Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
movie review - Jyothi Lakshmi

ఈ సంచికలో >> సినిమా >>

ఇంటర్వ్యూ

interview
టెమ్ పాట‌లు చేసీ చేసీ బోర్ కొట్టేసింది  - ఛార్మి
 
అటు గ్లామ‌ర్ గా క‌నిపిస్తూనే, ఇటు పెర్‌ఫార్మెన్స్ కూడా చూపించ‌గ‌లిగే క‌థానాయిక‌లు అరుదుగానే ఉంటారు. ఆ జాబితాలో.. ఛార్మి పేరు కూడా ఉంటుంది. ఫ‌క్తు వాణిజ్య చిత్రాల్లో న‌టించింది. గ్లామ‌ర్ జోలికి వెళ్ల‌కుండా అభిన‌యాన్నీ ప్ర‌ద‌ర్శించింది. ఐటెమ్ గీతాల్లో క‌నిపించి ఊపు తెచ్చింది. అలా... ఆల్ రౌండ‌ర్ అనిపించుకొంది. ఇప్పుడు మ‌రో కొత్త బాధ్య‌త భుజాన వేసుకొంది. అదే.. చిత్ర‌నిర్మాణం. జ్యోతిల‌క్ష్మి చిత్రానికి ఛార్మి నిర్మాత‌గానూ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈసినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా గో తెలుగుతో ఛార్మి జ‌రిపిన చిట్ చాట్ ఇది.

* హాయ్ ఛార్మీ
- హాయ్‌..

* ఇంకా జ్యోతిల‌క్ష్మీ మూడ్ లోనే ఉన్నారా?
- (న‌వ్వుతూ) మూడ్ అన‌కూడ‌దు...ఇది కిక్‌. జ్యోతిల‌క్ష్మి ఇచ్చిన కిక్ అంతా ఇంతా కాదు. ఇంకొంత‌కాలం ఇదే కిక్‌తో క‌నిపిస్తా..

* అంత కిక్ ఇచ్చిన విష‌యం ఏమిటి?
- ఒక‌టా రెండా...??  చాలా ఉన్నాయి. ఒక‌టి ఇలాంటి క‌థ‌, ఇలాంటి పాత్ర నాకు దొర‌క‌డం పెద్ద కిక్‌. పూరి జ‌గ‌న్ సార్‌తో క‌ల‌సి ప‌నిచేయ‌డం ఇంకా పెద్ద కిక్‌. అన్నింటికంటే ముఖ్యంగా.. ఈ సినిమాతో నేను ప్రొడ‌క్ష‌న్ కూడా చూసుకొన్నా.. అది డ‌బుల్‌, ట్రిపుల్ కిక్‌. 

* ప్రొడ‌క్ష‌న్ అన‌గానే హేమా హేమీలంతా ఖంగుతిన్నారు. మీరేం భ‌య‌ప‌డ‌లేదా?
- కొత్త విష‌యాలు తెలుసుకోవాలంటే నాకు చాలా ఇష్టం. నిజం చెప్పాలంటే.. ఇలాంటి బాధ్య‌త నేను మోస్తాన‌ని క‌ల‌లో కూడా అనుకోలేదు. అలాంటిది న‌న్ను న‌మ్మి పూరిసార్‌, క‌ల్యాణ్‌గారూ... నాకీ అవ‌కాశం ఇచ్చారు. ప్రొడ్యూస‌ర్ ఛార్మి అంటే.. ఇదేదో గౌర‌వం కోస‌మో, హోదా కోస‌మో వేసుకోలేదు. ఈ సినిమాకి సంబంధించిన ప్రొడ‌క్ష‌న్ పూర్తిగా నేనే చూశా. క‌ల్యాణ్‌గారు ఏదో లంచ్ టైమ్‌లో వ‌చ్చేవారు. హాయిగా భోంచేసి వెళ్లిపోయేవారు (న‌వ్వుతూ)

*  న‌ట‌న‌, నిర్మాణం.. ఏది సుల‌భం?
- నిజం చెప్ప‌నా..??  యాక్టింగ్ చాలా ఈజీ అండీ. మ‌న ప‌ని మ‌నం చేసుకొని, డ‌బ్బులు తీసుకొని వెళ్లిపోవ‌చ్చు. ప్రొడ‌క్ష‌న్ అలా కాదు. అన్నీ ద‌గ్గ‌రుండి చూసుకోవాలి. ఎవ‌రొచ్చారు, ఏం చేస్తున్నారు, ఈ రోజు ఏం సీన్ తీయాలి?  సెట్లో ఎవ‌రుండా?  ఇలా స‌వాల‌క్ష ప‌నులు. బ్యూటీపార్ల‌ర్‌కి వెళ్దామ‌న్నా టైమ్ లేకుండా పోయింది (న‌వ్వుతూ). పార్ల‌ర్‌లో రెండు గంట‌లు కూర్చోవాలా?  అదే ఆఫీసులో ఉంటే ఇంకో ప‌నేదో చూసుకోవచ్చు క‌దా, అనిపించింది. కాక‌పోతే... ఐ ఎంజాయ్ ఎలాట్‌. నా ప‌నిని చాలా చాలా ఆస్వాదించా.

* స్టార్ హీరోల ప‌క్క‌న న‌టించారు. కొత్త‌కుర్రాడు స‌త్య ప‌క్క‌న న‌టించేట‌ప్పుడు ఇబ్బంది అనిపించ‌లేదా?
- ఏమాత్రం లేదండీ. స‌త్య చాలా మంచి కుర్రాడు. చ‌క్క‌టి ఆర్టిస్ట్ కూడా. నేను చాలా ఏడిపించా. నేను స్లీవ్ లెస్‌తో క‌నిపిస్తున్నా క‌దా, నువ్వు ష‌ర్ట్ తీసేయొచ్చు క‌దా..?  అని అడిగేదాన్ని. త‌ను చాలా సిగ్గ‌రి. బాగా మొహ‌మాట‌ప‌డిపోయేవాడు. 

* ఇందులో వేశ్య పాత్ర‌లో న‌టించారు. అందుకోసం ఏమైనా క‌స‌ర‌త్తులు చేశారా?
- నేను పెద్ద‌గా క‌స‌ర‌త్తులేం చేయ‌లేదు. జ‌స్ట్ పూరి గారు రాసిన  క‌థ ఫాలో అయిపోయా. కాక‌పోతే 11 కిలోల బ‌రువు త‌గ్గా. ప్ర‌త్యేకంగా నేను చూపించిన శ్ర‌ద్ధ అంటే అదొక్క‌టే..

* బుల్లెట్ కూడా న‌డిపారు..
- నాకు చిన్న‌ప్ప‌టి నుంచీ బుల్లెట్ డ్రైవింగ్ అంటే ఇష్టం. ఓసారి అమ్మానాన్న‌ మా అన్న‌య్య‌కి బండి కొనిపెట్టారు. ఇంట్లో ఎవ‌రూ లేన‌ప్పుడు ఆ బండి నేను వేసుకొని రోడ్డుమీద‌కు వెళ్లిపోయా. అప్పుడే నాకు బండి న‌డ‌ప‌డం వ‌చ్చేసింది. కాక‌పోతే ట‌చ్ పోయింది. ఇన్నాళ్లకు మ‌ళ్లీ బండి న‌డిపా.

* టైటిల్ ఏమో మాస్‌గా ఉంది. మీదేమో వేశ్య పాత్ర‌. మ‌రి కుటుంబ ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వ‌స్తారా?
- మాస్ టైటిల్‌, వేశ్య పాత్ర అయినంత మాత్రాన ఇది మ‌సాలా సినిమా అనుకొంటే ఎలా?  నిజం చెప్తున్నా ఇందులో నేను వేశ్య‌నే అయినా... బెడ్ రూమ్ స‌న్నివేశం ఒక్క‌టీ లేదు. ఈ సినిమాలో సిగ్గు ప‌డాల్సిన అంశాలు ఒక్క‌టీ లేదు. ఈ సినిమా చూశాక మ‌హిళ‌ల‌పై గౌర‌వం పెరుగుతుంది. జ్యోతిల‌క్ష్మి అనే పేరు పెట్ట‌డానికి ఈనాటి త‌ల్లిదండ్రులు మ‌ళ్లీ ధైర్యం చేస్తారు. నా న‌మ్మ‌కం నాకుంది.

* ఈమ‌ధ్య ఐటెమ్ పాట‌ల్లో క‌నిపించ‌డం మానేశారు...
- ఐటెమ్ పాట‌లు చేసీ చేసీ బోర్ కొట్టేసిందండీ. అలాంటి ఆఫ‌ర్లు చాలా వ‌చ్చాయి, వ‌స్తూనే ఉన్నాయి. కానీ నేనే చేయ‌డం లేదు. ఇప్ప‌టికే అలాంటివి చాలా చేసేశా. ఇక మీద‌ట వాటికి గ్యాప్ ఇద్దామ‌నుకొంటున్నా.

* ఇన్నేళ్ల కెరీర్ ఎలా అనిపిస్తోంది?
- నా జ‌ర్నీ బాగానే సాగింది. సినిమా అంటే తెలియ‌ని వయ‌సులో ప‌రిశ్ర‌మ‌కొచ్చా. ఫ్లాపులు ఎదురైనా నిల‌బ‌డ్డా. నా స‌హ‌నానికి మంచి ప్ర‌తిఫ‌లం ద‌క్కింది. డిఫ‌రెంట్ రోల్స్ వ‌చ్చాయి. న‌న్ను కూడా ప్రేక్ష‌కులు గుర్తించారు. అది చాలు..  ఐ  యామ్ వెరీ హ్యాపీ.

* డిప్రెష‌న్‌కి లోనైన సంద‌ర్భాలున్నాయా?
- హిట్టు, ఫ్లాపు ఈ రెండింటినీ నేను స‌మానంగా చూస్తా. నాకు డిప్రెష‌న్ ఎందుకు?   పైగా నా చుట్టూ ఉన్న‌వాళ్లంతా మంచోళ్లే. నా కుటుంబం నా బ‌లం. వాళ్లుండ‌గా ఒత్తిడిఉండ‌దు.

* పెళ్లెప్పుడు చేసుకొంటారు..?
- పెళ్లా.. బోరండీ బాబు. నా పిచ్చి త‌ట్టుకోవ‌డం చాలా క‌ష్టం. 

* జ్యోతిల‌క్ష్మి త‌ర‌వాత ఏంటి?
- ఇంకా ఏమీ అనుకోలేదండీ. ఎందుకంటే నా దృష్టంగా జ్యోతిల‌క్ష్మిపైనే ఉంది.

* ఓకే ఆల్ ది బెస్ట్‌
- థ్యాంక్యూ.

- కాత్యాయని
 
మరిన్ని సినిమా కబుర్లు
Naa Paata 20 - Desamante Matam Kaadu - Jhummandi Naadam