Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
 డాడీ లుంగీల‌తో ప్ర‌యోగాలు చేసేదాన్ని - మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌


డేరింగ్ అండ్ డాషింగ్ అంటే.. మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌
యాక్ట‌ర్ అండ్ ప్రొడ్యూస‌ర్ అన్నా.. మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్నే!
మాట‌లు, చేత‌లు అన్నింటా స్పీడే. ఓ ఆడ ర‌వితేజ‌లా ఫుల్ ఎన‌ర్జీతో అన్ని రంగాల్లోనూ దూసుకెళ్లిపోతోంది. ఇప్పుడు సింగ‌రూ అయ్యింది. ''సినిమా నా ప్ర‌పంచం. ఎప్పుడైతే ఈ రంగంపై ప్రేమ పెంచుకొన్నానో.. అప్ప‌టి నుంచే ప్ర‌తి క్ష‌ణం సినిమాల గురించే ఆలోచిస్తుంటా..'' అంటోంది మంచు వారి అమ్మాయి. న‌టిగా, నిర్మాతగా డ్యూయ‌ల్ రోల్ చేసిన సినిమా.. దొంగాట‌. ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సంద‌ర్భంగా మంచు ల‌క్ష్మీ ప్ర‌స‌న్న‌తో చిట్ చాట్ ఇది.


* హాయ్‌..
- హాయండీ..

* మొన్న బుడుగు.. ఇప్పుడ దొంగాట - న‌టిగా ఫుల్ బిజీ అన్న‌మాట‌!
- (న‌వ్వుతూ) చేతి నిండా ప‌ని ఉంటే హ్యాపీ క‌దాండీ. ఇన్‌ఫాక్ట్‌... ఏ యాక్ట‌ర్ అయినా కోరుకొనేది ఇదే. బుడుగు సినిమా చూసి అంద‌రూ థ్రిల్ ఫీల‌య్యారు. మ‌రీ ముఖ్యంగా నా పాత్ర‌కు మంచి పేరొచ్చింది. అంత‌కు ముందు అంద‌రూ న‌న్ను 'అక్క‌య్యా..' అనే వారు. నిజం చెప్పాలంటే 'అక్క‌య్యా.' అని పిలిస్తే చిర్రెత్తుకొచ్చేది. ఈ సినిమా చూశాక ట్విట్ట‌ర్‌లో కొంత‌మంది ''మిమ్మ‌ల్ని అమ్మ అని పిల‌వొచ్చా.'' అంటున్నారు. నిజంగా ఆ పిలుపు విని నేను థ్రిల్ అయ్యా. ఇక దొంగాటలో నా పాత్ర ఖ‌త‌ర్నాక్‌గా ఉంటుంది. రెండు సినిమాల‌కూ అస్స‌లు పోలికే లేదు. ఇలా డిఫ‌రెంట్ డిఫ‌రెంట్ సినిమాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం సంతోషంగా ఉంది.

* ఇంత‌కీ దొంగాట మీకెలా స్పెష‌ల్‌?
- ఇలాంటి జోన‌ర్ నేనింత వ‌ర‌కూ చేయ‌లేదు. చాలా ర‌ఫ్ అండ్ ట‌ఫ్‌గా ఉంటా. దానికి తోడు ఫుల్ ఎన‌ర్జీ. నేనింత వ‌ర‌కూ కామెడీ చేయ‌లేదు. అది ఈ సినిమాతో ల‌భించిన అవ‌కాశం.

* న‌టిగా స‌రే.. మ‌రి నిర్మాత‌గా?
- నిర్మాత‌గా డ‌బుల్ హ్యాపీ. ఎందుకంటే ఈ సినిమా బిజినెస్ హ్యాపీగా జ‌రిగిపోయింది.

*  గాయ‌నిగానూ నిరూపించుకొన్నారు క‌దా?
- (న‌వ్వుతూ) అదో తీయ‌ని అనుభ‌వం. న‌న్ను మా నాన్న‌గారు గాయ‌నిగా చూడాల‌నుకొన్నారు. అది ఈ సినిమాతో తీరింది. చాలా జోష్ ఉన్న పాట అది. దాన్నో విప్ల‌వ గీతంగా తెర‌కెక్కించొచ్చు. కానీ ఇంత‌మందికి చేరేది కాదు. దాంట్లో కాస్త పెప్ యాడ్ చేసి, పెప్పీ నెంబ‌ర్‌గా మార్చ‌డం వ‌ల్ల‌.. జ‌నంలోకి వెళ్లిపోయింది.

* మ‌గాళ్ల‌పై బాగా కోపం పెంచుకొన్న‌ట్టున్నారు..
- అదేం లేదు. నాకు మ‌గాళ్లంటే గౌర‌వం. ఎందుకంటే మానాన్న‌, మా అన్న‌య్య‌, త‌మ్ముడు.. మా ఆయ‌న‌.. వీళ్లంటే చాలా గౌర‌వం.

* ప‌దిమంది హీరోల్ని తీసుకొచ్చి ప్రమోష‌న‌ల్ సాంగ్ చేయించారు.. ఆ హీరోల అభిమానుల్ని ఆక‌ట్టుకోవ‌డానికేనా?
- అలా ఏం లేదండీ. ఇందులో నేను ఓ హీరోయిన్ గా న‌టించాను. ఆ పాత్ర‌కు ఆ పాట అవ‌స‌రం. పైగా.. ఈ పాట‌తో సినిమాలో జోష్ వ‌స్తుంది. అందుకే అంత‌మంది హీరోల్ని తెర‌పైకి తీసుకొచ్చి డాన్స్ చేయించా.

* అంత‌మంది హీరోల్ని ఒప్పించ‌డం ఎలా సాధ్య‌మైంది?
- నిజంగా ట‌ఫ్ టాస్క్ అనుకొన్నా. కానీ చాలా ఈజీ అయ్యింది. త‌ల‌నొప్పి ఏంటంటే.. ఎంద‌కైనా మంచిద‌ని ఎక్కువ మందికి చెప్పుకొన్నా. అడిగివాళ్లంతా రారుక‌దా. ఒక‌రిద్ద‌రు హ్యాండిచ్చినా.. మిగిలిన‌వారితో స‌ర్దుకోవ‌చ్చ‌ని. కానీ.. ఫోన్ చేసి అడిగిన‌వాళ్లంతా రెడీ అయిపోయారు. చివ‌ర్లో కొంత‌మందికి నేనే ఫోన్ చేసి 'రావొద్దులే... సారీ..' అని చెప్పా. పాపం.. వాళ్లు ఫీల‌య్యారు. 

* ఈమ‌ధ్య బ‌య‌ట‌కు ఎప్పుడొచ్చినా ర‌క‌ర‌కాల డ్ర‌సుల్లో, స‌రికొత్త ఫ్యాష‌న్‌ల‌తో క‌నిపిస్తుంటారు. మీ ఫ్యాష‌న్ వెనుక ఉన్న ర‌హ‌స్యాలేంటి?
- ర‌హ‌స్యాలేం లేవు. నాకు ఫ్యాష‌న్లంటే చాలా ఇష్టం. నా డ్ర‌స్సుల్ని నేనే డిజైన్ చేసుకొంటా. చిన్న‌ప్పటి నుంచీ డ్రిస్సింగ్ స్టైల్ విష‌యంలో ర‌క‌ర‌కాల ప్ర‌యోగాలు చేసేదాన్ని. మా నాన్న‌గారు ఫారెన్ నుంచి లుంగీలు తెప్పించుకొనేవారు. ర‌క‌ర‌కాల రంగుల్లో న‌న్ను బాగా ఆక‌ర్షించేవి. వాటిని ఎత్తుకొచ్చేసి వాటితో ప్ర‌యోగాలు చేసేదాన్ని. అలా నాకు కాస్ట్యూమ్ డిజైనింగ్ అల‌వాటైంది. మా ఇంట్లోవాళ్లంద‌రికీ అల‌వాటు చేసేశా.

* డైట్ కంట్రోల్ కూడా పాటిస్తారా?
- అదేం లేదండీ. నేను భోజ‌న‌ప్రియురాల్ని. న‌న్ను నేను కంట్రోల్ చేసుకోలేను. కాక‌పోతే.. రోజూ వ‌ర్క‌వుట్లు చేస్తుంటా క‌దా. అందుకే ఏం తిన్నా... అరాయించుకోగ‌ల‌ను.

* జిమ్‌లో బాగా క‌ష్ట‌ప‌డ‌తారా?
- త‌ప్ప‌దు. ఎందుకంటే... నాకు మ‌గాళ్ల‌లా కండ‌లు పెంచాల‌ని వుంటుంది. (న‌వ్వుతూ). అమ్మాయిలైనా ఫిట్‌గా ఉండాల్సిందే.

* ఇంత‌కీ దొంగాట‌ చూడాలనుకొనే ప్రేక్ష‌కుల‌కు మీరేం చెబుతారు?
- ఇదో క్రైమ్ అండ్ కామెడీ జోన‌ర్‌కి చెందిన సినిమా. మీరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఊహించ‌ని ట్విస్టులు కొన్నున్నాయి. వాటిని బాగా ఎంజాయ్ చేస్తారు.

* క్రైమ్ కామెడీ జోన‌ర్ అంటే.. మ‌నీలా ఉంటుందా?
- మ‌నీ అని కాదుగానీ.. ఆ సినిమాలో ఎన్ని మంచి ఎలిమెంట్స్ ఉన్నాయో, అవ‌న్నీ మా సినిమాలోనూ ఉన్నాయి.

* మీ ఇంట్లోవాళ్లంతా రాంగోపాల్ వ‌ర్మ‌తో వ‌రుస‌గా సినిమాలు చేస్తున్నారు. దొంగ‌ల‌ముఠా త‌ర‌వాత మీకు ఆ ఛాన్స్ ఎందుకు రాలేదు?
- నిజానికి ఈ సినిమా ఆయ‌నే చేయాలి. స్ర్కిప్ట్ పూర్త‌య్యాక‌.. ఆయ‌న ద‌గ్గ‌ర‌కు వెళ్లాం. కానీ..`ఇది నా జోన‌ర్ సినిమాలా లేదు` అన్నారు. దాంతో వంశీ చేతులో పెట్టాం. త‌ను నిజంగా అద్భుతంగా తీర్చిదిద్దాడు.

* వ‌ర్మ‌తో ​ సినిమా చేసే   ఆలోచ‌న  ఉందా?
- ఉంది. ఆయ‌న గొప్ప ద‌ర్శ‌కుడు. ఆయ‌న‌తో ఒక్క సినిమా కాదు, ఎన్ని సినిమాలైనా చేయొచ్చు. ఆ అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్నా.

* దొంగాట‌తో అవార్డులు ఆశిస్తున్నారా?
- అవేం లేదండీ బాబూ. ఈ సినిమా బోల్డ‌న్ని డ‌బ్బులు తీసుకురావాలి. అవార్డులు కూడా వ‌స్తే హ్యాపీ.

* ఈ సినిమా మీకు డ‌బ్బులు, అవార్డులు తీసుకురావాల‌ని కోరుకొంటున్నాం.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌

-కాత్యాయని

మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 15 - Oka Chinni Navve Navvi - Ashok