Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

రామ్‌తో పోటీగా డాన్సులు వేశా! - సోనాల్ చౌహాన్‌

interview
తొలి సినిమా ఫ్లాప్ అయ్యాక కూడా మ‌రో అవ‌కాశం అందుకోవ‌డం, అందులో నిరూపించుకొని నిల‌దొక్కుకోవ‌డం అంత తేలికైన విష‌యాలేం కాదు. పైపెచ్చు క‌థానాయిక‌లు తొలి సినిమాతోనే ఫ‌ట్ అయితే.. ఐరెన్‌లెగ్గులుగా ముద్ర‌ప‌డిపోతారు. ఆ త‌ర‌వాత తేరుకోవ‌డం క‌ష్టం. తొలి సినిమా `రెయిన్‌బో`తో ఫ్లాప్ హీరోయిన్ అనిపించుకొంది సోనాల్ చౌహాన్‌. ఆ త‌ర‌వాత సోనాల్ చాలాకాలం క‌నిపించ‌లేదు. లెజెండ్‌తో మ‌ళ్లీ లైన్‌లోకి వ‌చ్చింది. ఆసినిమా హిట్ట‌వ్వ‌డం బాగా క‌లిసొచ్చింది. ఇప్పుడు పండ‌చేస్కో అంటూ రామ్‌తో క‌ల‌సి సంద‌డి చేసిందీ ముంబై ముద్దుగుమ్మ‌. మ‌రో రెండు చిత్రాలూ చేతిలో ఉన్నాయి. ఈనెల 29న‌ పండ‌గ‌చేస్కో విడుద‌ల అవుతోంది. ఈ సంద‌ర్భంగా సోనాల్‌తో జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* హాయ్ సోనాల్‌..
- హాయ్‌..

* లెజెండ్ త‌ర‌వాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు.. ఆ సినిమా హిట్ట‌యినా మీకు అన్ని అవ‌కాశాలు రాలేదేంటి?
- అవ‌కాశాలు రాక కాదు. వ‌చ్చిన సినిమాల్లో న‌న్ను ఆక‌ట్టుకొనే విష‌యాలు లేక‌పోవ‌డం వ‌ల్ల‌.. ఆ సినిమాల్ని వ‌దుల‌కొన్నా. ఏదో ఓ హిట్ కొట్టేశాం.. నాలుగు సినిమాలు వెన‌కేసేసుకొందాం అనుకొనే టైపు కాదు నేను. యేడాదికి ఒక్క సినిమా చేసినా చాలు. జ‌నంలో గుర్తింపు ఉండిపోవాలి. `లెజెండ్‌` క‌థానాయిక‌గా న‌న్ను జ‌నాలు గుర్తుపెట్టుకొన్నారంటే కార‌ణం.. ఆ సినిమా అంత పెద్ద హిట్ట‌వ్వ‌డ‌మే క‌దా..?

* ఓ సినిమా హిట్ట‌వుతుందా, లేదా అనేది మీకు క‌థ విన్న‌ప్పుడే తెలిసిపోతుందా?
- హిట్ట‌యినా అవ్వ‌క‌పోయినా... మంచి సినిమా అయితే చాలు క‌దా. ఓ క‌థ వింటున్న‌ప్పుడు `ఇలాంటి సినిమా వ‌దులుకోకూడ‌దు` అనిపించాలి. ఆ ల‌క్ష‌ణం ఉంటే త‌ప్ప‌కుండా చేసేస్తా.

* పెద్ద హీరోల పక్క‌నే చేయాలి అనే నియమం పెట్టుకొన్నారా?
- అలాంటిదేం లేదు. కాక‌పోతే స్టార్ల సినిమాలో న‌టించ‌డం వ‌ల్ల అనుకొన్న‌దానికంటే కొంచెం తొంద‌ర‌గా గుర్తింపు వ‌చ్చేస్తుంది. క‌థ‌లో నన్ను అమితంగా ఆక‌ట్టుకొనే అంశాలుంటే.. కొత్త హీరోల‌తో అయినా న‌టిస్తా.

* లెజెండ్ ఫ‌లితం, అందులో మీ పాత్ర మీకు పూర్తి స్థాయి సంతృప్తినిచ్చాయి?
- లేకేం.. ఓ సూప‌ర్ హిట్ సినిమాలో నేను క‌థానాయిక‌గా న‌టించా. అంత‌కంటే కావ‌ల్సింది ఏముంది?

* మ‌రి `పండ‌గ చేస్కో` లో మీ పాత్ర ఎలా ఉంటుంది?  ఈ సినిమాపై మీ అంచ‌నాలేంటి?
- ఈ సినిమాలో నేను ఓ ఎన్.ఆర్.ఐ గా క‌నిపిస్తా. చాలా డిఫరెంట్ గా బిహేవ్ చేసే పాత్ర నాది.  నా చుట్టుప‌క్క‌ల వాళ్లంద‌రినీ డామినేట్ చేసేస్తుంటాను. పొగరున్న అమ్మాయిగా న‌టించా. నా పాత్రే క‌థ‌ను మ‌లుపు తిప్పుతుంది.

* రామ్ ఎన‌ర్జిటిక్ హీరో. త‌న ప‌క్క‌న న‌టించాలంటే మీలోనూ అంతే ఎన‌ర్జీ ఉండాలి క‌దా..?
- అవును. మీర‌న్న‌ది నిజ‌మే. త‌ను చాలా ఎన‌ర్జ‌టిక్‌. ఇలా చెబితే అలా చేసుకొంటూ పోతాడు. మ‌రీ ముఖ్యంగా డాన్సుల్లో. నా డాన్స్ మాస్ట‌ర్స్ స‌హ‌కారంతో రామ్‌కి దీటుగానే స్టెప్పులు వేశా.

* గ్లామ‌ర్‌ని బాగా రంగ‌రించారా?
- కావ‌ల్సినంత మేర ఉంటుంది.

* ఈసినిమాలో  ఇద్ద‌రు క‌థానాయిక‌లున్నారు క‌దా. మ‌రో నాయిక‌తో క‌ల‌సి న‌టించ‌డంలో మీకు ఎలాంటి అభ్యంత‌రాలూ లేవా?
- ర‌కుల్ చాలా మంచి అమ్మాయి. పైగా ఇద్ద‌రం ముంబై వాళ్ల‌మే. మామ‌ధ్య ఈగో స‌మ‌స్య‌లు ఎప్పుడూ రాలేదు. లెజెండ్‌లోనూ ఇద్ద‌రు క‌థానాయిక‌లున్నారు. ఒక విధంగా అది నా సెంటిమెంటేమో.

* క‌థానాయిక‌గా రాణించాలంటే గ్లామ‌ర్ పాత్ర‌లు పోషించాల్సిందే అంటుంటారు. మీరు ఈ మాట న‌మ్ముతారా?
- కేవ‌లం అందంగా ఉంటేనే. అందాలు ఆర‌బోస్తేనే ఇక్క‌డ నెగ్గుకు రాగ‌లం అని ఎవ‌రైనా అన్నారంటే అది పిచ్చిమాటే. గొప్ప గొప్ప క‌థానాయిక‌లుగా వెలిగొందిన‌వాళ్లంతా అందం, అభిన‌యం రెండూ స‌మ‌పాళ్ల‌లో మేళ‌వించి ఆక‌ట్టుకొన్న‌వారే.  అంతంత అందంగా ఉన్న‌వాళ్ల‌కు అపార‌మైన ప్ర‌తిభ ఉంటే.. నెంబ‌ర్ వ‌న్ అయ్యారు. కేవ‌లం అందంతోనే ఆ స్థాయికి చేరుకోవ‌డం అసంభవం.

* స్వ‌త‌హాగా మీకు ఎలాంటి పాత్ర‌లంటే ఇష్టం?
- ఏ పాత్ర చేసినా ఛాలెంజింగ్‌గా ఉండాలి.  పండ‌గ చేస్కోలో నా పాత్ర అలానే ఉంటుంది. ఎందుకంటే నేనేం పొగ‌రుబోతు అమ్మాయిని కాదు. ప‌ద్ధ‌తైన పిల్ల‌నే. పొగ‌రుబోతుగా అభిన‌యించ‌డం చాలా ఛాలెంజింగ్‌గా అనిపించింది.

* ఇక మీద‌టా ఇలా నిదానంగానే సినిమాలు చేస్తారా?
- వేగంగా చేయాల‌ని నాకూ ఉంటుంది. కానీ.. అన్నీ కుద‌రాలిగా. మంచి క‌థ‌లు, మంచి పాత్ర‌లూ వ‌స్తే.. ఏ అవ‌కాశాన్నీ వ‌దులుకోను.

* కొత్త‌గా ఒప్పుకొన్న సినిమాలేంటి?
- క‌ల్యాణ్‌రామ్‌తో ఓ సినిమా చేస్తున్నా. సైజ్ జీరోలో అతిథిపాత్ర‌లో క‌నిపిస్తా.

* ఒకే.. ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ వెరీమ‌చ్‌...
 
- కాత్యాయని
మరిన్ని సినిమా కబుర్లు
cine churaka