Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
jyotishyam vignanam

ఈ సంచికలో >> శీర్షికలు >>

కుమారుడు గురువైన స్వామిమలై - పి.యస్.యమ్. లక్ష్మి

swami malai

         తమిళనాడులోని కుంభకోణం తాలూకా, తంజావూరు జిల్లాలో వున్న స్వామిమలై అనేక విధాల పేరు ప్రఖ్యాతులు చెందింది.  తమిళనాడులో సుబ్రహ్మణ్య స్వామికి వున్న ఆరు ముఖ్య క్షేత్రాలలో ఇది నాలుగవది.  ఇంకొక విశేషమేమిటింటే సాక్షాత్తూ పరమ శివుడు తన కుమారుని తెలివి తేటలకు మురిసి పోయి పుత్రోత్సాహం బడసిన స్ధలమిది.  సుబ్రహ్మణ్యేశ్వరుడు తన తండ్రిని శిష్యునిగా చేసుకుని తను గురువుగా ప్రణవ స్వరూపమైన ఓంకారానికి అర్ధం చెప్పిన పవిత్ర ప్రదేశమిది. ఆ సన్గతేమిటంటే...


ఒకసారి సృష్టకర్త అయిన బ్రహ్మగారు కైలాసానికి బయలుదేరారు.  ఆయనకి దోవలో కుమారస్వామి కనబడ్డాడు.  కనబడ్డవాడు వూరుకున్నాడా. ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్ధం చెప్పమన్నాడు.  పాపం దేవతలకి కూడా ఎవరి డిపార్టుమెంటు వారిదేనేమో బ్రహ్మగారు చెప్పలేకపోయారు.  ఇంకేముంది కుమారస్వామి ఆయనని బందీ చేశాడు.  సృష్టికర్త బందీ అయ్యేసరికి సృష్టి ఆగిపోయింది. దేవతలందరూ శివుడి దగ్గరకెళ్ళి పరిస్ధితి వివరించారు.  

అందరూ కలసి కుమారస్వామి దగ్గరకు వచ్చి బ్రహ్మ దేవుణ్ణి విడిచి పెట్టమని అడిగారు.  అందుకు కుమారస్వామి ఆయన ప్రణవ మంత్రమైన ఓంకారానికి అర్ధం అడిగితే చెప్పలేదు.  అందుకే బందీ చేశాను అన్నాడు తన తప్పేమి లేదన్నట్లు.  అప్పడు శివుడు కుమారస్వామిని అడిగాడు..సరే ఆయనకి తెలియదని బందీని చేశావు.  మరి నీకు తెలుసా దానర్ధం..అయితే చెప్పు అని.  కుమార స్వామి ఘటికుడు.  అంత తేలిగ్గా చెప్తాడా.  నాకు తెలుసు.  నేను చెప్తాను.  అయితే నేను ప్రణవ మంత్రార్ధాన్ని బోధిస్తున్నాను గనుక నేను గురువుని, నువ్వు అత్యంత భక్తి శ్రధ్ధలు గల శిష్యునిగా వింటానంటే చెప్తానన్నాడు.  ఇంకేముంది.  కుమారుడు గురువైనాడు.  తండ్రి అత్యంత భక్తి శ్రధ్ధలతో కుమారుడు ఉపదేశించిన ప్రణవ మంత్రార్ధాన్ని విని పులకరించి పోయాడు.

ఈ క్షేత్రం గురించి ఇంకొక పురాణ కధనం ...  భృగు మహర్షి మహా తపస్సంపన్నుడు.  ఆయన ఒకసారి తపస్సు ప్రారంభించేముందు తన తపస్సుని ఆటంక పరచిన వారికి అంతకు ముందున్న జ్ఞానమంతా నశిస్తుందనే వరం పొంది తీవ్ర తపస్సు ప్రారంభించాడు.  ఆ తపోశక్తి ఊర్ధ్వ లోకాలకి వ్యాపించగా, ఆ వేడిమిని భరించ లేని దేవతలు పరమ శివుని శరణు జొచ్చారు.  అప్పుడు ఈశ్వరుడు ఆ తపశ్శక్తి  దేవ లోకాలకి వ్యాపించకుండా తన చేయిని భృగు మహర్షి తలమీద అడ్డంగా పెట్టాడు.  దానితో పరమ శివునంత వానికి జ్ఞానం నశించింది. తన పూర్వ జ్ఞానాన్ని తిరిగి పొందటానికి ఆయన జ్ఞాన స్వరూపుడైన సుబ్రహ్మణ్యస్వామి దగ్గర ఈ క్షేత్రంలో ప్రణవోపాసన పొందాడు.

పరమ శివుడు జగత్తుకే స్వామి.  ఆ స్వామికి స్వామియై, నాధుడై ఉపదేశించాడు గనుక ఇక్కడ కుమార స్వామికి స్వామి నాధుడనే పేరు వచ్చింది.  ఈ స్ధలానికి స్వామిమలై అనే పేరు.

అతి పురాతనమైన ఈ ఆలయాన్ని కార్త వీర్యార్జునుడు కట్టించాడు.  గర్భగుడి బయట హాల్లో ఈయన విగ్రహాన్ని చూడవచ్చు.

యీ చిన్ని కొండ పైకి ఎక్కాలంటే విశాలమైన 60 రాతి మెట్లు ఎక్కాలి.  ఈ అరవై మెట్లూ తమిళ సంవత్సారాలకి ప్రతీకలనీ, ఆ సంవత్సరాధి దేవతలు ఈ రూపంగా స్వామిని సేవిస్తున్నారనీ అంటారు.  ప్రతి మెట్టు దగ్గర గోడ మీద ఆ సంవత్సరం పేరు వ్రాసి వుంటుంది తమిళంలో. ఈ మెట్ల దోవ మధ్యలో, 32 మెట్లు ఎక్కగానే కుడి వైపుకు చూడండి.  కుమార స్వామి తన తండ్రికి ఉపదేశం ఇస్తున్న అద్భుత శిల్పం కనబడుతుంది.

గుడి క్రింది భాగంలో శివుడు  పార్వతుల మంటపాలు వున్నాయి.  వీరి పేర్లు మీనాక్షీ సుందరేశ్వర్, మీనాక్షి. పాండ్య రాజైన వరగుణుడు ఒకసారి మధుర నుంచి పుణ్యక్షేత్రమైన తిరువిదైమరుదూర్ కు వెళ్తూ ఈ ఆలయంలో ఒక రాత్రి గడిపాడుట.  ఆయన కుల దైవమైన మీనాక్షీ సుందరేశ్వరుని ఆరాధించటానికి ఈ మంటపాలనేర్పరచాడు.  తర్వాత కీ.శే. అరుణాచల చెట్టియార్ ఇక్కడ రాతి కట్టడాలు కట్టించాడు.

ధ్వజ స్తంభం దగ్గర వున్న వినాయకుడి గుడి కూడా చాలా మహిమ కలది.  ఇక్కడ కుమార తరై, నేత్ర పుష్కరిణి అనే రెండు పుష్కరిణులు వున్నాయి.  కొంగు ప్రాంతం నుంచి వచ్చిన పుట్టు గుడ్డి అయిన ఒక భక్తుడు ఈ రెండు పుష్కరిణులలో స్నానంచేసి స్వామి సన్నిధానానికి వస్తుంటే ఈ వినాయకుడి గుడి దగ్గరకు వచ్చేసరికి ఆయనకి కన్నులు కనిపించాయట.  అందుకే ఈ వినాయకుణ్ణి నేత్ర వినాయగర్ అంటారు.

పురాణాల కధనం ప్రకారం  ఈ దేవుని సన్నిధానానికి వచ్చి  నిశ్చల భక్తితో ఈ స్వామిని కొలిచినవారు  చేసిన పాపాలన్నీ సూర్యుని ముందు పొగ మంచులాగా కరిగి పోతాయంటారు.  ఈ దేవాలయంలో వివాహం చేసుకున్నవారికి  సత్ప్రవర్తన, సత్సంతానం కలుగుతాయంటారు.

రోజూ అసంఖ్యాక భక్తులు  ఈ స్వామి దర్శనార్ధం వస్తుంటారు.  ఈస్వామి భక్తులు భారత దేశంలోనే కాక అనేక దేశాలలో కూడా వున్నారు.  భక్తులు తమ కోర్కెలు తీరిన తర్వాత స్వామికి అనేక ముడుపులు, పాల కావడి, పూల కావడి వగైరాలు సమర్పిస్తారు.

మీరు సాయం సమయంలో కనుక వెళ్ళినట్లయితే 5-45 ప్రాంతంలో స్వామికి అభషేకం చేస్తారు.  పసుపు, గంధాలతో అభిషేకం చేసిన తర్వాత స్వామి కన్ను, ముక్కు, నోరు, తుడుస్తారు.  అప్పుడు స్వామి దివ్య సౌందర్యం చూసి తీరవలసినదే.  అభిషేకాలు ఉదయం కూడా చేస్తారు.

ఈ క్షేత్రానికి కుంభకోణంనుంచి 30—40 ని. ల్లో బస్సులో  తేలిగ్గా వెళ్ళవచ్చు.  నేలనుంచి షుమారు 60 అడుగుల ఎత్తున వున్న ఈ ఆలయం ప్రకృతి సౌందర్యం మధ్య కనువిందు చేస్తూ వుంటుంది.

వసతి వగైరాలు కుంభకోణంలో అయితే మంచిది.  కుంభకోణం ప్రసిధ్ధ యాత్రా స్ధలం కనుక అన్ని వసతులూ వున్నాయి. బస్ స్టాండుకి దగ్గరలో బస చూసుకుంటే, ఉదయం, సాయంకాలం వీలయినన్ని ఆలయాలు దర్శించి, మధ్యాహ్నం రూమ్ లో కొంచెం సేపు విశ్రాంతి తీసుకోవచ్చు.

మరిన్ని శీర్షికలు
tunterviews