Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : గాయాల బాధను దిగమింగుకుంటూ సహస్రని భుజాల పై మోసుకు వెళ్తూ బలవంతంగా శక్తి కూడదీసుకుని విశాలకి ఫోన్ చేసి తామెక్కడున్నదీ వివరిస్తాడు విరాట్. ఆ గుర్తుల ఆధారంగా చేరుకోవడానికి కారులో బయల్దేరుతుంది విశాల. బైక్ పైన అనుసరిస్తుంటాడు చందూ. మధ్యలో పోలీసులు ఎదురై ప్రశ్నిస్తారు. వెతికి వెతికి టెన్షన్ పడుతున్న సమయంలో విశాల చటుక్కున ఫోన్ తీసి విరాట్ సెల్ కి రింగ్ ఇస్తుంది......ఆ తర్వాత...

‘‘రేపొద్దుటే వెళ్ళిపోతాను’’ అంటూ లోనకెళ్ళి తలుపేసుకుంది మంగతాయారు. తల పట్టుకొని సోఫాలో కూలబడ్డాడు వెంకట రత్నం నాయుడు.

‘‘చూసావ్ రా పెద్దోడా.... అడ్రసు తెలిసి కూడ మీ అమ్మ చెప్పనంటోంది’’ అన్నాడు పెద్ద కొడుకు విక్రాంత్ ని చూస్తూ. 

విక్రాంత్ తండ్రి పక్కన కూచొని ఆయన చేయి అందుకొని అభిమానంగా చూసాడు. ‘‘డాడీ మమ్మీ కోపం మీకు తెలీంది కాదు. మీరు చెన్నై వెళ్తే వాళ్ళని  ఎక్కడ విడదీస్తారోనని మమ్మీ భయం. తనకు అడ్రసు తెలుసు గాబట్టి ఇబ్బంది లేదు. మమ్మికీ ఎలాగో నచ్చజెప్పి ఓసారి మీ యిద్దరూ చెన్నై వెళ్ళి రండి. మమ్మీ కోపం ఎంతసేపు...? అయిందేదో అయింది. రెండ్రోజులు ఆగి మమ్మీతో కలిసి వెళ్ళండి’’ అంటూ సలహా యిచ్చాడు. 

కోడలు కూడ ఇదే సలహా యివ్వటంతో ప్రస్తుతానికి ప్రయాణం విరమించుకున్నాడు వెంకటరత్నం నాయుడు. ఇదే టైంలో అక్కడ చెన్నైలో  విరాట్ సహస్రలు ప్రాణాపాయ స్థితిలో వున్నారని తెలిస్తే క్షణం కూడ ఆగేవారు కాదేమో.

కోయంబత్తూరులో టివి వార్తలు చూసి వెంకటరత్నం నాయుడు ఆవేశ పడినట్టే, ఆవేశంతో కంగారు పడుతున్న మరో ఇద్దరు వ్యక్తులున్నారు.

వారిలో ఒకడు భూ కుంభకోణాల పుట్ట, మాజీ సియం, మనవడు త్యాగరాజన్. రెండో వ్యక్తి సహస్ర తండ్రి అయిన మహదేవ నాయకర్.

రాత్రి సుమారు ఎనిమిది గంటల ప్రాంతంలో చెన్నై నుంచి ఎవరో ఫోన్ చేసి చెప్పే వరకు అక్కడి విషయం త్యాగరాజన్ కి తెలీదు. ఆ సమయంలో అతను తన ఇంట్లోనే ఉన్నాడు. వెంటనే టివి ఆన్ చేసుకొని చూస్తున్నాడు. 

తేనాంపేట గుండా శిఖామణి తనకు తెలిసన వాడే. సంఘటన స్థలంలో పరిస్థితి చూడగానే ఉలిక్కి పడ్డాడు. ఎందుకంటే కొమ్ములు తిరిగిన గుండా శిఖమణిని ఎదుర్కొంటున్నది ఎవరో కాదు. సహస్ర....... ఇంకా చెప్పాలంటే ఎవర్ని చూసిరమ్మని తను ధనగిరి బేచ్ ను చెన్నై పంపించాడో ఆ లేడీ జర్నలిస్టు లహరి చూస్తుండగానే ఫైటింగ్ ఉధృతమైంది. ఆమెకు సాయంగా మరికొందరు రంగంలోకి దిగారు. వాళ్ళలో కొందర్ని ఇక్కడ మధురైలో చూసిన గుర్తు.

వెంటనే ధనగిరికి ఫోన్ చేసాడు.

‘‘ఏరా? ఎక్కడ చచ్చార్రా మీరంతా?’’ అంటూ అసహనంగా అరిచాడు.

‘‘సార్ మేం ఆ పని మీదే తిరుగుతున్నాం. ఇంత వరకు ఆ అమ్మాయి మా కంట పడలేదు.’’

‘‘అఘోరించారు. ఇప్పుడెక్కడున్నారు?’’ గద్దించాడు.

‘‘సాయం కాలం నుండి నందనం, విల్లివాక్కం పరిసర ప్రాంతాలు గాలించి ఇప్పుడే హోటల్ కి బయలు దేరాం’’ బదులిచ్చాడు ధనగిరి.

‘‘మీరు గాలించింది చాలు. ముందు చెప్పింది చేయండి. వెంటనే మీరు జియన్ చెట్టి రోడ్ కి వెళ్ళండి. అక్కడ పెద్ద గొడవ జరుగుతోంది. లహరి ఆ గొడవలో గుండాలతో హోరా హోరీగా పోరాడుతోంది. ఎవరికీ అనుమానం రాకుండా మీరు లహరిని షూట్ చేసి పారేయండి. పని ముగియగానే చెన్నై వదిలి వచ్చేయాలి. వెళ్ళండి’’ అంటూ వాళ్ళని అటు మళ్ళించాడు జగన్మోహన్.

తర్వాత పరిణామాల్లో...

అర్ధరాత్రి వేళ ఎప్పుడో ధనగిరి ఫోన్ చేసి చెప్పాడు. సహాస్ర వెంట మరో యువకుడున్నాడని, వాళ్ళు తప్పించుకున్నారని, కాల్పుల్లో షూటర్ విక్కీ డేవిడ్ లతో బాటు మరో ఇద్దరు చనిపోగా, మరో నలుగురు వేన్ ప్రమాదంలో మరణించారని, ప్రస్తుతం ధనగిరి వెంట మరో ముగ్గురు తప్పించుకొని ఆప్రాంతం వదిలి పారిపోయారని తెలిసి షాక్ తిన్నాడు. 

ఇదిలా వుండగా...

రెండో వ్యక్తి మహదేవ నాయకర్...

ఆయన రాత్రి ఎనిమిది గంటల నుండి టివికి అతుక్కుపోయి చూస్తూనే వున్నాడు. ప్రత్యక్ష ప్రసారాలు చూసాడు. ఆ తర్వాత సంఘటన తాలూకు క్లిప్పింగ్ లూ చూసాడు. తను సహస్రను పట్టి మధురై తీసుకు రమ్మని పంపించిన కదిరేషన్, వడివేలు మిగిలిన వాళ్ళు కూడ వెళ్ళిన పని మర్చిపోయి సహస్రకు సాయంగా పోరాటం చేయటం మిస్టరీగా వుంది. 

కదిరేషన్ కి మిగిలిన వాళ్ళకి ఫోన్లు కొడుతూనే వున్నాడు. ఫోన్లు స్విచ్చాఫ్ లో వున్నాయి. ఒకటి రెండు మోగుతున్నా ఎవడూ లిఫ్ట్ చేయటం లేదు. 

అసలేం జరిగిందో తేనాం పేట గుండా శిఖమణితో సహస్రకు గొడవేమిటో తెలీక హైరాన పడుతున్నాడు మహదేవ నాయకర్. తన కూతురు సహస్రకి సాయంగా వచ్చి పోరాడుతున్న చాకు లాంటి యువకుడ్ని గమనించాడు. సహస్రను లవ్ చేసి కన్పించటం లేదని పేపర్ లో ప్రకటనిచ్చింది అతడే కావచ్చని వూహించాడు. ఏ విషయం తెలిడానికి తన మనుషులు ఒక్కడయినా లైన్ లో దొరికితే గద... 

పిచ్చెక్కినట్టుంది నాయకర్ కి...

తనకు తెలిసింది ఒక్కటే... 

తన మనుషులు అడయారు లోని హోటల్ గదుల్లో వుంటున్నారు. ఆ హోటల్ తనకు తెలుసు. నేరుగా ఆహోటల్ కెళ్ళి కూచుంటే దొరుకుతారు. మరునాడు ఉదయం ఫ్లయిట్ కే చెన్నై వెళ్ళాలని నిశ్చయించుకొని పడుకున్నాడు మహాదేవ నాయకర్.  కాని తెల్లవారగానే విరాట్ ఫ్రండు ధర్మ మూలంగా కొన్ని నిజాలు తెలుస్తాయని ఆ తర్వాత మధురై వాతావరణం వేడెక్కి పరిణామాలు తీవ్రంగా వుంటాయని వూహించలేక పోయాడాయన. 

విశాల నడుపుతున్న కారు ఓల్డ్ మాంబళం వీధుల్లో పరుగు తీస్తోంది. ఆ కారును తన బైక్ మీద చందూ గుడ్డిగా అనుసరిస్తున్నాడు గాని, ఆమె ఏంచేయబోతుందో తెలీక చాలా టెన్షన్ పడుతున్నాడు. ఇలాంటి సందర్భాల్లో పోలీస్ కేసు గాకుండా ట్రీట్ మెంట్ చేయటానికి ఏ డాక్టరూ సాహసం చేయడు. అదీ యిలా అర్ధరాత్రి వేళ. 

కన్ను మూసినా తెరిచినా శవాల్లా రక్త సిక్తమైన దేహాలతో చాపమీద పడున్న తన ప్రాణ మిత్రుడు విరాట్, అతడి ప్రాణానికి ప్రాణమైన సహస్ర మెదులుతున్నారు. వాళ్ళని కారులో వేసుకొని విశాల ఎక్కడికి పోతోందో అర్ధం గావటం లేదు. ఓల్డ్ మాంబళం ఏరియా నిశ్శబ్దంగా వుంది. వీధులన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. విశాల వీళ్ళిద్దర్నీ తన ఇంటికి తీసుకు పోతోందేమోనని సందేహం కలుగుతోంది. మాట మాటకీ చెమరిస్తున్న కళ్ళు తుడుచుకొంటున్నాడు. 

అయితే...

విశాల ఏర్పాట్లు ఏవో తను చేసే వచ్చిందని చందూకి తెలీదు. అక్కడ డాక్టర్ గుణ దీపిక అన్ని ఏర్పాట్లతో సిద్దంగా వుండి విశాల రాక కోసం ఎదురు చూస్తోంది. ఆమె చాలా తెలివైన యువతి. ప్రాణ స్నేహితురాలయిన విశాల కోసం ఎలాంటి రిస్కయినా ఫేస్ చేయటానికి సిద్దంగా వుంది. 

ఈ విషయాన్ని రహస్యంగా ఉంచాలని ఫోన్లో విశాల చెప్పినప్పుడే కొంత వూహించ గలిగింది. చుట్టు పక్కల యిళ్ళలో ఎక్కడా లైట్లు వెలగటం లేదు. గాఢనిద్రలో వున్నారంతా. అర్ధరాత్రి సమయం.

అయినా సరే తమ కాంపౌండ్ గేటు పైనగాని పోర్టికోలో గాని లైట్లు ఆన్ చేయలేదు. గేటు మాత్రం బార్లా తెరిచివుంది. అక్కడే ఛేర్ వేసుకొని చొని ఎదురు చూస్తోంది. తనకు సాయంగా నమ్మకమైన నడి వయసు నర్సు ఒకామె తోడుగా ఇక్కడే వుంటుంది. ఇద్దరూ కలిసి రెండు స్ట్రెచర్లను తీసుకొచ్చి అప్పటికే పోర్టికోలో రెడీగా వుంచారు. లోన ఆపరేషన్ థియేటర్లో అన్నీ సర్వ సన్నద్ధంగా వుంచి ఎదురుచూస్తున్నారు. 

సరిగ్గా విశాల కారు రివ్వున దూసుకొచ్చి గేటులోకి తిరిగింది. కారు వెంటే చందూ బైక్ క్కూడ లోనకొచ్చేసింది. గబగబావెళ్ళి గేటు మూసి తాళం వేసేసింది నర్సు. తాము వచ్చింది ఏదో అస్పత్రికని లోన కొచ్చాకే చందూకి అర్ధమై తేలిగ్గా వూపిరి తీసుకున్నాడు. 

ఆ తర్వాత క్షణం కూడ ఆలస్యం జరగలేదు. కారు లోని విరాట్ ని సహస్రను స్ట్రెచర్ల మీద పడుకోబెట్టి లోనకు తోసుకెళ్ళిపోయారు ఆ వెనకే క్లినిక్ ఫ్రంట్ డోర్స్ ని కూడ క్లోజ్ చేసి తాళం వేసేసింది నర్సు. 

విరాట్ సహస్రలున్న రెండు స్ట్రెచర్లను సరాసరి ఆపరేషన్ థియేటర్లోకి తోసుకొచ్చేసారు.

చకచకా లైట్లు వెలిగాయి...

ముందుగా విరాట్ భుజం గాయాల్ని పరిశీలించింది. గాయానికి వేసిన కుట్లను చూసింది. ఒక డాక్టర్ వేసిన కుట్లు కావవి ఏం జరిగి ఉంటుందో వూహించి ఆశ్చర్య పోయింది. 

‘‘ఓమైగాడ్.....  సూది దారంతో తనకు తనే కుట్టేసుకొన్నట్టున్నాడు. ఎనీవే.... ఒంట్లో చాలా రక్తం పోయింది. రక్తం ఎక్కిస్తే గాని గాయానికి ఫ్రష్ గా కుట్లు వేయటం సాధ్యం కాదు. ఇది కత్తి గాటు. సందేహం లేదు. అసలు వీళ్ళిద్దరూ ఇదే పరిస్థితిలో ఉంటే కోమాలోకి పోయి తెల్లవారే సరికి ప్రాణాలు పోయేవి. సరైన టైంలో తీసుకొచ్చావే విశాలా. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. నర్స్ కమాన్ సిజర్ తో ఇతని షర్టు కట్చేసి తీసేయ్. వెంటనే బ్లడ్ ఎక్కించడానికి ఏర్పాట్లు చెయ్యి’’ అంటూ పక్క  స్ట్రెచర్ మీది సహస్ర వద్దకెళ్ళింది. 

వెంటనే ఆ ఏర్పాట్లలో మునిగిపోయింది నర్సు. ఇప్పుడు దగ్గర కొచ్చిన విశాలవంక చూస్తూ ‘‘నాకో నిజం చెప్పు ఇతను నీ లవరే కదూ?’’ అనడిగింది డాక్టర్. 

‘‘ఎందుకొచ్చిందా డౌటు?’’

‘‘ముందు అడిగిందానికి ఆన్సర్ చెప్పు. అవునా కాదా?’’

‘‘అవును’’

‘‘మరి ఈ సహస్ర ఎవరు?’’

‘‘విరాట్ లవరు?’’

‘‘వ్వాట్? ........... ఇతను నిన్ను లవ్ చేయటం లేదా?’’

‘‘చేస్తున్నాడు’’

‘‘నువ్వుండగా మళ్ళీ సహస్రను లవ్ చేయటం ఏమిటి?’’

‘‘నా కన్నా ముందే సహస్రను లవ్ చేసాడు గాబట్టి’’

‘‘ఓ మైగాడ్ నాకు పిచ్చెక్కేలా వుంది. అంటే మీ ఇద్దరూ ఇతన్నే లవ్ చేస్తున్నారంటావ్’’

‘‘అవును’’

‘‘ఇతను కూడ మీ ఇద్దర్నీ లవ్ చేస్తున్నాడంటావ్’’

‘‘అవును అవును అవును ఇంకా ఏమిటి నీ డౌటు?’’

‘‘ఒకే ఒక్క డౌటు’’

‘‘అడుగు చెప్తాను’’

‘‘మీ యిద్దర్లో తను పెళ్ళాడబోయేది ఎవర్ని?’’

‘‘ఏమో...........తనిష్టం’’

‘‘ఇద్దర్నీ చేసుకుంటానంటే?’’

‘‘నాకభ్యంతరం లేదు’’

‘‘ఓ మైగాడ్ నిజంగానే నాకు పిచ్చెక్కించావే. లోకంలో ఎక్కడైనా ఇద్దరు ప్రేమికుల్ని చూసానుగాని మీలా ముగ్గురు ప్రేమికుల్ని ఎక్కడా డలేదు.’’

బ్లడ్ శరీరంలో ప్రవేశించే కొద్ది  అటు సహస్ర ఇటు విరాట్ ముఖాల్లో స్పష్టంగా తేటదనం కన్పించనారంభించింది ఇద్దరి శ్వాస నార్మల్ కొచ్చింది. పల్స్ నార్మల్ కొచ్చింది  ఇద్దరికి కుట్లువేసి బాండేజ్ వేసే సరికి రెండు గంటలు పట్టింది. అప్పటికి తెల్లవారు జామున మూడు గంటలు కావస్తోంది సమయం.  విరాట్ కి, సహస్రకీ ఇంజక్షన్లు ఇచ్చాక తృప్తిగా విశాల వంక చూసింది గుణ దీపిక. 

‘‘భయపడాల్సిందేం లేదు. నిశ్చింతగా ఉండండి. ఉదయాని కంతా విరాట్ స్పృహలోకి వస్తాడు. సహస్రకు లేటు కావచ్చు. స్పృహలోకి వచ్చిం తర్వాత అవసరమైతే స్కల్ని ఎక్స్ రే తీయించి చూద్దాం. పేషంట్స్ ని ఇక్కడే ఉంచి ఉదయం వచ్చినా సరే మీరు రాత్రికి ఇక్కడే ఉండి పోయినా సరే. ఏం చేద్దాం’’ అంది.

‘‘లేదు లేదు. పోలీసులు హాస్పిటల్స్ ని చెక్ చేసే ప్రమాదం వుంది. చూసావుగా మమ్మీ ఇప్పటికే పది సార్లు ఫోన్ చేసింది. నేనింటి కెళ్తే గాని తను నిద్రపోదు. మా ఇంటికి తీసుకుపోతాను’’ అంది విశాల. 

‘‘ఒకె ఉదయం తొమ్మిది గంటలకి ఇంటి కొచ్చి చూస్తాను. వారం తిరిగే సరికి ఇద్దరూ మామూలుగా లేచి తిరుగుతారు. ఇక బెంగ పెట్టుకోకు’’ అంటూ ధైర్యం చెప్పింది డాక్టర్ గుణ దీపిక. ఆమెను కౌగిలించుకొని  థాంక్స్ చెప్పింది విశాల. 

అంతా కలిసి విరాట్ సహస్రలను కారులోకి చేర్చారు. మరోసారి డాక్టర్ గుణ దీపికకు కృతజ్ఞతలు చెప్పి కారు స్టార్ చేసింది విశాల కారు వెనకే తన బైక్ ను పోనిచ్చాడు చందూ. వాహనాలు బయటి కెళ్ళగానే నర్సు క్లినిక్ గేటు మూసి తాళం వేసుకుంది. 

ఇంటి కొచ్చేసరికి అప్పటికే ఆందోళనతో కూతురి రాక కోసం ఎదురు చూస్తూ మెలుకూగానే వుంది విశాల తల్లి కాంచన మాల ఆమెకు అసలు విషయం ఇంకా తెలీదు. ఇప్పుడు తెలిసి జరిగిందానికి చాలా బాధ పడింది. చుట్టు పక్కల ఎవరూ గమనించకముందే నౌకరు సాయం రాగా ముందుగా సహస్రను లోనకు తీసుకెళ్ళి మేడ మీద విశాల గదిని ఆనుకొనున్న గెస్ట్ రూంలో పరుండ జేసారు. తర్వాత చందూ నౌకరు ఇద్దరూ విరాట్ ను సాయం పట్టి మెట్ల వెంట రూంలో పరుండ జేసారు. గేటు మూసి తాళం వేసి బయట లైట్లు ఆర్పేసి లోనకొచ్చారు. చందూని తల్లికి పరిచయం చేసింది విశాల. చందూకి ఇదే మొదటిసారి ఆ యింటికి రావటం. 

నిజానికి రాత్రి నుంచీ చందూ ఏమి తిన లేదు. విపరీతంగా ఆకలి. కాని అడగటానికి మొగమాటంతో ‘‘విశాలా నేను ఇంటికెళ్ళి పోతనమ్మా’’ అన్నాడు.

‘‘ఇప్పుడా వద్దు వద్దు. ఉదయం వెళ్దువుగాని. విరాట్ గదిలోనే నువ్వు కంఫర్టబుల్ గా పడుకోవచ్చు. అన్నట్టు అన్నయ్యా..... నువ్వు ఏమన్నా తిన్నావా లేదా? తినుండవు. నాకు తెలుసు. అమ్మా భోజనం ఉందా?’’ అనడిగింది విశాల.

చందూ విశాలతోబాటు భోంచేసి వెళ్ళి విరాట్ గదిలో నిద్రపోయాడు. తర్వాత ఎప్పుడో వచ్చి విశాల తన గదిలో పడుకుంది. బాగా అలసిపోడంతో వెంటనే నిద్రలోకి జారుకున్నారంతా. 

మహదేవ నాయకర్.....

ఉదయం చెన్నై వెళ్ళాని నిశ్చయించుకున్నాడు. ప్రయాణమయ్యాడు కూడ. ఇక బయలుదేరబోతుండగా ఆయన సెల్ ఫోన్ రింగయింది. 

‘‘హలో.............ఎవరూ?’’ కాస్త విసుగ్గా అడిగాడు.

‘‘అంకుల్ నేను ధర్మని’’

‘‘ఏంట్రా అబ్బాయ్ ఈ మధ్య అస్సలు కన్పించటం మానేసావ్. వ్యాపారం ఎలా ఉంది?’’

‘‘మీనాక్షి అమ్మవారి దయతో బాగుంది అంకుల్. ఇప్పుడు మీకు ఫోన్ చేయటానికి బలమైన కారణం ఉంది. అర్జంటుగా మీతో మాట్లాడాలి. బయలుదేరి వస్తున్నాను. ఇంట్లోనే వున్నారుగా?’’

‘‘ఉన్నాను గాని నేను అర్జంటు పనిమీద చెన్నై వెళ్తున్నాను. వచ్చాక మాట్లాడొచ్చు గదా’’

‘‘లేదంకుల్ ఇప్పుడే మాట్లాడాలి. రాత్రి మీరు టివి వార్తలు చూసారు గాబట్టి ఇప్పుడు చెన్నై వెళ్ళాలనుకుంటున్నారు. అవునా?’’

‘‘అవును ఆ మాట నిజమేకాని.........’’

‘‘అంకుల్ ప్లీజ్ ప్రయాణం వాయిదా వేసుకోండి ఈ విషయంలో మీక్కూడ తెలీని చాలా విషయాలున్నాయి. వచ్చి చెప్తాను.’’

‘‘అది కాదురా ధర్మా నాకు తెలీని విషయాలేమున్నాయి?.’’

‘‘ఉన్నాయి చాలా వున్నాయి. తెలిస్తే మీరే ఆశ్చర్య పోతారు.’’

‘‘మాకు తెలీని విషయాలు నీకెలా తెలుసు?’’

‘‘ఎలా అంటే మీ అమ్మాయి సహస్ర లవ్ చేసిన కుర్రాడు నా క్లోజ్ ఫ్రెండ్ గాబట్టి. అర్ధమైందిగా కాస్సేపు ఓపిక పట్టండి నేను వచ్చేస్తున్నాను’’ అంటూ అవతల లైన్ కట్ చేసాడు ధర్మా.

 

చెన్నై.......

మరునాడు ఉదయం చందూకి మెలుకూ వచ్చేసరికి ఎనిమిది గంటలు దాటింది. సమయం రాత్రి విరాట్ ను పరుండజేసిన అదే డబుల్ కాట్ మీద ఒక పక్కగా నిద్ర పోయాడు. లేవగానే విరాట్ వంక చూసాడు.

అతడికి రాత్రి ఛాతీవరకు దుప్పటి కప్పింది విశాల, ముఖం ప్రశాంతంగా ఉంది గాని నిద్రలో వున్నట్టున్నాడు. ఇంకా స్పృహలోకి రాలేదు. బాత్రూం కెళ్ళి ఫ్రషప్ అయి ముఖం కడుక్కొని వచ్చాడు. ఇంతలో విశాల అతడి కోసం బెడ్ కాఫీ తెచ్చింది.

తెల్ల వారు జామున పడుకున్నా అయిదున్నర గంటలకే  లేచి పోయింది విశాల. ఒకసారి సహస్రను విరాట్ ను చూసి వెళ్ళింది. తలార స్నానం చేసి చీర జాకెట్లో తయారై పొద్దుటే వడపళని గుడికి కార్ లో వెళ్ళింది.  విరాట్ సహస్రల పేరన సుభ్రమణ్నేశ్వరునికి అర్చన చేయించి పూజ ముగించుకొని తిరిగి ఇంటికి చేరుకునే సరికి ఏడు కావచ్చింది సమయం. మేడ మీదకు వెళ్ళి విరాట్, సహస్రలకు విభూది పూసి, బొట్టు పెట్టి తిరిగి కిందకు వచ్చి తల్లి కాంచన మాలను లేపింది.

అందుకే చందూ బెడ్ కాఫీతో వచ్చిన విశాలను ఆశ్చర్యంగా చూసాడు.

‘‘ఏమ్మా గుడికెళ్ళొచ్చావా? రాత్రి నిద్రపోలేదా?’’ అంటూ పలకరించాడు.

‘‘అవునన్నయ్య. వాళ్ళిద్దరిపేరున అర్చన చేయించి వచ్చాను’’ అంది.

‘‘నేను బయలు దేరుతున్నాను’’ అన్నాడు కాఫీ తాగాక.

‘‘కాస్సేపు ఆగన్నయ్యా టిఫిన్ చేసి వెళ్దువు గాని’’ అంది విశాల.

‘‘లేదమ్మా వెళ్ళాలి. మళ్ళీ వస్తాగా. అక్కడ వాళ్ళంతా ఏం జరిగిందో తెలీక కంగారు పడుతుంటారు. దీక్ష సహస్రను చూడకుండా ఉండలేదు. రాత్రే చాలా భయపడిన్ది. వాళ్ళకి జరిగింది చెప్పి వీళ్ళకు బట్టలు తీసుకుని ప్రస్తుతానికి దీక్షను మాత్రం తీసుకొస్తాను. ఒకే సారి అంతా వచ్చినా మంచిది కాదు. చుట్టూ పక్కల వాళ్ళు గమనించే ప్రమాదం వుంది. విరాట్, సహస్రలు కోలుకునే వరకూ మనం జాగ్రత్తగా ఉండాలి. సెల్ ఫోన్లున్న ఈ రెండు కవర్లు నీ వద్దే వుంచి స్పృహ వచ్చాక వాళ్ళకివ్వు’’ అంటూ కవర్లను విశాల చేతికిచ్చాడు.

విశాల వంక చాలా అభిమానంగా చూసాడు ‘‘నిజంగా ఇది విరాట్ సహస్రలకు పునర్జన్మ. ఏ పూర్వ జన్మ అనుబంధమో వాళ్ళిద్దర్నీ దక్కించుకున్నావ్. నిన్నెలా అభినందించాలో తెలీటం లేదు. రత్నాల్లాంటి మీ ఇద్దరి ప్రేమను పొందిన మా విరాట్ నిజంగా అదృష్టవంతుడు’’ అనిచెప్పి ఇక బయలుదేరాడు...

చందూ బైక్ వెళ్ళిన వెనకే...

డాక్టర్ గుణ దీపిక కారు లోనకొచ్చింది. కాస్సేపు విశాల తల్లి కాంచనమాలను పరామర్శించి ఆమె ఇచ్చిన కాఫీ తాగాక విశాలతో కలిసి మేడ మీది పేషంట్ల వద్దకొచ్చింది. రెండు గదుల్లోకి వెళ్ళి ఇటు విరాట్ ను అటు సహస్రను కూడ పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేసింది. ఇంజక్షన్ ఇచ్చి, మందులు రాసిచ్చి వాళ్ళకి స్పృహ వచ్చాక ఎలా వాడాలో కూడా వివరించింది.

‘‘విరాట్ కూడ ఇంకా స్పృహలోకి రాలేదు. అదే కంగారుగా వుంది’’ అంది విశాల.

 ‘‘కంగారెందుకు? ఒక డాక్టర్ గా నేను చెప్తున్నాను. గండం గడిచింది. సంతోషించు. ఇద్దరూ సేఫ్. నా అంచనా కరక్టయితే సహస్రకి ఎక్స్ రే తీయించాల్సిన అవసరం లేక పోవచ్చు.  విరాట్ కి ఇంకో గంటలో స్పృహ వస్తుంది. సహస్రకు లేటవుతుంది. కంగారుపడకు. నేను ఆస్పత్రికి డ్యూటీకి వెళ్ళొస్తాను.  సాయంత్రం రాగానే వచ్చి చూస్తాను. అన్నట్టు చెప్పటం మరిచాను.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika