Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
satya...saroja...sheshu..

ఈ సంచికలో >> కథలు >> అవసరం

avasaram

“ మీ నాన్నగారి పద్ధతి ఏమీ బాగాలేదండీ!"

'ఏమయింది"

"ఏముందీ! ఆయన చాదస్తం ఆయనది. పిల్లల్ని కంట్రోల్ చేయాలని చూస్తారు. పిల్లలేమో ఈ చాదస్తం ఏమిటో...ఇంట్లో మాకు స్వేచ్ఛ లేకుండాపోయిందని వాపోతున్నారు. ఫ్రీ  గా ఉండలేకపోతున్నామని బాధ పడుతున్నారు. ఏం చేయాలో  అర్థం కావడం లేదు.""ఇంతకూ ఏమయిందే?"

"ఏముందీ! వాళ్ళ స్వంత విషయాల్లో జోక్యం చేసుకుంటున్నాడట. అలా ఉండాలి.  ఇలా  ఉండాలని ఆ0క్షలు విధిస్తున్నాడట. వాళ్ళు ఇబ్బంది పడ్తున్నారు."

"ఆయన చెప్పినట్లు వింటే పోలా? వాళ్ళ మంచికేగా ఆయనేమైనా చెప్పేది?’’

''మొన్నటికి మొన్న ట్యాప్ లీకయి నీళ్ళు కారుతుంటే పెద్ద రాద్దాంతమే చేశాడు.  మేమేదో నీళ్ళు వృధా చేస్తున్నట్లు పెద్ద క్లాసే పీకాడు. నీళ్ళు, కరెంట్ పొదుపు చేయాలట. జాగ్రత్తగా వాడుకోవాలట.  లేకుంటే భావి తరాల వారు ఇబ్బంది పడతారట."

"మంచిదే కదా?"

"పిల్లల్ని ఉదయం ఐదింటికే లేపి యోగా, వాకింగ్ చేయమంటాడు.  ల్యాప్ టాప్స్, చాటింగ్స్ ఆపేసి రాత్రుల్లో త్వరగా పడుకొని నిద్రపోవాలట. ఆఖరికి తిండి విషయంలో కూడా..."

"ఆ! కూడా...!

"బయటి తిండ్లు మాని ఇంట్లో వేళకు తినమని; టైమింగ్స్ మైంటైన్ చేయమని ఒకటే గోల. ఆరోగ్యమే మహా భాగ్యమట. ఐనా ఈ కాలం పిల్లలకు మనం చెప్పాలా? అంటే వినడు.  అంతా తనకే తెలిసినట్లు; అందరూ తన మాటే వినాలన్నట్లు మొండి వైఖరి.  ఈమధ్య అదేదో..."".....   "

"ఆ !స్వచ్చ భారత్ అట. పెద్ద పెద్ద వారే చీపురు పట్టుకుని రోడ్లు ఊడుస్తున్నారట. కనీసం ఇంటిని శుభ్రంగా ఉంచమని మీ మీ రూం లను మీరే శుభ్రంగా ఉంచుకోమని ఒకటే నస.  రోజుకు ఏదో ఒక నస. పిల్లలు చాలా ఫీల్ అవుతున్నారండీ!

"మా మంచి మాకు తెలియదా?  ఆయన చెప్పాలా? అంటున్నారు.     చివరికి మేము ఏ డ్రెస్ వేసుకోవాలో; ఎలా ఉండాలో ఆయనే నిర్ణయించేస్తాడు. ఆయన వచ్చినప్పటినుంచి   నరకం అనుభవిస్తున్నామని తెగ ఫీల్ అయిపోతున్నారు.     మీరే  ఏదైనా ఆలోచించండి."   "ఏం ఆలోచించమంటావు?"

"ఆయన్ను... ఏదైనా వృద్దాశ్రమం లో....."

"పార్వతీ! ఏమంటున్నావు. మతి ఉండే మాట్లాడుతున్నావా?"

"అదికాదండీ! ఆయనికేం లోటు రానివ్వకుండా చూసుకుందాం."

చలపతి కోపం ఒక్కసారిగా నషాలానికెక్కింది. పార్వతి ఇలా ఆలోచిస్తుందని అనుకోలేదు.  అసలు తమ మధ్య ఇలాంటి చర్చ వస్తుందని  వూహించనేలేదు. అలాంటి ఊహే చలపతికి భరింపరానిదిగా ఉంది. పరిస్థితిని  జీర్ణించుకోలేకపోతున్నాడు. హాల్లో పేపర్ చూస్తున్న శంకర్రావు కు ఇదంతా వినిపిస్తూనే ఉంది.  అసలు వినిపించాలనేమో కోడలు కొంత పెద్ద గొంతు తోనే చెప్పుకుపోతుంది.  ఇంతకీ తను చేసినతప్పేంటీ? పరిపరి విధాలుగా ఆలోచించసాగాడు.

శంకర్రావు  అరవై ఐదేళ్ళ రిటైర్డ్ ప్రొఫెసర్. చాలా డిసిప్లైండ్ లైఫ్.  ఏదైనా పద్ధతి ప్రకారం చేయాలనుకుంటాడు. ఉద్యోగం నిష్ఠగా చేశాడు. పిల్లలకు పాఠాలతో పాటు క్రమశిక్షణ నేర్పాడు.  అతని  దగ్గర చదువుకున్నవారంతా చాలా పై స్థాయిలో  ఉన్నారు. ఉద్యోగపరంగా చాలా మంచి పేరు సంపాదించుకున్నారు. సలహాలు, సంప్రదింపులకు ఆయన దగ్గరికి చాలా మంది వచ్చేవారు. అవి చాలా మంది జీవితాల్ని మార్చేశాయి.  కొన్ని జీవితాల్ని నిలబెట్టాయి. తన జీవితమంతా పదిమందికి చెప్పే స్టేజ్  లో గడిపాడు. అంతేగానీ, ఒకరి దగ్గరి చెప్పించుకోలేదు.

కానీ   ఇంట్లోనే --

రిటైర్ ఐనతర్వాత కూడా అలాగే ఉండాలని భావిస్తాడు.    తన పిల్లలు; వారి పిల్లలు తనలాగే దర్జాగా బతకాలంటాడు.                        మొన్నటికి మొన్న -

ట్యాప్ లో  నీళ్ళు రాత్రి నుంచి బొట్లు బొట్లుగా కారుతుంటే - "అమ్మాయ్! ఆ ట్యాప్ కు ఏదైనా చేయరాదా?" అన్నాడు.అంతెత్తున లేచింది కోడలు.

"చెప్పి పంపినా ప్లంబర్ ఇంకా రాలేదు తాతా! అయినా బొట్టు బొట్టుగానే గా కారుతుంటా! వాడొస్తే రిపేర్ చేస్టాడులే! మీరు కంగారు పడకండి!" మనవడి నిర్లక్ష్యం.

"బొట్టు బొట్టు కలిస్తేనే సముద్రం. బొట్టే కదా అంటే ఒక రోజుకు ఎంత వేస్ట్ అవుతుందో తెలుసా?" 

"అబ్బ తాతయ్యా? ఏంటి ఇంత చిన్న విషయానికి అంత రాద్దాంతం? అయినా అవంతా మాకు తెలియదనుకుంటావా?" కంఠంలో విసుగు.చేసేదేమీ లేక తనే బజారుకెళ్ళి కొత్త  ట్యాప్ తెచ్చి బిగించాడు. అదే కాదు . పని ఉన్నా లేక పోయినా -  అన్ని లైట్ లు వెలుగుతుంటాయి. అన్ని ఫ్యాన్ లు తిరుగుతుంటాయి. అవసరం లేని చోట ఆపి కరెంట్ పొదుపు చేయమంటాడు.

"అవి మాకు తెలియవా?" అంటారు వాళ్ళు.

కారులో షికారు కెళ్ళి ఏ అర్థరాత్రి దాటాకో వస్తాడు మనవడు. అంతవరకు తిరుగుళ్ళేమిటి?" అంటాడాయన. ఆ బలాదూర్ తిరుగుళ్ళు మాని  పెట్రోల్/డీసెల్ అదా చేయమంటాడు ప్రొఫెసర్. ఇంధనం ఆదా చేస్తే దేశానికి విదేశీ మారక విలువలు పెరుగుతాయంటాడాయన."అవి మాకు తెలియవా?" అంటాడు మనవడు.

"అర్థ రాత్రి దాక చాటింగ్ లేమిటి?" అంటాడాయన.

ల్యాప్ ట్యాప్ వాడకం తగ్గించమంటాడు.కళ్ళకు దెబ్బ; నిద్రకు భంగం అంటాడు.

"అవి మాకు తెలియవా?" అంటుంది మనవరాలు.

ఆ తిరుగుళ్ళు; ఈ చాటింగ్ లు మాని టయానికి నిద్ర పొమ్మంటాడు. ఉదయమే లేచి వాకింగ్, యోగా చేయమంటాడు.

"అన్నీ మాకు తెలుసు."అంటారు పిల్లలు.

సాయంత్రం ఐదు గంటలు.

బీచ్ లో బల్లపై కూర్చుని దీర్ఘాలోచనలో ఉన్నాడు శంకర్రావు.

ఎంతకాదన్నా ఉదయం జరిగిన సంఘటనలే  కళ్ళ ముందు కదలాడుతున్నాయి.  కొడుకు అటు ఇటు నలిగిపోతున్నట్లుంది.  వాడినిబ్బంది  పెట్టడం తనకిష్టం లేదు.

ఇదిగో ... ఇక్కడే బల్లపైన కూర్చుని ఎదురుగా అలల వైపు చూస్తూ ఎన్నో సాయంత్రాలు గడిపాడు. మనసు కు ఏదైనా బాధ ఏర్పడినప్పుడు ఒంటరిగా ఇక్కడే సేద తీరాడు. ఉపశమనం పొందాడు. అలలు, వాటి శబ్దాలూ అస్తమిస్తున్న ఎర్రటి సూర్య బింబం తనకెంతో ఆనందానిస్తాయి. ఎన్నో వెన్నెల రాత్రుల్లో కూడా అక్కడే సేద తీరాడు. ఎన్నో సంవత్సరాలుగా తన బాధలను, సంతోషాలను వాటితోనే పంచుకున్నాడు.       బాల్యంలో ఈ అలలతోనే ఆడుకున్నాడు. తీరం వెంబడే వాకింగ్ చేశాడు. ఈ బల్లపైన్నే చదువుకున్నాడు. ఇక్కడే కదూ! శ్యామల కూడా పరిచయమయింది.  అవును. చల్లని  సాయంత్రం వేళ్ళల్లో ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ ...సమయమే తెలిసేది కాదు.  వెన్నెల రాత్రుల్లో ; ఇసుక తిన్నెలపై పడుకుని ఆకాశాన్ని చూస్తూ; చుక్కల్ని లెక్కిస్తూ ...కాలమే తెలిసేది కాదు. ఒకరి చేతులొకరు పట్టుకుని తీరం వెంబడి నడుస్తుంటే; అలలు  కాళ్ళను తాకి వెనక్కు వెల్తుంటే   శ్యామల కళ్ళల్లోని మెరుపు చూసి తీరాల్సిందే.

'పల్లీలు, ఐస్ క్రీంలు, బెలూన్లు అమ్ముకునేవారి  కేకలతో బీచ్ అంతా కోలాహలంగా ఉంది. అందమైన జంటలతో, పిల్లల కేరింతలతో అంతా సందడి సందడిగా ఉంది. ఎవరి లోకంలో వారు...ఎవరి ఆనందంలో వారు.

ఒకరి భుజం పై ఒకరు  చేయి వేసి అలవోకగా నడుచుకుంటూ వచ్చి,   ఓ ప్రేమికుల జంట అల్లంత దూరంలో ఇసుకలో కూర్చున్నారు. కబుర్లే కబుర్లు. కలలే కలలు. జీవితంలో ఏదో సాధించేయాలని ...అలా బతకాలని..ఇలా బతికేయాలని ఎన్నెన్ని కలలో ఆ యవ్వనం ముంగిట్లో -    ఎదురు బెంచిపై ఉన్న జంట ఒక్కసారిగా ఎందుకో గట్టిగా నవ్వారు.    ఐస్ క్రీములు తింటూ పిల్లలు తల్లితండ్రులతో హుషారుగా కబుర్లు  చెప్తున్నారు. వాళ్ళ కళ్ళల్లోని మెరుపు ... పెద్దల ఆనందం -ఎంత తియ్యటి అనుభూతి --ఇదే ఆనందం ఇదే మెరుపు పాతికేళ్ళ  తరువాత ఉంటాయా?  ఉండవని ఇప్పుడే తెలిస్తే ఈ ఆనందం ఉంటుందా? 

శంకర్రావు  తనలో తాను నవ్వుకున్నాడు.  ముప్పై ఐదేళ్ళ క్రితం తను అలాగే ఉన్నాడు. తన ఫామిలీ  -  తను, శ్యామల, చలపతి. ఇదే లోకం. వాళ్ళ ఆనందమే తన ఆనందం. వాళ్ళు ఆనందంగా ఉంటే  చాలు ...అదే తనకు ఆనందం. కానీ, ఇప్పుడేమయింది?   శ్యామల పదేళ్ళ క్రితం తనను ఒంటరివాణ్ణి చేసి వెళ్ళిపోయింది. అప్పుడే తను సగం చచ్చిపోయాడు. ఉద్యోగ నిర్వహణలో నిమగ్నమై కొంత మర్చిపోగలిగాడు కానీ …ఇప్పుడు మళ్ళీ ఆమె ఙాపకాలు ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి.

రిటైర్మెంట్ తర్వాత చలపతి తన దగ్గరికే వచ్చేయమని పట్టుబడ్డాడు. రాక తప్పలేదు. చలపతి మంచి వాడే. కోడలూ మంచిదే. పిల్లలూ మంచివారే. ఎటుతిరిగి...ఈ తరాల అంతరమే ప్రతిబంధక  మయిందేమో?  తరాల మధ్య విలువలే  సమస్య లయిందేమో? తను కొన్ని విలువలతో బతికినవాడు. పిల్లలకు క్రమశిక్షణ నేర్పినవాడు. నీతులు చెప్పడమే కాదు ఆచరించి చూపినవాడు. కానీ, ఇప్పటి పిల్లలు తెలివైన వారే కాదు అన్నీ తెలిసిన వారు.  వారికి ఇంతక్రితం లా ప్రొఫెసర్లపై అధారపడాల్సిన అవసరం లేదు. వారికి భయపడాల్సిన అవసరము అంతకంటే లేదు. నెట్ ద్వారా ఏ ఙానాన్నైనా క్షణాల్లో డౌన్ లోడ్ చేసుకునే కెపాసిటీ  ఉన్నవారు.  అందుకే ఈ తరం వారికి అన్నీ తెలుసు. అవును అన్నీ తెలుసు. తెలియక పోయినా క్షణాల్లో తెలుసుకునే వెసులుబాటు ఉంది. వారికి తెలియందంటూ ఏమీ లేదు.

ఈ తరానికి అన్నీ తెలుసు. అందరూ మేధావులే. అందరూ చెప్పే వారే. కానీ వినే వారే కరువయ్యారు. ఆచరణలో పెట్టేవారు తగ్గుతున్నారు. అందుకే విలువలు దిగజారుతున్నాయి.    మేధావులు నోరు విప్పడానికి భయపడ్తున్నారు. తమ అవసరం వచ్చే  తరానికి అక్కర్లేద నుకుంటున్నారు.

శంకర్రావు  ఆలోచనలు  ఒక కొలిక్కి వచ్చాయి.   ఇక తనెవరికీ భారం కదల్చుకోలేదు. 

రాత్రి చాలా పొద్దుపోయినట్లుంది. బీచ్ అంతా నిర్మానుస్యంగా ఉంది.

భార్యకు తన అవసరం తీరింది.  కొడుకుకూ తీరింది. కోడలికి తన అవసరం లేదు. మనవడికి, మనవరాలికి కూడా తన అవసరం లేదు.  అదిగో తన అవసరం సముద్రుడికుంది. చేతులు సాచి రమ్మంటుంది. అలల రూపంలో ఆహ్వానం ... అవును .  

రావు లేచి నిలబడ్డాడు. చుట్టుప్రక్కల కలయ చూశాడు. కనుచూపు మేరలో ఎవరూ లేదు. నిర్ణయం మరింత గట్టిపడింది. అంతే. అడుగులు ముందుకు పడ్డాయి. ముందుకు... మరింత ముందుకు ...మరో అలోచన లేదు. నీళ్ళు చల్లగా పాదాలకు తగిలాయి. ముందుకు ... మరింత ముందుకు; నడుం దాకా నీళ్ళు ...ముందుకు ...మరింత ముందుకు

"మాస్టారూ!" ఎవరివో కేకలు తను వినదల్చుకోలేదు. ముందుకు ...మరింత ముందుకు  అలలు బలంగా ఉన్నాయి. నీళ్ళల్లో కాళ్ళు తేలిపోతున్నాయి.

"మాస్టారూ! మాస్టారూ!"

ఎదురుగా పెద్ద అల… గట్టిగా కళ్ళు మూసుకున్నాడు మాస్టారు.   భుజంపై  ఎవరిదో చేయి బలంగా  సూర్యోదయమయింది.  సముద్రం ఒడ్డున ఉన్న బెస్తపాలెం జనాభా మొత్తం రెండు వందల మంది దాకా అక్కడ గుమికూడి టెన్షన్ తో ఎదురు చూస్తున్నారు.  అదో ఆశ్రమం. వాతవరణమంతా ప్రశాంతంగా ఉంది.  అల్లంత దూరంలో సముద్రం కూడా చాలా ప్రశాంతంగా ఉంది. సముద్రం పైన్నుంచి వీస్తున్న చల్లని గాలి అక్కడున్న వారికి కొంత ఊరట కలిగిస్తోంది.

శంకర్రావు  మాస్టారు మెల్లగా కళ్ళు తెరిచారు. ఆశ్చర్యంతో లేవబోయారు.

"మెల్లగా మాస్టారూ!" అంటూ చెంగి మెల్లగా లేపి కూర్చోబెట్టింది.

మాస్టారు ఏదో చెప్పబోయాడు. వద్దని వారించింది చెంగి.

"మాస్టారూ! పదేళ్ళ క్రితం నన్ను మీరు కాపాడారు. ధైర్యం నూరిపోశారు. బతుకు పైన ఆశ నింపారు. భవిష్యత్ పై   భరోసా   ఇచ్చారు. ఆ గుండె ధైర్యంతోనే నేను క్రొత్త బ్రతుకు మొదలెట్టాను. మీ స్పూర్తితోనే బ్రతుకుతున్నాను. పదిమందికోసం బ్రతుకుతున్నాను. ఈ రోజు ఈ పాలేనికి సర్పంచ్ ని." 

సర్పంచ్ గా ఈ వూరికి రోడ్ లు వేయించాను. గుడి కట్టించాను. బడి పెట్టించాను. మీ స్పూర్తితో ఈ ఆశ్రమాన్ని నా ఖర్చుతో కట్టించాను. మీరెందుకు ఈ పని చేశారని అడగను. కానీ, మీ అవసరం మా పాలేనికుంది. మీరిక్కడే  ఆశ్రమంలో ఉంటూ మమ్మల్ని నడిపించండి.  మా గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడంలో మాకు ముందుండి దారి చూపండి."  ఆగింది చెంగి.

"చెంగి జిందాబాద్ ... సర్పంచ్ జిందాబాద్...మాస్టార్ జిందాబాద్." జనంలో హుషారు పెరిగింది.  ముక్త కంఠంతో ఆమోదం.  చెంగి మాటంటే జనంలో వేద వాక్కే.  ముగ్ధుడయ్యాడు మాస్టారు.

"మాస్టార్...ఇక్కడే ఉండాలి"

"మాస్టార్...ఇక్కడే ఉండాలి" 

జన నినాదం తనను ఉక్కిరిబిక్కిరి చేసింది.  ఏ చదువూ లేని ఒక అమాయక పిల్ల … ఆత్మహత్య  చేసుకోబోతుంటే వారించి నాలుగు మంచి మాటలు చెప్పినందుకే ఇంతగా పాలేం జనాల్లో ఎదిగిపోయి వారి అభివృద్ధికి అంకితమయిందంటే ఆశ్చర్యమేసింది. తన అనాలోచిత నిర్ణయానికి ఒకింత సిగ్గేసింది కూడా.“యస్. తన అవసరం వీళ్ళకుంది. “     అనుకున్నాడు   శంకరం మాస్టారు .                                                                                               

మరిన్ని కథలు
dastooritilakam