Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : సుకుమారిని రక్షించే ప్రయత్నంలో సహస్ర తేనాంపేట రౌడీలతో తలపడుతుంది. కొద్దిసేపట్లోనే అక్కడి వాతావరణం భీభత్సంగా మారిపోతుంది. దీక్ష ద్వారా చందూకి, విరాట్ కీ తెలిసి వాళ్ళూ అక్కడికి చేరుకుంటారు....

ఆ తర్వాత .......

వాళ్ళు ఎంటరైన రెండో నిముషంలోనే కదిరేషన్ అతడి మనుషులు రంగ ప్రవేశం చేసారు. అప్పటికే సుమారు ముప్పైమందికి పైగా వున్నారు. శిఖామణి కుర్రాళ్ళు వాళ్ళతో వూపిరి సలపకుండా ఒంటరి పోరాటం చేస్తున్న సహస్రకు ఎప్పుడైతే కదిరేషన్ బృందం తనకు సాయంగా ఎంటరైందో కాస్త వూపిరి తీసుకునే అవకాశం ఏర్పడిన్ది. దాంతో అటు యిటు ఇనుపరాడ్ తో రౌడీలను విరగొట్టి చెదరగొడుతూ గొడవకు కారణమైన గుండా శిఖామణి వైపు దూసుకెళ్ళింది.

శిఖామణి మనుషుల్లో కుడిభుజం లాంటి వేలు అనే యువకుడొకడున్నాడు. వీడికి కాస్త ముందు చూపు ఎక్కువ. ఎప్పుడైతే సహస్రకు సాయంగా కొందరు ఎంటరయ్యారో ఎప్పుడైతే సహస్ర సుడిగాలిలా శిఖామణివైపు దూసుకొస్తుందో వెంటనే పరిస్థితిని అంచనా వేసాడు. ఎందుకైనా మంచిదని సెల్ ఫోన్ అందుకుని తేనాంపేట ఆ పరిసరాల్లోని తమ బేచ్ లకు చక చకా ఫోన్లుకొట్టి పిలవటం ఆరంభించాడు. ఈ లోపల పోరాటం ఆరంభంలోనే సహస్ర ముఖాన్ని కవర్ చేస్తున్న చున్నీ జారిపోయింది. దాన్ని తిరిగి అందుకోడానికి ముఖాన్ని కవర్ చేసుకోడానికో ఆమెకు అవకాశం లేకపోయింది. జీప్ సమీపంలో నిలబడిన శిఖామణికి పరిస్థితి చూస్తుంటే మతి పోతున్నట్టుంది. ఇప్పుడు సహస్ర ముఖాన్ని స్పష్టంగా చూడగలుగుతున్నాడు.

అందమైన ముక్కుకి డైమండ్ ముక్కెర, చెవులకు గోల్డ్ రింగులు, మెడలో సన్నటి గోల్డ్ చైన్ అత్యంత సుందరమైన ఆమె ముఖం. ఎంత సింపుల్ గా వున్నా సర్వాభరణ భూషితమైన అమ్మవారిలా దర్శనమిస్తోంది. వాడి అశ్చర్యం సహస్ర అందం గురించి కాదు. అంత కోమలమైన అమ్మాయిలో ఇంతటి ధైర్య సాహసాలేమిటి ఈ పోరాట స్పూర్తి ఏమిటి?

శిఖామణి ఆశ్చర్యం నుంచి తేరుకునే లోపల చిరుత పులిలా వచ్చి వాడి ఎదురుగా నిలబడిన్ది సహస్ర. పొజిషన్ తీసుకొంటున్న సహస్రను చూడగానే ‘‘ ఏయ్ ఆగమ్మాయ్ ఆగు ’’ అనరిచాడు శిఖామణి.

‘‘నేను ఆగమన్నప్పుడు నువ్వు ఆగలేదు. ఇప్పుడు నేనెందుకు ఆగాలి?’’ ఎదురు ప్రశ్నించింది సహస్ర.

‘‘ఎందుకంటే... చెట్టంత మనిషిని. పహిల్వాన్ని. నాకు దయా దాక్షిణ్యాలు తెలీదు. నా కుర్రాళ్ళని కొట్టినంత ఈజీ కాదు నన్ను కొట్టడం. తామర తంపరగా వస్తున్న మా కుర్రాళ్ళని చూస్తున్నావ్ గదా? తప్పించుకోలేవు. నీకు భయపడి చెప్పటంలేదు. నిన్ను చూస్తుంటే ముచ్చటేస్తుంది. నీ వయసును అందాన్ని భవిష్యత్తును నాశనం చేసుకోకు. వెంటనే ఇక్కడ్నుంచి పారిపోయి ప్రాణాలు దక్కించుకో. లేదంటే చంపేస్తారు’’ పెద్ద గొంతుతో హెచ్చరించాడు శిఖామణి.

‘‘గీత బోధ చేయటానికి నువ్వు కృష్ణుడివీ కాదు వింటూ కూచోడానికి నేను అర్జునుడ్నీ కాదు. పదిమంది వెధవల్ని వెంటేసుకుని నగరం నడి బొడ్డులో పరువుగా బతుకుతున్న ఒక స్త్రీని ఎత్తుకుపోవాలని చూసిన నువ్వో మగాడివా? పది మంది ఒకడ్ని కొట్టడం కాదురా. ఒక ఆడపిల్ల పది మందిని కొట్టడం గొప్ప. పోరాటం ఆరంభించింది మీరు. దీన్ని ముగించే వెళ్తాను. తేనాం పేటలో రౌడీ అనేవాడు కనబడ కూడదు. కండలు పెంచిన పహిల్వాన్వి గదా, కమాన్ నువ్వో నేనో తేల్చుకుందాం’’ అంటూ వేగంగా ముందుకు దూకింది. దాంతో చేతిలోని ఇనప రాడ్ గిర గిరా తిప్పుతూ ముందుకురికాడు శిఖామణి. ఇక ఇరువురి మధ్య ఆరంభమైంది  పోరాటం.

సరిగ్గా ఇదే సమయంలో మునిసామి అతడి మనుషులు రంగ ప్రవేశం చేసారు. వస్తూనే ఎడా పెడా బాణా కర్రతో గుండాల్ని బెదర గొడుతూ సహస్రకి రక్షణగా ఆమె సమీపంలోకి వెళ్ళిపోయాడు మునసామి.ఇపుడా ప్రదేశంలో జరుగుతోంది ఒక దొమ్మిలా లేదు. వీధి పోరాటం కూడ కాదు. ఒక రణ రంగాన్నే తలపిస్తోంది. అరుపులు కేకలు ఆర్తనాదాలతో ఆ ప్రాంతం దద్దరిల్లుతోంది. అంతలో విరాట్ కూడ రంగప్రవేశం చేసాడు. అతడితో కలిసి సహస్ర వర్గమే సుమారు పాతిక ముప్పైమంది వరకు ఉండగా శిఖామణి వర్గం అరవై మంది పైనే ఉంటారు.

బేచ్ లు బేచ్ లుగా సైకిళ్ళ మీద బైక్ ల మీదా తేనాం పేట రౌడీ కుర్రాళ్ళు బీభత్సంగా అరుస్తూ ఇంకా వచ్చి పడుతూనే వున్నారు. జనం ఆ పోరాటాన్ని ప్రత్యక్షంగా చూస్తున్నారు. రోడ్ వెంట అటు ఇటు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఎవరో ఫోన్ చేసినట్టున్నారు. కదిరేషన్ బేచ్ ఎంటరవుతున్నప్పుడే  మీడియాకు చెందిన రెండు వేన్ లు ఎంటరయ్యాయి. టివి లకు లైవ్ టెలికాస్ట్ ఆరంభమైంది. ఇంకా సంఘటనా స్థలానికి తమ ప్రతినిధులు చేరుకుని ఛానల్ వాళ్ళు తమ టీవీల్లో స్క్రోలింగ్ లో ముఖ్య  ప్రకటన అంటూ ప్రసారం ఆరంభించారు.
దాంతో నాగరప్రజల దృష్టికి ఒక్కసారిగా టివి స్క్రీన్ ల వైపు మళ్ళింది.

ఇదే సమయంలో కాస్త ముందుగా...

సమాచారం తెలీగానే టి నగర్ పోలీస్ స్టేషన్ నుంచి ఇక యస్సై  ఆరుగురు కానిస్టేబుల్స్ లాఠీలు వూపుకుంటూ జీప్లోవచ్చి దిగారు. ఏదో చిన్నదొమ్మి అనుకున్నారు. కాని వచ్చి చూడగానే వాళ్ళకి కళ్ళు గిర్రున తిరిగినంత పనైంది. ఇప్పుడు తాము లా అండ్ ఆర్డర్ కోసం వాళ్ళ ముందుకెళ్తే ప్రాణాలతో బయటపడ్డం కష్టమనిపించింది. ఇటు రోడ్డు నుండి లోపల ఖాళీ స్థలం వరకు యుద్ద రంగాన్ని తలపిస్తోంది. ఎలా చూసినా రెండు వర్గాలు వంద మంది ఉండొచ్చనిపించింది. అదనపు బలగాలు వస్తే గాని తాము ఏం చేయలేని పరిస్థితి వుంది. దాంతో వచ్చిన వాళ్ళు ప్రేక్షకులుగా మారి పోగా యస్సై వరసగా ఇతర పోలీస్ స్టేషన్లకు నగర పోలీస్ కంట్రోల్ రూమ్ కి చక చకా ఫోన్ లు కొట్టి పరిస్థితి వివరించాడు. సైరన్లు మోగించుకొంటూ పోలీసు వాహనాలు దూసుకు రానారంభించాయి. రెండు వేన్ లలో తుపాకులు ధరించిన రిజర్వ్ పోలీస్ లు కూడ సంఘటనా స్థలానికి బయలు దేరారు.

ఈ లోపల సుమారు పది నిముషాల వరకు...|

సహస్ర శిఖామణిల మధ్య...

హోరా హోరీగా సాగింది పోరాటం....

శిఖామణి చాలా బలమైన మనిషి కావటంచేత సహస్రకు ఓపట్టాన లొంగేట్టు కన్పించటం లేదు. సహస్ర కొట్టే కుంగ్ఫూ పంచ్ ని ఫ్లైయింగ్ కిక్స్ ని తట్టుకొని నిలబడుతూ, తప్పించుకుంటూ, తిరిగి దెబ్బ కొట్టాలని ప్రయత్నిస్తూ పోరాడుతున్నాడు.

వాడికి సాయంగా ఎవరూ యిటు రాకుండా ఓ ప్రక్కన మునుసామి మరో పక్కన కదిరేషన్ లు కర్రలు తిప్పుతూ రౌడీల తాట తీసి చెదరగొడుతున్నారు.  ఇక ఆ యిద్దరి మనుషులయితే రుద్ర గణాల్లా చెలరేగి రౌడీలతో హోరా హోరీగా పోరాడుతూ దెబ్బకు ఒకడ్ని పడగొట్టేస్తున్నారు.

కాని అసంఖ్యాకంగా వచ్చి పడుతున్న రౌడీ మూకల్ని చూస్తుంటే ఈ పోరాటం ఇంకా ఎంతసేపు కొనసాగుతుందో ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేయకముందే అక్కడ్నుంచి తప్పుకోవాలని అందరికీ వున్నా. సహస్ర అక్కడ్నుంచి కదిలితేగాని అది వీలుపడదు.

అయితే సహస్ర ఆలోచన వేరుగా వుంది. ఎట్టి పరిస్థితిలోను శిఖామణిని వదిలి పోయే ఉద్దేశం ఆమెకు లేదు. వాడ్ని పడగొట్టి ఏ చేత్తో అయితే సుకుమారి జుత్తు పట్టి లాగాడో, ఆ చేతిని విరగొట్టి వాడ్ని జీవితంలో ఎప్పుడూ స్త్రీల వంక కన్నెత్తి చూడకుండా చేయాలని ఆమె ఉద్దేశం. అరుపులు కేకలు కర్రలు కత్తుల చప్పుళ్ళు రణగొణ ధ్వనితో ఆ ప్రాంతమంతా దద్దరిల్లిపోతోంది. ఇదే సమయంలో విరాట్ ఎంటరయ్యాడు. ఎక్కడికక్కడ దొరికిన రౌడీని దొరికినట్టు విరగొట్టేస్తూ దారి చేసుకుని మూడో నిముషంలోనే సహస్ర సమీపంలోకి వెళ్ళిపోయాడు.
ఆమె తనతో మాట్లాడదు....

తను ఆమెతో మాట్లాడాలా వద్దా?

పరిస్థితిని గమనిస్తూ కొన్ని క్షణాలు ఆగాడు.

శిఖామణి ఆరంభంలో కొంతసేపు సహస్ర వేగాన్ని నిలువరించగలిగినా క్రమంగా డిఫెన్స్ లో పడిపోయాడు. సుకుమారి జోలికి ఎందుకెళ్ళాన్రా బాబు అని ఇప్పుడు బాధపడుతున్నాడు.

శిఖామణి వంటిమీది గాయాలు చూస్తేనే అర్థమవుతోన్ది సహస్ర ఎంత దారుణంగా అటాక్ చేసిందో. ఈ పాటికే వాడు పడిపోవాలి కాని తెలివిగా వాడు ఎదురొడ్డి పోరాడకుండా సహస్ర పంచ్ లని లెగ్ స్ట్రోక్ లను తప్పించుకొంటూ ఆత్మరక్షణలో పడ్డంతో వాడ్ని కూల్చటంలో ఆలస్యం జరుగుతోంది.

శిఖామణి మూతి పగిలి నెత్తురొడుతోంది. బోడిగుండు రక్తసిక్తమైంది. వంటి మీద గాయాలు రక్తం చిందుతున్నాయి. వాడికి అండగా రావాలని దూసుకొస్తున్న రౌడీలని అటు మునుసామి ఇటు కదిరేశన్ లు చితగ్గొట్టి తరుముతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే పోలీసులు వచ్చి ముట్టడిన్చే అవకాశం ఉంది. ఉన్నట్టుండి కదిలాడు విరాట్. అతడి రాకను కాస్త ఆలస్యంగా గమనించింది సహస్ర.

‘‘పోలీసులు వచ్చేదాక ఈ వెధవతో పోరాడుతూనే వుంటావా? తప్పుకో ’’ అనరస్తు చివ్వున ఎగిరి శిఖామణి పక్కటెముకల మీద తన్నాడు. ఆ షాక్ నుంచి కోలుకొనే లోపు విరాట్  పిడికిలి వాడి చెవి పక్కన దారుణంగా తాకింది. అదే క్షణంలో సహస్ర ఎగిరి గుండెల మీద తన్నింది. ఒకే సారి ఇద్దరూ అటాక్ చేయటంతో నిలవలేక బాధతో పెద్దగా అరుస్తూ ఎగిరి వెనక్కి పడిపోయాడు. అంతే...

తొలిసారిగా వాడికి...

ప్రాణభయం అంటే ఏమిటో తెలిసింది....

ఇంకా అక్కడే ఉంటే ఇద్దరూ చంపేస్తారని భయపడ్డాడు. శక్తినంతా కూడదీసుకొని చివ్వున లేచి పరుగెత్తి తమ జీప్ ఎక్కేసాడు. వాడ్ని ఆపాలని కదిలిన సహస్రను చేయిపట్టి ఆపాడు విరాట్.

‘‘చాలు జరిగింది చాలు. వాడు పారిపోతున్నాడు పోనీ. పోలీస్ సైరన్లు వినబడుతున్నాయి. వెంటనే మనం వెళ్ళిపోవాలి’’ అంటూ హెచ్చరించాడు.‘‘లేదు వాడ్ని వదలకూడదు. వాడి కాలో చెయ్యో తీసే వరకు వదలను, నన్ను వెళ్ళనీ’’ ఆవేశంతో అరిచింది సహస్ర.ఆ కాస్త సమయంలోనూ శిఖామణి జీప్ స్టార్ట్ చేసి చివ్వున రౌండ్ తిప్పి సహస్ర వైపు దూకించాడు. తనను దెబ్బతీసిన ఆ పిల్లను జీప్ తో తొక్కించి చంపేయాలన్నంత ప్రతీకారేచ్ఛతో చివరి ప్రయత్నంగా వేగంగా దూసుకొచ్చేసాడు సహస్ర వైపు. ఆఖరి క్షణంలో సహస్రను విరాట్ పక్కకు లాగేసాడు గాని లేకపోతే సహస్రను జీప్ తో తొక్కించిచేసే వాడే.

తన ప్రాణానికి ప్రాణమైన సహస్రను చంపాలనుకున్న వాడ్ని ఇక క్షమించలేక పోయాడు విరాట్. కింద  పడున్న ఒక ఇనుప రాడ్ ని అందుకొని శిఖామణి వైపు బలంగా విసిరేసాడు.భూతంలా దూసుకొస్తున్న జీప్ ను చూడగానే ఆ దిశలో పోరాడుతున్న ఇరు వర్గాల వాళ్ళు పక్కకు పరుగులు తీసారు. అదే సమయంలో విరాట్ ప్రయోగించిన ఇనపరాడ్ విష్ణు చక్రంలా తిరుగుతూ దూసుకెళ్ళి జీప్ లోని శిఖామణి బోడిగుండును దారుణంగా తాకి ‘ఖంగు’ మని చప్పుడు చేసింది. దెబ్బకు ముందుకు తూలటంతో నుదురు స్టీరింగ్ ను బలంగా గుద్దుకొని క్షణంలో తెలితప్పి పోతూ పక్కకు ఒరిగి పోయాడు.

కంట్రోల్ తప్పిన జీప్ రోడ్ మీదకు దూసుకెళ్ళి అడ్డంగా తిరిగి పక్కకు పల్టీ కొట్టి శిఖామణిని ఈడ్చుకొంటూ దూసుకెళ్ళి ట్రాఫిక్ లో నిలిచిపోయిన వాహనాలు రెంటిని ఢీకొంది. నిప్పురవ్వలు ఎగసి నేలకు జారిన ఆయిల్ కు నిప్పంటుకొని క్షణంలో అగ్గి ఆయిల్ టాంక్ లో జొరబడిరది. అంతే....డైనమైట్ పేలినట్టు జీప్ ఆయిల్ టాంక్ ఒక్కసారిగా పేలిపోవటంతో గొల్లున అరిచి దూరంగా పరుగులు తీసారు జనం. భయంకర అగ్ని జ్వాలలు గాల్లోకి ఎగసాయి. జీపు తునాతునకలయి పక్కనున్న రెండు వాహనాలూ మంటల్లో చిక్కుకున్నాయి. ట్రాఫిక్ జామయి వెనక్కో పక్కలకో వెళ్ళలేక రోడ్ వెంట అనేక వాహనాలు నిలిచి పోయాయి. ఎప్పుడైతే మంటలు ఎగసాయో వాహనాలు వదిలి పరుగులు తీసారు జనం.

ఇదే సమయానికి కొన్ని పోలీసు వాహనాలు వచ్చి చేరాయి. కాని ట్రాఫిక్ లో నిలిచిపోయిన వాహనాల్ని దాటి అవి ముందుకుకొచ్చే అవకాశం లేక పోవటంతో వాహనాలు దిగి పోలీసులు పరుగులెత్తుకురాసాగారు. కొన్ని వాహనాలు సందు గొందుల వెంట తిరిగి ఎలాగో చేరుకో గలిగాయి. వాహనాలు దిగుతూనే లాఠీలు ఝుళిపిస్తూ ముందుగా జనాన్ని దూరంగా తరిమి రెండు ప్లడ్ లైట్లను ఆన్ చేసి సంఘటన స్థలంలోకి ఫోకస్ చేసారు పోలీసులు. అయినా ఎక్కడా ఇరువర్గాలు చెదిరి పోయే పరిస్థితి కన్పించలేదు. రిజర్వు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్ ని పోరాడుతున్న వాళ్ళ మధ్యకు విసురుతూ రబ్బరు బుల్లెట్లతో గాల్లోకి కాల్పులు జరపటం ఆరంభించారు. పోలీసులు గుంపులో జొరబడి లాఠీఛార్జీ ఆరంభించారు. అప్పుడే సహస్రను గుర్తించిన పోలీసులు ఇద్దరు ` ‘‘మనం వెదుకుతున్న సహస్రనే ఆ అమ్మాయి. ఇక్కడే ఉంది. పారిపోకుండా చూడండి’’ అనరిచాడు.

పరిస్థితి విషమిస్తోందని గ్రహించిన విరాట్ ‘‘సహస్రా ఇక శిఖామణి ఏమయ్యాడనేది వాడి అదృష్టం మీద అధార పడిన విషయం. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. మనం పారిపోక తప్పదు’’ అంటూ కొంత దూరంలో వీర భద్రుడిలా... రౌడీ మూకల మీద విరుచుకు పడుతున్న మునుసామిని పిలిచాడు. ‘‘గురువు గారు మనం వెళ్ళిపోవాలి మనవాళ్ళు ఒక్కడూ ఇక్కడ ఉండకూడదు. మా గురించి చూడొద్దు. పోలీసులు ఈ ప్రాంతాన్ని పూర్తిగా కవర్ చేయకముందే మనం అవతలికెళ్ళిపోవాలి. త్వరగా’’ అనరిచాడు.

‘‘ఒకే చినబాబు మీరు పదండి వచ్చేస్తున్నాం’’ అనరిచాడు మునుసామి. సహస్ర తన మనుషులు కదిరేశన్ ని మిగిలిన వాళ్ళని హెచ్చరించింది. వాళ్ళు వేగంగా చెదిరి పోవటం ఆరంభించారు.

‘‘పద వెళ్ళిపోదాం’’ అంటూ సహస్ర చేయి పట్టుకున్నాడు విరాట్.

ఆ చేతిని కోపంతో విదిల్చి కొట్టింది సహస్ర.

‘‘వద్దు నేన్నీతోరాను. నీదారి నీది. నాదారి నాది’’ అంది మొండిగా.

అంత క్లిష్ట పరిస్థితిలోకూడా...

సహస్ర మొండితనం చూడగానే...

విరాట్ కి సర్రున ముంచుకొచ్చింది కోపం.

‘‘చెప్చేది నీక్కాదా. ఇప్పుడూ పెంకి తనమేనా!’’ అంటూ చెంప మీద ఒక్కటిచ్చాడు. దెబ్బకు సహస్ర కళ్ళలో గిర్రున నీళ్ళుతిరిగాయి. అదే క్షణంలో మరో ఘోరం చోటు చేసుకుంది.

శిఖామణికి నమ్మిన బంటు వేలు. వాడే ఫోన్ లు కొట్టి తమ బేచ్ లను అక్కడికి రప్పించింది. శిఖామణికి ఏ గతి పట్టిందో ప్రత్యక్షంగా చూసాక వాడు సహస్ర మీద పగ-ద్వేషంతో మండిపోతున్నాడు. ప్రాణాలతో సహస్రను వెళ్ళనీకూడదనుకొని ఆవేశంతో పొడవాటి కత్తి ఒకటి పుచ్చుకొని దొంగ దెబ్బ తీయటానికి ఆమె వెనక్కి నక్కి నక్కి వచ్చేస్తున్నాడు. సహస్ర విరాట్లు గొడవపడుతున్న సమయంలోనే కత్తిని లేపి విసురుగా వచ్చేసాడు.చివరి క్షణంలో కంటి కొస నుండి ప్రమాదం గమనించిన విరాట్ సహస్ర చెంపను తాకిన అదే చేత్తోనే ఆమెను భుజం పట్టి వేగంగా పక్కకు లాగేస్తూ ముందుకు దూకి. వేలు కత్తి పట్టిన చేతిని బ్లాక్ చేయ బోయాడు. ప్లడ్ లైట్ల కాంతిలో అంచనా తప్పింది. వేలు చేతిలో కత్తి సహస్ర వీపులో దిగటానికి బదులు విరాట్ ఎడం భుజాన్ని రెండంగుళాల లోతున ఆరంగుళాల పోడవున నిలువునా చీరేసింది. అది చూడగానే కెవ్వున అరిచింది సహస్ర. అంతే ఆడ పులిలా, తన విరాట్ ని గాయ పర్చిన వాడి మీదకు దూకింది. ఒకే దెబ్బతో వాడి చేతిలోని కత్తిని లాక్కుని ఒకే వేటు కత్తి పట్టిన వేలు చేతిని భుజం వద్దకు తెగ నరికింది. కత్తి వెంటే చేయి తెగి ఎగిరిపడిరది. బాధతో భయంకరంగా అరిచాడు వాడు. ఈ లోపల ఎగువ నుంచి పోలీసులు దూసుకు రానారంభించారు.

సహస్ర ఆవేశం చూసి ఆమెకు తన పట్ల ప్రేమ తగ్గలేదని విరాట్ కి అర్థమైంది. భుజం గాయం నరకం చూపిస్తుండగా అంత బాధలో కూడా... ‘‘వాడ్ని ఎక్కువగా శిక్షించావేమో. చేయి నరక్కుండా ఉండాల్సింది’’ అన్నాడు.

‘‘వాడు నిన్నో నన్నో చంపితే ఇలా ఆలోచించేవాడివి కాదు. చేయి నరకటం కాదు. ఇలాంటి కుక్కల్ని నడిరోడ్లో ఉరితీయాలి. అప్పుడే ఈ దేశంలో అర్థరాత్రికూడా ఆడది నిర్భయంగా తిరగ్గలుగుతుంది. ఓట్ల రాజకీయంతో ఇలాంటి రౌడీల్ని పెంచి పోషిస్తున్న రాజకీయ పార్టీల్ని, పోలీసుల్ని అనాలి. వీళ్లని కాదు!’’ అంది ఆవేశంగా సహస్ర.

విరాట్ తన జేబు రుమాలు తీసి సహస్ర కిచ్చాడు. ‘‘ఒకే ఒకే ఆవేశ పడకు. ఇప్పుడైనా కట్టు కడతావా నాకెందుకని వెళ్ళిపోతావా? నెత్తురు పోతోంది’’ అన్నాడు.

ఆ మాటతో ఒక్క సారిగా...

ఏడుపు ముంచుకొచ్చింది సహస్రకి...

ఇప్పటికిప్పుడు రెండు ప్రమాదాల నుంచి తనని కాపాడాడు. తన ప్రాణం అడ్డం వేసి మరీ కాపాడాడు. ఇంకా విరాట్ ని తను శంకించటంలో అర్థంలేదు. కళ్ళు తుడుచుకుంటూ గాయాల్ని చూసింది. నిజంగానే వరదలా పొంగుతోంది నెత్తురు. చాలా లోతుకు తెగి ఉండాలి. ‘‘నావల్లే ఇదంతా నావల్లే’’ అంటూ రుద్ద కంఠంతో పలుకుతూ గాయానికి జేబు రుమాలు చుట్టి కట్టు కట్టింది. రుమాలు ఎర్రగా తడిసి పోతోంది. ఆమె ముఖాన్ని తన గుండెలకు హత్తుకొని ప్రేమగా జుత్తు నిమిరాడు విరాట్. ‘‘సారీరా కోపంతో నిన్ను కొట్టాను. నువ్వు నా ప్రాణం నీ తర్వాతే ఎవరయినా. అది గ్రహించటంలేదు నువ్వు’’ అన్నాడు బాధగా.

‘‘ఒకే ముందు మనం వెళ్ళిపోవాలి. పోలీసులు ఇటే వస్తున్నారు’’ అంది కళ్ళు తుడుచుకుంటూ. ఆమె చేయి అందుకొని అవతలి ఇళ్ళవైపు పరుగు తీసాడు విరాట్. ఈసారి హఠం చేయకుండా అనుసరించింది సహస్ర.

‘‘అదిగో... అదిగదిగో... వాళ్ళిద్దరూ పారిపోతున్నారు. సహస్రను ఆపండి వదలొద్దు’’ వెనకనుంచి ఒక పోలీసు గొంతు చించుకొని అరుస్తున్నాడు.

ఆ అరుపుల్ని లెక్కచేయకుండా...

సహస్ర విరాట్ లిద్దరూ ఏకమై అటుపక్క యిళ్ళ మధ్యగా సందులోకి పారిపోయారు. లాఠీలు వూపుకొంటూ పోలీసులు వారిని అనుసరించి తరుముకెళ్ళారు. అయితే నాలుగు వీధులు దాటి అయిదో వీధిలో ప్రవేశించేసరికి పారిపోతున్న ఇద్దరూ ఎటు తప్పించుకున్నారో గాని కంటిక్కన్పించకుండా పోయారు. అంతటితో వెనుతిరిగారు పోలీసులు.ఈ లోపల పోలీసులు సంఘటనా స్థలాన్ని పూర్తిగా కవర్ చేసారు. ఫైర్ సర్వీస్ వాళ్ళు తగలబడుతున్న వెహికిల్స్ ని ఆర్పే పనిలో బిజీగా వున్నారు. పారి పోయిన వాళ్ళు పారిపోగా మిగిలిన వాళ్ళు పోలీసులకు పట్టుబడ్డారు. అంతకు ముదే మునుసామి కదిరేశన్ లు వాళ్ళ మనుషులు అక్కడినుంచి తప్పుకొని వెళ్ళి పోగలిగారు. జరుగుతున్నదంతా టివి ఛానెల్స్ వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేస్తూనే ఉన్నారు. పోరాటం ఆగిపోయిన సంఘటనా స్థలంలో పడున్న ఆయుధాలు క్షత గాత్రులు ఆర్తనాదాలతో భీభత్సంగా ఉంది. పోలీసులు గాయ పడిన వాళ్ళని హాస్పిటల్ కి తరలించే పనిలో పడ్డారు. ఇదిలా ఉండగా...ప్రభుత్వానికి అసలు సమస్య...

సరిగ్గా ఇక్కడే మొదలయింది.

సంఘటనా స్థలం నుంచి పారిపోయిన తమ నాయకుడు శిఖామణిని ప్రత్యర్థులు చంపేసారని ఫోన్లమీద ప్రచారం చేయటంతో తేనాం పేట పరిసర ప్రాంతాల్లోని అల్లరి మూకలు ఒక్కసారిగా వీధిన పడ్డాయి. గుంపులు గుంపులుగా రౌడీలు బయలుదేరి వాహనాలు తగల బెడుతూ షాపుల్ని పగల గొడుతూ అరాచకాలకు పాల్పడ్డారు. అప్పటికింకా సమయం రాత్రి తొమ్మిది గంటలు దాటలేదు. పరిస్థితి గమనిస్తున్న వ్యాపారులు షెట్టర్ లు దించేసి షాపులు మూయటం ఆరంభించారు. అల్లర్లు మరింత చెలరేగాయి. అవి విస్తరించక ముందే అణచి వేయాలని ప్రభుత్వ బలగాల్ని రంగంలోకి దించింది ప్రభుత్వం. రౌడీ మూకలు బస్సుల్ని రాళ్ళతో కొట్టడం, తగల బెట్టడం ప్రయివేటు వాహనాల్ని ధ్వంసం చేయటం, షాపుల్ని లూటీ చేయటం ప్రజల్ని తరిమి కొట్టడం వంటి అరాచాకాలకు తెగబడి బీభత్సం సృష్టించాయి. ఆయా ప్రాంతాల్లో వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ పెట్టి కర్ఫ్యూ విధించి కన్పిస్తే కాల్చివేతకు ఉత్తరువిచ్చింది.

చెన్నైలో పరిస్థితి ఇది...

స్టేట్ వైడ్ గా ప్రజలు టివిలకు అతుక్కుపోయి చూస్తున్నారు.

************************************************************

పోలీసులకు స్లిప్ ఇచ్చిన విరాట్ సహస్రలు ఎక్కడా ఆగకుండా సందుగొందుల వెంట పరుగు తీస్తు పది వీధులకి అవతల ఒక పెద్ద రోడ్ కి చేరుకున్నారు.

ఇప్పుడు ఏం చేయాలి?ఇద్దరి ముందున్న ప్రధాన సమస్య ఇది.ఎలాగో పోలీసుల్ని తప్పించుకొని బయట పడగలిగారు. కాని తన భుజం పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. వెంటనే ట్రీట్ మెంట్ జరగాలి. ఈ ప్రమాదకర స్థితిలో ఏ ఆస్పత్రికెళ్ళినా ట్రీట్ మెంట్ జరక్కపోగా తమని పోలీసులకు పట్టిస్తారు. ప్రస్తుతం ఇంటికి చేరటం కన్న తనకి ట్రీట్ మెంట్ ముఖ్యం. టివి వాళ్ళు లైవ్ టెలికాస్ట్ చేసుంటే ఖచ్చితంగా జనం, పోలీసులు తమని గుర్తుపట్టేస్తారు.తీవ్రంగా ఆలోచిస్తున్న విరాట్ దృష్టి...రోడ్ కి అవతల తమకు సమీపంలోనే ఉన్న ట్వంటీఫోర్ అవర్స్ మెడికల్ షాపుమీద పడిరది.‘‘ఏం చేద్దాం?’’ ఆందోళన చెందుతూ అడిగింది సహస్ర.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్