Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - లయన్‌

movie review - lion

చిత్రం: లయన్‌
తారాగణం: బాలకృష్ణ, త్రిష, రాధికా ఆప్టే, ప్రకాష్‌రాజ్‌, అలీ, ఎమ్మెస్‌ నారాయణ, గీత, జయసుధ, చలపతిరావు, చంద్రమోహన్‌, ప్రదీప్‌ రావత్‌, విజయ్‌కుమార్‌ తదితరులు
చాయాగ్రహణం: వెంకట్‌ప్రసాద్‌
సంగీతం: మణిశర్మ
నిర్మాణం: శ్రీ లక్ష్మి వెంకటేశ్వర సినిమా
దర్శకత్వం: సత్యదేవా
నిర్మాత: రుద్రపాటి రమణారావు
విడుదల తేదీ: 14 మే 2015

క్లుప్తంగా చెప్పాలంటే
కోమాలోంచి బయటకొస్తాడు ఓ వ్యక్తి (బాలకృష్ణ). తన పేరు గాడ్సే అని తెలుస్తుందతనికి. ఓ ప్రమాదంలో బలమైన గాయం తగిలి, మూడు నెలలు కోమాలో ఉన్నాడని డాక్టర్లు అతనికి వివరిస్తారు. తల్లిదండ్రులు వచ్చి పలకరిస్తే వాళ్ళెవరో తనకు తెలియదంటాడు. తనపేరు గాడ్సే కాదని, తనకు వేరే తల్లిదండ్రులు ఉన్నారని అంటాడు. ఆసుపత్రి నుంచి తప్పించుకుని తన ఇంటికి వెళ్ళిన అతనికి అక్కడా కొత్త వింత అనుభవాలు ఎదురవుతాయి. ఓ సంఘటన అతని తల్లిదండ్రుల్ని అతను కలిసేలా చేస్తుంది. తన పేరు బోస్‌ అని గుర్తిస్తాడు. ఆ బోస్‌ గతమేంటి? అందరూ అతన్ని గాడ్సే అని ఎందుకు పిలుస్తారు? అనేవి తెరపై చూస్తేనే బాగుంటుంది.

మొత్తంగా చెప్పాలంటే
బాలకృష్ణ ‘వన్‌ మాన్‌ షో’తో ఆకట్టుకున్నాడు. నటనలో చెలరేగిపోయాడు. ఫాన్స్‌ మెచ్చేలా ఎనర్జీ లెవల్స్‌ ప్రదర్శించాడు. ఫస్టాఫ్‌లోని గడ్డంతో కనిపించే పాత్ర కోసం కొంచెం జాగ్రత్తలు తీసుకుని ఉండాల్సింది. అయితే అది బాలకృష్ణ పని కాదు. దర్శకుడు చూసుకోవాల్సిన విషయమది. డాన్సుల్లో, ఫైట్స్‌లో బాలకృష్ణ అదరహో అనిపించాడు. డైలాగ్స్‌ చెప్పడంలో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు బాలయ్య.

హీరోయిన్లలో త్రిష పాత్ర కాస్త బెటర్‌ రాధికా ఆప్టే పాత్రకన్నా. అంతకు మించి ఇద్దరు హీరోయిన్లూ సినిమా కోసం చేసిందేమీ లేదు. చేయడానికి కూడా దర్శకుడు వారికి అవకాశం ఇవ్వలేదు. విలన్‌ పాత్రలో ప్రకాష్‌రాజ్‌ కూడా ఆకట్టుకోలేకపోయాడు. జయసుధ పాత్ర కూడా వేస్టయ్యింది. ఎమ్మెస్‌ నారాయణ, అలీ నవ్వించలేకపోయారు. చెప్పుకోడానికి ఏమీ లేదు మిగతా పాత్రధారుల గురించి.

కథ పరంగా బాగానే ఉన్నా, కథనంలో కొత్తదనం చూపించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. డైలాగులు ఓకే. యాక్షన్‌ సీన్స్‌ బాగా తీశాడు దర్శకుడు. ఎడిటింగ్‌ ఫస్టాఫ్‌లో ఎక్కువ అవసరమయ్యిందిగానీ, ఎందుకో ఆ జాగ్రత్త తీసుకోలేకపోయారు. సెకెండాఫ్‌లో ఎడిటింగ్‌ బాగుంది. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ విషయంలో మణిశర్మ స్పెషలిస్ట్‌. కానీ ఆ ముద్ర వేయలేకపోయాడు మణిశర్మ ఈ సినిమాతో. రెండు పాటలు బాగున్నాయి. కాస్ట్యూమ్స్‌ అంత గొప్పగా లేవు. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ ఓకే.

కథ పరంగా హీరో పాత్ర చాలా స్ట్రగుల్‌ అవ్వాలి. ఆ స్ట్రగుల్‌లోంచి ఫైర్‌ పుట్టాలి. కానీ అదంతా సిల్లీగానే అనిపించింది. లాజిక్‌ లెస్‌ సీన్స్‌తోనే సినిమా అంతా చుట్టేశాడు దర్శకుడు. ఫస్టాఫ్‌ బోరింగ్‌గా ఉంటుంది. సెకెండాఫ్‌లో మాత్రం కాస్త వేగం కనిపిస్తుంది. కేవలం బాలయ్య అభిమానులు ఓకే అనిపించేలా దర్శకుడు సినిమా తీశాడు. వారి వరకూ సినిమా కొంతమేర ఓకే అనిపించవచ్చు. మాస్‌ ఆడియన్స్‌ని మెప్పించగలిగినా, ఓవరాల్‌గా సినిమా అంత అపీలింగ్‌గా అనిపించదు. బాలకృష్ణ లాంటి స్టార్‌తో తొలి సినిమా అవకాశం రావడం దర్శకుడి అదృష్టం. దాన్ని ఆయన నిలబెటుట్టుకోవడంలో విఫలమయ్యాడు. కొత్త దర్శకులతో గడచిన పదేళ్ళలో హిట్‌ కొట్టని బాలయ్య, ఆ సెంటిమెంట్‌ని ఈ చిత్రంతోనూ ప్రూవ్‌ చేశాడు.

ఒక్క మాటలో చెప్పాలంటే
మాస్‌ ఆడియన్స్‌కీ, బాలయ్య ఫ్యాన్స్‌కీ ఓకే!

అంకెల్లో చెప్పాలంటే: 2.75/5

మరిన్ని సినిమా కబుర్లు
interview