Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : స్నేహితురాలయిన డాక్టర్ గుణదీపిక సహాయంతో మొత్తానికి విరాట్, సహస్రలను ప్రాణాపాయ స్థితి నుంచి కాపాడగలుగుతుంది విశాల. క్షేమంగా తన ఇంటికి తీసుకుని వస్తుంది. దీక్షను తీసుకుని వస్తాడు చందూ..ఇంకా స్పృహలోకి రాని సహస్ర ముఖం చూసి అందరికీ చాలా బాధేస్తుంది..విరాట్ తల్లిదండ్రులూ, సహస్ర తల్లిదండ్రులూ ఎవరి ఆలోచనల్లో వాళ్ళుంటారు..విరాట్ తో తమ బాక్ గ్రౌండ్ అంతా వివరంగా చెప్తుంది విశాల.....ఆ తర్వాత....

‘‘ధర్మ ఒక్క నిముషం’’ పిలిచాడు మహదేవ నాయకర్.

‘‘చెప్పండి అంకుల్’’

‘‘అంతా చెప్పి ఒక విషయం చెప్పకుండా వెళ్ళిపోతున్నావేరా?’’

‘‘ఏ విషయం ?’’

‘‘అదేరా నా కూతుర్ని ప్రేమించిన కుర్రాడు అతడి పేరు విరాట్ అన్నావ్. వివరాలేమిటి?’’

‘‘వద్దంకుల్ ఇప్పుడు మీరు తెలుసుకోకుండా వుంటనే మంచిది’’

‘‘ఎందుకు?..... నాకిప్పుడే తెలియాలి. ఎవరా కుర్రాడు?’’

‘‘ఒకె మీరు కోప్పడనంటే చెప్పేస్తాను. విరాట్ ఎవరో కాదు, కోయంబత్తూర్ వెంకట రత్నం నాయుడు గారి చిన్నకొడుకే ఈ విరాట్’’ అని చెప్పి ఇక ఒక్క నిముషం కూడ అక్కడుండకుండా వెళ్ళి పోయాడు.

మహదేవ నాకర్ మాత్రం షాక్ తో కొద్ది నిముషాలు అలాగే ఉండి పోయాడు.

ఆ వెంకట రత్నం నాయుడికి తనకు పడదు, గతంలో తమ మధ్య జరిగిన గొడవలు తనింకా మర్చి పోలేదు. అలాంటి వెంకట రత్నం నాయుడి కొడుకుని ప్రేమించటం ఏమిటి? ఆలోచనలు ఓ కొలిక్కి రాక ముందే భార్య మూగంబికై మాటలు విని తిరిగి చూసాడు ఆమె అంత సేపు వారి సంభాషణ వింటూనే వుంది.

‘‘ధర్మ చెప్పిందంతా నిజమే మీరెందుకలా షాక్ అయ్యారోనాకు తెలుసు, కాని ఆ కుర్రాడు చాలా మంచి వాడు, మనమ్మాయి తప్పు చేయ లేదు, విరాట్ కి మనమ్మాయంటే ప్రాణం’’ అంది.

‘‘ఏమిటే అంటున్నావ్ ? నీకీ విషయాలు తెలుసా?’’ నమ్మలేనట్టు అడిగాడు.

‘‘తెలుసు. ఆ రోజు పేపరు ప్రకటన వచ్చిన రోజే నేను ఫోన్ చేసి ఆ అబ్బాయితో మాటాడాను. సహస్ర తోనూ మాటాడాను. తన ఫోన్ నంబరు నాకిచ్చింది. అప్పట్నుంచి మేం ఫోన్ టచ్ లో వున్నాం. ఆ అబ్బాయి వెంకటరత్నం నాయుడు గారి కొడుకని తెలిసి ప్రేమించలేదు. ప్రేమించాకే దానికీ తెలిసింది.

మనమ్మాయి లాగే ఆ అబ్బాయీ తన మేన కోడల్ని చేసుకోవాలని తండ్రి బలవంతం చేస్తుంటే ఇష్టం లేక చెన్నై వెళ్ళిపోయి అజ్ఞాతంగా ఉంటున్నాడు. తండ్రి కాదంటే మనమ్మాయిని చేసుకోడని మనం భయపడాల్సిన అవసరం లేదు. కులం వేరన్న ఒకే ఒక్క అభ్యంతరం తప్ప మన కన్నా ఎందులోనూ వాళ్ళు తీసిపోరు. ఒక్కగానొక్క కూతురు. దాని ఇష్టాన్ని మనం కాదనటం మంచిది కాదు ఆలోచించండి.
దీనికంతా కారణం ఆ త్యాగరాజన్ వాడికి మన కూతురని తెలిసే దాన్ని చంపించాలని కంకణం కట్టుకున్నాడు. ప్రధాన శతృవు ఆ త్యాగరాజన్ గాని, వెంకటరత్నం నాయుడు గారు కాదు. ఆలోచించండి. బిడ్డ ఇప్పుడెలా వుందో ఏమిటో ఎన్నిసార్లు ఫోన్లు చేసినా దాని ఫోను స్విచ్చాఫ్ లో వుంది. విరాట్ కి ఫోన్ చేసినా అదే పరిస్థితి నాకెందుకో భయంగా వుంది’’ అంటూ చెప్పాల్సింది చెప్పి కన్నీళ్ళు పెట్టుకుని అక్కడ్నుంచి వెళ్ళిపోయింది ముగాంభికై.

భార్య మాటలు వినగానే మహదేవ నాయకర్ కి కర్తవ్యం బోధ పడినట్టయింది. ఆవేశం కట్టలు తెంచుకుంది. ప్రాణంలా పెంచుకున్న ఒక్కగా నొక్క కూతురు ఇల్లొదిలి ఆరు మాసాలు కావస్తోంది. దాన్ని చూడలేక పోయారు. జరిగింది తెలుసుకోలేక పోవటం నిజంగా తన అమాయకత్వమే.

ఎవడీ త్యాగరాజన్? చెన్నై నుంచి వచ్చి ఇక్కడ రియల్ ఎస్టేట్ ఆరంభించి క్రమంగా ఇప్పటికి భూ కుంభకోణాల పుట్టగా మారాడు. తాత మాజీ సియం ప్రస్తుత ప్రతి పక్ష నాయకుడు, అటు తండ్రి సెంట్రల్ మినిస్టర్, వాళ్ళ అండ చూసుకొని ప్రశాంతంగా వుండే మధురైలో గూండా సంస్క్రృతిని పెంచి పోషిస్తూ చుట్టు పక్కల అయిదారు జిల్లాల్లోని ఖనిజ సంపదను ఎడా పెడా దోచేసి ప్రజా ధనాన్ని కొల్లగొడుతూ విదేశీ బాంకులకి తరలించుకుంటున్నాడు.

మధురైలో తనకున్న పలుకుబడి ప్రజాభిమానం తెలిసి కూడ తన కూతుర్ని చంపించడానికి తెగించాడంటే ఇక వాడ్ని క్షమించ కూడదు.
కోపావేశాలతో వూగి పోయాడు మహదేవ నాయకర్. వెంటనే తన సెల్ అందుకొని ఎవరెవరికో ఫోన్ చేసాడు. గబ గబా క్రిందికొచ్చేసరికి భార్య ముగాంబికై ఎదురైంది.

‘‘ఇంటి దగ్గర జాగ్రత్తగా ఉండండి. మధురైలో నేనా, త్యాగరాజనా అని తేలి పోవాల్సిన సమయం వచ్చింది. బయటికి వెళ్ళొస్తాను’’ అంటూ చర చరా బయటికి నడిచాడు మహదేవ నాయకర్. భర్తను ఆపలేదు ముగాంబికై.

మహదేవ నాయకర్ కారు బయలుదేరే సరికి ఇంటిక్కాపలా ఉండే వాళ్ళలో సంగం మంది రెండు వేన్ లలో ఎక్కేసి కారుని వెంబడిన్చారు. వీధిలో కొచ్చే సరికి ఆయన కారు వెనక అర డజను కార్లు ఫాలో అయ్యాయి. నేరుగా మహాదేవ నాయకర్ కాన్వాయ్ ఆస్పత్రి వైపు దూసుకెళ్ళింది.

అక్కడ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఎ.యస్.పి ప్రకాష్ కి గాయాలు పూర్తిగా తగ్గు ముఖం పట్టాయి. ఫ్రీగా లేచి అటు యిటు తిరగ్గలుగుతున్నాడు. ఆ లోపే అతడ్ని ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేయబోతున్నారు. ఇన్ని రోజులూ సిక్ లీవులో వున్నాడు. వెళ్ళి డ్యూటీలో జాయిన్ అవగానే అంతు చూడాని పట్టుదలతో వున్నాడు. అలాగే ఓసారి చెన్నై వెళ్లి సహస్రను వెదకాలని, ఆమె ప్రియుడు దొరికితే ఎన్ కౌంటర్ చేసేయాలనీ ఏవేవో పిచ్చి ఆలోచనల్లో హుషారుగా వున్నాడు. అంతే గాని తన మీద కొద్ది క్షణాల్లో ఒక సునామీయే విరుచుకు పడ నుందని వూహించ లేక పోయాడు.

ఇంతలో పది మంది దృఢమైన మనుషులు ఆస్పత్రి వార్డు లోకి దూసుకొస్తుంటే అక్కడున్న వాళ్ళలో కొందరు నాయకర్ మనుషులు ఎవడేం తప్పు చేసాడో తప్పుకోండి తప్పుకోండి అంటూ పక్కలకు పరుగులు తీసారు.

అక్కడే వున్న ఎ యస్ పి ప్రకాష్ కి ఏం జరుగుతోందో అర్ధమయ్యే లోపలే వచ్చిన వాళ్ళు అతడ్నిపట్టుకొని కొట్టుకొంటూ బయటకు లాక్కుపోయారు.

కారు దిగుతున్న మహదేవ నాయకర్ ని చూడగానే ఎ.యస్.పి కి పై ప్రాణం పైనే పోతున్నంత కంగారు పట్టుకుంది. తన గురించి తెలిసి పోయుంటుందనే సందేహం ఏర్పడిన్ది. డిపార్ట్ మెంట్ వాళ్ళు నన్నెందుక్కొడుతున్నారు? అంటూ విడిపించు కోడానికి గింజుకున్నాడు.
తన గుబురు మీసం దువ్వి క్రూరంగా చూసాడు మహదేవ నాయకర్ కారులోంచి. తమ వంశ పారం పర్యంగా వస్తున్న పొడవాటి ఖడ్గాన్ని, తన లైసెన్స్డ్ రివాల్వర్ని తీసి కారు బోనెట్ మీద ఉంచి పక్కన కూచున్నాడు. వాటిని చూస్తేనే గుండెల్లో వణుకు పుట్టింది ప్రకాష్ కి.
‘‘సార్ ఎ.యస్.పి గారు మీకు శ్రమ కలిగిస్తున్నందుకు క్షమించాలి. మీకు నాకూతురు లక్ష్మీ సహస్ర తెలుసునా?’’ గంభీరంగా అడిగాడు నాయకర్.

‘‘తెలీదు’’ అన్నాడు ప్రకాష్.

‘‘పోనీ జర్నలిస్టు లహరి తెలుసా?’’

‘‘తెలీదు నాకేం తెలీదు’’

‘‘స్వయంగా లహరి తనుఎంతో శోధించి సాధించిన ఇన్ఫర్మేషన్ త్యాగరాజన్ భూ బాగోతం మీద తయారు చేసిన ఫైలు నకలుతో బాటు రిపోర్ట్ వ్రాసిచ్చి నిన్నుకేసు బుక్ చేయమని కోరింది. ఆ ఫైలు ఏమైంది.’’

‘‘లేదు లేదు..... మీకెవరో రాంగ్ ఇన్పర్మేషన్ ఇచ్చారు. నాకెవరూ అలాంటి ఫైలు యివ్వలేదు’’ అంటూ అడ్డంగా బొంకాడు ప్రకాష్.

‘‘ఇంకా బొంకి ఎక్కడికి తప్పించుకుంటావ్రా. నా కూతుర్ని బ్లాక్ మెయిల్ చేసి నాకే అల్లుడయిపోవాలను కుంటావ్ రా. కొట్టండ్రా..... వాడు నిజం చెప్పే వరకు విరగొట్టండి’’ అనరిచాడు కోపంతో మహదేవ నాయకర్ అంతే.

ప్రకాష్ ని చితగొట్టడం ఆరంభించారు ఆయన మనుషులు. ఇంతలో ఆస్పత్రి డాక్టర్లు బయటకు పరుగులెత్తుకొచ్చారు.

‘‘సార్....... ఆయన ఇప్పుడే కోలుకున్న మనిషి. ఈ పూట డిశ్చార్జ్ చేద్దామనుకున్నాం. మీరిలా కొడితే చచ్చిపోతాడు. వదిలేయండి’’ అంటూ రిక్వెస్ట్ చేసారు.

‘‘ప్రాణం పోసే మీకు ప్రాణం విలువేమిటో తెలుసు. కాని ఇలాంటి వెధవలకి ప్రాణం విలువ తెలీదు. వీడు నిజం చెప్తే బ్రతికి పోతాడు. చెప్పక పోతే ఛస్తాడు. ప్రాణం వుంటే లోనకొస్తాడు. పోతే కాటికి పోతాడు. మీరు లోన కెళ్ళండి’’ అంటూ ఖడ్గం అందుకుని సర్కున ఒరలోంచి కత్తి తీసాడు మహదేవ నాయకర్.

‘‘ఆగండిరా...... వీడ్ని కొట్టి అనవసరంగా టైంవేస్ట్ చేయొద్దు. వీడు నిజంచెప్పడు. వీడి తలనరికి పట్టుకుపోదాం. తప్పుకోండి’’ అంటూ ఖడ్గాన్ని పైకి లేపాడు.

అంతే...

ప్రకాష్ భయంతో ఒక్కసారిగా ‘‘వద్దు నన్ను చంపొద్దు అంతా చెప్తాను’’ అంటూ అరిచాడు.

‘‘ఈ బుద్ది ముందే ఉండాల్సింది. ఒరలో కత్తిదూసాక నెత్తురు చూపకుండా లోనపెట్టకూడదు’’ అంటూ కత్తి మొనతో ప్రకాష్ చెంపమీద గాటుపెట్టి దాన్ని తిరిగి ఒరలో ఉంచాడు.

‘‘చెప్పరా ఆ ఫైలు ఏం చేసావ్ ఇప్పుడు ఎక్కడుంది ?’’ అడిగాడు నాయకర్.

అంతే!

ఎ.యస్.పి ప్రకాశ్ నోటినుంచి నిజాలు తన్నుకొంటూ బయటికొచ్చేసాయి. ధర్మా చెప్పిన విషయాలతో ప్రకాష్ చెప్పిన విషయాలు సరిపోవటంతో మహాదేవనాయకర్ కి కోపం తారా స్థాయికి చేరుకుంది. ఇంత కాలం తను ఎంత అమాయకంగా ఉండి పోయాడో తెలిసొచ్చింది.

సరిగ్గా ఇదే సమయంలో`

మహాదేవ నాయకర్ సెల్ ఫోన్ మోగింది.

అవతల మధురై సిటీ పోలీస్ కమీషనర్ లైన్ లో ఉన్నాడు. ఎవరో ఇక్కడి విషయాలు ఫోన్ చేసినట్టున్నారు.

‘‘సార్... మీరు దగ్గరుండి ఎ.యస్.పిని కొట్టిస్తున్నట్టు తెలిసింది. అతను డిపార్ట్ మెంట్ మనిషి సార్. వెంటనే వదిలేయండి’’ అటునుంచి రిక్వెస్ట్ చేసాడు కమీషనర్.

‘‘డిపార్ ట్మెంట్ మనిషి. నాకు తెలుసు కమీషనర్ డిపార్ట్ మెంట్ మనిషే, కాని వాడే  డిపార్ట్ మెంట్ కాదు కదా. అర్హత లేని ఇలాంటి కుక్కల్ని ఉన్నత పదవిలో కూచోబెట్టిన మీ అధికారుల్ని అనాలి. డిపార్ట్ మెంట్ మనిషిగా ప్రజల తరపున పనిచేయాల్సిన మనిషి కాకీ బట్టలేసుకుని త్యాగరాజన్ లాంటి వాడికి కాపలా కుక్కలుగా మారుతుంటే ఏం చేయాలి? మీ డిపార్ట్ మెంట్లో వాడి దగ్గర లంచం మెక్కని వాడెవడో చెప్పగలరా? ఈ ఒక్కరోజు మీరు కళ్ళు చెవులు నోరు మూసుక్కూచోండి. నా కూతుర్ని చంపాలని చూస్తుంటే నేను చేతులు ముడుచుక్కూచోలేను.’’ అంటూ ఫోన్ కట్టేసి జేబులో వేసుకొని ఎ యస్ పి ప్రకాశ్ వంక చూసాడు.

‘‘నీకు బ్రతకాలనుందా?’’ కౄరంగా చూస్తూ అడిగాడు.

‘‘అవును. ఇంకెప్పుడూ తప్పు చేయను. నన్నొదిలేయండి ప్లీజ్’’ నెత్తురొస్తున్న చెంపను తుడుచుకొంటూ అడిగాడు.

‘‘సరి ఇప్పుడే ఈ క్షణమే... నువ్వు మధురై వదిలి వెళ్ళిపోవాలి. రేపు తెల్లవారే సరికి నీ ముఖం మధురైలో కన్పించకూడదు. తర్వాత నీ యిష్టం వచ్చిన చోటుకి ట్రాన్స్ ఫర్ చేయించుకో. వెళ్ళిపో మరోసారి నా కంట బడితే చంపేస్తాను. రేయ్ వీడికి ట్రీట్ మెంట్ చేయించి నేరుగా ఇంటికి తీసుకెళ్ళి వదిలేసి రండి’’ అంటూ ఆర్డర్ వేసి రివాల్వర్ జేబులో వేసుకొని ఖడ్గాన్ని అందుకొని కారెక్కాడు. ‘‘పోనీరా నేరుగా త్యాగరాజన్ అడ్డా, టేకు తోట గెస్ట్ హౌస్ కి  కారు పోనీ’’ అన్నాడు.

************************

పక్క జిల్లా కలక్టరయిన లక్ష్మి ముందురోజు సాయంకాలమే త్యాగరాజన్ టేకు ఎస్టేట్ గెస్ట్ హౌస్ భవంతికి వచ్చింది. రాత్రికి త్యాగరాజన్ ఆమెతో ఎస్టేట్ భవనం లోనే ఉండి పోయాడు. రెండంతస్థుల విశాలమైన ఆ భవనంలో ఫస్ట్ ప్లోర్ లో టేకు తోటలో పని వాళ్ళుగా వుంటూ గుండాయిజం చలాయించే త్యాగరాజన్ మనుషులుంటారు. ఆ భవంతికి నిరంతరం కాపలా ఉంటుంది. అనుమతి లేందే ఎవరినీ లోనకు రానివ్వరు.
ఆ తోటను చుట్టి వున్న ఎత్తయిన కాంపౌండ్ వాల్ని ఆనుకొని దక్షిణం వైపున గోడ అవతల మరో పాత కట్టడం వుంది. గెస్ట్ హౌస్ నుంచి ఆ కట్టడంలోకి రహస్య మార్గం ఉందన్న సంగతి ఎవరికీ తెలీదు. ఎట్టయ్యప్పలాంటి ఒకరిద్దరు ముఖ్యమైన వాళ్ళకి మాత్రం తెలుసు.
త్యాగరాజన్ కి మధురైలో అర డజను ఆఫీసులు, పది ఇళ్ళు ఉన్నాయి. అతని భార్య పిల్లలు చెన్నైలోనే ఉంటారు. చెన్నైలో చాలా ఆస్థి పాస్థులున్నాయని వేరే చెప్పక్కర్లేదు. ఇవి గాక బెంగళూరు, మైసూరు, బాంబే, హైదరాబాద్ ల లోనూ ఆస్థులున్నాయి. చెన్నైనుండి భార్యా పిల్లలు వస్తే ఉండేందుకు మధురైలో తన పర్మనెంట్ అడ్రస్ కోసం ఒక ఇంటిని అట్టి పెట్టుకున్నాడు. రాత్రంతా ఎస్టేట్ బిల్డింగ్ లో వున్నా తెల్లవారు జామునే లేచి ఇంటికెళ్ళి పోయి స్నానాదికాలు ముగించి పూజ చేసుకోవటం త్యాగరాజన్ అలవాటు. తిరిగి పది గంటల తర్వాత ఓసారి గెస్ట్ హౌస్ కొచ్చి తర్వాత మెయిన్ ఆఫీస్ కు వెళ్తాడు. అతను వచ్చే వరకు ఉండి తర్వాత తను బయలుదేరి వెళ్ళిపోతుంది లక్ష్మి.
ఆ రోజు సాయంత్రం త్యాగరాజన్ ఇంట్లోనే వున్నాడు. లక్ష్మి వచ్చిందని తెలిసి బయలు దేరబోతుండగా ఎవరో వచ్చారు. వాళ్ళతో మాట్లాడేసరికే రాత్రి ఏడుగంటలు దాటింది సమయం. అంతలో టివిలో చెన్నైలో గొడవ గురించి వార్తలు ప్రసారం గావటంతో చాలాసేపు టివికి అతుక్కుపోయాడు. టివి చూస్తూనే తన మనుషులు ధనగిరికి ఫోన్ చేసి వాళ్ళని గొడవ జరుగుతున్న ప్రాంతానికి డైవర్ట్ చేసాక రాత్రి పది గంటలకి ఎస్టేట్ గెస్ట్ హౌస్ కి చేరుకున్నాడు.

ఈ ఎస్టేట్ ఉత్తర భాగంలో ఎటుపక్క తవ్వినా ఎముకల గుళ్ళు బయట పడతాయని జనం గుసగుసలు పోతుంటారు. అది నిజం కూడ తనకు కిట్టని వాళ్ళు తన మాట వినని అధికారులు, భూస్వాములు ఇలా చాలా మందిని నమ్మకంగా అక్కడికి రప్పించి ఫినిష్ చేసి టేకు తోట లోనే భూస్థాపితం చేసి అడ్రసు గల్లంతు చేసిన సందర్భాలు చాలా వున్నాయి.

ఆ రాత్రి లక్ష్మితో ఎంజాయ్ చేస్తూ సుమారు రెండు గంటలవరకు మేలుకోనే వున్నాడు. ఒంటి గంట ప్రాంతంలో ధనగిరికి ఫోన్ చేయగా విక్కీ డైమండ్లతో బాటు ఫైరింగ్ లో కొందరు మరణించిన సంగతి వేన్ ఆక్సిడెంట్ లో కొందరు పోయిన సంగతీ తెలిసింది.

లక్ష్మి ఏకాంతంలో చాలా ఓపెన్ గా ఉంటుంది. హేపీగా మందు కొడుతుంది. సిగరేట్ తాగుతుంది. పచ్చిగా మాట్లాడి మగాడికి కిక్ ఎక్కిస్తుంది. తనకేం కావాలో తీసుకుని ఎదుటి వాళ్ళకివ్వవలసింది ఇచ్చేస్తుంది. అందుకే లక్ష్మి అంటే త్యాగరాజన్ కి స్పెషల్ మోజు ఆ పైన తన వ్యాపారాలకు ఆమె సహకారం ఎంతో ఉపకరిస్తోంది గాబట్టి ఆమెకు కోట్లాది రూపాయలిస్తున్నాడు.

రాత్రంతా ఆమెతో గడిపిన త్యాగరాజన్ అలవాటు ప్రకారం తెల్ల వారు జామున అయిదు గంటలకు లేచి ఇంటి కెళ్ళి పోతూ తను వచ్చే వరకు ఉండమని చెప్పి మరీ వెళ్ళాడు.

ఉదయం ఏడు గంటలకు నిద్ర లేచిన లక్ష్మి స్నానాదికాలు ముగించి ఫ్రష్ గా తయారైంది. పని వాళ్ళిచ్చిన కాఫీ టిఫిన్లు తీసుకొని త్యాగరాజన్ కోసం ఎదురు చూస్తూ అతడి ఆఫీసు గదిలో కూచుంది.

ఇదే సమయంలో అక్కడ ఆస్పత్రి వద్ద ఎ.యస్.పి ప్రకాష్ ను మహ దేవ నాయకర్ తన మనుషులతో స్వయంగా వచ్చి దగ్గరుండి కొట్టించి విచారిస్తున్న విషయాన్ని ముందుగా ఎవరో త్యాగరాజన్ కి ఫోన్ చేసి చెప్పారు.

ఆ వార్త విన్న మరు క్షణం హడావుడిగా బయలు దేరాడు త్యాగరాజన్ కాని అప్పటికే ఆలస్యమైంది.

జగన్మోహన్ కారు ఆ ప్రాంతం చేరుకునే సరికే మహ దేవ నాయకర్ ఎస్టేట్ వద్దకొచ్చాడు. మిగిలిన కార్లను బయటే ఉండమని చెప్పి తన కారు వెంట మరో రెండు వేన్ లను మాత్రం తీసుకొని గేటు లోపలికి వెళ్ళి పోయాడు వెంటనే జగన్మోహన్ గేటువైపు వెళ్ళకుండా తన కారును పాత కట్టడం కాపౌండ్ లోకి పోనిచ్చి కారు దిగి ఎట్టయప్పకు ఫోన్ చేసాడు.

‘‘సార్ పరిస్థితి ఉద్రిక్తంగా మారేట్టుంది. లక్ష్మి గారు మహా దేవ నాయకర్ తో వాదానికి దిగి అతన్ని చెంప మీద కొట్టబోయింది. దాంతో ఆవిడ్ని దారుణంగా తిట్టి పక్కకు గెంటేసి మీ ఆఫీసు గది మొత్తం గాలించి జర్నలిస్టు లహరి ఫైల్ ను తీసుకున్నారు.............’’

‘‘ఇక చెప్పకు బ్లడీ ఫూల్. లక్ష్మి నోరు పారేసుకునుండ కూడదు. మహ దేవ నాయకర్ వర్గం ఇక ఆగదు. తాడో-పేడో తేల్చేసుకుందాం. గేట్లు మూసి లోపలున్న అందర్నీ అటాక్ చేయండి. దొమ్మీలో సందు చూసి మహ దేవ నాయకర్ ని వేసేయండి, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను. లక్ష్మిని రహస్య మార్గం నుంచి తప్పించి నా వద్దకు పంపించండి. ఇక్కడ నేను రెడీగా వున్నాను’’ అంటూ ఆర్డర్ వేసి ఆ వెనకే సిటీ లోని తన వర్గానికి చెందిన గుండాలు రౌడీ గ్రూపుల లీడర్స్ కు చక చకా ఫోన్లు కొట్టాడు.

ఇక్కడే త్యాగ రాజన్ కూడ లక్ష్మి లాగే తొందర పడ్డాడు. ఈ గొడవ ఎక్కడకు దారి తీస్తుందో వూహించి వుంటే అటాక్ చేయమని ఆర్డర్ వేసే వాడు కాదు. ప్రభుత్వ ఖజానాకు గండి కొట్టి కోట్లాది ప్రజా ధనం మెక్కిన మదం, అహంకారం, తననెదిరించే మగాడెవడనే గర్వం ఆ క్షణంలో త్యాగరాజన్  వివేకాన్ని నశింప చేసి మధురైలో దారుణ మారణ హోమానికి బీజం పడేలా చేసాయి.

నిజానికి మహ దేవ నాయకర్ వచ్చింది గొడవ పెట్టుకోడానిక్కాదు. తన కూతురు జోలికొచ్చినా ప్రాణహాని కలిగించినా పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిపోవాలనే వచ్చాడు. కాని మూర్ఖుడైన ఎట్టయప్ప కేవలం తన వెంట రెండు వేన్ లలో పాతిక మందితో లోన కొచ్చిన మహ దేవ నాయకర్ ని చూడగానే బలమైన కాంపౌండ్ వాల్ మెయిన్ గేటు మూయించటంతో రగులుకుంది చిచ్చు. ఆ పైన త్యాగ రాజన్ తెలివి తక్కువగా వేసిన ఆర్డర్ ఆ చిచ్చుకు ఆజ్యం పోసింది.

ఈ లోపల బోరున ఏడుస్తూ లక్ష్మి రహస్య మార్గం గుండా బయటి కొచ్చేసింది. తన ఆంతరంగికురాలయిన లక్ష్మి ఏడుపు చూసి త్యాగ రాజన్ తెగ ఫీలయి పోయాడు. రా కారెక్కు  వాళ్ళ సంగతి మన వాళ్ళు చూసుకుంటారు. అంటూ కారు స్టార్ట్ చేసాడు.

‘‘నా కారు..... నా ఏభై లక్షల కారు లోపలే ఉండి పోయింది’’ అంది గాభరా పడుతూ లక్ష్మి.

‘‘ఏయ్ ఇపుడు కావలసింది కారు కాదు ప్రాణాలు, లోనకెళ్ళటం ఇప్పుడు అసాధ్యం. నువ్విక్కడున్న సంగతి మీడియా వాళ్ళు పసిగడితే ఇద్దరి పరువులు గాలి పటాల్లా ఎగురుతాయి. ముందు నువ్వుసేఫ్ గా సిటీ వదిలి పోవటం ముఖ్యం.

నీ కోసం వేరే కారు ఏర్పాటు చేసాను, హర్రీ’’ అంటూ డోర్ తెరిచాడు లక్ష్మి కూచోగానే కారును వేగంగా పక్క దారుల వెంట దూకించాడు.
చాలా సేపటి తర్వాత  వూరు చివర ఒక కాలనీ దగ్గర ఆపాడు కారు.

అక్కడ వీళ్ళకోసం

మరో కారు సిద్దంగా ఉంది

లక్ష్మిని ఆ కారు ఎక్కించి పంపించాక గాని త్యాగరాజన్ కి మనశ్శాంతి కలగ లేదు, ఆ కారు కను మరుగు కాగానే తన కారును వెనక్కు మళ్ళించాడు. అయితే సిటీలోకి ఎంటర్ కావటానికి ధైర్యం చాల్లేదు. త్యాగరాజన్ లాంటి వాళ్ళ ఎప్పుడూ ముందు తమ సేఫ్టీ చూసుకుంటారు. జనాన్ని రెచ్చ గొట్టడమే గాని జనం మధ్యకు వెళ్ళి పోట్లాడే దమ్ము ధైర్యం వీళ్ళకుండవు, కారును పక్క దారుల వెంట పరుగెత్తించి చెన్నై వెళ్ళే రూట్ కి చేరుకున్నాడు, ఆ రూట్లో అయిదు కిలో మీటర్ల దూరం వెళ్ళాక ఎవరూ లేని చోట చెట్ల కింద కారాపి కూచొని సెల్ ఫోన్ అందుకున్నాడు, ఎప్పటి కప్పుడు తన మనుషులకు ఫోన్ చేసి పరిస్థితి తెలుసుకుంటూ వాళ్ళని మరింతగా రెచ్చగొట్టనారంభించాడు.
ఆస్పత్రి నుంచి బయలు దేరిన మహ దేవ నాయకర్ కారు నేరుగా టేకు తోట కాంపౌండ్ మెయిన్ గేటును చేరుకొని ఆ గేటు చూడ్డానికి ఒక కోట సింహ ద్వారంలా ఉంటుంది. రెండు వాహనాల్ని మాత్రం తనతో లోనకు రమ్మని మిగిలిన వాహనాన్ని బయటే ఉండమని ఆర్డర్ వేసి గేటు తలుపు కొట్టించాడు.

గేటు లోపల ఇద్దరు సెంట్రీలు కాపలా ఉంటారు ఎవరన్నా వచ్చి తలుపు కొడితే కిటికీ తెరిచి చూసి పర్మిషనుంటేనే గేటు తీసి లోనకు పంపిస్తారు. బయట కలకలం విని అప్పుడే కిటికీ తెరిచి చూస్తున్నాడో సెంట్రీ తలుపు తట్టడం వాడు కిటికీ తెరవటం ఒకే సారి జరిగింది. నాయకర్ మనిషి చట్టున వాడి పీకపట్టుకున్నాడు.  గేటు తెవరక పోతే చస్తావ్ అంటూ హెచ్చరించాడు. లోపలి రెండో సెంట్రీ కంగారుపడి గేటు తెరిచాడు.

వెంటనే మహ దేవ నాయకర్ కారు వెనకే రెండు వాహనాలూ లోనకు దూసుకొచ్చాయి. మిగిలినవి బయట ఆగి పోయాయి. అప్పుడే బాల్కనీలో కొచ్చిన ఎట్టయప్ప పరిస్థితి చూసి తొందర పడి గేటు మూసి తాళం వేయమంటూ గేటు దగ్గర సెంట్రీలకి సిగ్నలిచ్చాడు. మరు క్షణం వాళ్ళు గేటు మూసి తాళం వేసేసారు. బయటి అనుచరులు జాగ్రత్త పడేలోనే జరిగి పోయిందంతా.

లోన కెళ్ళిన మహ దేవ నాయకర్ గాని మిగిలిన వాళ్ళు గాని తమ వెనకే గేటు మూసి తాళం వేసిన సంగతి గమనించలేదు. గెస్ట్ హౌస్ లోనే ఉన్నాడనీ అభిప్రాయంలో వున్నాడు. నేరుగా మెట్ల వెంట పైకి పోబోతుంటే ఇరవై మంది గుండాలు మెట్ల దారిని బ్లాక్ చేసేసారు. బాల్కనీలో నిలబడిన ఎట్టయప్పన్.

‘‘హలో మహ దేవ నాయకర్ గారూ ఏంటీ దౌర్జన్యం? సార్ ఇక్కడ లేరు. ఏమన్నా మాటాడ దలుచుకుంటే ఆయన వచ్చాక మాటాడండి. మీరు వెళ్ళి పోతానంటే ఆ గేటు తెరుచుకుంటుంది. లేదు గొడవ పడాలనుకుంటే వచ్చిన  వాళ్ళలో ఒక్కడూ బయటకి పోలేడు’’ అంటూ వేలెత్తి చూపిస్తూ హెచ్చరిక జారీ చేసాడు.

.............ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika