Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సినిమా >>

చిత్రసమీక్ష - జ్యోతిలక్ష్మి

movie review - Jyothi Lakshmi

చిత్రం: జ్యోతిలక్ష్మి
తారాగణం: ఛార్మి కౌర్‌, బ్రహ్మానందం, సత్యదేవా, భద్రం, అజయ్‌ ఘోష్‌, సంపూర్ణేష్‌, సప్తగిరి, ఉత్తేజ్‌, సత్యం రాజేష్‌ తదితరులు
చాయాగ్రహణం: పి.జి.విందా
సంగీతం: సునీల్‌ కశ్యప్‌
నిర్మాణం: సికె ఎంటర్‌టైన్‌మెంట్స్‌, శ్రీ శుభ శ్వేత ఫిలింస్‌
దర్శకత్వం: పూరి జగన్నాథ్‌
నిర్మాత: శ్వేతా లానా, వరుణ్‌, తేజ, సి.వి.రావు
విడుదల తేదీ: 12 జూన్‌ 2015

క్లుప్తంగా చెప్పాలంటే:
జ్యోతిలక్ష్మి (ఛార్మి) హై క్లాస్‌ కాల్‌ గర్ల్‌. ఆమెను మనసారా ఇష్టపడతాడు సత్య (సత్యదేవా). తన వద్దకు వచ్చే చాలామంది విటులలానే సత్య గురించి కూడా ఆలోచిస్తుంది జ్యోతిలక్ష్మి. అయితే సత్య తనను మనసారా ఇష్టపడుతున్నాడనీ, అతని ప్రేమ పవిత్రమైనదని తెలుసుకుంటుంది జ్యోతిలక్ష్మి. నారాయణ పట్వారీ నిర్వహిస్తున్న వ్యభిచార కూపంలోంచి బయటకు వచ్చి జ్యోతిలక్ష్మి, సత్యను పెళ్ళాడుతుంది. ఇద్దరూ నారాయణ పట్వారీ నుంచి దూరంగా పారిపోతారు. నారాయణ పట్వారీ, జ్యోతిలక్ష్మి వెంటపడతాడు, తిరిగి ఆమెను వ్యభిచార కూపంలోకి లాగడానికి ప్రయత్నిస్తాడు. వ్యభిచారాన్ని వదిలేసి అందరిలానే వైవాహిక జీవితం గడపాలన్న జ్యోతిలక్ష్మికి అడుగడుగునా ఇబ్బందులు సృష్టిస్తాడు నారాయణ పట్వారీ. ఆ తర్వాత ఏమయ్యిందనేది మిగతా కథ.

మొత్తంగా చెప్పాలంటే:
తన అందంతో, తన గ్లామర్‌తో, తన నటనతో, తన స్క్రీన్‌ ప్రెజెన్స్‌తో ‘అనుకోకుండా ఒక రోజు’, ‘మంత్ర’ లాంటి సినిమాల్ని బాక్సాఫీస్‌ వద్ద నిలబెట్టేసిన ఛార్మి, చాలా కాలం తర్వాత మళ్ళీ ఆ స్థాయి నటనా ప్రతిభతో ఈ సినిమాలో ఆకట్టుకుంది. గ్లామర్‌, లుక్స్‌, బాడీ లాంగ్వేజ్‌ ఇలా అన్నిటిలోనూ ఛార్మి డిఫరెంట్‌గా కన్పించింది. హై క్లాస్‌ కాల్‌గర్ల్‌ ఎలా ఉంటుందో దానికి తగ్గ బాడీలాంగ్వేజ్‌ని సంతరించుకోవడం చిన్న విషయం కాదు. ఎమోషనల్‌ సీన్స్‌లోనూ ఛార్మి రాణించింది.

బాయ్‌ నెక్స్‌ట్‌ డోర్‌ అనిపించేలా ఉన్నాడు సత్యదేవా. ముందు ముందు మంచి అవకాశాలు అతనకు రావొచ్చు. సరిగ్గా వాడుకుంటే అతనిలో మంచి స్టఫ్‌ తెలుగు సినీ పరిశ్రమకు ఉపయోగపడుతుంది. బ్రహ్మానందం కడుపుబ్బా నవ్వించాడు. సంపూర్ణేష్‌బాబు గెస్ట్‌ రోల్‌లో ఆకట్టుకున్నాడు. సప్తగిరి, ఉత్తేజ్‌, సత్యం రాజేష్‌ తదితరులు తమ పాత్రల పరిధి మేర ఫర్వాలేదనిపించారు.

కొత్త కథ ఏమీ కాకపోయినా పూరి జగన్నాథ్‌ తన డైలాగ్స్‌తో, తనదైన కథనంతో సినిమాని కొత్తగా మలచేందుకు ప్రయత్నించాడు. మాటలు బాగున్నాయి. కథనం ఆకట్టుకుంటుంది. టేకింగ్‌ పరంగానూ దర్శకుడు తన ప్రత్యేకతను చాటుకున్నాడు. పి.జి. విందా సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. సినిమాకి సినిమాటోగ్రఫీ హైలైట్‌. సునీల్‌ కశ్యప్‌ సంగీతం బాగుంది. పాటలు ఓకే. నేపథ్య సంగీతం చాలా బాగుంది. ఎడిటింగ్‌ ఇంకాస్త క్రిస్పీగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి.

ఫస్టాఫ్‌ అంతా ఎంటర్‌టైనింగ్‌గా, హాట్‌గా సాగిపోతుంది. సెకెండాఫ్‌లో మాత్రం వేగం మందగించింది. సెంటిమెంట్‌ పాళ్ళు ఎక్కువవడంతో సినిమా స్లో అవుతుంది. క్లయిమాక్స్‌కొచ్చేసరికి మళ్లీ పికప్‌ అవుతుంది. ఓవరాల్‌గా సినిమాతో మంచి మెసేజ్‌, అది కూడా అందరికీ అర్థమయ్యేలా ఇచ్చేందుకు ప్రయత్నించాడు దర్శకుడు. ఆ ప్రయత్నంలో దర్శకుడు కొంతవరకు సఫలమయ్యాడు. మెసేజ్‌ ఇవ్వాలనుకున్నప్పుడు సహజంగానే ఉండే ఇబ్బందులు ఈ సినిమాకీ తప్పలేదు. అదొక్కటీ పక్కన పెడితే ఓవరాల్‌గా దర్శకుడు సినిమాని చక్కగా నడిపించాడు. టార్గెట్‌ ఆడియన్స్‌ నిరాశపడే ఛాన్సే లేదు. పైగా ఆలోచింపజేసే సినిమా.

ఒక్క మాటలో చెప్పాలంటే: జ్యోతిలక్ష్మి హాట్‌ అండ్‌ సెన్సిబుల్‌

అంకెల్లో చెప్పాలంటే: 3/5

మరిన్ని సినిమా కబుర్లు
interview