Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ-ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

 

ప్రపంచం లో ఉన్న ప్రతీ occasion కీ బట్టలు పెట్టడం అనేది, మన ఆంధ్రదేశంలోనే ఎక్కువనుకుంటాను.ఎవరింటికి వెళ్ళినా, ఆడవారికి, వారి పరిచయాన్ని బట్టి ఓ చీరో జాకెట్టు ముక్కో పెట్టేస్తూంటారు.బాగా తెలిసినవాళ్ళైతే, కొంచెం మంచి క్వాలిటీ ది,చుట్టాలైతే ఓ చీర బోనస్సు! అవి అటూ ఇటూ తిరిగి, చివరకు మొదటిచ్చిన వాళ్ళ దగ్గరకే వస్తూంటుంది. అది వేరే విషయమనుకోండి! అసలు ఈ బట్టలు పెట్టడం అనే ఆచారం ఎక్కడినుంచొచ్చిందండి బాబూ? ఎవరైనా పీటలమీద కూర్చుంటే, వాళ్ళకి (దంపతులకి) బట్టలు పెట్టాలిట.ఈ సెంటిమెంటు లేమిటో, ఈ గొడవలెంటో నాకు మాత్రం ఎప్పుడూ అర్ధం అవవు.ఒక్క విషయం మాత్రం అర్ధం అవుతూంటుంది- ఇంట్లో ఏ శుభకార్యం అయినా, మా ఇంటావిడవైపు చూస్తాను, ఎవరెవరికి బట్టలు కొనాలో!

పైగా ఎవరైనా పుట్టింటికి వెళ్తే, ఆవిడ అక్కడినుంచి తిరిగివచ్చిన తరువాత, అందరికీ తనకి ఎవరెవరు ఏమేమి బట్టలు పెట్టారో, అందరినీ పిలిచి మరీ చూపిస్తారు.అదంతా తన పుట్టింటి వారి status చూపించుకోడం అన్న మాట! ఏ పరిస్థితుల్లో అయినా, అక్కడినుంచి, బట్టలు రాకపోయినా,  కొంచెం చవకబారు బట్టలొచ్చినా, తిరిగి వచ్చేటప్పుడే, కొట్లోకి వెళ్ళి ఖరీదైన బట్ట కొనుక్కోవడమూ, పుట్టింటివారిచ్చేరని చెప్పుకోవడమూనూ.అలా బట్టలు పెట్టిన వాళ్ళెవరైనా, మనింటికి వస్తే, వాళ్ళిచ్చినదానికంటె ఓ మెట్టు పైది పెట్టడం. లేకపోతే మన పరువు పోదూ?

ఇంట్లో బీరువా నిండా, ఓ మోపెడు బ్లౌజు పీసులు దాస్తూంటారు.ఇంటికి మొదటిసారి వస్తే బ్లౌజు పీసివ్వాలిట.పైగా ఆ వచ్చినవాళ్ళుకూడా take it for granted గా, ఆ బ్లౌజుపీసేదో ఇస్తేనేకానీ కదలరు! పైగా ఇస్తున్నప్పుడు 'ఇప్పుడెందుకండీ ఇవన్నీనూ' అంటూ ఓ మొహమ్మాటం డయలాగ్గోటీ. వీళ్ళు ఇవ్వకా మానరు, ఆ వచ్చినవాళ్ళు పుచ్చుకోకా మానరు, ఊరికే public consumption కోసం ఈ డయలాగ్గులు! ఇవన్నీ అస్తమానూ ఎందుకూ అంటే, మనం వెళ్ళినప్పుడు వాళ్ళు పెట్టిన చీర తీసికోలేదేమిటీ, తిరిగి పెట్టకపోతే బావుంటుందా అంటూ ఇంటివాడి నోరు నొక్కేస్తూంటారు!అసలు in the first place తీసికోమ్మనదెవడంట? అప్పుడు తీసికోకపోతే ఇప్పుడు ఇచ్చే అవసరం ఉండేది కాదుగా!

ఈ బట్టలవ్యవహారాలు ఈ మధ్యన, ఆడవారివరకే పరిమితం అయ్యాయి.మొగాళ్ళకి, ఓ జేబురుమ్మాలో, ఓ తువ్వాలో పెట్టేస్తున్నారు. మా రోజుల్లో, ఏ సన్మానం లాటిది జరిగినా శాలువాలు కప్పేవారు. ఈ మధ్యన ప్రతీ వారికీ, ఓ కండువా భుజంమీదెయ్యడం ( ఏ పార్టీవాళ్ళైతే ఆరంగుది).ఒకప్పుడు ఆ కండువాకి చాలా పెద్ద honour ఉండేది. కండువా వేసికున్నవారిని  ప్రత్యేక గౌరవంతో చూసేవారు. కండువా లేకుండా, వీధిలోకి కూడా వెళ్ళేవారు కాదు. ఇప్పుడో ప్రతీ కోన్కిస్కాగాడికీ కండువాయే! వాడు history sheeter అవొచ్చు, లేక అప్పుడో, ఆముందురోజో పార్టీ ఫిరాయించిన రాజకియ నాయకుడవచ్చు!

ఒక్కొక్కప్పుడు మగాళ్ళకి పంచలచాపు పెడుతూంటారు. వాటినేం చేసికుంటాం, లుంగీగా కట్టుకోడమో, లేక ఇంకోదానికో మడిబట్టలా కట్టుకోడం.ఇంక ఇలా అవతలివారిచేత పెట్టించబడ్డ బట్టలు ( మగాళ్ళ పాంటు పీసులూ, షర్టు పీసులూ) ఇంట్లో పెట్టినిండా ఉంటాయి .ఇది వరకటి రోజుల్లో, ఈ పెట్టుబళ్ళకి, మంచి కంపెనీల బట్టలైనా పెట్టేవారు, కానీ ఈరోజుల్లో, “సెట్లు” కింద అమ్ముతున్నారు. ఓ ప్యాంటు పీసూ, షర్టుపీసూ కలిపి. పోనీ, కుట్టించుకుందామా అనుకుంటే, కుట్టుకూలే, తడిపి మోపెడవుతుంది.దానితో, ఏ బీరువాలోనూ, కలరా ఉండలు వేసి, జాగ్రత్త చేయడం. అలా పెట్టినింపుకోడం తప్పించి, మనమేమైనా కుట్టించుకుంటామా, పెడతామా? మళ్ళీ మనింటికి ఎవరైనా చుట్టాలొస్తే,  వాటికి ముక్తీ మోక్షం వస్తాయి. మళ్ళీ ఇందులో ఓ జాగ్రత్త తీసికోవాలి, మరీ వాళ్ళిచ్చిందే తిరిగి వాళ్ళకి పెట్టేయడం కూడా బాగోదు! మనవైపు చూశాను- ప్రతీ బట్టల దుకాణంలోనూ, పెట్టుబడి బట్టలని విడిగా ఉంటాయి. వాళ్ళకీ తెలుసు,ఈ బట్టల ఇకనామిక్స్!వాటి క్వాలిటీ కూడా అంతంతమాత్రమే! చివరకి అవన్నీ ఏ గిన్నెలమ్మేవాళ్ళదగ్గరకో చేరతాయి.పోనీ వాళ్ళైనా  గొడవ చేయకుండా తీసికుంటారా అంటే అదీ లేదూ..  నాణ్యమైన బట్టలన్నీ ఓవైపు పెట్టేసి, వీటిని, మరీ మొహమ్మాటపెట్టేస్తే తీసికుంటారు.

ఈ పెట్టుబడి బ్లౌజు పీసులకీ, దేవుడి గుళ్ళో ఇచ్చే అరటి పళ్ళకీ , చాలా పోలికలుంటాయి. రెండూ కూడా, ఏదో మొక్కుబడి వ్యవహారమే. ఆ అరటి పళ్ళు చూడండి, ఓ రుచీ, పచీ ఉండదు. అలాగే ఈ బ్లౌజుపీసులూ, పెట్టుబడి చీరలూనూ. ఏ పండక్కో, పనిమనిషికి పోనీ ఇచ్చేద్దామా అనుకున్నా, మొహంలో కనిపించిపోతుంది, అమ్మగారికి ఎవరో పెట్టుంటారు, మెహర్బానీ కోసం నాకంటగట్టేస్తోందీ అని.

మరిన్ని శీర్షికలు
yuva