Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
cine churaka

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - పండగ చేస్కో

movie review - pandaga chesko

చిత్రం: పండగ చేస్కో
తారాగణం: రామ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహన్‌, సంపత్‌రాజ్‌, బ్రహ్మానందం, సాయికుమార్‌, అభిమన్యు సింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, రావు రమేష్‌, ఎమ్మెస్‌ నారాయణ, పవిత్ర తదితరులు.
చాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
సంగీతం: తమన్‌
నిర్మాణం: యునైటెడ్‌ మూవీస్‌ లిమిటెడ్‌
దర్శకత్వం: గోపీచంద్‌ మలినేని
నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల తేదీ: 29 మే 2015

క్లుప్తంగా చెప్పాలంటే
పోర్చుగల్‌లో ఉండే పెద్ద బిజినెస్‌ మేన్‌ కార్తీక్‌ (రామ్‌). అక్కడే ఉండే ఇంకో బిజినెస్‌ విమెన్‌ అనుష్క (సోనాల్‌ చౌహన్‌)తో కార్తీక్‌కి పరిచయమవుతుంది. ఆ పరిచయం పెళ్ళిదాకా వెళుతుంది. ఆ పెళ్ళి వెనుక ఇద్దరూ తమ తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకోవాలనే కాంక్ష ఉంటుంది. అయితే ఓ బిజినెస్‌ వివాదంతో ఇండియాకి వస్తాడు కార్తీక్‌. ఆ వివాదానికి కారణం దివ్య (రకుల్‌ ప్రీత్‌సింగ్‌). ఇంకోపక్క దివ్య తండ్రి భూపతి (సంపత్‌రాజ్‌), కార్తీక్‌తో దివ్య వివాహం చేయాలనుకుంటాడు. కానీ దివ్య మేనమామ (సాయికుమార్‌) ఆమె పెళ్ళి బాధ్యత తనదేనంటాడు. అసలు కార్తీక్‌ని తన ఇంటి అల్లుడు చేసుకోవాలని భూపతి ఎందుకు అనుకుంటాడు? దివ్యకీ, కార్తీక్‌కీ సంబంధమేంటి? బిజినెస్‌ వివాదాన్ని కార్తీక్‌ ఎలా పరిష్కరించుకుంటాడు? వంటి ప్రశ్నలన్నిటికీ తెరపైనే సమాధానాలు దొరుకుతాయి.

మొత్తంగా చెప్పాలంటే
యూత్‌ స్టైల్‌ ఐకాన్‌గా హెవీ రిచ్‌నెస్‌ కలిగిన పాత్రలో పెర్‌ఫెక్ట్‌గా కనిపిస్తూనే, మెచ్యూరిటీతో కూడాన పెర్ఫామెన్స్‌ ఇవ్వడంలో రామ్‌ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. రెండు భిన్నమైన షేడ్స్‌ ఉన్న క్యారెక్టర్‌లో రామ్‌ అద్భుతంగా నటించాడు. ఎనర్జీ విషయంలో రామ్‌ ఇదివరకే తన సినిమాలతో ప్రూవ్‌ చేసుకున్నాడు. ఇందులో ఇంకో డోస్‌ ఎక్కువగానే ఎనర్జీ ప్రదర్శించాడు రామ్‌.

రకుల్‌ ప్రీత్‌సింగ్‌ క్యూట్‌నెస్‌ని ప్రదర్శిస్తూనే, ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఆకట్టుకుంది. గ్లామర్‌ బాగా పండిరచింది. సోనాల్‌ చౌహన్‌ ఓకే. గ్లామర్‌లో మాత్రం రకుల్‌, సోనాల్‌ ఇద్దరూ పోటీ పడ్డారు. ఎవరు తక్కువ? ఎవరు ఎక్కువ? అనడానికి లేకుండా ఇద్దరూ గ్లామర్‌ పరంగా సత్తా చాటారు. బ్రహ్మానందం కామెడీ ఆకట్టుకుంటుంది. సంపత్‌రాజ్‌, సాయికుమార్‌ తమ పాత్రలకు వెయిట్‌ తెచ్చారు. మిగతా పాత్రధారులంతా సినిమాకి అవసరమైన మేర పెర్ఫామెన్స్‌ ఇచ్చారు.

రొటీన్‌ కథే, దానికి రొటీన్‌ స్క్రీన్‌ప్లేనే. అయితే ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆడియన్స్‌కి బోర్‌ కొట్టించకుండా చేయడంలో దర్శకుడు సఫలమయ్యాడు. పాటలు బాగున్నాయి. తెరపై చూడ్డానికి ఇంకా బాగున్నాయి. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ బాగుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త క్రిస్ప్‌గా ఉంటే బావుండనిపిస్తుంది. కాస్ట్యూమ్స్‌ రిచ్‌గా ఉన్నాయి. ఆర్ట్‌ డిపార్ట్‌మెంట్‌ వర్క్‌ సినిమాకి తగ్గట్టుగా ఉంది. నిర్మాణ పరంగా బాగానే ఖర్చు చేశారు. అది సినిమాకి రిచ్‌నెస్‌ని అద్దింది. సినిమాటోగ్రఫీ ప్రధాన ఆకర్షణ.

కథ ఎలా ఉన్నా, స్క్రీన్‌ప్లేతో ఆడియన్స్‌ని కథలో లీనమయ్యేలా చేయొచ్చు. ఇంట్రెస్టింగ్‌ ఎలిమెంట్స్‌, టెన్షన్‌ పెట్టే ట్విస్ట్‌లు ఇవేమీ లేకుండానే సినిమా సాగిపోతుంది. దర్శకుడు ఇక్కడే కేర్‌ తీసుకుని ఉండాల్సింది. నెక్స్‌ట్‌ ఏం జరుగుతుందో ఆడియన్స్‌ ఊహించుకోగలిగాడంటే, అది స్క్రీన్‌ప్లే వైఫల్యమే.  ఫస్టాఫ్‌ సరదాగా సాగిపోతుంది. ఫన్‌, గ్లామర్‌తో ఫస్టాఫ్‌ వేగంగానే నడిచిపోతుంది. సెకెండాఫ్‌లో ఎమోషనల్‌ కంటెంట్‌ ఎక్కువయ్యింది. అక్కడక్కడా కొంచెం స్లో అయినట్లు అనిపిస్తుంది. క్లయిమాక్స్‌ కూడా అలా అయిపోతుందంతే. ఓవరాల్‌గా సినిమా ఎంటర్‌టైన్‌మెంట్‌ని ఇష్టపడేవారికి నచ్చుతుంది. పబ్లిసిటీ బాగా చేస్తే హాలీడేస్‌ సీజన్‌ని బాగానే క్యాష్‌ చేసుకోవచ్చు. గ్లామర్‌ కోసం థియేటర్లకు వచ్చేవారికి పండగే గనుక, ఎబౌ యావరేజ్‌ నుంచి హిట్‌ వరకూ సినిమా వెళ్ళొచ్చు.

ఒక్క మాటలో చెప్పాలంటే
గ్లామర్‌తో ఎంటర్‌టైనింగ్‌గా పండగ చేస్కోవచ్చు

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 18 - Kani Penchina Ma Ammake - MANAM