Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
death mystery

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : సుకుమారిని రక్షించే ప్రయత్నంలో తేనాంపేట రౌడీలతో తలపడిన సహస్రకు సాయంగా వచ్చిన విరాట్ కి ఎక్కువగా ఆ అవకాశం ఇవ్వకుండా తానే ఆ అరుడీలను చిత్తు చేస్తుంది సహస్ర. అక్కడంతా భీభత్సమైన వాతావరణ మేర్పడుతుంది. ఒక ఆగంతకుడు సహస్రపై విసరబోయిన కత్తిని తప్పించాలనుకున్న విరాట్ భుజానికి గాయమవుతుంది...... పోలీసులెంటయ్యేలోగానే అక్కణ్ణుంచి చాకచక్యంగా బయటపడతారు, విరాట్, సహస్రలు.    ఆ తరవాత.........

‘‘ఏదో ఒకటి వెంటనే చేయకపోతే ఒంట్లో నెత్తురంతా బయటికి పోయేలా ఉంది. ఆ మెడికల్ షాప్ కి వెళ్ళి రాగలవా?’’ అన్నాడు పంటి బిగువున బాధను భరిస్తూ.

‘‘ఎలా విరాట్.. ముఖం కవర్ చేసుకోడానికేమీ లేదు. నన్ను గుర్తుపట్టేస్తారు’’ అంది నిస్సహాయంగా సహస్ర.

‘‘ఒకే కొంచెం రిస్క్ చేయక తప్పదు. పద నేనూ వస్తాను’’ అంటూ కదిలాడు విరాట్.

మెడికల్ షాపులో ఒక యువతి కూచుని టివి చూస్తోంది. అంత క్రితమే ఒక వ్యక్తి ఏవో మందులు కొనుక్కొని వెళ్ళిపోయాడు. రోడ్డు నిర్మానుష్యం కాగానే సహస్ర విరాట్ లు వేగంగా రోడ్ దాటి మెడికల్ షాపు ముందుకు వెళ్ళిపోయారు. జరుగుతున్న అల్లర్ల గురించి టివిలో పోలీసు కమీషనర్ ప్రజలకు ఏదో సందేశం ఇస్తున్నాడు. టివిలో వార్తలు మొదలయితే ఆ యువతి తమను గుర్తించే ప్రమాదం వుంది. అటు ఇటు చూసిన విరాట్ కి...

పక్కన చేతికి అందే ఎత్తులోనే కేబుల్ టివి కనక్షన్ వైరు కన్పించింది. అంతే... చప్పుడు కాకుండా కేబుల్  వైరు కట్ చేసి ఏమీ తెలీనట్టు లోనకు అడుగు పెట్టాడు. సహస్రను పక్కగా బయటే ఉంచాడు.

టివి ఆగిందని కంగారు పడుతున్న షాపు లేడీ విరాట్ ని చూసి ‘‘ఎవరు మీరు? ఏంకావాలి?’’ అనడిగింది. కంగారుగా. ఆమె చూపులు విరాట్ భుజం గాయం మీద వున్నాయి.

‘‘కంగారు పడకండి మేడం. చిన్న హెల్ప్ చేయాలి. ఇక్కడికి దగ్గర్లోనే మా బైక్ ఆక్సిడెంటయింది. పలుగు రాయి నా భుజాన్ని లోతుకు చీరేసి నెత్తురొస్తుంది. నెత్తురు ఆగటానికి మందులు, ఇంజక్షను యివ్వండి. అలాగే ఒక సూది దారం యివ్వండి.’’ గబగబా తమకి ఏం కావాలో చెప్పేసాడు.

‘‘సూది దారం ఎందుకు? అవిక్కడుండవు’’ అందామె.

‘‘అది లేకపోతే ఆపరేషన్లో వాడే వంపు సూది దారం వున్నా ఇవ్వండి మేడం. మీకు చాలా పుణ్యం వస్తుంది. ఆమె చుడీదార్ వెనక చినిగిపోయి వీపంతా కలబడుతోంది కుట్టాలి’’ అంటూ అయిదు వందల నోటు తీసి కౌంటర్ మీద వుంచాడు.

‘‘చిల్లర ఇవ్వక్కర్లేదు మేడం నేనడిగినది ఇవ్వండి’’ అన్నాడు.

‘‘ఆవిడ ఎవరు?’’ నోటు తీసుకుంటూ అడిగింది.

‘‘ఆమె నా భార్య’’ తడబడకుండా చెప్పేసాడు.

ఇక ఆ యువతి సందేహించకుండా విరాట్ అడిగినవన్నీ ఒక కవర్లో వేసిచ్చింది. వాటర్ బాటిల్ కూడా అడిగి తీసుకొని వెనుతిరిగాడు విరాట్. అతడి భార్య వీపు మీద చుడీదార్ ఏమాత్రం చిరిగిందో చూద్దామని షాపులోయువతి రోడ్ దాటుతున్న జంట వంక ఆసక్తిగా చూసింది. సహస్ర వీపు మీద ఎక్కడా చిన్న చిరుగు కూడా కనబడక పోడంతో అవాక్కయింది.

ఆమె చూస్తుండగానే సహస్ర విరాట్ లు ఎదురు వీధిలోకి వెళ్ళి అదృశ్యమయ్యారు.

******************************************

అక్కడ పోలీసులు సంఘటనా స్థలాన్ని కవర్ చేస్తున్న సమయానికి సుకుమారి ఆమె తన ఇద్దరు బిడ్డలతో చెన్నైనుంచి కంచి వెళ్ళే రూట్లో బస్ లో ప్రయాణం చేస్తోంది.

ఆమె కళ్ళముందు సహస్ర మెదులుతోంది.

సహస్ర ఏమైందోనన్న బెంగతో మాట మాటకి చెమరిస్తున్న కళ్ళు తుడుచుకుంటోంది.

సుకుమారి పుట్టి పెరిగిన వూరు కంచి.

ఆమె తల్లిదండ్రులు ఇద్దరు అన్నలు అంతా అక్కడే వున్నారు. అప్పట్లోనే తనను కంచి వచ్చేయమని బంధువులంతా చెప్పినా ఇల్లు వదులుకోలేక, పిల్లల చదువుల దృష్టిలో ఉంచుకొని చెన్నైలోనే ఉండి జాబ్ చేసుకుంటూ బతుకుతోంది. శిఖామణి లాంటి గూండా మూలంగా ప్రశాంతంగా ఉన్న తన జీవితం తిరిగి అల్లరి పాలయింది. సమయానికి సహస్ర కాపాడి ఉండకపోతే తన బిడ్డలు అనాధలయ్యేవారు. ఇంతకీ అక్కడ పరిస్థితి ఏమిటి. సహస్ర ఏమైందో తెలీక సుకుమారి మనసు కొట్టుమిట్టాడుతోంది.

ఇంతలో అవతలి సీట్ లో వ్యక్తి ఫోన్ లో సంభాషణ వినగానే అటు చూసింది సుకుమారి.

అవతలి వ్యక్తి చెన్నైలో పరిస్థితి వివరిస్తున్నట్టున్నాడు. వివరాలు అడిగి తెలుసుకుంటున్నాడతడు. సంభాషణ ముగియగానే అతనితో ` ‘‘అయ్యా చెన్నైలో పరిస్థితి ఏమిటి? గొడవలు సద్దు మణిగాయటనా?’’ అంటూ ఏమీ తెలీనట్టు అడిగింది సుకుమారి.‘‘లేదమ్మ అక్కడంతా బీభత్సతంగా ఉందట’’ వెంటనే చెప్పాడతను.

ఆ మాట వినగానే..

సుకుమారి గుండెలు దడదడలాడాయి.

‘‘ఏం జరుగుతోందట? పోలీసులు ఆపలేకపోయారా?’’ తనను ఆను కంట్రోల్ చేసుకుంటూ అడిగింది.

‘‘మీరడిగేది జి యన్ చెట్టి రోడ్ లో గొడవ గురించేనా?’’

‘‘అవును’’

‘‘తేనాంపేట గుండా శిఖామణి ఎవరో స్త్రీని అల్లరి చేస్తుంటే ఒకమ్మాయి వచ్చి ఆమెను కాపాడి పంపించేసి గుండాల్ని చితక్కొట్టిందట. ఆమె తరపున మరో పాతిక ముఫ్పైమంది వచ్చి శిఖామణి కుర్రాళ్ళని చావగొట్టి చెవులు మూసారట. తర్వాత ప్రమాదంలో వాహనాలకు నిప్పంటుకొని శిఖామణి కుడికాలు నుజ్జునుజ్జయి ఒళ్ళంతా కాలిన స్థితిలో పోలీసులకు చిక్కాట్ట. ప్రస్తుతం శిఖామణితో బాటు గాయపడ్డ వాళ్ళని రాయపేట ఆస్పత్రికి పోలీసులు తరలిస్తున్నారట....’’

‘‘ఆ అమ్మాయి.. తనేమైంది?’’

‘‘తప్పించుకుంది. వాళ్ళంతా తప్పించుకు పారిపోయారట’’

ఆ మాట వినగానే తేనెజల్లు కురుస్తున్నంతగా...

సంతోష పడింది సుకుమారి.

ఈ లోపల అవతలి వ్యక్తి చెప్తూనే వున్నాడు.

‘‘ఒకందుకు మెచ్చుకోవాలమ్మా. ఆడపిల్లంటే ఎలా వుండాలో ఆ పిల్ల నిరూపించింది. ఏ తల్లి కన్నబిడ్డో గాని, పచ్చినెత్తురు తాగే తేనాంపేట శిఖామణి కొమ్ములు విరిసేసింది. వాడి మనుషుల తాట తీసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంది’’ అన్నాడు.

‘‘నిజంగా తను తప్పించుకుందా?’’ అనుమానం తీరక అడిగింది సుకుమారి.

‘‘ఆమెకు సాయంగా ఎవరొచ్చారు?’’

‘‘అదేగా చెప్తున్నాను. పోలీసులకే తెలియంది జనానికేం తెలుసుస్తుంది. రణ రంగంగా మారిన ఆ ప్రదేశాన్ని పోలీసులు ముట్టడించే సరికే వాళ్ళంతా పారిపోగా కొందరు రౌడీలు గాయపడిన వాళ్ళు పోలీసులకు చిక్కారు. గాయపడ్డ వాళ్ళని రాయపేట ఆస్పత్రికి తరలించారట’’‘‘శిఖామణి... ఆ వెధవ ఏమయ్యాడు?’’

‘‘వాడు జీప్ లో పారిపోతూ ఆక్సిడెంటయి. జీపుతో బాటు కొన్ని వాహనాలు తగలబడగా, శిఖామణి కుడికాలు నుజ్జు నుజ్జయి ఒళ్ళుకాలిన స్థితిలో ప్రాణాపాయ స్థితిలో వున్నాట్ట. ఈ విషయం తెలీగానే రౌడీ మూకలు వీధుల్లో పడి అల్లర్లకు తెగబడి పరిస్థితి ఉద్రిక్తంగా ఉందట. పోలీసులు కర్ఫ్యూ విధించారట’’ అంటూ ఫోన్ లో తన మిత్రుడు చెప్పిన విషయాన్ని సుకుమారికి వివరించాడా పెద్దమనిషి.

‘‘ఇంతకీ పోలీసులు ఆ అమ్మాయిని గుర్తించారన్నారుగా. ఆమె ఎవరు?’’ కుతూహలంగా అడిగింది సుకుమారి. సుసాగా ఆమెను గుర్తించి షాపింగ్ మాల్ పేరు బయటకొచ్చిందేమో. అదే జరిగితే తన పేరుతో బయటకొచ్చే అవకాశం ఉందన్న సందేహంతో అడిగింది సుకుమారి. కాని ఆమె విన్న సమాధానం ఆమెకు నిజంగా షాకిచ్చింది.

‘‘కొద్ది రోజుల క్రితం పేపర్లో పట్టిస్తే కోటి రూపాయలంటూ ప్రకటనలో ఓ అమ్మాయి ఫోటో పడింది చూసారా? పేరు సహస్ర. ఆ సహస్రే ఇప్పుడు శిఖామణి నడుంను విరగ్గొట్టింది. ఉండాలి. ఇలాంటి అమ్మాయి వూరికి ఒక్కరున్నా చాలు. దేశంలో రౌడీ అనే వాడుండడు’’ అన్నాడు. తాము షాపింగ్ మాల్ లో సుసాగా పిలుచుకునే అమ్మాయి అసలు పేరు సహస్ర అని తెలీగానే నిజంగానే సుకుమారి షాకయింది. కాని ఆమె తప్పించుకుందని తెలిసి మనసు తేలికపడింది.

ఆమె ఫీలింగ్స్తో సంబంధం లేకుండా...

బస్సు కంచివైపు పరుగు తీస్తునే వుంది.

********************************************

‘‘మనం అనవసరంగా తిరుగుతున్నట్టున్నాం. వాళ్ళిటు రాలేదు. వచ్చుంటే ఈ పాటికే మనకి కనబడాలి’’ అన్నాడు సీటు చివర డోర్ పక్కన కూచున్న షూటర్ విక్కీ.

‘‘ఒక పని సాధించాలంటే ఓర్పు సహనం చాలా ముఖ్యం. ఎవరూ డౌటు పడక్కర్లేదు. సహస్ర ఆమె వెంట వున్న యువకుడూ ఇటే వచ్చారు’’ అన్నాడు స్థిరంగా మధ్యలో కూచున్న ధనగిరి.

‘‘మూడు వైపులా పోలీసులు కవర్ చేసేసారు. నాలుగో పక్కకి పోలీసులు వచ్చేలోపు వాళ్ళిద్దరూ ఇటు పారిపోవటం నేను చూసాను. కొందరు పోలీసులు కూడా వాళ్ళని తరుముకెళ్ళారు. కాబట్టి వాళ్ళింకా ఈ  ఏరియాలోనే తిరుగుతుంటారు. కనబడగానే ఇద్దర్నీ కాల్చిపారేయండి’’ అంటూ వివరించాడు.

వెనక సీట్లో రెండోవైపు డోర్ పక్కన కూచున్నాడు రెండో షూటర్ డేవిడ్. వాడికి రాకూడని సందేహం వచ్చింది.

‘‘కోప్పడకు. మనికిచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఆ అమ్మాయిని అనుసరించి ఇల్లు తెలుసుకున్నాక ఇంటి దగ్గరే షూట్ చేయాలి గదా. నువ్వేమిటి ఇక్కడే వేసేద్దామంటావ్. పొరబాటు జరిగితే ఎట్టయప్పతో మాటొస్తుంది గదా!’’ అనడిగాడు.

‘‘వాళ్ళు చెప్పారని మీనమేషాలు లెక్కిస్తే పనులు కావు. త్వరగా పని ముగించామా అవతలికి వెళ్ళిపోయామా అన్నట్టుండాలి. త్యాగరాజన్ సార్ ఫోన్ లో అదే చెప్పారు. పిచ్చి ఆలోచనలు చేయకుండా చెప్పింది చేయండి’’ అన్నాడు. ధనగిరి మాటలు ముగించేసరికి వారి వేన్ ఒక వీధి మలుపు తిరిగింది.

ఆ వీధి అప్పటికే నిర్మానుష్యంగా వుంది. ఇళ్ళలో జనం తలుపులు బిగించి నిద్రలు తీస్తున్నారు. వీధి దీపాలు వెలక్క వీధి చీకటి గుహలా వుంది. హెడ్ లైట్ల కాంతిలో దూరంగా ఒక జంట తమ కెదురుగా నడచుకొంటూ రావటం చూసారు. చూసిన మరుక్షణంలో షూటర్ విక్కీ ఆనందంతో ఉక్కిరి బిక్కిరవుతూ తన షాట్ గన్ అందుకున్నాడు.

‘‘నీ అంచనా ఇంత ఖచ్చితంగా ఉంటుదనుకోలేదు. ఆ వచ్చే యిద్దరూ మనం వెదుకుతున్న వాళ్ళే’’ అనరిచాడు.

‘‘వదలకు. ఇద్దరూ రెడీగా ఉండండి. ఒకేసారి కాల్పులు జరపండి. ఫస్ట్ రౌండ్లోనే ప్రాణాలు పోవాలి గెట్రెడీ’’ అంటూ హెచ్చరించాడు ధనగిరి అంతే`

డ్రయివర్ ఒక్కసారిగా వేన్ స్పీడ్పెంచి వేగంగా ముందుకు దూకించాడు.

**********************************************************

మెడికల్ షాపునుంచి బయలు దేరిన విరాట్ సహస్రలు రోడ్డు దాటి పక్క వీధిలోకి వెళ్ళిపోయారు. కొంత దూరం వెళ్ళగానే అక్కడి నుండి వీధి దీపాలు వెలగటం లేదు. ఆ ప్రాంతం చీకట్లో మునిగివుంది. ఇద్దరూ వడి వడిగా నడుస్తున్నారు.

‘‘ఆమెతో నేన్నీ భార్యనని ఎందుకు చెప్పావ్?’’ అంతవరకూ గొంతులో దాచుకున్నా ప్రశ్నను ఇక ఆగలేక అడిగేసింది సహస్ర.‘‘ ఏం? చెప్పకూడదా?’’ ఎదురు ప్రశ్నించాడు విరాట్.‘‘అలా చెప్పకపోతే అనుమానించి అడిగినవి ఇవ్వదు. అందుకే అలా చెప్పాను. చెప్పకూడదా? నువ్వు నన్ను పెళ్ళి చేసుకోవా?’’ అడిగాడు.

‘‘ఇప్పుడే చెప్పలేను’’

‘‘ఎందుకు చెప్పలేవు?’’

‘‘ఎందుకంటే నువ్వు నాకు మాత్రమే సొంతం అని పూర్తిగా నమ్మకం కలగాలి.

అప్పుడు’’

‘‘ఓహో! సరి నమ్మకం కలగలేదనుకుందాం. అప్పుడేంచేస్తావ్? నన్నుకాదని వేరే వాడ్ని చేసుకుంటావా?’’

‘‘నేనలా చెప్పలేదు. ఈ జన్మకి నువ్వే నా మొగుడని ఎప్పుడో డిసైడయిపోయాను.’’

‘‘అయితే పెళ్ళి చేసుకో. నువ్వే నా పెళ్ళామని నేనూ ఎప్పుడో డిసైడయిపోయాను’’

‘‘అదెలా కుదురుతుంది. పెళ్ళి చేసుకోడానికి నీకు విశాల ఉందిగా. నేనెందుకులే’’

‘‘చివరికి దొరికి పోయావ్ చూసావా? నీ సమస్య నేను కాదు విశాల. ప్రస్తుతం నీకు సమస్యల్ని వివరించే ఓపిక నాకు లేదు. గాయం నరాల్ని తోడేస్తోంది. త్వరగా ఏదో ఒకటి చేయాలి. అక్కడ పార్కులో లైటు వెలుగుతోంది పద’’ అంటూ శక్తినంతా కూడదీసుకొని నడక వేగం పెంచాడు.అది చిన్న పార్కు. పార్కును చుట్టూ నాలుగు పక్కలా రోడ్డు ఉంది. ఆ పార్కు పరిసరాల్లో మాత్రం కొన్ని లైట్లు వెలుగుతున్నాయి. గేటు తీసే ఉంది. ఆ ప్రాంతమంతా నిర్మానుష్యంగా నిశ్శబ్ధంగా వుంది. ఇద్దరూ పార్కులో ప్రవేశించారు. నేరుగా పార్కు సెంటర్ లోని లైట్ కింద తిన్నెమీద కూచున్నారు. చేతిలో ప్లాస్టిక్ కవర్ని వాటర్ బాటిల్ని విరాట్ ముందుంచింది సహస్ర.

బాటిల్లో కూలింగ్ వాటర్ నాలుగు చుక్కలు తాగి పక్కన పెట్టాడు విరాట్. ‘‘కవర్లో సూది దారం ఉంటాయి. దారం ఎక్కించి రెడీగా వుంచు’’ అన్నాడు బాధతో కళ్ళు మూసుకుంటూ.‘‘వద్దు విరాట్ బాధకు తట్టుకోలేవు. మత్తు ఇంజక్షనివ్వకుంటే కుట్టలేం. ఏమయితే అయింది. ఏదో అస్పత్రికి వెళ్ళి పోదాం పద’’ అంది చిన్నగా ఏడుస్తూ సహస్ర.

‘‘ఏయ్ ఇప్పుడేమైందని ఏడుస్తున్నావ్? నీకోసం బతికే ఉంటాను. భయపడక. ఆస్పత్రి అంటూ కొంప ముంచే ఆలోచనలు చేయక. కట్టు విప్పి గాయాన్ని కడుగు చెప్తాను. త్వరగా ’’ అన్నాడు.

కళ్ళు తుడుచుకుని`

అతను చెప్పినట్టు చేసింది.

నెత్తురు ముద్దలా వున్న జేబు రుమాలును నీళ్ళలో తడిపి పిండి, విరాట్ భుజం గాయాన్ని చన్నీటితో కడిగింది. నరకం చూపిస్తొంది గాయం. ఆ గాయాన్ని చూస్తున్న సహస్రకి దుఃఖం ఆగటం లేదు. తన ఎడం చేతిని సహస్ర భుజం మీద వుంచాడు.‘‘పట్టుకో చేతిని కదలకుండా గట్టిగా పట్టుకో’’ హెచ్చరించాడు.సహస్రకు దుఃఖం ఆగటం లేదు.చిన్నగా ఏడుస్తొంది.‘‘ఏడవకు!’’ అన్నాడు కటువుగా.‘‘ఏడ్చి నాయకర్ వంశానికి మచ్చతేవద్దు. నువ్వు సాధారణ యువతివి కాదు. ధైర్య సాహాసాలకు నిలయమైన నాయకరాజుల వంశం నీద. ఎన్నో యుద్ధాలు చూసిన వీరవంశం. కష్టాలను కళ్ళలోనే దాచుకుని వీరోచితంగా పోరాడిన వాళ్ళు మీ వంశీకులు. ఎందుకేడుస్తావ్? ఏడిస్తే పనులు కావు. తేనాంపేట కరడు గట్టిన గూండా శిఖామణి కొమ్ములు విరిచి. వాడి అడ్డాను కాల్చి. రౌడీ మూకల్ని చిత్తు చేసిన మహాశక్తివి నీకు ఏడుపేమిటి? నాకే సిగ్గుగా వుంది. ధైర్యం వదలక. మన ప్రయత్నం మనం చేద్దాం. భయ పడక. చేతిని బలంగా పట్టుకో’’ అంటూ సహస్రకు ధైర్యం నూరిపోస్తూనే పళ్ళబిగువున బాధను భరిస్తూ చకచకా సూది-దారంతో గాయానికి కుట్లు వేయటం ఆరంభించాడు. బాధ నర నరాన భగ్గుమన్నా ఆపలేదు. అపితే కుట్టలేడు. చకచకా జరిగిపోవాలి. బద్దలా విడిపోయిన కండను దగ్గరకు చేర్చి తనకు తానే కుట్లు వేసుకున్నాడు.

అంత బాధను ఎలా తట్టుకున్నాడో`

ఎలా కుట్లు వేసుకున్నాడో విరాట్ కే తెలీదు.

చివరి కుట్టు అవగానే`

దారాన్ని పంటితో తెంచింది సహస్ర.

గాయం మీద టించరు పోసి పౌడర్ అద్దేసరికి ప్రాణం పోతున్నంత నరకాన్ని అనుభవించాడు. నిస్త్రాణతో కాస్సేపు సోలిపోయాడు. అతడి ముఖాన చల్లటి నీళ్ళు చల్లి తెప్పరిల్లేలా చేసింది సహస్ర. కొంచెం నీరు తాగి సేద తీరగానే చివరగా యూజ్ అండ్ త్రో సిరంజితో తనకు తానే ఇంజక్షన్ చేసుకొని బాధగా కళ్ళుమూసుకుంటూ అలాగే ఉండిపోయాడు కాస్సేపు.

‘‘ఏం చేద్దాం. ఏదో ఆటో పట్టుకొని ఇంటికెళ్ళిపోదామా?’’ విరాట్ కాస్త తెప్పరిల్లగానే అడిగింది సహస్ర.

‘‘చూద్దాం. ముందు మనం ఏదో ఒక పెద్ద రోడ్డుకి చేరుకోవాలి. వెనక్కి పోలేం. జేబురుమాలు బాగా పిండి కట్టుకట్టు. వెళ్ళిపోదాం’’ అంటూ ఓపిక తెచ్చుకొని లేచాడు.

సహస్ర కట్టుకట్టింది.

నెత్తురు స్రవించటం`

కంట్రోలయింది.

ఇక దుఃఖాన్ని ఆపుకోలేక మరోసారి అతడ్ని కౌగిలించుకొని ఏడ్చేసింది సహస్ర.

‘‘పాపిష్టి దాన్ని. నువ్వు పిలిచినప్పుడే వచ్చేసుంటే ఇలా జరిగేది కాదు. నా వల్లే నీకింత బాధ’’ అంది దుద్దకంఠంతో. ప్రేమగా ఆమె జుత్తునిమిరి`

నుదురు ముద్దాడాడు.

‘నీ కోసం ఎంత బాధనయినా భరిస్తాను. ఆరోజు రైల్లో నిన్ను చూసిన క్షణంలోనే, నువ్వెవరో తెలీక పోయినా ప్రేమించాను. నీ కోసం చచ్చిపోయినా తప్పులేదనిపించింది. ఈ బాధ కన్నా నువ్వు నాకు దూరంగా వుంటేనే ` ఆ బాధ తట్టుకోలేను. నీకాన్నా నా ప్రాణం ఎక్కువ కాదు’’ అన్నాడు.

ఆ మాటతో తనకు తెలీకుండానే పులకించిపోతూ. ఇక వితండ వాదం చేయకుండా మౌనంగా అతడ్ని అనుసరించింది. పార్కులోంచి బయటికొచ్చి`ఎగువకు నడక ఆరంభించారు.‘‘మన వాళ్ళంతా క్షేమంగా ఇంటికెళ్ళిపోయారంటావా?’’ దారిలో అడిగింది.‘‘వెళ్ళే వుంటారు’’ చెప్పాడు.‘‘ఇంతవరకు ఫోన్ చేయలేదు...’’‘‘కాస్సేపు ఆగి మనమే ఫోన్ చేద్దాం’’ఇద్దరూ మాట్లాడుకుంటూ...మూడు వీధులు దాటారు.నాలుగో వీధిలో ప్రవేశించేసరికి అక్కడినుండి కుడి పక్క చిన్న చిన్న ఇళ్ళు గుడిశెలతో స్లమ్ ఏరియా వుంది. ఎడం పక్క మేడలు మిద్దెలు వున్నాయి. ఆప్రాంతంలో కరెంటు లేక పోవటం, అప్పటికే రాత్రి పదిన్నర దాటడంతో ఏయింట్లోను దీపాలు వెలగటం లేదు. చాలామంది నిద్రపోతున్నారు. వీధి నిర్మానుష్యంగానే వుంది. అంతలో ఎగువన మలుపులోకి వస్తున్న ఏదో వెహికిల్ హెడ్లైట్ల కాంతి చప్పున ఫోకస్ అవటం ఇద్దరూ చూసారు. క్షణం తర్వాత అది మలుపు తిరిగి ఇటే రావటం కన్పించింది.

‘‘ఎవరు? పోలీసులంటావా?’’ అనుమానంగా అడిగింది సహస్ర.

‘‘మనం పోలీసులు లోకల్ గూండాల గురించే ఆలోచిస్తున్నాం. మధురై నుండి నిన్ను చంపటం కోసం వచ్చిన ఎట్టయ్యప్పన్ పంపించిన మనుషుల గురించి ఆలోచించటం లేదు. ఇంత వరకు వాళ్ళు మన కంట పడలేదు. మిగిలిన అందరి కన్నా మన కోసం ఎక్కువ గాలించేది వాళ్ళే. వాళ్ళు కావచ్చని సందేహంగా వుంది. అదో... ఉన్నట్టుండి వేగం పుంజుకుందా వేన్. వచ్చేది ధనగిరి బేచ్ అయితే వాళ్ళ దగ్గర రివాల్వర్లుంటాయి. మనం జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు మనల్ని గుర్తించి వేగంగా వస్తున్నారు. మనం తప్పుకోడానికిక్కడ అవకాశం లేదు. జాగ్రత్త గెట్ రెడీ’’ అంటూ డాగర్ అందుకున్నాడు విరాట్. చూస్తుంటే సహస్రకు విరాట్ మాటలు నిజమనిపించింది. అసలే విరాట్ పరిస్థితి బాగ లేదంటే పులిమీద పుట్రలా ఇదొకటి. కోపంతో వూగి పోతూ గుప్పెడులా వుండే పలుగు రాళ్ళు రెండు అందుకుంది. ఈ లోపల...సమీపంలోకి రానే వచ్చేసిందా వేన్.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika