Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
dowry kalyanam

ఈ సంచికలో >> కథలు >> స్వయంవరం

varapareeksha

హేమాంగ రాజ్యాన్ని మహీపాలుడు అనే రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పరిపాలనలో దేశమంతా ఎంతో సుభిక్షంగా వర్ధిల్లుతూ ఉండేది. మహీపాలునికి ఇద్దరు కుమార్తెలు. సౌందర్యరేఖ, మందారమాల. ఇరువురూ అతిలోక సుందరీమణులే. చూడ చక్కని రూపు రేఖలతో పాటు, అపరిమితమైన తెలివి తేటలు, పెద్దల ఎడల వినయ విధేయతలు కలిగి యుండి రాజు గారి మనసు రంజింపజేస్తూ ఉండేవారు.

అమ్మాయిలిద్దరూ యుక్త వయసులోకి అడుగిడగానే, వారికి వివాహం చేయ సంకల్పించి, స్వయంవరానికి ఏర్పాట్లు చేయవలసిందిగా తన సిబ్బందికి ఆదేశించాడు మహీపాలుడు. అన్నిదేశాలకూ వర్తమానాలు వెళ్ళాయి. నగరాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.   స్వయంవరం  జరిగే నాటికి వివిధ దేశాలకు చెందిన రాజ కుమారులందరూ నగరానికి విచ్చేశారు. అనుకున్న రోజురానే వచ్చింది. సర్వాలంకృతలైన  రాజ కుమార్తెలిద్దరూ చేతిలోవర మాలలు పట్టుకుని స్వయంవర మంటపంలోకి అడుగు పెట్టారు.ఒక్కో యువరాజును పరిచయం చేస్తూ వారికి సంబంధించిన విశేషతలను తెలియజేయసాగాడు మహా మంత్రియైన మకరసేనుడు.   అపురూప సుందరుడు, సకల శాస్త్రపారంగతుడు, మహావీరుడు అయిన భూపాలపుర యువరాజును వరించి అతడి మెడలో పుష్ప హారాన్ని వేసింది సౌందర్యరేఖ. అందరూ హర్ష ధ్వానాలు చేశారు. రాజుగారు ఆనంద పరవశులైనారు.

మందారమాల మాత్రం సౌందర్యరేఖలా త్వరగా నిర్ణయం తీసుకోలేదు. యువరాజులందరి గురించి తెలుసుకున్నాక వారిలో అర్హులనిపించినవారు  ముగ్గురిని ఎంపిక చేసింది. ఆ ముగ్గురిలో నుంచి తనకి అన్నివిధాల నచ్చిన వాడిని ఎన్నుకునేందుకు తండ్రి అనుమతిని కోరింది.

వారు ముగ్గురూ కూడా అగ్ర రాజ్యాధీశుల సుపుత్రులే. అందచందాలలో క్షాత్ర విద్యలలో సరి సమానులే. వారిలో ఒకరిని ఆమె ఏవిధంగా ఎంపిక చేసుకుంటుందో మహీపాలునికి అర్థం కాలేదు. అయినా కూతురి యుక్తి మీద ఆయనకు విశ్వాసముండడం చేత ఆమె కోరిన దానికి సమ్మతించారు.

మందారమాల ఆముగ్గురు యువరాజులను ఉద్దేశించి ఇలా అంది. “ మీ ముగ్గురూ అన్ని విషయాలలోనూ సమ ఉజ్జీలే అన్నసంగతి నాకు బోధపడింది. నేను మీలో ఒకరిని వరించాలంటే నేను అడిగిన ప్రశ్నకి మీరు సూటిగా సమాధానమివ్వాలి.’’

ముగ్గురు యువరాజులూ ఏక కంఠంతో “అలాగే రాకుమారీ... మీ ప్రశ్న ఏమిటో సెలవివ్వండి’’ అన్నారు.

అప్పుడు మందారమాల “ నేనే కనుక ఈ సృష్టిలో కెల్లా అమూల్యమైనదీ, అందమైనదీ అయిన కానుకను నాకిమ్మంటే మీరేమిస్తారు? బాగా ఆలోచించి చెప్పండి. మీ సమాధానాన్నిబట్టి నా నిర్ణయం ఉంటుంది.’’ అంది.

ముగ్గురు రాజకుమారులూ ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. వారు ఏమని బదులిస్తారోనని రాజు గారితో పాటు సభా సదులందరూ ఆసక్తిగా ఎదురు చూడసాగారు.

మొదటగా  మైధిలీ పుర యువరాజైన సమర భూపాలుడు “నేను అతి విలువైన నవరత్న ఖచిత పాద మంజీరాలని మీకు బహూకరించదలచాను యువరాణీ.  అవి తర తరాలుగా మా ఖజానాలోఉన్నాయి. వాటి విలువ అంచనా వేయడం మాఆర్థిక నిపుణుల వల్ల కూడా కాలేదు. అంతటి అపూర్వమైన మంజీరాలను మీకు కానుకగా ఇవ్వగలను.’’ అన్నాడు తాను చెప్పినది విన్న రాకుమారి తననే వరిస్తుందన్న ధీమాతో.

అంగ రాజకుమారుడైన విక్రమ వర్మ “ నేను అంత విలువైన కానుకలిచ్చుకోలేనుగాని, మీ రూపాన్ని యధాతధంగా చిత్రించగల నైపుణ్యం నాకుంది. ఇప్పటికిప్పుడు మీ సమక్షంలోనే మీ యొక్క సుందర చిత్రాన్ని గీసి మీకు కానుకగా సమర్పించ గలను.’’ అన్నాడు అచంచల విశ్వాసంతో.

ఇక మాళవ దేశ యువరాజైన అమర దీపుడు “ వీరిద్దరితో పోలిస్తే నా వద్ద అంత విలువైన వస్తువులు కాని, మదిని మైమరపించే కళా కౌశలంకాని ఏమీ లేవు. అయితే నా వద్ద ఉన్న వస్తువు పూర్తిగా నా స్వంతం. అది నాకు వారసత్వంగా లభించలేదు. నేర్చుకున్నందువల్ల పట్టు బడ్డ విద్యాకాదు. అది దైవదత్తం... అమూల్యం. అత్యంత స్వఛ్ఛం. అతి సున్నితం’’ అన్నాడు మృదువుగా. మందారమాల తనకనురెప్పలు అల్లాడిస్తూ “ అలాగా... అదేమిటో సెలవివ్వండి యువరాజా...’’ అంది చిరునవ్వుతో. “ అది మరేదో కాదు యువరాణీ...మిమ్మల్ని కల్లా కపటం లేకుండా ప్రేమించ గలిగే నా మనసు. అవును యువరాణీ... మీరు అంగీకరిస్తే పాలకన్నా తెల్లనైన నా మనసుని మీకు కానుకగా అందజేస్తాను.’’ చల్లగా నవ్వాడు అమర దీపుడు.

  సభలోని వారు నివ్వెరపోయారు. అవకాశం దొరికినప్పుడు రాకుమారికి విలువైన కానుకనివ్వకుండా ‘తన మనసు’ ఇస్తానంటూ పలికిన అమరదీపుని వెర్రివాడిని చూసినట్లుగా చూశారు. మందారమాలకు భర్త అయ్యే యోగ్యత సమరభూపాలునికి గాని, విక్రమవర్మకు గాని మాత్రమే ఉందనీ కాబట్టి యువరాణి వారిలోఒకరిని వరిస్తుందని తమలోతాము గుసగుసలాడుకున్నారు. ఇక రాజకుమారుల సంగతి చెప్పనే అక్కరలేదు. ఏ ప్రత్యేకత లేని అమర దీపుడిని పక్కనపెట్టి మందారమాల తమ ఇద్దరిలో ఒకరిని వరిస్తుందన్న నమ్మకంతో ఉన్నారు సమరభూపాల, విక్రమవర్మలు.

అమరదీపుడు మాత్రం ఏ అలజడీ లేకుండా ప్రశాంతంగా ఉన్నాడు. చేతిలోవరమాలను ధరించిన  మందారమాల హంస గమనంతో వారి దగ్గరకు వచ్చి అందరూ ఆశ్చర్యపోయే విధంగా అమరదీపుని మెడలో వరమాలను వేసింది.

సభా సదులందరూ నివ్వెరపోయారు. సమర భూపాల విక్రమవర్మలిరువురూ ఉక్రోషంతో ఊగిపోయారు.

“ మేమివ్వాలనుకున్న అపురూపమైన కానుకలను కాలదన్ని మీరు ఏ ప్రత్యేకతా లేని అమర దీపుని ఎలా వరించారో తెలుసుకోవచ్చునా యువరాణీ’’ అంటూ ఆవేశంగా ప్రశ్నించారు.

“ కోపగించుకోకండి యువరాజులారా... మీరివ్వాలనుకున్న కానుకలు అపురూపమైనవి, ఖరీదైనవే కావచ్చు.కాని, అవి ఏనాటికైనా వన్నెతగ్గిపోవచ్చును. వాటిని చోరులు దోచుకు పోయే అవకాశంఉంది. కాని, అమరదీపుల వారు నాకర్పించిన మనసు మాత్రం ఎప్పటికీ అలాగే ఉంటుంది. ‘ప్రేమించే మనసుకి’ ఎన్నటికీ నాశనమన్నది లేదు. దాని విలువ అమూల్యం. అది ఎవరిచేతా దోచుకో బడని అపురూపమైన పెన్నిధి. అందుకే నేను వారిని వరించాను.’’ మృదువుగా పలికింది మందారమాల. సమరభూపాలుడు, విక్రమవర్మ సిగ్గుతో తలదించుకున్నారు ఆమె సమాధానం విన్నాక. అమర దీపుడు ఆరాధనగా చూశాడు మందారమాల వైపు. మహీపాలుని వదనంలో ఆనందం వెల్లి విరిసింది. ఆమె ఎంపిక సరియైనదేనంటూ తమ కరతాళ ధ్వనుల ద్వారా హర్షాన్ని వ్యక్త పరిచారు సభలోని వారు.

మరిన్ని కథలు
neevu nerpina vidyaye