Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
yatra

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

 

జరిగిన కథ : చిన్నారి చంద్రకళ ప్రదర్శించిన నాట్య ప్రతిభను ప్రశంసిస్తూ దినపత్రికలో వచ్చిన వార్తను ఉదయమే చంద్రకళకు చూపిస్తారు నాన్న. మేస్టారు స్వయంగా వచ్చి తనదగ్గర కూచిపూడి నేర్చుకునే అవకాశమిస్తారు. వేసవి సెలవులు ఆరంభమవుతాయి..నాన్న కూడా లీవు తీసుకుని, అంతా కలిసి, గుంటూరు వెళ్ళబోతున్నామని చెప్పేసరికి సంతోషిస్తుంది చంద్రకళ.....ఆ తర్వాత.....

పొద్దున్నే దేవుడి గది నుండి బయటకి వస్తుంటే,  ఫోన్ రింగ్ అయింది... పికప్ చేసి ‘హలో’ అన్నాను. అవతలి నుండి అమ్మమ్మ గొంతు, “ఏరా బంగారం? బాగున్నావా? మిమ్మల్ని చూసి ఎన్నాళ్ళవుతుందో....నువ్వు  సెకండ్  క్లాస్ లో జాయిన్ అవ్వక ముందు చూసాము.  ఇప్పుడు  ఐదో క్లాస్ కొచ్చావంట.  ఇంకో వారం  రోజులు  ఓపిక  పట్టాలి  మీ రాక కోసం,” సంతోషంగా  ఆమె.

“అవునమ్మమ్మా  మాకూ  మిమ్మల్ని  చూడాలనుంది,” అన్నాను.

”ఫోనులో అమ్మమ్మే కదూ! ఓ పది నిముషాల్లో ఫోన్ చేసి అన్ని వివరాలు ఇస్తానని చెప్పి నువ్వు తినడానికి రా,” అంది ఇదంతా వింటున్న అమ్మ నాతో.  మరికాసేపు మాట్లాడాను అమ్మమ్మతో..

**

“ఇవాళ  నుండి సమ్మర్  హాలిడేస్  మొదలయ్యాయిగా.  ఎల్లుండే మన ప్రయాణం.  ముందు నాలుగు రోజులు మీ నానమ్మ వాళ్ళ దగ్గరికి, ఓ మూడు రోజులు అమ్మమ్మ వద్దకి వెళ్ళి వస్తాము.  తరువాత, సమ్మరంతా  నీ డాన్స్ క్లాస్ యదాతథం, నా పాట క్లాస్ మామూలే.  మళ్ళీ స్కూల్ తెరిచే లోగా, తమ్ముడు  బర్తడే సెలెబ్రేట్  చేద్దాము,”  అంది అమ్మ  ప్లేట్లల్లో  టిఫిన్ పెడుతూ.

తల తిప్పి  అమ్మ వంక చూసాను. కాఫీ సిప్ చేస్తుంది.

‘అమ్మని ఇప్పుడే అడగాలి’ అనుకున్నాను.

నాలుగు  స్పూన్స్  ఉప్మా కానిచ్చి, నీళ్ళు తాగాను.

“అమ్మా,  నాకు ఇప్పుడు బోలెడు కొత్త స్టెప్స్ కూడా వచ్చు.  నువ్వు పాడే ‘గోవర్ధన గిరిధారి!’ అనే పాటకి  నాకు  డాన్స్  తెలుసును.  మనం తిరిగొచ్చాక,  నాకోసం రోజూ పాడుతావా?  నేను ప్రాక్టీస్  చేస్తాను,”  అడిగాను.

“ఏమిటీ! ఈ మధ్యేగా నీకు అడుగులు, జతులు అయ్యాయి.  అంతలోనే, అలాంటి డాన్సా?” నవ్వింది అమ్మ.  “అప్పుడోసారి  క్లబ్బు  ప్రోగ్రాములో, ఆ  చిన్నమ్మాయి  బాగానే  చేసింది ఆ పాటకి. గుర్తుందా?” అంది నా వంక చూస్తూ అమ్మ.

క్షణమాగి, “అలాగేలే,  తిరిగొచ్చాక ప్రాక్టీస్  చేద్దువుగాని.  నేనూ  చూస్తాను,” అంది.

“ముందైతే, ప్రయాణానికి తయారవ్వండి.. నీ బట్టలవీ తీసి ఓసారి నీ బీరువా, తమ్ముడి అలమారా సర్దు,”  అంటూ మాకు హార్లిక్స్ కలిపి అందించింది.

**

ఒక రోజు  ప్రయాణం  తరువాత,  లంచ్ టైం కి కారులో ఎర్రగొండ పాలెం చేరాము.

మమ్మల్ని చూసి చాలా సంతోషపడ్డారు నానమ్మ, తాత.  మమ్మల్ని క్షణం వదలకుండా ఉన్నారు.  ఆ రోజు సాయంత్రం నుండే, మమ్మల్ని చూడ్డానికి నాన్న వాళ్ళ చుట్టాలు ఒకొక్కరే వచ్చారు.

నాన్నని కలవడానికంటూ, నానమ్మ ఊళ్ళో వాళ్ళందరిని పిలిచింది. 

మాకోసం రకరకాల వంటలు చేస్తున్నారు అత్తావాళ్ళు.  చీకటి  పడుతుండగా,  పెందరాళే తినాలంటూ,  విస్తళ్ళు వేసి కబుర్లు చెబూతూ  వడ్డించారు.  “నానమ్మ చేసిన పప్పు, ఉర్లగడ్డ  కారం ఎంత రుచిగా ఉన్నాయో చూసావా?  మీ అమ్మ కూడా ఇలా  చేయలేదు,” అన్నారు నాన్న.

**

మరునాడు కార్లో ఊరంతా తిప్పి, మా పొలం, తోట, రైస్ మిల్లు చూపించారు నాన్న.  తాతల నాటి ఆస్థులట.  నాన్నే వాటిని వృద్ది చేసి, వాళ్ళ అక్కల  పిల్లలకి  అప్పజెప్పారుట.

నీళ్ళ కోసం మోటారు పెట్టించమని,  తోట చుట్టూ  ఫెన్స్  వేయించమని, డబ్బు కావాలని, రోజంతా నాన్నతో అర్ధరాత్రి వరకు మాట్లాడారు అత్తయ్య వాళ్ళు,.....

**

మరుసటి రోజు కారులో శ్రీశైలం వెళ్ళి, దేవుని దర్శనం  చేసుకొని , సాయంత్రానికి తిరిగి పాలెం వచ్చాము.  రాత్రి ఆలస్యం అయేంత వరకు కూర్చుని కబుర్లు చెప్పారు నానమ్మ వాళ్ళు.

కొద్ది గంటలు మాత్రమే నిద్రపోయాము...

మళ్ళీ తెల్లారుజామునేఅక్కడి నుండి, అమ్మమ్మ వాళ్ళ ఊరు గుంటూరుకి బయలుదేరి పోయాము.

**

మమ్మల్ని చూసి అమ్మమ్మ, తాతయ్య చాలా సంతోషించారు.

నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని, రోజంతా  కబుర్లు  చెప్పింది  అమ్మమ్మ.  ఆస్ట్రేలియా పెద్దమ్మా వాళ్ళ గురించి, ఢిల్లీ  రాంమామయ్యా వాళ్ళ గురించి  బోలెడన్ని విషయాలు చెప్పింది.  వాళ్ళు గుంటూరుకి వస్తుంటారట.

“ఔనూ, నీకు గుర్తున్నారా మామయ్యా,  జగదీష్, అత్తయ్య?” అడిగింది అమ్మమ్మ నన్ను.

నాకు అంతగా గుర్తులేదన్నాను.  నేను వాళ్ళని చూసి ఐదేళ్లయిందని అమ్మంది.

**

మాకోసం ఎన్నో వంటకాలు చేయించింది అమ్మమ్మ.

తాతయ్య మమ్మల్ని షాపింగ్ తీసుకువెళ్ళి,  నాకు, తమ్ముడికి బంగారపు గొలుసులు కొని పెట్టారు. మూడు రోజులసమయం చాలా సరదాగా గడిచిపోయింది....తిరిగి చెన్నై వెళ్ళిపోయే రోజు,  మమ్మల్ని వాళ్ళ గురువుగారి ఆశ్రమంకి తీసుకువెళ్ళింది అమ్మమ్మ.  అక్కడ  ఆయన ఆశీర్వాదం తీసుకున్నాము.

**

ఆశ్రమం నుండి ఇల్లు చేరాక, దగ్గరుండి అందరికీ భోజనం వడ్డించింది అమ్మమ్మ.

“ఏంటో, ఇలా తుర్రుమని వచ్చి పోతున్నారు.   దేనికి  టైం లేదు మీకు.  ఈ సారి వదిలేస్తున్నాను  గాని,  మళ్ళీ  వచ్చినప్పుడు,నువ్వు  నేర్చుకుంటున్న డాన్స్ చేసి చూపించాలి,” అంది నా భుజం మీద తట్టి.

సాయంత్రం బయలుదేరి పోతుంటే అమ్మమ్మ కన్నీళ్లు పెట్టుకుంది.

**

గుంటూరు  నుంచి వచ్చాక,  మా మాస్టారిగారి ‘డాన్స్ వర్క్ షాప్’ అటెండ్ అవుతూ, ‘గోవర్ధనగిరిధారి’ పాటకి డాన్స్ ప్రాక్టీసు మొదలు పెట్టాను.మ్యూజిక్  క్లాసులతో అమ్మ కూడా తీరిక లేకుండా అయిపొయింది.

**

స్కూల్  రి-వోపెన్  అయ్యాక,  కొత్త సబ్జెక్ట్స్, మ్యూజిక్ గ్రూప్ యాక్టివిటీస్  తో రెట్టింపు బిజీ అయ్యాను.  క్వార్టర్లీ  ఎగ్జామ్స్  అవుతూనే  ‘చిన్మయ మిషన్’  వారి  కృష్ణాష్టమి   ఫంక్షన్ లో ఈ యేడు కూడా పర్ఫాం చేయాలంది మధుమామీ.  అదేకాక,  ‘చిన్మయా అకడెమిక్   స్కాలర్ షిప్’ కమిటీ వారికి, నా బయోడేటాసబ్మిట్ చేసిందట మధుమామి...వాళ్ళ  గుర్తింపు  కూడా పొందే అవకాశం ఉందంది..

“మంచి వేదిక.  చక్కగా అలంకరించబోతున్నాము.  ‘గోవర్ధన గిరిధారి’ డాన్స్ చేయి,”  అంటూ మళ్ళీ వారానికి నా పేరు కూడా వేయించిన   ఇన్విటేషన్ కార్డ్స్ తెచ్చిచ్చింది ఆమె.

**

చిన్మయ వారి వేదిక అందంగా అలంకరించారు.  అమ్మ పాట శ్రావ్యంగా పాడింది.. ఎంతో ఆనందంగా నాట్యం చేసాను. డాన్స్ అవగానే  చిన్మయ వారు నాకు మొమెంటోతో పాటు, ‘యుంగ్ రోల్ - మాడల్ స్కాలర్ షిప్ అవార్డ్’  గా పాతిక వేల రూపాయల చెక్ ప్రెజెంట్ చేసారు... అనుకోని అవార్డును కరతాళ ధ్వనుల మధ్య అందుకున్నాను. 

**చిన్మయ ప్రోగ్రాం గురించి మా శివరామశర్మ మాస్టారు అడిగారు.  నేను చక్కగా చేసానని ఆయన కూడా విన్నారంట.   నేను  రెండుసార్లు  గెలుచుకున్న ‘టాలెంట్ షో ట్రోఫీ’ గురించి కూడా మాట్లాడారు.  నాకు ఎంతో గర్వంగా అనిపించింది.

**

శనివారం  పొద్దున్నేమేము కార్టూన్స్  చూస్తుండగా,  భూషణ్ అంకుల్ ఫోన్ చేసారు.  నేనే ‘హలో’ చెప్పి ఫోన్ అమ్మకిచ్చాను.  భూషణ్ అంకుల్ ఫేమస్ సినిమా యాక్టర్.  తెలుగు, తమిళ భాషల్లో హీరోగా చేసారంట.  ‘విజయ భూషణ్ సినీ స్టూడియో’ కట్టాక, ఇప్పుడు  మూవీ  ప్రొడ్యూసర్ కూడానట... మా కాంప్లెక్స్ ఎదురుగా పెద్ద బంగళాలో ఉంటారు.  అప్పుడప్పుడు ఫోన్ చేసి మమ్మల్ని  స్టుడియోలో  ఫంక్షన్స్ కి ఇన్వైట్  చేస్తుంటారు.

ఇవాళ  కూడా అందుకేనేమో ఫోన్  చేసారు.

మాతో ఫ్రెండ్లీగా ఉంటారు భూషణ్ అంకుల్.  నాతో సరదాగా, ప్రేమగా మాట్లాడుతాడు ఆయన.వాళ్ళమ్మాయి  రాణి అమ్మ దగ్గర మ్యూజిక్ నేర్చుకుంటుంది.  తను ఎయిత్ స్టాండర్డ్  చదువుతుంది.   స్కూల్లో నా సీనియర్.   ఫోన్ లో మాట్లాడుతున్న అమ్మ మాటలు వింటూ, నేను, బాబు టి.వి చూస్తున్నాము.

“హలో నిరుపమా,  ఎలా ఉన్నారు?  మీతో మాట్లాడుకుండా ఫోన్ ఎలా పెట్టేస్తాను?” క్షణమాగింది అమ్మ.  “ఆ..ఆల్ ది బెస్ట్, మీ కొత్త మూవీ రిలీజ్ కి....భూషణ్ గారు చెప్పారుగా ..తప్పకుండా వస్తాము.....,”  అంటూ  రాణి  వాళ్ళమ్మతో  మాట్లాడుతుంది అమ్మ.....

భూషణ్ అంకుల్,  నాన్నకి  కాలేజీ నుండి కూడా తెలుసంట.  ఇద్దరు కలిసి వాళ్ళ కాలేజీ నాటకాల్లో,  కాక కొన్ని సినిమాల్లో  కూడా  పనిచేసారంట.  ఆ తరువాత, నాన్న ఆర్మీలో జాయిన్ అయితే, అంకుల్ మాత్రం సినిమా ఫీల్డులో సెటిల్ అయ్యాడంట..

నాకు  వాళ్ళ  విషయాలన్నీ ,అప్పుడప్పుడు నాన్న చెబుతుంటారు..

ఫోన్ పెట్టేసాక మాకు సంగతి చెప్పింది అమ్మ.  మరునాడు ఆదివారం, వాళ్ళ స్టుడియోలో సినిమా ప్రీవ్యూకి,  తరువాత డిన్నర్ కి మమ్మల్ని ఇన్వైట్ చేసారంట  భూషణ్ అంకుల్.

బాబుని  కన్నన్ కి  అప్పజెప్పి  సినిమా  ప్రీవ్యూ కి  వెళదామంది అమ్మ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్