Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review - lion

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
సినిమా ఫ‌లితాన్ని  హీరోయిన్ల‌తో ముడిపెడితే ఎలా? -తా​​ప్సి

తెలుగు సినిమా హీరోయిన్‌కి ఉండాల్సిన ల‌క్ష‌ణాల‌న్నిటినీ పుణికి పుచ్చుకొంది తాప్సి. అందంతో అల‌రించ‌గ‌ల‌దు. అవ‌కాశ‌మిస్తే న‌ట‌న‌తోనూ అద‌ర‌గొట్టేయ‌గ‌ల‌దు. కానీ ఏం చేస్తాం? అన్నీ ఉన్నా... అన్న సామెత‌లాగా అమ్మ‌డికి స‌రైన బ్రేకే రాలేదు. అందుకే హిందీవైపు అడుగు లేసింది. ఏకంగా త‌న మ‌కాంని ముంబైకి మార్చేసి అక్క‌డ అదృష్టాన్ని వెదుక్కొనే ప‌నిలో ప‌డింది. ఆ ప్ర‌య‌త్నంలో `బేబి`లాంటి హిట్టుని కూడా సొంతం చేసుకొంది. అయితే అమ్మ‌డికి ద‌క్షిణాది సినిమాల‌పైన మాత్రం ఇంకా ఆశ చావ‌లేదు. ఇక్క‌డ వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని త‌పిస్తోంది. ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన `గంగ‌` ఫ‌లితం త‌న ఆశ‌ల్ని నెర‌వేర్చుతుంద‌ని న‌మ్మ‌కంగా ఉంది.  `సాహసం` త‌ర్వాత `గంగ‌`తో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది తా​​ప్సి. ఈ సంద‌ర్భంగా ఆమె చెబుతున్న మ‌రిన్ని ముచ్చట్లివీ...

* దాదాపు రెండేళ్ల  త‌ర్వాత తెలుగులో మీ సంద‌డి క‌నిపిస్తోంది. 
- `గంగ‌` ఎప్పుడో ప్రేక్ష‌కుల ముందుకు రావాల్సింది. ర‌క‌ర‌కాల కార‌ణాల వ‌ల్ల ఆల‌స్యమైంది.  అయితే ఈ  చిత్రం  ఎప్పుడొచ్చినా హిట్టే అన్న న‌మ్మ‌కం నాకుండేది. `గంగ‌` త‌ర్వాతే ద‌క్షిణాదిలో కొత్త సినిమాలు ఒప్పుకొందామ‌నుకొన్నా. ఆ సినిమా  ఎంత‌కీ ప్రేక్ష‌కుల ముందుకు రాక‌పోవ‌డంతో నేను హిందీకే ప‌రిమితం కావ‌ల్సి వ‌చ్చింది. ఆల‌స్యమైనా స‌రే... `గంగ‌`కి మంచి ఆద‌ర‌ణ ద‌క్క‌డం, నాకు న‌టిగా మంచి గుర్తింపు రావ‌డం  ఎంతో ఆనందాన్నిచ్చింది. 

* `గంగ‌` ఫ‌లితం మిమ్మ‌ల్ని అంత‌గా సంతృప్తి ప‌రిచిందా?   
- మామూలుగా కాదు. న‌టిగా నాకు వంద‌కు వంద‌శాతం  ఆత్మ‌సంతృప్తినిచ్చిన చిత్ర‌మిది. ఒక మామూలు క‌మ‌ర్షియ‌ల్ చిత్రంతో హిట్టు కొట్టుంటే ఇంత‌గా సంతోషించేదాన్ని కాదు. కానీ ఇదొక డిఫ‌రెంట్ సినిమా. ఇలాంటి చిత్రంలో భాగం కావ‌డం ఎంతో ఆనందాన్నిచ్చింది.

* మొద‌ట్లో `గంగ‌` క‌థ విన్న‌ప్పుడు మీకేమ‌నిపించింది?
- లారెన్స్ మాస్ట‌ర్ మొద‌ట లైన్ వినిపించారు. దెయ్యం క‌థ‌, ఇంటెన్ష‌న్ ఉన్న పాత్ర అని అనిపించ‌గానే `ఎందుకొచ్చిన గొడ‌వలే` అనుకొన్నా. కానీ ఆయ‌న క‌థ మొత్తం విన‌మ‌న్నారు. విన్నాక మాత్రం `ఇలాంటి సినిమాలో ఛాన్స్‌ని అస్స‌లు వ‌దులుకోకూడ‌దు`  అనిపించింది.

* అటు అందం, ఇటు న‌ట‌న... తెలుగు సినిమా హీరోయిన్‌కి కావ‌ల్సిన ల‌క్షణాల‌న్నీ మీలో ఉన్నాయి. కానీ ఆశించిన స్థాయిలో  రాణించ‌లేక‌పోయారు. కార‌ణాల్ని విశ్లేషించారా?
- విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించిన‌ప్పుడే న‌న్ను ప్రేక్ష‌కులు ఆద‌రించారు. క‌మ‌ర్షియ‌ల్ సూత్రాల‌కు అనుగుణ‌మైన పాత్ర‌లు నాకు అస్స‌లు క‌లిసిరాలేదు. అంద‌రి హీరోయిన్ల‌కీ అవే వ‌ర్కువుట్ అవుతుంటాయి. కానీ నాకు అవి కుద‌ర్లేదు. కార‌ణాలేమిటో తెలియ‌దు. అయితే  ఆ విష‌యంతో ``నేను బ‌ల‌మైన పాత్ర‌ల్లోనే క‌నిపించాల‌``నే ఓ పాఠాన్ని మాత్రం నేర్చుకొన్నా.  

* తెలుగులో అలాంటి పాత్ర‌లు దొర‌క్క‌పోవ‌డంతోనే హిందీకి వెళ్లారా? 
- అలాంటిదేమీ లేదు. నాకు క‌థానాయిక‌గా జీవితాన్నిచ్చిన  తెలుగు ప‌రిశ్ర‌మ‌. ఇక్క‌డ వ‌రుస‌గా సినిమాలు చేయాల‌ని  నాకూ వుంది. కానీ స‌రైన  అవ‌కాశాలే రాలేదు. ద‌ర్శ‌కులు న‌న్ను దృష్టిలో పెట్టుకొని పాత్ర‌ల్ని సృష్టించ‌లేదు. 

* మీరు న‌టించిన సినిమాలేవీ ఆశించిన స్థాయిలో స‌క్సెస్ కాలేక‌పోయాయి. అందుకే మిమ్మ‌ల్ని ప‌ట్టించుకోవ‌డం లేదేమో?
- ఏవండీ... తెలుగు సినిమాల్లో హీరోయిన్ మ‌హా అయితే 20 నిమిషాలో, 30 నిమిషాలో క‌నిపిస్తుంది. అలాంట‌ప్పుడు  ఆ సినిమా రిజ‌ల్ట్‌ని హీరోయిన్‌తో ముడిపెడ‌తామంటే ఎలా?  ఇలా మీకు మీరే  ఏదేదో ఊహిస్తారు, మ‌ళ్లీ మీరే  ఐరెన్‌లెగ్ అనీ, అద‌నీ ఇద‌నీ రాస్తారు. ఇదేమైనా న్యాయ‌మా?

* `గంగ‌`లో మీరు బాగానే న‌టించారు. కానీ ఆఖ‌రి నిమిషంలో నిత్య‌మీన‌న్ వ‌చ్చి క్రెడిట్ కొట్టేసింది. ఇలా మ‌రో క‌థానాయిక‌తో క‌లిసి న‌టించ‌డంతో మీకు స‌రైన గుర్తింపు ద‌క్క‌డం లేద‌ని మీకు ఎప్పుడైనా అనిపించిందా?
- ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్లున్న సినిమాలో ఎందుకు న‌టించారు? ఎలా న‌టించారు?  గుర్తింపేముంటుంది? ఇలాంటి కొశ్చెన్లు ఇక్క‌డే అడుగుతారు. హిందీలోనూ, త‌మిళంలోనూ ఎవ్వ‌రూ అడ‌గరు. అక్క‌డ సినిమాల్లో ఇద్ద‌రు ముగ్గురు క‌లిసి న‌టించ‌డం  అత్యంత స‌హ‌జం. అయినా ఎవ‌రి పాత్ర‌లు ఎలా ఉండాలో క‌థే డిసైడ్ చేస్తుంది. ఇచ్చిన పాత్ర‌ను ఆయా న‌టులు ఎంత‌వ‌ర‌కు ర‌క్తి క‌ట్టించార‌నేదే చూడాలి కానీ... ఆ పాత్ర ఎక్కువ‌, ఈ పాత్ర త‌క్కువ అని డిసైడ్ చేయ‌కూడ‌దు.  

* విమ‌ర్శ‌ల ప్ర‌భావం మీపై చాలానే ఉన్న‌ట్టుంది? 
- నా వ్య‌క్తిగ‌త విష‌యాల గురించి ఎవ‌రేం రాసుకొన్నా, ఎవ‌రేమ‌నుకొన్నా ఫ‌ర్వాలేదు. కెరీర్ విష‌యంలో అలా చేసిన‌ప్పుడే బాధ క‌లుగుతుంది.

* వ్య‌క్తిగ‌తం అని మీరే గుర్తు చేశారు. ఈమ‌ధ్య మీరు ప్రేమ‌లో ప‌డ్డార‌ట‌. నిజ‌మేనా?
- ఆ విష‌యాన్ని న‌లుగురితో పంచుకోవ‌ల్సిన అవ‌స‌రం లేదు. నా ప్రేమ గురించి, నేను పెళ్లి చేసుకోబోయేవాడి గురించి మా ఇంట్లో వాళ్ల‌కు తెలిస్తే స‌రిపోతుంది. 

*  హిందీలో కెరీర్ హ్యాపీగా సాగుతోందా?
- మీకు తెలియందేముందీ. ఈమ‌ధ్య `బేబి`తో ఓ మంచి హిట్టు ప‌డింది. నా కెరీర్‌కి మంచి ఊపు తీసుకొచ్చిన చిత్ర‌మ‌ది. అలాగే `ర‌న్నింగ్ షాదీ డాట్ కామ్‌` అనే మ‌రో చిత్రం విడుద‌ల‌కు సిద్ధంగా ఉంది. దాంతోపాటు ఇంకో చిత్రంలోనూ న‌టిస్తున్నా.

* `గంగ‌`ని చూశాక ద‌క్షిణాది నుంచి ఆఫ‌ర్లేమీ రాలేదా?
- కొన్ని క‌థ‌లు విన్నాను. రెండు మూడు బాగానే న‌చ్చాయి. ఆ వివ‌రాలు మీకు త్వ‌రలోనే తెలుస్తాయి. 
మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 16 - Bangaru Konda - Simha