Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattistE koti

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : మంచుకొండలు చూసి మైమరచిపోయిన జీవన్ బృందానికి ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలుస్తుంది....నలభై యేళ్ళతర్వాత కాసిన ఎండకి మంచు కురిసి, పాతికేళ్ళక్రితం మంచులో కూరుకుపోయిన ఒక శవం బయటపడుతుంది....మంచు ఉన్నప్పుడు ఎంతో అందంగా కనిపించిన పరిసరాలు మంచు కరిగిన తర్వాత కళావిహీనంగా అనిపిస్తాయి...... ఆ తర్వాత.....

ఇద్దరు ముగ్గురు మా చుట్టూ మూగి ఏవయిందన్నారు.  అయినా చెప్పని చందర్రావు ఎప్పటికో నోరు విప్పి అన్నాడు. “చాలా తప్పు చేసేనండీ” అని.

“ఏవయిందండీ..?” అన్నాడు జీవన్. “మీతో పాటు ఆ మంచు కొండల సీనరీలో ఫోటో దిగుదాం అనుకున్నానా. దిగకండానే విమానం ఎక్కేసేం”

“అందుకా ఈ హడావుడంతా...? దుబాయ్ లో తీసుకుందాం” అన్నాడు జీవన్. “ఆ మంచు కొండలు అక్కడుంటాయా చెప్పండి. అక్కడంతా వేడేనట గదా..?” “దుబాయ్ కూడా మన జర్నీలో ఒక ఊరే గదా..! అయినా మీకు ఇంత ఫోటోల పిచ్చేంటి చందర్రావు గారూ...?”“ పిచ్చిగాదండీ, ఈ ఫోటోలు మా ముందు తరాల వాళ్ళంతా చూసి మా తాతయ్య గారు విదేశాలు పర్యటించేరని మురిసిపోవాలి గదా..” చాలా తన్మయత్వంతో ఎటో చూస్తూ అన్నాడు చందర్రావు.

అక్టోబర్ – 11

ఉదయం ఆరు గంటలకి దుబాయ్ ఎయిర్ పోర్ట్ లో లాండయింది ఫ్లైట్. చందర్రావు దగ్గర కొచ్చిన జార్జి ప్రసాదు “మన నాలుగు పాస్ పోర్టులూ ఎక్కడా..?” అన్నాడు. జేబులు తడుముకున్న చందర్రావు ముఖంలో టెన్షను పెరిగిపోతుంది. కళ్ళల్లోంచి నీళ్ళొచ్చేస్సేలాగున్నాయి. అతని వాలకం చూసిన జార్జి ప్రసాదు “ఎక్కడా పాస్ పోర్టులూ..?” అన్నాడు.

ఎక్కడో పారేసేనంటూ గొళ్ళుమన్నాడు చందర్రావు. చివరికని ఫ్లైట్లో చందర్రావు కూర్చున్న సీటు వెనక పడున్నాయి. రాత్రి పదీ నలభై అయిదుకట ఇండియా వెళ్ళే ఫ్లైటు. ఆ రోజు పద్నాలుగో రోజు, షహనాజ్ భవిష్యత్తు తేల్చే రోజు.ఫోన్ చేసి కనుక్కుందామనుంది జీవన్ కి.కానీ ఎలా...?

ఏమని..??

ఎప్పుడు హైదరాబాదులో దిగిపోదామా అనుంది. కానీ, ఎలాగా..?

నా దగ్గరున్న యూరోపియన్ కరెన్సీ తీసుకుని దరమ్స్ లోకి మార్చుకొచ్చిన జార్జి ప్రసాద్ అందరి దగ్గరికీ వచ్చి ఎవరి ఖర్చుల మీద వాళ్ళే వెళ్ళి సాయంత్రం ఏడు గంటల కల్లా ఇక్కడుండాలి అని గోవిందూ చందర్రావు లతో వెళ్ళిపోయాడు.

పక్కనే సిటీలో కొన్ని కొన్ని హోటల్స్ కి సంబంధించిన రిజర్వేషన్ కౌంటరుంది. కేపిటల్ హోటల్లో యోగి, జీవన్, వేగేష్ ఉండడానికి ఒక రూమ్ బుక్ చేశాడు యోగి. మీరు ఎయిర్ పోర్టు బయటికొస్తే హోటలుకి సంబంధిచిన మినీ బస్సు వస్తుంది. దాంట్లో బయల్దేరొచ్చు అంది కౌంటర్లో అమ్మాయి.

ఎయిర్ పోర్ట్ కొచ్చారు. తట్టుకోలేని వేడి, ఇన్నాళ్ళూ చల్లని ప్రదేశంలో హాయిగా ఉన్న వీళ్ళకి ఎప్పుడు ఏసీ రూములోకి దూరిపోదామా అనిపించింది. రకరకాల జనం రకరకాల హోటల్స్ కి సంబంధించిన కో – ఆర్డినేటర్సూ వస్తున్నారు. పాసింజర్లతో తిరిగి వెళ్తున్నారు గానీ ఈ కేపిటల్ హోటలు కి సంబంధించిన మనిషి మట్టుకి కనబడ్డం లేదు. ఎయిర్ పోర్ట్ బయట ఒక్కొక్కళ్ళు ఒకో మూల కూలబడిపోయేరు. హరిప్రియ, అనిల్ నేల మీద పెట్టిన సూట్ కేసుని చెరి సగం పంచుకుని కూర్చున్నారు. ఎండ వేడి తట్టుకోలేక పోతున్న యోగి, తన ఒంటి మీదున్న స్వెట్టరూ, జర్కిను లాంటివన్నీ విప్పేస్తున్నాడు.

ఎప్పటికో దిగాడు ఆ కేపిటల్ హోటలు మనిషి. అదీ వీళ్ళ కోసం రాలేదట. ఒక అట్ట మీద రెండు పేర్లు రాసుకుని తిరుగుతుంటే పట్టుకుని వీళ్ళ గురించి చెప్పేరు. ఒక వేన్ లో అందర్నీ కురి తీసుకెళ్ళాడు.

కెపిటల్ త్రీ స్టార్ హోటలు. స్నానాలు చేసి కిందకి దిగే సరికి జార్జి ప్రసాదూ తనతో తీసుకెళ్ళిన గోవిందూ, చందర్రావూ కనిపించలేదు. అంతా కల్సి దిగిన హోటలుకి ఎదురు బిల్డింగ్ లో ఈట్ అండ్ డ్రింక్ అనే మలయాళపు వాళ్ళ హోటలుంది. అందులో ఇడ్లీలూ దోశలూ తిని టీ తాగారు. అక్కడ్నించి ఎక్కడి కెళ్ళినా ఏసీయే. ఆఖరికి చిన్న షాపులో కెళితే అక్కడ టూ టన్ ఏసీ ఉంది.

రెండు టాక్సీల్లో షాపింగ్ కి బయల్దేరారు.  చూడ్డానికి అది అరబ్బుల ఊరయినా మళయాళం వాళ్ళెక్కువ. కారు డ్రైవరు మళయాళం వాడు. ఇందాక కేపిటల్ హోటలు డ్రైవరు కూడా మళయాళం వాడే. ఒక షాపులో యోగి, వేగేష్ కెమెరా స్టాండు కొంటుంటే అక్కడికొచ్చి చాలా బేరమాడి కుదరక పక్కనే ఉన్న షాపులో కెళ్ళారు. వాచీలు, ఒక కెమెరా కొంటుంటే అక్కడికొచ్చి చాలా బేరమాడి వెళ్ళిపోయిన చందర్రావు పేమెంటు మీద కెళ్ళి చైనా మేడ్ వి రెండు పెద్ద పెద్ద తాళం కప్పలు కొన్నాడు. ఆ షాపులోనే చాలా కొంటున్నాడు. ఈలోగా పక్క షాపునించి కెమెరా స్టాండు పట్టుకెళ్ళమని కబురు. చివరికి తేలిందేంటంటే రెండింటికీ ఓనరు ఒకడే. మూడున్నరయిపోయింది.మద్రాసులో ఫేమస్ వెజిటేరియన్ హోటల్ శరవణా భవన్ తాలూకు బ్రాంచి ఇక్కడ ఉంది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika