Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

 

" సాఫ్ట్ వేర్ ఉద్యోగిని అపర్ణ అదృశ్యమైన ఆ రోజు రాత్రి అసలేం జరిగింది?

సైబర్సిటీ :

ఐటీ పార్క్ :

ఎం ఎన్ సీ కంపెనీ ఎయిత్ ఫ్లోర్ :

రాత్రి 8 గంటల వేళ ....."

కీబోర్డ్ పై అతి సున్నితంగా కంపోజ్ చేస్తున్న చిరుసవ్వడి నేపధ్యంగా చానెల్ సిక్స్ టీన్ తెరపై ఒక్కో అక్షరం ప్రత్యక్షమవుతుంటే .... వెనుక నుంచి ఫిమేల్ వాయిస్ కథనాన్ని రక్తి కట్టిస్తోంది . ప్రతి రాత్రి ఆ చానెల్ లో క్రయిం బులెటెన్ టెలికాస్టవుతుంది . రియల్ క్రైం స్టోరీల్ని బేస్ చేసుకుని ... ఉత్కంఠ గొలిపేలా ప్రజెంట్ చేయడమే ఆ బులెటెన్ ప్రత్యేకత . సెన్సేషన్ క్రియేట్ చేసిన ఆ క్రైం అచ్చం ఇలాగే జరిగి ఉంటుందనిపించేలా టెలికాస్ట్ చేయడమే ఆ బులెటెన్ సక్సెస్ .

ఇంట్రెస్టింగ్ ఇంట్రో...

మెస్మరైజ్ చేసే స్క్రిప్ట్...

ఒళ్లు జలదరించే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్... ఆ ప్రోగ్రాంకి ఎస్సెట్స్...

అంతేకాదు, యాంకర్ వరలక్ష్మి కూడా ప్రొగ్రాం ప్రెజెంట్ చేయడంలో స్పెషలిస్ట్. చూడచక్కని రూపంతో పాటు ఏ అక్షరాన్ని ఎక్కడ ఒత్తి పలకాలో, ఏ సందర్భంలో, ఏ పదాన్ని ఎంతలా విరవాలో తెలిసిన జాణ... దాంతో ఆ టైంలో మిగతా ఛానెల్స్ అందుకోలేనంత టి.ఆర్.పి.తో ఈ ప్రోగ్రాం దూసుకుపోతోంది. లవ్, సెక్స్, కోపం, క్రౌర్యం, శౌర్యంలాంటి భావావేశాలన్నింటినీ ఒడిసిపట్టి దట్టిస్తారేమో...డైలీ సీరియల్స్ ధాటిని తట్టుకుని నిలబడుతోంది న్యూస్ ఛానెల్ లోని  ఈ బులెటిన్.

ఈ ప్రోగ్రాంని చూసి కనీసం చిన్న క్రైంనైనా చేయకపోతే ఏదో థ్రిల్ మిస్ అయిపోతామేమోననే భయంకరమైన భ్రమని వీక్షకులను కల్పిస్తోందని గిట్టనివారు ప్రచారం చేస్తూంటే... ప్రోగ్రాంలో ఇంట్రెస్ట్ వుండబట్టే వ్యూయర్స్ అంతగా ఏడిక్ట్ అయ్యారంటూ ఆ బులెటిన్ పై సాగుతున్న ప్రచారాన్ని ఛానెల్ 16 తిప్పికొడుతూంటుంది.

లేటెస్ట్ ఎపిసోడ్ లో సైబర్ సిటీ నుండి అంతర్థానమైన ఎం.ఎన్.సి. ఎంప్లాయీ అపర్ణ ఇన్సిడెంట్ ని బేస్ చేసుకున్నారు.

అపర్ణ హౌస్ నుంచి సేకరించిన పర్సనల్ ఆల్బం లోని అందమైన ఫోటోలతో పాటు నైట్ లైట్లో షూట్ చేసిన సైబర్ సిటీ, ఐ.టి. పార్క్ స్పాట్ విజువల్స్ నేపథ్యంగా ప్లే చేస్తున్నారు.

'ఎనిమిదిగంటల మూడు నిమిషాలు... సిస్టం లాగౌట్ చేసి సీట్లోంచి అపర్ణ లేచింది. నెమ్మదిగా ఒక్కో అడుగూ వేస్తూ లిఫ్ట్ దగ్గరకొచ్చి నిల్చుంది. అలసట తీర్చుకోవడానికన్నట్టు ఒక్కక్షణం ఆగిన తరువాత లిఫ్ట్ బటన్ నొక్కింది. ఎక్కడో సెల్లార్లో సెటిలైన లిఫ్ట్ నెమ్మదిగా కదిలిన సవ్వడి. ఒక్కో ఫ్లోర్ దగ్గర ఆగుతూ... మళ్లీ కదులుతూ వస్తున్న లిఫ్ట్ ఎనిమిది గంటల నాలుగు నిమిషాలకు ఎయిత్ ఫ్లోర్ దగ్గర ఆగింది. డోర్ తెరచుకుని లోనికి వెళ్లిన అపర్ణ, గ్రౌండ్ ఫ్లోర్ బటన్ నొక్కుతుండగా... 'ఎక్స్ క్యూజ్ మీ...' అన్న పిలుపు వినిపించింది. ఆ తరువాత... పరుగు పరుగున వచ్చిన ఓ ఆగంతకుడు హడావుడిగా లిఫ్ట్ డోర్ తెరచి లోనికి ప్రవేశించాడు.

అంతలోనే... హడలెత్తించే మ్యూజిక్ తో 'అ... ప్పు... డేం... జ... రి... గిం... ది?' అంటూ స్క్రీన్ పై గ్రాఫిక్స్ ప్లేట్స్ పడ్డాయి.

ఆ తరువాత స్క్రీన్ పై ప్రత్యక్షమైన యాంకర్ ఆసక్తి కలిగిస్తూ చెప్తోంది. 'ఇప్పుడు ఆ లిఫ్టులో ఇద్దరే ఇద్దరు. ఒకరు అపర్ణ... మరొకరు ఆగంతకుడు. ఆ రాత్రి అపర్ణ కంపెనీ క్యాబ్ ఉపయోగించలేదు. ఆ తరువాత ఆమె కనిపించనూ లేదు. ఏం జరిగి వుంటుంది? ఎవరైనా ఆమెను కిడ్నాప్ చేశారా? అపర్ణ అపహరణలో ఆగంతకుడి పాత్ర ఏమైనా వుందా? గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చిన తరువాత కూడా ఆ ఆగంతకుడు అనుసరించాడా? అతడితో అపర్ణకు అంతకు ముందే పరిచయం వుందా? అది కేవలం పరిచయమేనా... లేక అంతకు మించిన స్నేహం... మనసిచ్చి పుచ్చుకోవడంలాంటి దగ్గరతనం కూడా వుందా? ఆ రాత్రి వాళ్లిద్దరూ కలిసే వెళ్లారా? వెళితే...ఎక్కడికి వెళ్లారు? ఇలా ఈ కేసులో ఎన్నో ప్రశ్నలు... మరెన్నో చిక్కుముడులు... వాటన్నింటికీ సమాధానం వెదికే ప్రయత్నం చేద్దాం! ఒక చిన్న బ్రేక్ తరువాత...'

ఆ వెంటనే టీవీ స్క్రీన్ ని వరుస యాడ్స్ ముంచెత్తాయి.

క్యాబిన్ లో కూర్చుని ఆ ప్రోగ్రాం చూస్తున్న ఇన్ పుట్ ఎడిటర్ సుధామ తన ఎదురుగా వున్న క్రైం రిపోర్టర్  తేజతో అన్నాడిలా... 'ఈ క్రైం బులెటిన్ కి వరలక్ష్మి యాంకరింగ్ సూపర్బ్...'

'కరెక్ట్ చెప్పారు. అందుకే మన క్రైం బులెటిన్ కి ఎంతో క్రేజ్' అన్నాడు తేజ.

'అవును... ఆ బులెటిన్ కి గ్లామరూ, గ్రామరూ వరలక్షమే! కేవలం వరలక్ష్మిని ఫాలో అవ్వడం కోసమే నెత్తురోడే క్రైం బులెటిన్ ని ఇంట్రెస్ట్ గా చూస్తున్నారు.' సుధామ చెప్తూంటే 'వెల్ కం బ్యాక్' అంటూ స్క్రీన్ పై మళ్లీ యాంకర్ ప్రత్యక్షమై 'క్రైం కహానీ' షురూ చేసింది.

సరిగ్గా అదే సమయంలో క్యాబిన్ లో ఫోన్ రింగైంది.

'ఎక్కడున్నారు?' బాస్ నరసింహం గొంతు అది.

'క్యాబిన్ లోనే ఉన్నా సర్... అర్జెంటా?'

''ఓసారి నా దగ్గరకు రండి! అన్నట్టు... క్రైం రిపోర్టర్ తేజనీ తీసుకుని రండి!'' అవతలివైపునుండి హుకుం జారీ అయింది.''అపర్ణ అపహరణకు గురై ఆరు రోజులైనా ఆచూకీ తేలలేదు. సైబర్ సిటీ పరిసరాల్లోని సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సాక్ష్యాల్ని సేకరించే పనిలోపడ్డారు. ఇంతకీ అపర్ణని కిడ్నాప్ ఎవరు చేశారు?'' వరుస ప్రశ్నల్ని వరలక్ష్మి సంధిస్తూండగా సుధామ, తేజ క్యాబిన్ లోంచి బయటకొచ్చారు.

''బాస్ ఎందుకు పిలిచినట్టు?''

''కలవబోతూ కారణం, తినబోతూ రుచి అడగడం కరెక్ట్ కాదనుకుంటా!'' అన్నాడు సుధామ.

''నన్నూ తీసుకురమ్మన్నారంటే...'' తేజ కళ్లల్లో చిన్నపాటి బెదురు.

కారణం...కోట్ల పెట్టుబడి పెట్టిన ఛానెల్ ఓనర్ నరసింహం. ఒకే దేహంలో నరుడినీ, సింహాన్నీ పకడ్బందీగా ఇమిడ్చిన వ్యక్తి. అనీ అనుకూలిస్తే నరుడు... తేడా వస్తే, జూలు విదిల్చి పంజా విసిరే సింహమే అవుతాడు.

భయంభయంగానే సింహం బోనులోకి అడుగుపెట్టారిద్దరూ! నరసిమ్హానికి నలభై ఏళ్లుంటాయి. రియల్ ఎటేట్ రంగలో సంపాదించిన సొమ్ముల్ని తీసుకొచ్చి సొంతంగా ఛానెల్ సిక్స్ టీన్ న్యూస్ ఛానెల్ ప్రారంభించాడు. పోటీ ఛానెల్స్ కన్నా స్క్రీన్ క్వాలిటీలో, కంటెంట్లో తన ఛానెల్ భిన్నంగా ఉండాలనే తాపత్రయం అతడిలో అనుక్షణం కనిపిస్తూంటుంది.

ఛానెల్ కి సీఈఓ అంటూ బాధ్యతాయుతమైన ఓ వ్యక్తి ఉన్నా ప్రతి ఎంప్లాయీతో ఇంటరాక్ట్ అయి విషయాలను సేకరించడం నరసింహంలో ప్రత్యేకత. మరీ, ప్రత్యేకించి ప్రోగ్రామింగ్ డిజైనింగ్ లో తన ఆలోచనల్ని ఇన్ పుట్, ఔట్ పుట్ ఎడిటర్లతో ఎప్పటికప్పుడు పంచుకుంటూంటాడు.   ''అపర్ణ మిస్టరీ ఇంకా వీడలేదా?'' ప్రశ్న సంధించాడు నరసింహం క్యాబిన్ లోకి వచ్చిన సుధామ, తేజని చూస్తూ.

''ఊహూ!'' తల అడ్డంగా ఊపారిద్దరూ!

''తెలీకుండానే హాఫెనవర్ బులెటిన్ రన్ చేసున్నారా?'' గయ్యిమన్నాడు.

''స్టేట్ లో హాట్ టాపిక్ కదా... రేటింగ్ ఉంటుందనీ...'' నసిగాడు సుధామ.

''ఇంతకీ ఆ అమ్మాయి ఏమై వుంటుంది?''

''బహుశా...'' అన్నాడు తేజ. "ఊ ... బహుశా!" చెప్పమన్నట్లు చూసాడు నరసిం హం .

"అందమైన ఆడపిల్ల .ఎం ఎన్ సీ లో జాబ్ చేస్తోంది . ఇంటినుంచి బయటకొస్తే మధ్యలో ఎంతోమంది పోకిరీలు. అంటే ... ఎప్పుడైనా ఎవరికైనా ఒంటరిగా చిక్కే అవకాశాలూ ఎక్కువే. టైం చూసి ఎవరో కిడ్నాప్ చేసుంటారు " మనసులో ఉన్న మాట కక్కేసాడు తేజ ."చేసి..."కొత్త స్క్రీన్ ప్లే రైటర్ని పాత ప్రొడ్యుసర్ చూసినట్లు ఓ లుక్కేసాడు నరసిం హం తేజావైపు .... ఇంకా చెప్పమన్నట్లు . "ఏముంది ...ఏ తుప్పల్లోకో తీసుకెళ్లి ఆ కాస్తా  అయిందనిపిస్తారు " అనేసాడు తేజ నోరు జారి .

"అంటే..." అర్థం కానట్టు మళ్లీ ఓ చూపు.

"అదే సార్ .. వయసులో ఉన్న ఒంటరి ఆడపిల్ల చిక్కితే ఆకతాయిలేం చేస్తారో ...అదే చేస్తారు . అంటే... అత్యాచారం . అపర్ణ కిడ్నప్ జరిగి అప్పుడే ఆరురోజులైంది ఇప్పటికి ఏ ఇంఫర్మేషన్ లేదంటే అంతా అయిపోయిదని అర్థం చేసుకోవాల్సిందే. అత్యాచారంతోపాటు ఆధారాలు లేకుండా చేసేందుకు హత్య కూడా చేసుండొచ్చు. పోలీసులూ ఇదేఅనుమానిస్తున్నారు"

"అపర్ణ పేరెంట్స్ ఏమంటున్నారు?"ఏమంటారు? కంటికీ మంటికీ ఏకధారగా ఏదుస్తున్నారు. మా అమ్మాయి బంగారం. ఎవరిజోలికి పోదు. ఏపాపిష్టి వాడి కన్ను పడిందో .. ఆమె బతుకు బుగ్గయిందని లబోదిబోమంటున్నారు. ఈ దేశం లోని ఆడపిల్లల తల్లితండ్రులు అంతకన్నా ఏం చేయగలరు?" చెప్తున్నాడు తేజ.

ఇంతలో ...డోర్ తెరుచుకుని క్యాబిన్ లోకి వచ్చిన ఆఫీస్ బాయ్ కప్పుల్లో కాఫీ ఆ ముగ్గురికీ అందించాడు.

తీసుకోమ్మన్నట్లు సైగ చేసి తనో కప్పు అందుకున్నాడు నరసిమ్హం.

"ఓ కేసు ఎన్నాళ్ళకి తేలుతుంది? కొద్ది నిముషాల విరామం తరువాత నరసిమ్హం అడిగాడు మళ్ళీ, ఎన్నాళ్ళయినా పట్టొచ్చు... పోలీస్ కేస్ కదా" చెప్పాడు సుధామ.కొన్నాళ్ళ తరువాత క్లోజ్ కూడా చేయొచ్చు".. ఎన్నడూ లేనిదీ.. ప్రత్యేకించి అపర్ణ కేసుపై బాస్ ఎందుకంత ఇంట్రశ్ట్ చూపిస్తున్నాడో ఆ ఇద్దరికీ అర్ధం కావడంలేదు.

"ఎప్పటికీ తేలకపోవచ్చు అన్నమాటే కదా! మళ్ళీ నరసిమ్హం అన్నాడు.అమ్మాయి కిడ్నాపర్లు దొరక్క ఎంతకాలం కేసుని లైవ్ లో వుంచుతారు. అందుకే ఓ ముహూర్తం లో ఫైల్ ని అటకెక్కించేస్తారు. ఇలా పోలీస్ స్టేషన్ లలో మగ్గుతున్న కేసులెన్నో ? చెప్పాడు తేజ.అలాంటి కేసులెన్ని వుంటాయి?

చాలా.. ఏడో అంతస్థు టెర్రస్ పై నుంచి పడిపోయి మృతి చెందిన వాగ్దేవి ప్రొడక్షన్ క్రియేటివ్ హెడ్ ప్రతిమ కేసు సంచలనం సృష్టించింది. ఆమెది హత్యో, ఆత్మ హత్యో ఆరు నెలలైనా ఇప్పటికీ తేలలేదు..." చెప్తుంటే తేజ కళ్ళల్లో ప్రతిమ బొమ్మ కదిలింది.

"హాయ్..అంటూ ఆమె మళ్ళీ ఇప్పుడు కొత్తగా తనను పలకరించినంత హాయి.

ఊ... తర్వాత" బాస్ మాటతో మళ్ళీ ఈ లోకం లోకి వచ్చాడు తేజ.

ఓ సీరియల్ షూటింగుకి విశాఖ వెళ్ళి అక్కడే హోటల్ రూము లో మర్డరైన టీవీ ఆర్టిస్టు సుజి కేసు కూడా మిస్టరీగానే వుంది. నాగార్జునసాగర్ విహరయాత్రకెళ్ళిన ఇంజనీరింగ్ స్టూడెంట్  అరుణ మృతి సెన్సేషనే ఇలా తనకు గుర్తున్న కేసులన్నింటినీ గడ గడా అప్పజెప్పేస్తున్నాడు తేజ.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
naa preyasinipattiste koti