Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ - ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

ఇదివరకటి రోజుల్లోనే హాయిగా ఉండేది—ఫోన్లూ అవీ  కొత్తగా వచ్చిన రోజుల్లో, మనకి కొత్తగా పరిచయమైన వారితో, ఇంకా సంబంధబాంధవ్యాలు కొనసాగాలిద్దామనుకుంటే, వారి ఫోను నెంబరు, ఏదో మూడు నాలుగంకెల్లోనే ఉండేది, వెంటనే, జేబులో ఉండే, బుల్లి పుస్తకంలో వ్రాసేసుకునేవారం. అయినా ఆ రోజుల్లో ఫోనులు రావడం అనేదే అరుదుగా ఉండేదనుకోండి. ఈ ఫోనులు కూడా ఏ పోస్టాఫీసులోనో ఉండేవి. ఊళ్ళో ఎవరికైనా ఫోను వచ్చిందీ అంటే, అదేదో గొప్ప విషయంగా భావించేవారు. అలాగే పైఊళ్ళోఉండే ఎవరికైనా ఫోను చేయాలంటే, అదో పెద్ద తతంగం  గా ఉండేది. పోస్టాఫీసుకి వెళ్ళి, అదేదో ట్రంక్ కాల్ అని చేసేవారు. ఓ గంట ఆ పోస్టాఫీసు బయట వరండాలో, పడిగాపులు పడుతూ వేచి ఉన్నతరువాత, మొత్తానికి ఆ లైనేదో కలిసేది. తీరా మాట్టాడడం మొదలెట్టేసరికి, మూడు నిమిషాల్లో ఓ బ్లీప్ వచ్చేది. కాల క్రమేణా,  మనమే స్వంతంగా ఫోనుచేసికునే సదుపాయం, ఆ నెంబర్ల ముందర ఓ కోడ్డూ, వగైరా వచ్చాయి. వీటన్నిటికీ ఊరూరికీ టెలిఫోన్ బూత్ లు వెలిశాయి. మళ్ళీ ఇందులో రెండు రకాలు- లోకల్ అయితే, ఆ బూత్ లోకి వెళ్ళి, ఓ రూపాయి బిళ్ళ వేస్తేనేకానీ, ఆ అవతలవాడి మాట వినిపించేది కాదు. ఇంకో ఊరికి చేయాల్సొస్తే, ఆ బూత్ బయటకి వచ్చి, అక్కడున్నవాడికి నెంబరు చెప్పి, వాడు లైను కలిపిన తరువాత మాట్టాడుకోడం, పూర్తయిన తరువాత, ఆ పక్కనే ఉన్న మీటరులో చూపించినంతా డబ్బులు కట్టేసి, ఓ దండం పెట్టడం.


  రోజులు గడిచేకొద్దీ, ఈ సమాచార వ్యవస్థలో ఊహించని మార్పులు వచ్చేశాయి. ఎక్కడదాకా వచ్చిందీ అంటే, చేతిలో ఓ “సెల్ ఫోను”  లేని మానవుడు కనిపించనంతగా. తినడానికి తిండి ఉండకపోవచ్చేమో కానీ, ఫోను మాత్రం తప్పకుండా ఉండాల్సిందే. అదేమిటో,  కర్మకాలి ఇంట్లో ఫోను మర్చిపోయామా, అంతే సంగతులు. ఏదో విలువైనదేదో పోగొట్టుకున్నంత బాధా, వ్యధా ఒకటెమిటి, ప్రపంచంలో ఉండే కష్టాలన్నీ తనకే వచ్చినంతగా ఫీలైపోయే స్థితికి వచ్చేశాము. పైగా ఇందులో ఓ చిత్రం ఒకటుంది. ఈ సెల్ ఫోన్లొచ్చిన తరువాత కొత్తగా వచ్చిన జాడ్యం ఇంకోటుంది. తన ఫోనునిండా వందలాది నెంబర్లుంటాయి. అవేవో కంఠతా పట్టాల్సిన అవసరంకూడా లేదు. ఎవరికి ఫోనుచేయాలో, వారి పేరు మీద నొక్కితే పనైపోయే రోజులు ఇవి. మెదడుకి అసలు పని చెప్తే కదా, అన్నీ క్షణాల్లో జరిగిపోతున్నాయి. ఇలా ఎప్పుడైనా, ఫోను పోగొట్టుకున్నా, ఇంట్లో మర్చిపోయి వచ్చినా, మన వాళ్ళ నెంబర్లు ఛస్తే గుర్తుకురావు. ఇంకోరి ఫోను నుంచో, లేదా  పూర్వవైభవానికి సాక్ష్యంగా మిగిలిన అరా కొరగా ఉన్న టెలిఫోను బూత్ లకి వెళ్ళిమాత్రం ఉపయోగమేమిటీ?


 ఇందులోనూ ఓ గొడవ, ఈ సెల్ ఫోన్లు మొదట్లో బాగానే విశ్వాసపాత్రంగా ఉంటాయి. కానీ కొన్ని రోజులు పోయాక అదేదో సాఫ్ట్ వేర్ ని అప్ డేట్ చేయాలిట. అదేదో చేయగానే, ఉన్నవన్నీ మాయం అయిపోతాయి. మళ్ళీ మొదలు రెడ్డొచ్చి మొదలాట లాగ.  మనలో చాలా మందికి ఓ దురలవాటుంది. రోమింగ్ ఛార్జెస్ ధర్మమా అని, బిల్లు తడిపి మోపెడయిపోతుందని, ఊళ్ళో ( స్వంత రాష్ట్రం) లో ఉండేటప్పుడు ఓ నెంబరూ, బయటి రాష్ట్రాలకి వెళ్ళినప్పుడు ఇంకో నెంబరూ.  పైగా తెలిసినవారిలో ముఖ్యులకి మాత్రమే ఈ రెండో నెంబరు చెప్పుకోవడం. ఎలాగూ మిగిలినవారి దగ్గరనుండి వచ్చే ఫోనులు ఎత్తే ప్రశ్నే లేదుగా ( రోమింగ్ ఛార్జీల సౌజన్యం ). ఎవరి సావకాశం, సదుపాయాన్ని బట్టి వాళ్ళిష్టం వచ్చినట్టు చేసికుంటారు, మనం ఎవరూ వారిని విమర్శించడానికీ?

కానీ, ప్రస్తుత ఈ వ్యాసం వ్రాసేది, ఇంకో ముఖ్యమైన సమస్య గురించి. చెప్పానుగా ఇదివరకటిరోజుల్లో, ఎవరితోనైనా పరిచయం అయితే, వారి నెంబరు ఓ బుల్లి పుస్తకంలో వివరాలు వ్రాసుకునే వారు. కానీ, బుల్లిపుస్తకాలూ అవీ అటకెక్కేశాయి. ఈరోజుల్లో చేతిలో ఓ సెల్ ఫోనుంటే చాలు, అన్ని పనులూ అయిపోతాయి. బ్యాంకులకెళ్ళి క్యూల్లో నుంచోనక్కరలేదు, రైల్వే స్టేషన్లకి రిజర్వేషన్లకి వెళ్ళాల్సిన పనిలేదు, పుస్తకాలు హాయిగా ఫోనులోనే చదివేసికోవచ్చు, పెళ్ళాంతో “ కాపరం” ఒకటీ చేసికునే సదుపాయం తప్పించి, మిగిలిన అవసరమైనవీ, అవసరంలేనివీ కావాల్సినన్ని పనులైపోతున్నాయి. ఇదంతా మన టెక్నాలజీ మహిమ. అన్నీ ఆ యంత్రాలే చేసేస్తే, ఇంక మనిషెందుకూ, కానీ కొన్ని మనిషే చేయగలిగింది ఒక ముఖ్యమైన విషయం ఒకటుంది.

  పరిచయం అయిన వ్యక్తి ఫోను నెంబరు తన చేతిలో ఉండే ఫోనులోనే save  చేసికునే సదుపాయం ఒకటి ఏడిసిందిగా, కానీ దాన్ని సద్వినియోగం కూడా చేసికోవద్దూ? నెంబరు నోట్ చేసేసికుంటే సరిపోయే రోజులు కావివి. ఆ నెంబరు ఎవరిదో, వారి “ప్రవర” కూడా రాసుకోవద్దూ? పోన్లెద్దూ, తరువాత రాసుకోవచ్చులే అని వదిలేస్తారు. ఆ నెంబరు ఎవడిదో, వారు ఏ సందర్భంలో పరిచయం అయారో గుర్తుకు రావాలి. లేకపోతే ఎందుకూ ఫోను నిండా ఆ మాయదారి నెంబర్లూ? పోనీ అలాగని మానుతారా, అబ్బే, ప్రతీవాడికీ తెలియాలి మనకో నెంబరుందని. అడిగినవాడికీ, అడగనివాడికీ ఇచ్చేయడం. రైలు ప్రయాణాల్లో జరుగుతూంటాయి ఇలాటివి. ఎవరిదో నెంబరు తీసికోడం, పేరో, ఊరో, దిబ్బో దిడిగుండమో తరువాత రాసుకోవచ్చని వదిలేయడం, తీరా రాద్దామనుకుంటే గుర్తుకు రాకపోవడం.. మొత్తానికి పేరుగుర్తొస్తుంది. కానీ అప్పటికే ఆ ఫోనులో ఆ పేరుతో ఇద్దరు ముగ్గురుండుంటారు.  చివరకి అవసరం వచ్చినప్పుడు, తనక్కావాల్సిన ఫలానా పేరువాడి నెంబరు గుర్తుకొచ్చి చావదు. పోనీ మానతాడా, అబ్బే పనవ్వొద్దూ? చేతికొచ్చిన నెంబరు ( పేరు మాత్రమే) చూసుకుని ఫోను చేసేసి, తనకి కావాల్సిన పని గురించి మాట్టాడడం. అసలు అవతలివాడు ఆ పనిచేస్తాడా లేదా అని చూసుకోవడంకూడా ఉండదు.

ఇదంతా ఎందుకు రాస్తున్నానంటే, మూడేళ్ళ క్రితం ఒకావిడ ఫోను చేసి, “ మా ఇంట్లో సంతర్పణ ఉందీ,   నూటయాభైమంది వస్తారూ, వంట చేయడానికి ఏమాత్రం తీసికుంటారూ..” అని. పైగా మడి కట్టుకుని మరీ వంట చేయాలిట ! ఏదో మొత్తానికి నేనెవరో పరిచయం చేసికుని, నాకు పాకశాస్త్రంలో ప్రావీణ్యంలేదని ఆవిడని ఒప్పించడానికి నానా తిప్పలూ పడ్డాను ! అలాగే, ఈ మధ్య ఓ వారం రోజులక్రితం, భాగ్యనగరం నుంచి ఓ ఫోనూ—అయిదింటికల్లా వచ్చేయ్. ఏడింటికి స్టేషనుకి వెళ్ళాలి అని. నేనెందుకండీ, మీ ఇంటికి రావడమూ, అని అడిగితే, “ నువ్వు డ్రైవరువి కావా..” అని ఎదురు ప్రశ్నా !!!

ఇలాటి అనుభవాలు జరగకుండా చూడాలనుకుంటే, మీరు ఫోన్లలో ఎవరివైనా నెంబర్లు నోట్ చేసికుంటే, వెంటనే, వారి పేరూ, ఊరూ రాసుకుంటే ఆరోగ్యమూ, ఇంటికీ వంటికీ మంచిదీనూ...
సర్వేజనా సుఖినోభవంతూ...

మరిన్ని శీర్షికలు
jayajayadevam