Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
rahu ketu kshetram-raahoori

ఈ సంచికలో >> శీర్షికలు >>

సాహితీవనం - వనం వెంకట వరప్రసాదరావు

sahiteevanam

'ఆముక్తమాల్యద'

కృష్ణుని పక్షము తప్ప, కృష్ణపక్షము తెలియని శుక్లపక్ష చంద్రునివలె తల్లిదండ్రులకు కన్నులపంటగా ఎదుగుతున్నది గోదాదేవి . ఆమెను బాల్యం విడిచిపోయింది, యవ్వనం చేరుకున్నది. ఆమె యవ్వనాన్ని సంతరించుకున్న విధానాన్ని అద్భుతమైన శ్లేషతో, తనకే సాధ్యమైన చమత్కృతితో, సరసభావసమ్మిళితంగాచెప్తున్నాడు రాయలు.

వా తెర తొంటికైవడి మాటలాడదు / కుటిలవృత్తి వహించెఁగుంతలంబు 
లక్షులు సిరులు రా నరచూడ్కిఁ గనుఁగొనె / నాడించె బొమగొని యాననంబు
చనుగొమల్నెగయ వక్షముపేక్షఁ గడకొత్తెఁ / బాణిపాదము లెర్రవారఁ దొడఁగె
సారెకు మధ్యంబు దారిద్ర్యముల చెప్పె / రొచ్చోర్వ కిటులోగ జొచ్చె మేను

వట్టిగాంభీర్య మొక్కఁడు వెట్టుకొనియె
నాభి నానాఁటి కీగతి నాఁటిపొందు
చవుకయైనట్టి యిచ్చటఁ జనదు నిలువ
ననుచు జారినకరణి బాల్యంబు జారె

నోటికి తెర పడ్డట్టు అంతకుముందులా గలగలా మాట్లాడ్డం మానేసింది. మౌనం ప్రదర్శిస్తున్నది. ఏపుగా నల్లగా ఎదుగుతున్న శిరోజాలు కుటిల వృత్తిని వహించాయి, అంటే వంకర్లు తిరిగిపోయాయి, నొక్కుల నొక్కుల జుత్తు వచ్చింది. నడమంత్రపుసిరి వచ్చినపుడు నిర్లక్ష్యంగా, చూసీ చూడనట్టు చూసినట్లు కనులు చూడడం మొదలెట్టాయి. కనుబొమలు ముడిచి నిర్లక్ష్యంగా, అసహనంగా చూడడం మొదలైంది. చనుకొమ్మలు అంటే వక్షోజ శిఖరాలు గర్వంగా తలెత్తడంతో రొమ్ము ఉపేక్షకు గురి అయింది, కుచించుకుపోయింది. అరచేతులు, అరికాళ్ళు ఎర్రబారడం మొదలెట్టాయి. నడుము మాటిమాటికీ దారిద్ర్యాన్ని వెళ్ళబోసుకుంటున్నది, అంటే నడుము చిక్కి సన్నమైపోయింది. అందరిలో ఉండడానికి, రాసుకుంటూ పూసుకుంటూ తిరగడానికి ఒళ్ళు నిరాకరిస్తున్నది, అంటే ఇతరుల స్పర్శకు ఇబ్బంది పడుతున్నది. నాభి ఉత్తుత్తి గాంభీర్యాన్నిపెట్టుకుని మిన్నకుండిపోయింది, అంటే నాభి లోతై, అగాధమై, గంభీరమైపోయింది. నడమంత్రపు సిరి వచ్చినవాడు అహాన్ని ప్రదర్శిస్తుంటే అంతవరకూ కలివిడిగా తిరిగిన స్నేహితుడు, ఈ టెక్కు ఈ నిక్కు మనకెందుకు, ఇంతకుముందులాగా చనువు, సరదాల్లేవు నాతో, గోప్పోళ్ళతో మనకెందుకు, ఎక్కడుండేవాళ్ళు అక్కడే ఉండాలి అని దూరమైపోయినట్లుగా, కొత్తగా వచ్చిన యవ్వనము అనే సిరిని చూసి బాల్యం జారిపోయింది, పారిపోయింది గోదాదేవినుండి!

హేమాభాంగవిభాధరారుణిమవక్త్రేందుప్రభాశ్రీలఁ ద
ద్భామారత్నము వొందదయ్యె మును దత్తద్వర్ణయుక్తాఖ్యలన్
శ్యామాత్వం బళిగర్వధూర్వహ కచచ్ఛాయాచ్ఛటం గాంచె నౌఁ
గా మున్నుర్వి 'శిరఃప్రధాన' మను వాక్యం బెమ్మెయిన్ దప్పునే?

ఆ భామారత్నము, గోదాదేవి శరీరము పచ్చని బంగారపు వర్ణములో ఉన్నది. అధరము ఎర్రగా ఉంది. ముఖం చంద్రునివన్నెలో ఉన్నది. అయినా ఆ పచ్చని రంగువలన, ఎఱ్ఱని రంగువలన, చంద్రకాంతి వలన  ఆ రంగులకు తగ్గట్టు పేరు రాలేదు ఆమెకు. ఆమె హరిణి కాలేదు శరీరపు ఛాయనుబట్టి, అరుణ కాలేదు పెదవుల కాంతిని బట్టి, పూర్ణిమ కాలేదు పూర్ణచంద్రుడిని బోలిన ముఖాన్నిబట్టి. నల్లని కాంతులతోమెరిసిపోతూ తుమ్మెదల గర్వాన్ని అణిచివేసే శ్యామలవర్ణంలో ఉన్న తలవెంట్రుకల కారణంగా ఆమెకు 'శ్యామ' అన్న పేరు సార్ధకం ఐంది, నిజమే, శరీరములో శిరస్సే ముఖ్యమైనది అన్నిటికన్నా అని పూర్వపు నానుడి తప్పు అవుతుందా ఎప్పుడైనా!

శరీరంలో తల ముఖ్యమైనది కనుక, ఆ తలపై తుమ్మెదల బారువంటి నల్లని కుటిల కుంతలములు ఉన్నాయి కనుక, ఆ నల్లని రంగువలన 'శ్యామ' ఐంది అనడంలో ఒక అందమైన శ్లేషను పొదిగాడు రాయలు. శ్యామ అంటే యవ్వనమధ్యస్థ ఐన స్త్రీ అని అర్ధం, కనుక ఆమె యవ్వనమధ్యంలో ఉన్నది యిప్పుడు, నేటి పరిభాషలో మిడ్ టీన్స్, అంటే కచ్చితంగా పదహారేళ్ళ పడుచు వయసు అన్నమాట! ఈ శ్లేషకన్నాకూడా గొప్పదైన ధ్వని ఉన్నది ఈ పద్యంలో, ఈ వ్యాసకర్త ఉద్దేశంలో. ముఖ్యమైన అవయవం గురించే చెప్పాలి అనుకుంటే, కనులగురించి కూడా చెప్పొచ్చు, సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అని చెప్పుకోడానికి. కానీ ఉద్దేశపూర్వకంగా ఆ 'తలవెంట్రుకల' గురించి చెప్తున్నాడు రాయలు. ఆ తలలో, ఆ వెంట్రుకలలో అలంకరించుకున్న పూమాలను స్వామికి సమర్పించింది కనుకే ఆమె 'ఆముక్తమాల్యద' ఐంది. ఆ పూమాలకు మరిగి, ఆమెకు వశుడై మదన జనకుడు మదనభావదాసుడు అయినాడు కనుకే ఈ కథ జరిగింది. ఆ తలకట్టు, దాని కనికట్టు కనిపెట్టిన రసపట్టు రాయల కవితకు ఆటపట్టు. శ్రీకృష్ణదేవరాయ కవికన్నా రసికుడు, భావుకుడు, మార్మికుడు, స్వాప్నికుడు, చతురుడు ఐన కవి ఉన్నాడా?

ఆయతభుజైక చక్రుం
డాయదుపతి దొమ్మిఁ గెలువ నడరు మరునికా
లాయాసచక్రపరంపర
లో యన నుంగరపుఁగురులు యువతికినమరున్

విశాలమైన భుజములు కలిగినవాడు, ఒక్కటంటే ఒక్కటే చక్రమును(సుదర్శనం) కలిగినవాడు శ్రీకృష్ణుడు.ఆ యదుపతిని(శ్రీకృష్ణుని) యుద్ధంలో, మదనకదనంలో గెలువగలిగినదానిలా ఉన్నది గోదాదేవి. నల్లనిఉక్కుముక్కలతో చేయబడిన మన్మథుని చక్రముల పరంపరలో అన్నట్లు నల్లని ప్రకాశవంతమైన ఉంగరాలతలవెంట్రుకలు అనే అనేక చక్రాలు ఉన్నాయి ఈమెకు, ఆ శ్రీకృష్ణునికి ఉన్నది ఒక్క చక్రమే! ఇన్ని చక్రాలుమోహచక్రబంధంలో ఇరికించి దాడిచేస్తే ఒక్క చక్రమే ఉన్నవీరుడు లొంగిపోకుండా ఎలా ఉంటాడు?ఆ ఉంగరాల శిరోజాలు, వాటి పరిమళం, వాటిలో ధరించిన పూమాల గింగిరాలు తిరిగేట్లు చేసి స్వామినిదాసుడిని చేసుకున్న సంగతిని మరలా ధ్వనిస్తున్నాడు రాయలు.

సకలసీమంతినీలోక సమతిశాయి
భాగ్యవర్ణావళులు వ్రాసెఁ బద్మగర్భుఁ
డనఁగ గర్పూరతిలక రజోవదాత
ఫాలమునఁ గుంతలశ్రేణి పడఁతి కమరు 

కర్పూరతిలకము పొడి అంటుకుని తెల్లని కాంతులతో మెరిసిపోతున్నది ఆమె ఫాలభాగము. ఆ తెల్లనినుదుటిపై నల్లని నొక్కుల నొక్కుల ముంగురులు పడుతున్నాయి. చూడడానికి బ్రహ్మదేవుడు ఆమెకుసమస్త స్త్రీల, ముత్తైదువుల భాగ్యాన్ని మించిపోయే అదృష్టపు అక్షరాలను ముద్దుగా, ముచ్చటగా,గుండ్రంగా వ్రాసినట్లుగా గుండ్రంగా ఉన్నాయి ఆ నొక్కుల ముంగురులు.యిది ఆముక్తమాల్యద లోని గొప్ప పద్యాలలో ఒకటి. తలరాత, బ్రహ్మ దేవుడు రాసిపెట్టినట్లే జరుగుతుంది అనేజనసామాన్యమైన లోకోక్తి ఉన్నది ఇందులో. సమస్త స్త్రీలోకం అంటే మానవకాంతలు, దేవకాంతలు అసలుఏ జాతికి చెందిన స్త్రీలు అయినా అని విరుపు. స్త్రీలందరి అదృష్టాన్ని మించిపోయే అదృష్టము అంటే సాక్షాత్తూశ్రీకాంతుడు కాంతుడు గావడమే. అలాంటప్పుడు ఆయనను అంతకుముందు పొందినవారు ఎందరున్నారని!వారందరిలోకీ గోదాదేవి గొప్ప ఏంటట? గోదాదేవి గొప్పదనం ఉన్నది, దాన్ని చెప్పగలిగిన రాయల గొప్పదనంఅనే గొప్పధనమూ ఉన్నది తెలుగువారికి!లక్ష్మీదేవి తనంత తానే స్వయంవరంలో ఆయనను వరించింది. రుక్మిణి ఆయననే ప్రేమించి నువ్వు కాకుంటేమరణిస్తాను, వేరే వాడికైతే దక్కను అని పిలిపించుకుని వరించింది. సత్యభామను ఆమె తండ్రి కానుకగా,ప్రాయశ్చిత్తంగా స్వామికి సమర్పించాడు. జాంబవతిదీ అదే కథ. నాగ్నజితి శ్రీకృష్ణునికి మేనమరదలే.స్వామిని ప్రేమించి ఆయనను తప్ప వేరే ఎవరినీ పెళ్లిచేసుకోను అని మొండిపట్టు పట్టింది. కృష్ణద్వేషి ఐనఆమె తండ్రి ఏడు మదించిన ఆంబోతులను నిరాయుధుడై లొంగదీసినవాడికే నిన్ను ఇచ్చి చేస్తాను అనిపోటీ పెట్టాడు. ఆమె వర్తమానం అందుకున్న శ్రీకృష్ణుడు ఆంబోతులను లొంగదీసి ముక్కులకు తాడు వేసి,ఆమె కోరికను చెల్లించి వివాహం చేసుకున్నాడు. 'కాళిందీ' నదీ తీరంలో ఆయనకోసం తపస్సు చేసి ఆయనను భర్తగా పొందింది కాళింది. మిగిలినవారివీ ఇలాంటి కథలే. పదహారువేలమంది గోపికలు నరకుడి చెరవీడిన తర్వాత, మా యిళ్ళకు తిరిగి వెళ్ళము, నీతోనే వస్తాము, నువ్వే తీసుకెళ్ళు అని భార్యలైనారు.ఒక్క గోదాదేవి మాత్రమే స్వామికి తను ఎంగిలిచేసి వదిలిన పూమాలను ఎరగా వేసి, ఆయననే మోహింపజేసి, వలచి, గెలిచి, వశుడిని చేసుకుంది. కనుక ఆమె గొప్పదనం ఎవరికీ లేదు. కనుకనే అదృష్టవతులు అందరికన్నా అదృష్టవంతురాలు, సౌభాగ్యవతులు అందరికన్నా సౌభాగ్యవతి గోదాదేవి అని చమత్కారం.

(కొనసాగింపు తరువాయి సంచికలో)
***వనం వేంకట వరప్రసాదరావు    

మరిన్ని శీర్షికలు
padyam-bhavam