Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
nischala

ఈ సంచికలో >> కథలు >> దయ్యాలంటే

dayyaalamte

శ్మశానం లో ఎవరిదో శవం కాలుతోంది. కాటికాపరి రుద్రయ్య దగ్గరుండి పనులు చూస్తున్నాడు. నల్లగా మబ్బులు పట్టి, చిన్నగా చినుకులు ప్రారంభమయ్యాయి. శవం తో పాటు  వచ్చిన బంధువులు తలో ఒక దిక్కుకు వెళ్ళారు. చితికి నిప్పంటించినతను మాత్రం అక్కడే వున్నాడు. "రేయ్ ! శివుడు వర్షం వస్తుంది., కట్టెలు తడిసిపోతున్నాయి. కొన్ని లోపల పెట్టరా" అంటూ కేకేసాడు రుద్రయ్య.

శ్మశానం లో ఓ మూల రేపో, మాపో, కూలడానికి సిద్ధం గా వున్న తాటాకుల ఇంటిలో నుండి ఓ పన్నెండేళ్ళ కుర్రాడు వచ్చాడు. "తాతా! రేపు పరీక్షలున్నాయి, మధ్యలో నీ గోలెంది" అన్నాడు. "సరేగాని రెండు కట్టెలు లోపల పెట్టరా... రేపు వచ్చే వాళ్ళకి కావాలి" అన్నాడు. వాడు జారిపోతున్న నిక్కరును పైకి లాక్కుంటూనే వెళ్ళి ఒక్కొక్క కట్టె తెచ్చి ఇంటిలో పేరుస్తున్నాడు. వర్షం తగ్గింది. శవం తాలూకు మనుష్యులు వెళ్ళిపోయారు. పొయ్యి మీద నుండి దించిన వేడివేడి సంగటిని వ్రేళ్ళతో కెలుకుతూ "తాతయ్యా! దయ్యాలున్నాయా?.." అడిగాడు శివుడు. రుద్రయ్య సమాధానం ఇవ్వలేదు. శ్మశానం లో దయ్యాలు వుంటాయి. నువ్వెప్పుడైనా చూసావా  అని ప్రెండ్సు నన్నడిగారు. అందుకే నిన్ను అడిగాను తాతా!" అన్నాడు శివుడు.  మనవడి మాటలకు రుద్రయ్య పెద్దగా నవ్వేసాడు. చింకి చాపపై పడుకుని నిద్రపోతున్న శివుడికి, చిరిగిన దుప్పటి ఒకటి కప్పి ప్రేమగా నిమురుకున్నాడు.

నిజానికి రుద్రయ్యకి, శివుడికి ఏ సంబంధం లేదు. ఒక పిచ్చిది స్మశానం లో శివుడిని కని చనిపోయింది. ఆ అనాధ శవానికి రుద్రయ్యే కర్మకాండలు చేసాడు. శివుడిని అక్కున చేర్చుకున్నాడు. తెల్లవారింది. కట్టెలను తీసి ఎండలో ఆరబెడుతున్నాడు రుద్రయ్య. ఇంతలో కొంతమంది ఒక శవాన్ని తీసుకువచ్చారు. వాళ్ళ ముఖాలు చాలా ఆందోళనగా వున్నాయి. రుద్రయ్య శవదహన కార్యక్రమాలు చూస్తున్నాడు. "నా విషయం తేలిన తర్వాతే ఈయనకు నిప్పెట్టు." ఒక ఆడగొంతు వినిపించడం తో రుద్రయ్య వెనక్కి తిరిగి చూసాడు. "ఏంటి తేలేది. నేను అమెరికాలో వున్నప్పుడు ఆయన ఇల్లుని నీ పేరు మీద రాయించుకుని, ఇప్పుడు మిగతా వాటిల్లో వాటా అడగడానికి సిగ్గులేదు " ఒక మగ గొంతు గయ్యిమని లేచింది. వాళ్ళ మాటలను బట్టి, చనిపోయిన వ్యక్తి కూతురు, కొడుకులే ఈ గొడవపడుతున్నారని రుద్రయ్యకి సులభం గానే అర్ధమైంది. ఆడవాళ్ళకీ ఆస్థిలో సగం వాటా వుందని, లేదంటే కోర్టుకు వెళతానని ఆమె, నీ ఇష్టం వచ్చింది చేస్కో అని ఇతను  అరుస్తూనే వున్నారు. వీళ్ళ వెనుక వచ్చ్చిన బంధువులు సైతం చెరొక పక్క వకాల్తా పుచ్చుకుని వాదులాడుకోవడం ప్రారంభించారు. అయ్యా! సమయం మించిపోతుంది. ఈ కార్యక్రమాన్ని తొందరగా ముగించండి. రుద్రయ్య చెప్పాడు. కాని వాళ్ళెవరు రుద్రయ్యని, ఆ శవాన్ని పట్టించుకోలేదు. ఈ  గొడవకు లోపల చదువుకుంటున్న శివుడు, రుద్రయ్య దగ్గరికి వచ్చి తాతయ్యా! ఏం జరుగుతోంది. అడిగాడు. "నిన్న దయ్యాలున్నాయా? అని అడిగావు కదా!  వున్నాయి. ఆస్థి కోసం కన్నతండ్రి శవం ముందే కొట్టుకుంటున్న దయ్యాల్ని చూడు అని గొడవపడుతున్న వాళ్ళని చూపాడు రుద్రయ్య.

శివుడికి అర్ధంకా అయోమయం తో ఆ గొడవపడుతున్న వాళ్ళని, తాత రుద్రయ్యన్ని మార్చి మార్చి చూస్తున్నాడు.       

మరిన్ని కథలు
dastooritilakam