Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

యాత్ర

జరిగిన కథ : అందరూ కలిసి దుబాయ్ ఏర్ పోర్ట్ కి చేరుకుంటారు......ఇక అక్కణ్ణుంచి ఇండియాకి చేరుకోవడమే తరువాయి...ఆ తర్వాత

ఆ హోటల్లో కెళ్ళి తమిళం మాటాడ్తుంటే పని చేసే వాళ్ళంతా వీళ్ళని చాలా ఆదరంగా చూసేరు. వాళ్ళలో ఒకతన్ది కుట్రాళం అట. ఇంకో కుర్రాడిది మధురై దగ్గర పల్లెటూరు. జీవన్ ఇళయరాజా గారి కూడా కంపోజింగ్స్ కెళ్ళినప్పుడు ఈ ఊళ్ళన్నీ తిరిగాడు. ఇదంతా మాటాడ్తుంటే సొంత ఊళ్ళు వదిలొచ్చి ఎన్నో ఏళ్ళవడం వల్ల ఇదిగా మాటాడారు జీవన్ తో.

శరవణా భవన్ నించి బయటికొచ్చి ముందుకి నడుస్తుంటే సముద్రంలో ఒక పాయ ఊళ్ళోకొచ్చేసి ఉంది. అవతల ఒడ్డున దింపడానికి మోటరు బోట్లున్నాయి. ఆ ప్రాంతం పేరు అబ్రా అంటారట. విపరీతమైన ఎండ తట్టుకోలేక పోతున్నారీళ్ళు.

అవతల ఒడ్డున దిగి కొంత దూరం నడిచే సరికి గోల్డు మార్కెట్లు కొన్ని వందల షాపులు ఎన్నో టన్నుల బంగారం రాసులు పోసి అమ్ముతున్నారు. అయితే అక్కడ గోల్డు వ్యాపారం చేసే వాళ్ళంతా ఇండియన్ గుజరాతీస్.

అమాయకుడు అనుకున్న చందర్రావు మా అందరి కంటే ఎక్కువ బంగారం కొంటున్నాడు. నగల రూపంలో అయితే రేపు హైదరాబాద్ ఎయిర్ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు టాక్స్ వెయ్యరు. బిస్కెట్లు అయితే మట్టుకి గట్టిగా పడ్తుంది టాక్సు. ఆ ముక్కే చెప్పి “వద్దయ్యా బాబూ” అంటే వినకుండా బిస్కెట్లే కొన్నాడు. ఎవరి దారిన వాళ్ళం హోటలు కొచ్చి అన్నీ సర్దుకున్నాం.

రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో హోటలు ఏసీ వేన్ వచ్చి వీళ్ళని ఎయిర్ పోర్ట్ లో దింపింది.

లోపలున్న ట్వెంటీ ఫోర్ అవర్స్ షాపింగ్ కాంప్లెక్స్ లో అరబిక్ మ్యూజిక్ కేసేట్లూ సీడీలూ కొన్నాడు యోగి. జీవన్ స్టాన్లీ కూబ్రిక్ డైరెక్ట్ చేసిన ఓల్డ్ క్లాసిక్ ఫుట్ మెటల్ జూకెట్ డి.వి.డి కొన్నాడు.

హరిప్రియ, అనిలూ కల్సి అందరి కాంబినేషన్లో ఫోటోలు తీయించుకున్నారు.

హైదరాబాదులో లేండ్ అయ్యాకా కస్టమ్స్ వాళ్ళు మనిషికి మూడు బాటిల్స్ మించి ఒప్పుకోరు అంటున్నా వినకుండా మీరేదో చెపుతున్నారు గానీ మందేదిరా ఎదవా..? అంటే మా ఫ్రెండ్స్ కేం సమధానం చెప్పనూ అంటూ ఇరవై బ్లాక్ లేబిలు బాటిల్సు కొనేశాడు చందర్రావు.రాత్రి పదీ నలభై అయిదుకి ఫ్లైటు. ఇంకొన్ని గంటల్లో హైదరాబాదు చేరబోతున్నాం. పద్నాలుగో రోజు అయిపోయింది. ఆ షహనాజ్ ఎలాగుందో..? అసలెం తేలిందో..? రేపంతా అదే పని మీదుండాలి. దారి పొడుక్కీ అదే ఆలోచిస్తున్నాడు జీవన్.

అక్టోబర్ – 12

రెండున్నరకి హైదరాబాదులో లాండయింది ఫ్లైట్.

కస్టమ్స్ వాళ్ళ చేతుల్లో చాలా దారుణంగా ఇరుక్కుపోయాడు చందర్రావు.

వాళ్ళని కన్విన్స్ చెయ్యడానికి తనకి తెల్సున్న భాషలన్నీ ఉపయోగిస్తున్నాడు. ఫలానా ఎక్స్ ఎమ్మెల్యే గారికి కీప్ ఫ్రెండ్ నంటున్నాడు.దేనికీ చలించండం లేదు వాళ్ళు.జీవన్ లగేజీ వచ్చేసింది.అంతలో వచ్చిన మూడు కార్లూ ఒక సఫారీ వేన్ లో ప్రపధమంగా పరాయి దేశం వెళ్ళిని యోగిని రిసీవ్ చేసుకోవడం కోసం అతని తాలూకు జనం వచ్చారు. మళ్ళీ దండలూ స్టిల్ కెమెరాలూ మామూలే.యోగి దగ్గరకెళ్ళిన జీవన్ “ఈ కంపెనీ వాళ్ళు నన్ను పికప్ చేసుకునే సరికి చాలా టైమవుద్ది. నీ బండిలో వచ్చేస్తాను” అంటే, “మేటిజ్ లో వెళ్ళిపోండి మా సాయిగారు దింపేస్తడు” అన్నాడు.

బయల్దేరాడు వాళ్ళ ఇంటి వేపు.

జార్జి ప్రసాదు నించి ఫోనొచ్చింది “షహనాజ్ ఆత్మహత్య చేసుకుంది సార్” అని.

“ఏమిటీ..???” అన్నాడు జీవన్.

“షహనాజ్ ఆత్మహత్య చేసుకుంది” అన్నాడు జార్జి ప్రసాద్.

అంతే...

కొన్ని క్షణాలు జీవన్ కి ఊపిరాడ్డం మానేసింది. యూరప్ వెళ్ళి వచ్చేలోపు జీవన్ ఎక్కిన విమానాలూ, రైళ్ళూ, ట్రామ్ బళ్ళు తన మీంచి కర్కశంగా వెళ్ళిపోయినట్టు అనిపించింది.

షహనాజ్ ఇంటికి బయలుదేరాడు. ఎందుకు చనిపోయింది షహనాజ్..?

ఎందుకు ఆత్మహత్య చేసుకుంది షహనాజ్..?షహనాజ్ మనసుకి గాయం చేసిందెవరు..?ఎవరు చేశారు...?అసలెందుకు చేశారు..? అన్నీ ప్రశ్నలు.

సరే కనుక్కొని సుఖమేంటి..?

షహనాజ్ లేనప్పుడు ఇక ఆ వివరాలు తెల్సుకుందామన్న కుతూహలం జీవన్ కి ఏ మాత్రం కలగడం లేదు. ఏదో కారణం తో ఆమెని శంకించి ఉంటారు. ఆమెకి తెల్సు అది నిజం కాదని. నా అనుకున్న వాళ్ళే అనుమానించే సరికి ఇక భరించలేక చనిపోయింది. ఇది లేకపోతే ఇలాంటిదే ఇంకోటి జరిగి ఉంటుంది.

ఇంటి ముందు జనం. ఆమె దర్శనం చేసుకుని ఏడుస్తూ వస్తున్నారు. హాల్లో పడుకోబెట్టారు.దగ్గరికెళ్ళాడు జీవన్.పరిమళ ద్రవ్యాలు జల్లారు. అగరవత్తులూ, గుగ్గిలం పొగలు రకరకాల పూలు. వాటి మధ్యలో నల్లటి బురఖా వేసుకుని ఉన్న షహనాజ్ శవం. ఎప్పటికీ తెరవని కళ్ళు ప్రశాంతంగా నిద్రపోతూ దర్శనం ఇచ్చే సరికి నమస్కారం చేశాడు జీవన్.“అల్లా..... మహానుభావా ఏమిటీ వైపరీత్యం....?”

.............అయిపోయింది.............

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika