Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
దర్శ‌క‌త్వమా... నావ‌ల్ల కాదు!  - నారా రోహిత్‌
 
బాణం, ప్ర‌తినిధి, రౌడీ ఫెలో ఈ సినిమాల్ని చూస్తే తెలిసిపోతుంది నారారోహిత్ కాన్సెప్టే వేర‌ని. త‌న‌కు త‌గ్గ క‌థ‌ల్ని ఎంచుకొంటూ.. అందులోనే త‌న ప్ర‌త్యేక‌త చూపిస్తున్నాడు నారా రోహిత్‌. హీరోగా సంఖ్యాబ‌లం పెంచుకోవాల‌ని ఎప్పుడూ తొంద‌ర ప‌డలేదు. క‌మ‌ర్షియ‌ల్‌, మాస్, మ‌సాలా క‌థ‌ల వెంట‌ప‌డ‌లేదు. డాన్సింగులు, ఫైటింగులూ అంటూ ఫీట్లు చేయ‌లేదు. కేవ‌లం క‌థ‌ని న‌డిపించ‌డానికి ప్ర‌య‌త్నించాడంతే. అందులో విజ‌యం సాధించాడు కూడా. తాజాగా.. 'అసుర'లోనూ తాను చేసింద‌దే అంటున్నాడీ క‌థానాయ‌కుడు. 'అసుర‌'తో రోహిత్ నిర్మాత‌గానూ మారాడు. ఈ చిత్రం ఈ శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈసంద‌ర్భంగా రోహిత్‌తో చిట్ చాట్‌.

* హాయ్ రోహిత్‌..
- హాయండీ..

* మీతోటి హీరోలంతా చ‌క‌చ‌క సినిమాలే చేసేస్తున్నారు. మ‌రి మీరెప్పుడు స్పీడు పెంచేది?
- నేనొచ్చి ఏడేళ్ల‌య్యింది. ఇప్పటి వ‌ర‌కూ ఏడు సినిమాలు చేశా. ఆ లెక్క‌న చూస్తే పోగ్రెస్ బాగానే ఉన్న‌ట్టు లెక్క (న‌వ్వుతూ). అయితే ఇంకా స్పీడు పెంచాల్సిన అస‌వ‌రం ఉంది. ఇక నుంచి యేడాదికి క‌నీసం మూడు సినిమాలొచ్చేలా జాగ్ర‌త్త ప‌డ‌తా.

* నిర్మాత‌గానూ మారారు. మీ సినిమాల్ని మీరే తీసుకోవ‌చ్చ‌నా?
- ఒక విధంగా చెప్పాలంటే అదీ ఒక కార‌ణ‌మే. నేను క‌థానాయ‌కుడిగా అడుగుపెట్టిన‌ప్ప‌టి నుంచీ ఇప్ప‌టి దాకా కొన్ని వంద‌ల క‌థ‌లు విన్నా. అందులో కనీసం ఓ పాతిక క‌థ‌ల వ‌ర‌కూ బాగా న‌చ్చేశాయి. వాట‌న్నింటితో సినిమాలు చేయొచ్చు. కొన్ని క‌థ‌లు నా మ‌న‌సుకు న‌చ్చుతాయి. కానీ వాటిని చేయ‌డానికి నిర్మాత‌లు ముందుకు రాక‌పోవ‌చ్చు. అలాంట‌ప్పుడు సొంత బ్యాన‌ర్ ఉండ‌డం మంచిదే. లాభ‌న‌ష్టాల‌తో ప‌ని లేకుండా.. ముందుకెళ్లిపోవ‌చ్చు.

* చిత్ర నిర్మాణం చాలా రిస్క్ క‌దా. ఎందుకులే అనిపించ‌లేదా?
- మిగిలిన‌వారి సంగ‌తేమో గానీ.. కాస్త ప‌క్కాగా ప్లాన్ ప్ర‌కారం చేసుకొంటూ వెళ్తే బాగానే ఉంటుంది. ఈ సినిమాకొస్తే ప్రీ ప్రొడ‌క్ష‌న్‌, పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ్య‌వ‌హారాల్లో  చాలా జాగ్ర‌త్త‌లు తీసుకొన్నాం. బేసిగ్గా నాకు సినిమా గురించి కాస్త నాలెడ్జ్ ఉంది. ఎక్క‌డెక్క‌డ త‌ప్పులు చేస్తున్నాం అనే విష‌యంపై అవ‌గాహ‌న పెంచుకొన్నా. ఆ త‌ప్పులు  చేయ‌కుండా జగ్ర‌త్త‌ప‌డితే సరిపోతుంది. ఇన్‌ఫాక్ట్‌.. చాలా త‌క్కువ రోజుల్లో అసుర చిత్రీక‌ర‌ణ పూర్తి చేశాం. అనుకొన్న బ‌డ్జెట్‌లోనే సినిమా తీశాం. నిజానికి అదో ఎచీవ్‌మెంట్‌.

* మీ సినిమాలు బాగానే ఉన్నా వ‌సూళ్ల ప‌రంగా సంతృప్తిక‌ర‌మైన ఫ‌లితాల్ని తెచ్చుకోలేదు. కార‌ణాలు విశ్లేషించారా?
- ఓ సినిమా బాగుండ‌డం ఎంత ముఖ్య‌మో స‌రైన స‌మ‌యంలో విడుద‌ల చేసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం. రిలీజ్ డేట్ విష‌యంలో తీసుకోన‌న్ని జాగ్ర‌త్త‌లు తీసుకోక‌పోవ‌డం వ‌ల్ల కొన్ని సినిమాలు జ‌నానికి చేర‌లేక‌పోయాయి.

* మీ సినిమాల్లో క‌మ‌ర్షియ‌ల్ అంశాలూ త‌క్కువ‌గానే ఉంటాయ్‌..
- అసుర‌తో ఆలోటు తీరిపోతుంది. ఎందుకంటే ఇందులో యాక్ష‌న్ సీక్వెన్స్‌కి చోటుంది. దాంతో పాటు ఓ ఐటెమ్ పాట‌కూ చోటు ద‌క్కింది. నా కెరీర్‌లో ఇప్ప‌టి వ‌ర‌కూ ఐటెమ్ పాట చేయలేదు. ఇదే తొలిసారి. డైలాగ్స్ కూడా కొత్త‌గా ఉంటాయి.

* మీరు స్లిమ్ అవుతాన‌ని ఇది వ‌ర‌కు చెప్పారు..
- నిజ‌మే. నేనూ అనుకొన్నా. కానీ రౌడీ ఫెలోకీ, అసుర‌కీ మ‌ధ్య అంత విరామం రాలేదు. అన్నీ కుదిరితే ఈసారి సిక్స్ ప్యాక్ చేయాల‌ని వుంది. చూద్దాం..

* ఇంత‌కీ అసుర అనే నెగిటీవ్ టైటిల్ పెట్ట‌డానికి కార‌ణ‌మేంటి?
- ఈ సినిమాలో నా పేరు ధ‌ర్మ‌. ఓ జైల‌ర్‌ని. నిజాయ‌తీ ప‌రుణ్ని. నా క్యారెక్ట‌ర్లో నెగిటీవ్ ల‌క్ష‌ణాలేం లేవు. కాక‌పోతే ప‌రిరాక్ష‌సుడ్ని అంతే. రాక్ష‌సులు మొండిగా ముందుకెళ్లిపోతారు.. ఈ సినిమాలో నేనూ అదే టైపు.

* రౌడీఫెలోలోనూ మీది పోలీస్ పాత్రే..
- కావ‌చ్చు. కానీ అసుర కీ రౌడీఫెలోకీ చాలా తేడా ఉంది. క‌థ‌, నా పాత్ర ప్ర‌వ‌ర్తించే తీరు వీట‌న్నింటిలోనూ స్ప‌ష్ట‌మైన మార్పు క‌నిపిస్తుంది. బేసిగ్గా నేను కొత్త‌ద‌నాన్ని ఇష్ట‌ప‌డ‌తా. కొత్త క‌థ‌లనే ఎంచుకొంటా. అంద‌రూ చేసే క‌థ‌ల్ని చేయ‌ను. నేను చేసిన క‌థ‌ని మ‌ళ్లీ ఎందుకు చేస్తా..??  రౌడీ ఫెలో త‌ర‌వాత వెంట‌నే పండ‌గలా వ‌చ్చాడు రావ‌ల్సింది. కానీ... కొన్ని కార‌ణాల వ‌ల్ల అసురే ముందుకొచ్చింది. దాంతో బ్యాక్ టూ బ్యాక్ పోలీస్ పాత్ర‌ల్లో చూడాల్సివ‌స్తోంది.

* మీ సినిమాల్ని పెద‌నాన్న నారాచంద్ర‌బాబు నాయుడుగారికి చూపిస్తారా?
- అప్పుడ‌ప్పుడు చూస్తుంటారు. నా సినిమాల గురించి వాక‌బు చేస్తుంటారు.

* ఏమైనా స‌ల‌హాలు ఇస్తుంటారా?
- మాంఛి క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేయ్ అంటుంటారంతే. అంత‌కు మించి స‌ల‌హాలేం ఇవ్వ‌రు. 

* పార్టీ కార్య‌క్ర‌మాల్లో చురుగ్గా పాల్గొంటున్నారా?
- ఎన్నిక‌ల సమ‌యంలో కొన్ని స‌భ‌ల‌కు హాజ‌ర‌య్యా.  ఇప్ప‌టికీ నేను పార్టీ వ్య‌క్తినే. అంత‌మాత్రాన ప్ర‌తి కార్య‌క్ర‌మానికీ వెళ్ల‌లేను.

* నిర్మాత‌గా మారారు. క‌థ‌లు ద‌గ్గ‌రుండి ఎంచుకొంటున్నారు. నెక్ట్స్ స్టెప్ డైరెక్ష‌నా?
- అబ్బే అలాంటిదేం లేదండీ. ఒడ్డున ఉండి స‌ల‌హాలు ఇవ్వ‌మంటే ఇస్తా.. దిగ‌మంటే నావ‌ల్ల‌కాదు.

* శంక‌ర‌కు మోక్షం ఎప్పుడు?
- అది చాలా మంచి సినిమా. చాలా ఇష్ట‌ప‌డి చేశా. త్వ‌ర‌లోనే బ‌య‌టకు వ‌స్తుంది. పండ‌గ‌లా వ‌చ్చాడు కంటే ముందే శంక‌ర రావొచ్చు.

* ఇష్ట‌ప‌డి చేసిన సినిమా ఆగిపోతే బాధ లేదా?
- చాలా ఉంది. అలాంట‌ప్పుడు బాధ‌ప‌డ‌డం త‌ప్ప ఏం చేయ‌లేం. ఎందుకంటే విడుద‌ల విష‌యాల‌న్నీ నిర్మాత‌ల చేతుల్లో ఉంటాయి. నా సినిమా ఆగిపోతే ఎలాగైనా బ‌య‌ట‌ప‌డేయ‌డానికి శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తా. అవ‌స‌ర‌మైతే పారితోషికం త‌గ్గించుకొంటా. ఇక ముందు ఇలాంటి పొర‌పాట్లు చేయ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌తా.

* అసుర బాగా ఆడాల‌ని, శంక‌ర‌కు మోక్షం క‌ల‌గాల‌ని కొరుకొంటున్నాం.. ఆల్ ది బెస్ట్
- థ్యాంక్యూ వెరీ మ‌చ్‌...
 
-కాత్యాయని 
మరిన్ని సినిమా కబుర్లు
rudramadevi comming on 26th june