Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasinipattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగినకథ: సరదాగా గడచిన వేసవి సెలవుల వెంటనే చంద్రకళ చదువొక పక్క నాట్యాభ్యాసం మరోపక్క ఆనందం బిజీ కలగలిపి కాలం గడిచిపోతుంటుంది. భూషణ్ అంకుల్ ప్రివ్యూ థియేటర్ కి అందరూ కలిసి వెళతారు. ఆ తరువాత....

భూషణ్  అంకుల్  ఏర్పాట్లన్నీ దగ్గరుండి  చేయిస్తున్నారు.  వాళ్ళ నాన్నగారి వర్ధంతితో పాటు మా ప్రోగ్రాం, తమ్ముడి పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కూడా జరుగుతాయట.

రాణి  పాట  ప్రాక్టీస్  వినడానికి, అప్పుడప్పుడు ఆంటీ, అంకుల్, మ్యూజిక్ క్లాస్ కి వస్తున్నారు.  రాణీని  క్లాసికల్  సింగర్ గా తీర్చిదిద్దాలని వాళ్ళ కోరికట....

ఇన్విటేషన్స్, పబ్లిసిటీ, మీడియా కోసం అంటూ రాణీవి, నావి స్టిల్స్ తీయించారు అంకుల్. వాళ్ళ స్టూడియోలో మా ప్రదర్శన గురించి  పెద్ద బ్యానర్స్ పెట్టించారు.  నన్ను అమ్మని తీసుకువెళ్ళి చూపించారు కూడా.  ప్రోగ్రాంకి  నాన్న తన ఆర్మీ ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తున్నారు. అసలైన ‘వేదిక’ మీద నేను చేయబోయే మొదటి డాన్స్ ప్రోగ్రాం ప్రాక్టీస్ ఉత్సాహంగా  సాగుతుంది.

**

అదే టైంలో మాకు మరింత ఉత్సాహాన్ని కలిగించేలా,  ఊహించని మరో విశేషం జరిగింది.....నేనైతే, ఆనంద తాండవం చేసేసాను.  అమ్మా నాన్న కూడా నాకంతటి అవకాశం ఇంత త్వరగా వస్తుందని తామసలు ఏనాడూ అనుకులేదన్నారు.

......

ఆ సంతోషాలకి కారణం మా మాష్టారు గారు నాకందించిన ఓ గొప్ప ఆవకాశమే.  అది వివరిస్తూ, ఆయన మాకు పంపిన లెటర్ లో విషయాన్ని, అమ్మ చేత మళ్ళీ మళ్ళీ చెప్పించుకున్నాను.

...

‘ప్రతిష్టాత్మకంగా  ప్రభుత్వం వారు చేపట్టనున్న - కూచిపూడి  నృత్య నాటికలు, ప్రదర్శనల నిమత్తం - టాలెంట్, ఆసక్తి ఉన్న  డాన్సర్స్ తో, తామొక  డాన్స్ ట్రూప్ ని తయారు జేయబోతున్నామని,  దానికి సెలెక్ట్  అయిన వారిలో  చిరంజీవి చంద్రకళ కూడా ఉందని తెలియజేస్తూ,  త్వరలో ప్రాక్టీసులు,  యేడాది తరువాత  దేశ – విదేశ ప్రయాణాలు కూడా ఉంటాయి’  అన్న ఆ లెటర్ తో పాటు,  వెంటనే తమ అనుమతి తెలియ జేయమని,అమ్మా వాళ్ళకి మాస్టారు గారు  పర్సనల్ మెసేజ్ కూడా పంపారు.

.......

అలా టూర్ మీద వెళ్ళ వలసి వస్తే, మరి స్కూల్ విషయం ఏమిటన్న లాంటి విషయాలు వివరంగా మాట్లాడాలంది అమ్మ.

మరునాడు తమ సమ్మతి, అనుమతి తెలుపుతూ నాన్న సైన్ చేసిచ్చిన కన్సెంట్  ని తీసుకువెళ్ళి  మాస్టారు గారికి ఇచ్చినప్పుడు,  ఆ  డాన్స్  గ్రూప్ కి ‘నృత్యహేళి’ అని పేరు పెట్టారని తెలిసింది....

**

మొట్ట మొదటి ‘నృత్యహేళి’  గ్రూప్’ క్లాస్ లో, కాస్త నర్వస్ గానే అడుగు పెట్టాను., అప్పటికే, నలుగురు సీనియర్ స్టూడెంట్స్ డాన్స్ చేస్తున్నారు.  నేను వాళ్ళని మునుపెన్నడూ చూడలేదు.  కళ్ళు తిప్పుకోలేనంత అందంగా ఉన్నారు వాళ్ళు. మెల్లగా వెళ్లి ఓ పక్కగా కూర్చున్నాను.

అమ్మ, ఈ వేళ మామూలుకన్నా మంచి బట్టలు వేయించి, జడలు కూడా మరింత శ్రద్ద  పెట్టి వేసిందని గుర్తొచ్చి...నవ్వొచ్చింది....వీళ్ళంతా ఎంత అందంగా ఉన్నారో, ఎంత చక్కగా నాట్యం చేస్తున్నారో ! అమ్మకి చెప్పాలి అనుకున్నాను.  వాళ్ళని చూస్తుంటే, త్వరగా  పెద్దదాన్నయ్యి  వాళ్ళలా ఉండాలనిపించింది.

ఇంతలో మరికొందరు వచ్చారు క్లాసుకి.   హీరోయిన్ వసంత కుమారి కూతురు – నా క్లాస్ మేట్  ‘ఉదయ కూడా వచ్చింది...లంచ్ టైంకి క్లాస్ అవుతుందని చెప్పారు మాస్టారు గారు. మా చేత ముందుగా  అడుగులు, జతులు ప్రాక్టీసు చేయించాక,  ‘కస్తూరి తిలకం’ శ్లోకం కి డాన్స్  మొదలుపెట్టారు.

**

క్లాస్ అవుతూనే పరుగున ఇంటికొచ్చి, చేతులు కడుక్కుని లంచ్ కి కూర్చున్నాను. అమ్మ వడ్డిస్తుంది.  నేను  క్లాస్  గురించి  చెప్పాలని  అనుకుంటుండగానే, “ఎలా ఉందమ్మా? మీ స్పెషల్ క్లాస్,” అడిగారు నాన్న.

“నాన్నా, అమ్మా,  ఈ  క్లాసుకి మంజరి, కాంచన అని ఇద్దరు సినిమా యాక్టర్స్ వచ్చారు.

మాస్టారు నన్ను వాళ్ళకి పరిచయం చేసినప్పుడు, నేను ‘అచ్చం  ‘తేజశ్విని’ మేడమ్ లాగా’ ఉన్నానన్నారు.దానికి మాస్టారు,  ‘అవును  పోలికలు,  టాలెంట్  కూడా  మన  తేజశ్విని లాగానే’  అన్నారు,”  గబగబా చెప్పాను.

అమ్మ నా వంక ఆశ్చర్యంగా చూసింది..

“నిజమా?...మంజరి అంటే, ఇప్పుడు టాప్ తెలుగు, తమిళ  సినిమా  హీరోయిన్.   కాంచన కూడా ఇప్పుడిప్పుడే  సినిమాల్లో  వస్తుంది...ఇక  తేజశ్విని  చాలా  ఫేమస్ కూచిపూడి డాన్సర్.  మీ మాస్టారు శిష్యురాలు. ఇప్పుడు అమెరికాలో సెటిల్ అయిందని విన్నాను.  అందంగా ఉంటుంది.  మా కాలేజీ టైములో కూడా, అవకాశం  వచ్చినప్పుడల్లా  మేము ఆమె ప్రోగ్రాములు మిస్ అవ్వకుండా చూసేవాళ్ళం. ఆంధ్రదేశంలో  డాన్సర్స్ అవ్వాలనుకునే వారికి, ఆమె అప్పట్లోనే రోల్-మాడల్,”  అంది అమ్మ.

**

ఈ స్పెషల్ క్లాస్ అంటే చాలా ఉషారుగా, ఆసక్తిగా అనిపించ సాగింది.

ఆదివారాలు పొద్దుటే జరిగే  డాన్స్  క్లాస్ కి,  పెద్ద కార్లల్లో వచ్చే ఆ సినిమా యాక్టర్లు – వీళ్ళేనని, ఇప్పుడు అర్ధమయ్యింది.. ఆ క్లాస్ కి నేను వెళ్ళను కాబట్టే, వాళ్ళని నేను ఇప్పటివరకు చూడలేదు....

పోతే వాళ్ళు నన్ను ‘తేజశ్విని’ లాగా ఉన్నానన్నారే? ఆమెలా ఉన్నానా?  అమ్మ చెప్పడం ఆమె పేరున్న డాన్సర్ అని.  నేను ఆమెలా అవ్వగలనా? ‘ఆమె ఫోటోలు చూపించమని’ మాస్టర్ గారిని అడగాలి అనుకుంటూ నిద్రపోయాను.

**

“త్వరగా లేవాలి చంద్రా.  ఇవాళే  రాంమామయ్యా వాళ్ళు వచ్చే రోజు..... నీ రూం సర్దుకో,” పొద్దున్నే వాకిట్లో నిలబడి చెప్పి వెళ్ళింది అమ్మ. అవును, నిన్న సాయంత్రం నుండీ ఇల్లంతా క్లీన్ చేసి, వచ్చే వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేసింది.  వాళ్ళఫ్లైట్ సాయంత్రం ఆరింటికి వస్తుందట...ఇవాళే  డాన్స్  కాస్ట్యూమ్స్  ట్రైల్స్ కూడా... చాలా ఉత్సాహంగా ఉంది....

‘ఆర్డర్ చేసిన క్లాసికల్ కాస్ట్యూమ్స్, ఓ ఫోక్  స్టైల్ కాస్ట్యూమ్, మాచింగ్ జ్యులరీ తీసుకొని స్టూడియో  నుండి టైలర్  కృష్ణ ఇవాళ లంచ్ టైంకి వస్తున్నాడు’ అనుకుంటూ బెడ్ నుండి లేచాను..

**

కృష్ణ రావడం బాగా ఆలస్యం అవడంతో, కాస్ట్యూమ్స్  ట్రైల్స్ అయ్యేప్పటికి,  రాం మామయ్య వాళ్ళు  కూడా వచ్చేసారు.టైలర్ ని పంపేసి, అప్పటికే  సిటింగ్ రూమ్ లో ఉన్న మామయ్యా వాళ్ళ దగ్గరికి వెళ్ళాము.

“సారీ అన్నయ్యా,  వదినా సారీ....,” అంటూ మణత్తయ్య వద్దకు వెళ్ళింది అమ్మ...

“ఏం పర్వాలేదు శారదా,  మేమూ ఇప్పుడేగా వచ్చింది,” అన్నారు మామయ్య. అమ్మ వెనకే ఉన్న నన్ను, మామయ్య పలకిరించారు. వచ్చి  పక్కన  కూచోమన్నారు.  చాలా పొడవయ్యానన్నారు.  “స్వీట్ క్యాండీ ఫర్ ఎ స్వీట్ గర్ల్,” అంటూ నాకు క్యాడ్బరీ చాక్లెట్ బాక్స్ అందించారు..  మణత్తయ్య తన చేతిలోని మరో గిఫ్ట్ బాక్స్ బాబుకి అందించి, వాడ్ని దగ్గర కూర్చోబెట్టుకుంది.

వాళ్ళబ్బాయి, జగదీష్ మా వంక చూస్తూ మాట్లాడకుండా దూరంగా కూర్చునున్నాడు.  “మా వాడు కొంచెం రిజర్వ్ డ్.  మనుషులు తెలిసి నచ్చితే మాత్రం, బెస్ట్ ఫ్రెండ్ అవుతాడు,” అన్నారు మామయ్య అతని గురించి.  ”ఐనా మిమ్మల్ని చూసి సెవెన్ ఇయర్స్ అయిందేమో కూడా,” అన్నారు మళ్ళీ.

“ఇలా రావే, కోడలు పిల్లా.  డాన్స్, పాట అన్నీ చేస్తున్నావంట.  సన్నగా ఉన్నావు  కానీ అందంగా ఉన్నావులే,”  అంటూ నన్ను దగ్గరికి పిలిచి నా నుదుటిపై  ముద్దు పెట్టింది మణత్తయ్య.

“పదహేడేళ్ళకే జగదీష్  బాగా  పొడవయ్యాడే?  వాడి  నవ్వు,  కర్లీ  హెయిర్ తో కొంటెకృష్ణుడులా  ఉన్నాడు.  పెద్దవాడయిపోయాడు,”  అంది అమ్మ  జగదీష్ గురించి.

ఇంతలో నాన్న కూడా వచ్చేసారు.

**

అందరూ  ఫ్రెష్ అయి వచ్చాక, నాన్న, వాళ్ళతో  చాలా సేపు మాట్లాడుతూ కూర్చున్నారు. మీనాక్షితో పాటు నేనూ అమ్మకి కిచెన్ లో హెల్ప్ చేసాక,  డైనింగ్ టేబిల్ కూడా సెట్ చేసి అందరినీ డిన్నర్ కి పిలిచాను. అత్తయ్య వాళ్ళతో కలిసి భోంచేసాము. రాంమామయ్య  త్వరలో  ఆర్మీ ప్రొమోషన్ తో కర్నల్ అవుతున్నందుకు  అభినందించారు  నాన్న.

**

మరునాటి నుంచి, జగదీష్  మాతో  కొద్దిగా  మాట్లాడ్డం  మొదలు పెట్టాడు.   తను చెస్ బాగా ఆడుతాడట.  ఢిల్లీ స్టేట్ జూనియర్స్  చెస్  చాంపియన్ షిప్ గెలిచాడట.

......రోజూ నా క్లాస్ అయ్యాక,  చెన్నైలో చూడవలసిన ప్రదేశాలు ఒక్కోటి చూడ్డానికి వెళుతున్నాము....డిన్నర్ టైంకి మళ్ళీ ఇల్లు చేరేలా ప్లాన్ చేస్తుంది అమ్మ. రెండు రోజులుగా,  ఇంట్లో  మా  ప్రోగ్రాం  ప్రాక్టీసులకి కూడా  కూర్చుంటున్నాడు జగదీష్.  నాతో, వినోద్ తో ఫ్రెండ్లీగా ఉంటున్నాడు.

నా డాన్స్ చూసి, అమ్మ పాట వింటుంటే,  క్లాసికల్ ఆర్ట్స్ నచ్చాయని కూడా చెప్పాడు....  జగదీష్ ని  పేరు పెట్టి కాదు, ‘బావ’ అని పిలవమంది అమ్మ, ఓ రోజు,  డిన్నర్ చేసేప్పుడు.

“ఏమిటా పాత కాలం పిలుపులు.   పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయి, శారదా,”  అమ్మతో అన్నారు నాన్న.

**

భూషణ్ అంకుల్, నీరూ ఆంటీ వచ్చి మామయ్యా వాళ్ళని కలిసారు.

“ప్లెజర్ మీటింగ్ యు” అంటూ జగదీష్  హ్యాండ్ షేక్  చేసి, చాలా ప్లెజెంట్ గా మాట్లాడింది రాణి. పెద్దవాళ్ళు చాలా సేపు కబుర్లు చెప్పుకున్నారు...వాళ్ళింటికి  మా అందరినీ  భోజనానికి  ఇన్వయిట్  చేసారు భూషణ్ అంకుల్.. తన వద్ద మంచి మూవీ కలక్షెన్ఉందని చెబుతూ,  తమ హోం థియేటర్ లో మూవీ చూడ్డానికి రోజూ రావచ్చని, జగదీష్ ని ఇన్వైట్ చేసింది రాణి .  

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్