిఖామణి వంక చూస్తూ.వాడు ఒడిసి పట్టిన సుకుమారి జుత్తు వదల్లేదు సరి గదా తన కుర్రాళ్ళ వంక చూసి బండరాళ్ళు దొర్లిస్తున్నట్టు పగలపడి నవ్వాడు.

‘‘ఏంట్రా, నన్ను చూస్తే భయపడి ఛస్తారు జనం. అలాంటిది ముసుగు వీరుడిలా ముఖం దాచుకుని, ఓ కుర్ర పిల్ల నా ముందు కొచ్చి వదిలేయమని గద్దిస్తుంది. వదిలేద్దామా? కాస్సేపు దీన్ని పారి పోకుండా పట్టుకోండ్రా చెప్తాను’’ అంటూ జుత్తు వదిలి సుకుమారిని తన కుర్రాళ్ళ మీదకు తోసి ఇటు తిరిగాడు శిఖామణి. నలుగురు యువకులు సుకుమారి చేతుల్ని బలంగా పట్టుకొని నిలబెట్టారు. ఈ లోపల జీప్ లో వున్న మిగిలిన రౌడీలు కూడ దిగి వచ్చేసారు.

శిఖామణి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసి బోడ గుండు ఎడంచేత్తో తడుముకుంటూ సహస్రను నిశితంగా చూసాడు.

‘‘ఎవరే నువ్వు? నిజంగా ముస్లిం పిల్లవేనా? నీపేరు సుసానా? ఏం చూసుకుని నీకింత ధైర్యం? చిన్న పిల్లవి. నీలాంటోళ్ళ జోలికి మేం రాం గాని, వెళ్ళిపో. ఇది నీకు సబంధం లేని విసయం పో పో ’’ అన్నాడు.

‘‘వెళ్ళను.......నీ మంచి కోసమే చెప్తున్నాను. సుకుమారిని వదిలి వెళ్ళిపొండి’’ అంది స్థిరంగా సహస్ర.

‘‘పిట్ట కొంచెం కూత ఘనం. నా ముందుకు రాగలిగిన నీ ధైర్యాన్ని మెచ్చు కోవాలి.

‘‘చెప్తుంటే అర్ధం కాదా? చచ్చి పోతావ్. నా కుర్రాళ్ళస్సలు మంచోళ్ళు కాదు.........’’

‘‘నువ్వు మంచోడివా? కాదు. నేను నీ కుర్రాళ్ళ కన్నా నీ కన్నా కూడ మంచి దాన్ని కాదు. కారణం చెప్పకుండా మీరు వెళ్ళ లేరు. ’’‘‘ఒకె కారణం చెప్తాను. కాని నీకు భయపడి కాదు. ఇప్పుడు నీకేం కావాలి? దాన్ని మేం వదిలేయాలి అంతేగా? ఒకె........... వదిలేస్తాను. ఈ సుకుమారి నాకు లక్ష రూపాయలు బాకీ వుంది నువ్వు తీరుస్తావా? కమాన్, డబ్బిచ్చెయ్ వెంటనే వదిలేస్తాను. చెప్పు ఆ బాకీ ఇప్పుడే........ఇక్కడే...........నువ్వు తీరుస్తావా?’’ అరిచాడు. ‘‘ తీరుస్తాను. ’’

‘‘తీర్చు. ఇదీ సవాల్ అంటే ఇలా ఉండాలి ఒకే మన బాకీ ఈ పిల్ల తీర్చేస్తుందట్రా. కమాన్ యంగ్ లేడీ డబ్బువ్వు ’’

‘‘హలో శిఖామణి నువ్వు గుండు కొట్టించుకున్నంత సులువు కాదు డబ్బు వసూలంటే. నోటి మాటలతో పనులు కావు. నీ దగ్గర బాకీ పత్రం ఉంటే చూపించు. క్షణాల్లో నీ డబ్బుచ్చేస్తాను.’’

‘‘ఉంది. ఇప్పుడే చూపిస్తాను’’

‘‘తొందర పడకు. పత్రం ఎవరి పేరున ఉంది? ’’

‘‘దీని మొగుడు అరుణా చలం పేరున ’’

‘‘పత్రం మీద సుకుమారి సంతకం కూడ వుందా? ’’

‘‘ఏయ్ పిల్లా తెలివిగా అడుగుతున్నానుకుంటున్నావా? మొగుళ్ళకి అప్పులిచ్చేప్పుడు పెళ్ళాల దగ్గర సంతకాలు తీసుకోరు. ’’‘‘తీసుకోవాలి. అలా తీసుకుంటేనే మొగుడు ఎగ్గొట్టినా పెళ్ళాన్ని అడిగే ఛాన్సుంది. నువ్వా పని చేయలేదు. పైగా సంవత్సరం క్రితమే ఎప్పుడో తను భర్తకి విడాకులిచ్చింది. నీ బాకీతో తనకి ఏ విధంగా సంబంధమో చెప్పగలవా? నీ దగ్గర సమాధానం ఉండదు. దౌర్జన్యంగా వసూలు చేయాలన్నా, సుకుమారిని కిడ్నాప్ చేసి నిర్భందించాలన్నా వూరుకోను........’’

‘‘ఏయ్.............ఎవరితో మాటాడుతున్నావో తెలుసా?’’ హూంకరించాడు శిఖామణి.

‘‘నువ్వెవరో నాకు తెలుసు కాని నా గురించే నీకు తెలీదు. మర్యాదగా పత్రం మీద సుకుమారి సంతకం వుంటే చూపించు. ఈ క్షణమే మీరంతా ఆన్టీని వదలి పోవాలి ’’ కరుగ్గా డిమాండ్ చేసింది సహస్ర.

శిఖామణి తొందర పడలేదు.

కాని వాడి కుర్రాళ్ళలో ఒకడు తొందర పడ్డాడు...

అసహనంగా చూసాడు...

‘‘ఇంకా ఏందన్నా మాటలు?.......ఏయ్....వెళ్ళక పోతే ఏం చేస్తావ్ ’’ అంటూ దురుసుగా ముందుకు దూకి పిడికిలి బిగించి సహస్ర ముఖం మీద కొట్ట బోయాడు.

వాడు చేసిన అతి పెద్ద తప్పు అది.

అంత వరకు మాటలతో నడుస్తున్న వ్యవహారాన్ని...

చేతల వరకు తెచ్చాడు...

ఇలాంటి సందర్భాల్లో సహనం సంయమనం చాలా ముఖ్యం. చాలా సందర్బాల్లో గొడవలకి కారణం ఇలాంటి ఆత్రగాళ్ళే. ఇప్పుడూ అదే జరిగింది. చివరి క్షణం వరకూ కదలకుండా స్టడీగా నిలబడున్న సహస్ర వాడి చేయి ముఖం మీదు వస్తుండగా ఒక్కసారిగా మెరుపులా కదిలింది. చూస్తున్న వాళ్ళకీ సరిగా అర్ధం గాలేదు.ఎడం చేత్తో వాడి చేతిని బ్లాక్ చేస్తూ కుడి చేతి పిడికిలి బిగించి పంచ్ ప్రత్యర్ధి మెడను తాకింది. దాంతో కట్టెలా విరుచుకు పడ్డ వాడు తిరిగి లేవ లేదు.ఎవరూ వూహించని సంఘటనయిది...ఒక మనిషిని అంత సులువుగా పడగొట్టడం కేవలం సినిమాల్లోనే చూస్తాం. నిజ జీవితంలో చాలా అరుదు. శిఖామణి లాంటి పెద్ద గుండాకే కళ్ళు గిర్రున తిరిగినంత పనైంది. అతని కుర్రాళ్ళంతా దిగ్భ్రమ చెందారు. అదే క్షణంలో వాళ్ళలో మరొకడు తిరిగి తొందర పడ్డాడు. తమ వాడ్ని కొట్టిందన్న ఆవేశంలో వెనక ముందు ఆలోచించకుండా పొడవాటి ఇనప రాడ్ తో సహస్ర వైపు పరుగెత్తుకొచ్చాడు.కోపావేశంలో ఒక బ్లాక్ బెల్ట్  ఫైటర్ కితనే ఆయుధాన్నందిస్తున్నట్టు గుర్తించ లేదు వాడు.వాడ్నిచూడగానే వాడికి ఎదురు పరుగెత్తింది సహస్ర. ఒక్క సారిగా గాల్లోకి ఎగిరింది. వస్తున్నవాడ్ని వస్తున్నట్టే వాడి ఇనప రాడ్ పట్టిన చేతిని గాల్లోనే బ్లాక్ చేస్తూ మోకాళ్ళు మడిచి వాడి గుండెల్ని దారుణంగా తాకింది.అంతే...ఆమె దూకిన ఫోర్స్ కి తట్టుకోలేక...

కెవ్వున అరుస్తూ...

మొదలు నరికిన చెట్టులా వెల్లకిలా విరుచుకు పడి పోయాడు వాడు. ఆమె మోకాళ్ళ తాకిడికి గుండె రెండుగా చీలి పోతున్నంతగా బాధతో గావు కేక పెట్టాడు. వాడిపై నుంచి లేస్తూనే ఇనప రాడ్ ను సొంతం చేసుకుని ఈడ్చి కొట్టింది వాడ్ని. దెబ్బకు తల వాల్చేసాడు వాడు. ఇక వెనక ముందూ చూడకుండా...

సుకుమారిని బలవంతంగా పట్టి నిలబెట్టిన రౌడీల మీదకు దూసుకెళ్ళింది. ఎడాపెడా దొరికిన వాడ్ని దొరికినట్టు ఎక్కడ తగులుతుందో కూడ చూడకుండా విరగొట్టేసింది. వెర్రి కేకలు వేస్తూ వాళ్ళు సుకుమారిని వదిలి పక్కలకు పరుగులు తీసారు. వెంటనే సుకుమారిని కాస్త ముందుకు తీసుకెళ్తూ చుడీదార్ లోంచి ఒక నోట్ల కట్టను తీసి చేతిలో పెట్టింది సహస్ర.

‘‘ఆన్టీ......... ఇందులో మూడు వేలున్నాయి. చెప్పేది జాగ్రత్తగా విను. ఇప్పుడు ఇంటికి వెళ్ళగానే పిల్లల్ని తీసుకొని ఇంటికి తాళం వేసి ఎటైనా కొద్ది రోజులు మీ బంధువుల ఇంటికి వెళ్ళిపో....... వీళ్ళు నీ వెంట పడకుండా కొంత సేపు నేనాపుతాను. నా గురించి భయం లేదు. వెళ్ళి పో త్వరగా’’ అంటూ ముందుకు తోసింది.సుకుమారి సహస్రను గుండాలకు వదిలి వెళ్ళాలనిపించటం లేదు. అలాగని తను చేయగలిగిందీ లేదు. కన్నీళ్ళతో రెండు చేతులూ ఎత్తి నమస్కరిస్తుంటే వారించింది సహస్ర. ‘‘ముందిక్కడ్నుంచి వెళ్ళిపో ఆన్టీ. త్వరగా ’’ అంటూ హెచ్చరించింది. దొరికిన అవకాశాల్ని సద్వినియోగం చేసుకుంటూ అక్కడ్నుంచి జనాన్ని తప్పించుకొంటూ తన ఇంటి దిశగా వేగంగా పరుగెత్తి వెళ్ళిపోయింది సుకుమారి.అప్పటికే శిఖామణి గంగ వెర్రులెత్తి పోతున్నాడు. ఒక ఆడపిల్లేమిటి తనను నిలదీసి తన కుర్రాళ్ళని కొట్టటమేంటి? వాటంగా తమ చేతికి చిక్కిన సుకుమారిని నలుగురూ గమనించక ముందే జీప్ లో పడేసి తీసుకు పోవచ్చనుకుంటే చివరి క్షణంలో వచ్చి అడ్డం పడి విడిపించి తీసుకు పోతుందే. ఈ విషయం తెలిస్తే తేనాం పేటలో వీధి కుక్కలు కూడ తనకి భయపడవు. ఎవరో సాధారణమైన అమ్మాయనుకున్నాడు గాని మార్షల్ ఆర్ట్స్ లో దిట్ట అని తెలీక మోసపోయాడు.‘‘రేయ్ ఆపండ్రా....... పారిపోతున్నారు. వాళ్ళిద్దర్నీ ఆపండ్రా’’ అని అరుస్తూ ఒక ఇనప రాడ్ అందుకుని దూసుకు రాసాగాడు. వాడి మనుషులు...

శిఖామణి కన్నా ముందే ఒకర్నొకరు హెచ్చరించుకొంటూ ఆయుధాలతో సమీపించారు. సుకుమారిని పంపించగానే ఆమె వెనక ఎవరూ పోకుండా వాళ్ళ దారికి అడ్డంగా నిలబడిరది సహస్ర.

‘‘మీ అంతు చూడకుండా నేనెక్కడికి పోతాన్రా, రండి ’’ అనరిచింది సహస్ర.

ఈ లోపల గొడవ ఆరంభంలోనే అక్కడక్కడా కొందరు పౌరులు ఆగిపోయి గొడవ ఏమిటో అర్ధంగాక ఆసక్తిగా చూస్తున్నారు. వెహికిల్స్ లైట్ల కాంతిలో అక్కడుంది తేనాం పేట రౌడీలని గుర్తించగానే కొందరు భయంతో పరుగులు తీసారు. అయినా క్రమంగా దూరదూరంగా గుంపు చేరి పోతున్నారు. ఒక ఆడపిల్ల శిఖామణి లాంటి గుండాని ఎదిరించి దుమ్ము దులపటం ఆశ్చర్యంగా వుంది వాళ్ళకి.సుకుమారి వెంట ఎవరూ పడకుండా అడ్డంగా వున్న సహస్ర తిరిగి భద్రకాళిలా ప్రత్యర్ధుల మీద విజృంభించింది. కాళ్ళు విరుగుతున్నాయో చేతులు విరుగుతున్నాయో కూడ చూడకుండా దొరికిన వాడ్ని దొరికినట్టు చితగొట్టేస్తోంది. ఈ లోపల సమీప ప్రాంతాల్లో వున్న కొందరు గుండాలు శిఖామణి వాడి మనుషుల మీద ఎవరు దాడి చేస్తున్నారనీ వినగానే కర్రలు కత్తులతో శిఖామణికి అండగా పరుగులెత్తుకొచ్చారు. ఇదే సమయంలో మునుసామికి ఫోన్ చేసి చెప్పాక అతడి మనుషులిద్దరూ సహస్రకు సాయంగా తామూ పోరాటం లోకి ఎంటరై పోయారు.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
yatra