Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
naa preyasini pattiste koti

ఈ సంచికలో >> సీరియల్స్

వేదిక

జరిగిన కథ : చంద్రకళకి నృత్యశిక్షణనిచ్చే గురువు గారు కనబరిచే ప్రత్యేక శ్రద్ధ చంద్రకళ నాన్నగారికి ఎంతో నచ్చుతుంది. ప్రత్యేకంగా తాంబూలంలో కొంత దక్షిణ తీసుకువెళ్ళి ఇస్తారు. కానీ ఆయన సున్నితంగా తిరస్కరించి, నృత్యం పట్ల చంద్రకళా అంకితభావాన్ని అభినందించి ఆశీర్వదిస్తారు....తర్వాత...

“..పొండి నాన్న, మీరు మరీ చేస్తారు... రేపే మనం గుంటూరు వెళుతున్నాముగా.... ఈ సారి ఆస్ట్రేలియా నుండి పెద్దమ్మ వాళ్ళు కూడా వస్తున్నారు.  అమ్మ నన్ను ఓ వారం అక్కడే ఉండమంటుంది  మరి..వాళ్ళతో సరదాగా అటు ఇటు తిరగడాలు ఉంటాయి,” అంటూ నవ్వేసాను నేను...

“.... అదేగా నేననేది... ఎవరిల్లైనా సరే,  మేము లేందే  అక్కడిక్కడ  ఉండిపోవడాలు  ఎందుకమ్మా?  ... గుంటూరులో మనం మూడు రోజులు ఉంటున్నాము కదా! నువ్వు మా వెంటే  తిరిగి వచ్చేయాలి,” అన్నారు నాన్న.

“కనీసం అమ్మమ్మ, నానమ్మల దగ్గర కూడా ఉండ కూడదా?” కావాలనే నవ్వుతూ అడిగాను. ..నేనిప్పటివరకూ ఒంటరిగా ఎక్కడికీ వెళ్లిందీ లేదు..... ఎవరింట్లోనూ

ఉన్నదీ లేదు..."

“అవునవును, కుదిరితే నిన్ను బంగారు పంజరంలో బంధిస్తారు మీ నాన్న,” అంది ఇదంతా వింటున్న అమ్మ.

“అలాగా? అందుకేనా ఎప్పుడు లీవ్ పెట్టినా నీ ఇష్ట ప్రకారమే, ముందు గుంటూరు ప్రయాణం ఉంటుంది...మిమ్మల్ని పంజరాల్లో పెట్టి తిప్పడానికే,” అని నాన్న  అనడంతో, ‘మీ వాళ్ళు, మా వాళ్ళు’ అనుకుంటూ వాదించుకోడం  మొదలుపెట్టారు.

నవ్వుకుంటూ నేను అక్కడి నుండి బయటపడ్డాను.....ప్రయాణానికి సర్దుకోవాలి అనుకుంటూ....

**

ఆస్ట్రేలియా నుండి సుశీల పెద్దమ్మ, వారానికోసారైనా ఫోన్ చేస్తుంది అమ్మకి.  వాళ్ళు మెల్ బోర్న్ లో ఉంటారు.  వాళ్ళ  గురించిన కబుర్లు అమ్మ నుండే వింటుంటాము.. వాళ్ళమ్మాయి, వీణ మెడిసిన్ లో చేరబోతుందట.  అవకాశం ఉన్నప్పుడల్లా, అక్కడ జరిగే ఇండియన్ ఫంక్షన్స్ లో భరత నాట్యం  ఐటమ్స్  చేస్తుందట వీణ... కాకపోతే, తనకి డాన్స్ మీద కంటే చదువు మీదే ఇంట్రెస్ట్ ఎక్కువట.  మొత్తానికి,  ఈ సారి వాళ్ళని కలవబోతున్నందుకు సంతోషంగానే ఉంది...

**

మేము గుంటూరులో ట్రైన్ దిగి ఇల్లు చేరేప్పటికి, చీకటి పడింది.  

ఆప్యాయంగా ఎదురు వచ్చారు అమ్మమ్మా, తాతయ్య.....  మమ్మల్ని చూడగానే, నన్ను, వినోద్ ని,  ప్రేమగా దగ్గరికి పిలిచింది పెద్దమ్మ.  “చిన్నపిల్లప్పుడు చూసాను నిన్ను.  ఎంత ఎదిగి పోయావు చంద్రకళ, నువ్వు?” అంది నన్ను.  “నిన్నైతే, నెలల పిల్లాడిగా చూసానురా,  ముద్దుగా ఉన్నావు,” అంటూ వినోద్  తలపై ముద్దు పెట్టుకుంది...

పెద నాన్నగారు దూరం నుండే, “హలో కిడ్స్,” అన్నారు.  వీణ లేచి వచ్చి, నాకు, వినోద్ కి హ్యాండ్ షేక్ ఇచ్చి, “హవ్ ఆర్ యు?” అని పలకరించింది....

“మీరంతా ఫ్రెష్ అయి రండర్రా,  భోజనాలు కానిద్దాం,” అంది అమ్మమ్మ....

**

కబుర్లు చెప్పుకుంటూ భోంచేస్తున్నాము. ‘వీణ ఎక్కువగా ఇంగ్లీషు లోనే మాట్లాడుతుంది, వాళ్ళ నాన్న లాగా’ అనుకున్నాను.  

“వీళ్ళు చూడు, శారదా,  చెప్పిన దాని కంటే మూడు రోజులు ముందే వచ్చారు సరే....కాని రేపే చీకటితో వెళ్ళిపోతున్నారు,”  అంది అమ్మమ్మ, ఫిర్యాదుగా...

“ఏం లేదు శారదా, ప్లాన్స్ కాస్త మార్చుకోవలసి వచ్చింది... ఈ సారి, కనీసం మిమ్మల్ని చూడ గలిగాము. సంతోషం,” అంది పెద్దమ్మ.

తాతయ్య కల్పించుకున్నారు.

“అసలు ఈ సారి, కొన్ని యాక్టివిటీస్  కూడా ప్లాన్ చేసాము,....ముఖ్యంగా, నీ డాన్స్  చూడాలని ఆదుర్దాగా ఉన్నాము, చంద్రా.  రాంబాబు, మణి ఎంతో చెప్పారు నీ నృత్య ప్రదర్శన గురించి,”  అన్నారాయన నా వంక చూస్తూ...

“అవును, మేమూ వింటున్నాము... నీ ప్రోగ్రామ్స్ అన్నీ యూ-ట్యూబ్ లో పెట్టమ్మా... చూడ్డానికి మాకు వీలుంటుంది,” అంది పెద్దమ్మ.   

అమ్మ ఫక్కున నవ్వింది.

“ఇది పెద్ద ముసలామె. కనీసం సెల్ ఫోన్ కూడా వాడదు... యూ-ట్యూబ్ వరకు కూడానా? ఎదో  స్కూల్ లోనే, స్కూల్ వర్క్ వరకే కంప్యూటర్ పరిమితమంటుంది,” అంది అమ్మ...

”టి.వి చానల్స్ కి చేసినవి తప్ప,  డాన్స్ రికార్డింగ్స్ కొన్ని డి.వి.డి ఫార్మాట్ లో నా దగ్గరున్నాయి. యూ-ట్యూబ్ పనంటే నేనే పూనుకొని చేయించాలి,”  మళ్ళీ అమ్మ....   

**

అర్ధరాత్రి దాటేంత వరకు అరిసెలు తింటూ, అందరం కబుర్లల్లో ఉండి పోయాము....  

నాన్నచేత ‘సాలీడా!' పద్యం పాడించారు తాతయ్య.   పెద నాన్న గారు తన వంతుగా హిందీ గజల్ పాడి వినిపించారు.  కళ్ళు మూతలు పడుతున్నా, వినోద్ తప్ప మిగతా అందరం మేలుకొని కూర్చున్నాము....  

నాన్న, పెద నాన్నగారు, తాతయ్య గార్ల  ఎడ తెగని కబుర్లతో, రెండు దాటింది...

“మళ్ళీ  మనం ఇలాగే కలవాలి శారదా.  ఈ సారికిలా కలిసి భోంచేసి, కాసేపు కూచుని కబుర్లు చెప్పుకో గలిగినందుకు సంతోషంగా ఉంది.  

మేము రేపు పొద్దున్నే, ఆరింటికి వెళ్ళిపోతాం.   మీరంతా నిద్ర పోతుంటారనుకో,” క్షణమాగి మా వంక చూసింది...  “బాగా అలిసి పోయున్నారు. ఇక  పిల్లల్ని పడుకోబెట్టు,” అంటూ నన్ను, వినోద్ ని దగ్గరికి తీసుకొని, ‘గుడ్ నైట్’ చెప్పింది  పెద్దమ్మ...

వీణకి, పెదనాన్న గారికి కూడా ‘బై’ చెప్పి బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోయాము నేను, వినోద్.......

**

మరునాడు సాయంత్రం, పట్టు పంజాబీ డ్రెస్సు వేసుకొని,  ప్రత్యేకంగా రెండు డాన్సులు చేసి చూపించాను అమ్మమ్మ, తాతయ్యలకి.  వంట మనిషి, ఆయమ్మ కూడా త్వరగా పనులు ముగించుకొని వచ్చారు డాన్స్ చూడ్డానికి.

అమ్మమ్మ నన్ను దగ్గరికి తీసుకొని మెచ్చుకుంది.

“చిన్నప్పుడు మీ అమ్మ, పెద్దమ్మ  కూడా  నేర్చుకుని  చేసేవారు.  కానీ నీలో మాత్రం ఏదో ఉందిరా, చంద్రకళ.  నువ్వు చూపించే హావ భావాలు,  అభినయం, కళ్ళు తిప్పుకోలేనంత  అందంగా చేస్తున్నావు... నువ్వు డాన్స్ మానవద్దు,” అంది అమ్మమ్మ.

“అయితే,  పెళ్ళి  చేసుకోబోయే  టైంకి, పెళ్లికొడుకుతో ముందే ఒప్పందం చేసుకోవాలి,” నవ్వారు తాతయ్య.

“మన జగదీష్ నే చేసుకుంటే,  అన్ని విధాల సుఖంగా ఉంటుంది చంద్ర.  మొన్న డిసెంబర్ లో,  వాళ్ళ అమ్మా, నాన్నలతో వచ్చెళ్ళాడుగా!   జగదీష్  అందంగా ఉన్నాడు.  చదువులో ఫస్ట్ అంట.  చెస్, టెన్నిస్ ఆడుతున్నాడంట.  మంచి మాటకారి కూడా.  తాతయ్య వాడిని మెచ్చుకుంటే, వాడు మాత్రం  తిరిగి  చంద్రకళని  మెచ్చుకున్నాడంటే,  మంచి కళా హృదయుడు అని కూడా అర్ధమయింది,”  పొంగిపోతూ  చెప్పింది  అమ్మమ్మ.

“అవును, నిజమే,  ‘టీన్ టెన్నిస్ స్టార్’  అని నేను వాడిని మెచ్చుకుంటే,  ‘మీరింకా  చంద్ర డాన్స్ చూడలేదు.  చంద్రకళ  డాన్స్  ముందు  ఏదీ  గ్రేట్ కాదు. షి ఇజ్ ఎ మార్వలస్ డాన్సర్, తాతయ్యా, అని నిన్ను మెచ్చుకున్నాడు వాడు,” అన్నారు తాతయ్య... నా వంక చూస్తూ. ఆశ్చర్యమనిపించింది.  ఆనందంగా అనిపించింది... జగదీష్ కి నా డాన్స్ అంటే అంత మంచి ఒపీనియన్ ఉండడం గర్వంగా అనిపించింది కూడా...

“మేనరికాలు  నాకు  నచ్చవు  అత్తయ్య గారు, అయినా పసి పిల్లలు.  ఇప్పటి నుంచీ పెళ్ళి మాటలు ఎందుకు లెండి,” అమ్మమ్మతో, నాన్న.

“కళా, తమ్ముణ్ణి తీసుకొని, వెళ్ళి టి.వి  చుడండమ్మా,”  అన్నారు.

పైకి లేచి పుస్తకం చదువుతున్న వినోద్ చేయి పట్టుకుని, ఎదురుగా ఉన్న గదిలోకి నడిచాను...

“అదేమిటి  అల్లుడు గారు?  రాంబాబు  మాకు  రక్త సంబంధీకుడు  కాదే!  కజిన్ అంటారే గానీ  నిజానికి అతను మా దూరపు  బంధువుకి  కొడుకు.  పైగా  ఆ  బంధువుకి,  రాంబాబు  దత్త పుత్రుడు.  అటువంటి రాంబాబు కొడుకు జగదీష్ విషయంలో, మేనరికమంటూ  అభ్యంతరాలేముంటాయి? భలే వారే మీరు,” అన్న  తాతయ్య మాటలు వినబడ్డాయి వెనుకనుండి....

“వాళ్ళుండేది  పల్లెటూరని  ఇక్కడ  గుంటూరులో  చదువుకున్నాడు, రాంబాబు.  సుశీలకి, శారదకి  అన్నిటా వాడు తోడుగా, సాయంగా ఉండేవాడు.  మాకు కొడుకు లేని కొరత తీర్చాడు,” అంది అమ్మమ్మ.

“మీ అల్లుడు గారు అన్నీ మరిచి పోతారులే  అమ్మా.  అయినా తప్పేముంది? జగదీష్  బంగారం  లాంటి  పిల్లాడు,” నవ్వింది అమ్మ.

వాళ్ళున్న హాలు మా టి.వి రూమ్ కి ఎదురుగానే ఉండడంతో,  వాళ్లంటున్న  చుట్టరికాలు  అర్ధమవ్వకపోయినా, వాళ్ళ మాటలు  గట్టిగానే  వినబడుతున్నాయి.

**

మరునాడు,  అమ్మమ్మ వాళ్ళతో, అమరావతి - కాకాని గుళ్ళకి బయలుదేరాము..

“మీ నాన్నకి ఇష్టమైన మరో పుణ్య క్షేత్రం ఇది,...”  అంది అమ్మ...

మా తిరుపతి, మదురై  ట్రిప్పుల గురించిన కబుర్లతో హాయిగా సాగింది  ప్రయాణం.  అమ్మ చెబుతున్న సంగుతులు వింటూ  స్టుడియోలో మేము చేసిన ప్రోగ్రాంని గుర్తు చేసుకున్నాను.

“పొద్దున్నే బయలుదేరడంతో త్వరగానే వచ్చేసామర్రా అమరావతికి.  గెస్ట్-హౌజ్ కూడా ఇంకా పది నిముషాల దూరంలోనే ఉంది.  త్వరగా మీ పనులన్నీ అయితే, రావుగారి మనిషి వచ్చి, మనల్ని దైవ దర్శనానికి తీసుకెళతాడు,” అన్నారు తాతయ్య మాతో...........

**

అమ్మవారి  దర్శనం  అయ్యాక,  గుడి  బయట, చెట్టు అరుగు మీద చేరాము.  వెంటొచ్చిన ఆయమ్మతో,  వినోద్ కాస్త దూరంలో ఉన్న  గిఫ్ట్ షాప్ కి  వెళ్ళాడు..... ఎక్కడికెళ్ళినా  ఫ్రెండ్స్ కి చిన్న గిఫ్ట్స్, పోస్ట్ కార్డ్స్ కొనే అలవాటు వాడికి.

“ఇక్కడేనమ్మా  కళా, నీలాంటి  బిడ్డ పుట్టాలని  ఈ గుళ్ళోని దేవతని మొక్కుకున్నాను,” అన్నారు నాన్న, కొట్టిన కొబ్బరులు నాకిస్తూ.  

ఆయన వంక చూసాను.  

“మా పెళ్ళైన రోజున, ఇక్కడ అమ్మవారి దర్శనానికి  వచ్చాము.  ఈ గుళ్ళో, ఇక్కడి నుంచి అక్కడి వరకు  కుంకుమార్చాన  జరుగుతుంది.  అందుకని,  దూరాన్నుంచే అమ్మవారికి వినబడేలా పెద్దగా,  గొంతెత్తి మరీ  వేడుకున్నాను.  అందమైన, కూతురు కావాలని,” , “మీ అమ్మనడుగు నిజమా? కాదా?” అన్నారు నాన్న.

అమ్మ నవ్వింది. “నాకెందుకు గుర్తు లేదు?  పెళ్ళి బట్టల్లో అందరి ముందు, గొంతెత్తి అంత బిగ్గరగా  ‘కూతురు కావాలి’ అని మీరు మొక్కడం.. అందరూ నవ్వడం,”  అంది అమ్మ.

“ఔనట...మేము చూడలేదు కాని, అంతా విన్నాము,” అంది అమ్మమ్మ...

“అందుకేరా నువ్వు నా చిన్న దేవతవే... ఆ అమ్మవారు నీకు ఎన్ని కళలు ప్రసాదించిందో చూసావా?” అంటూ నాన్న నా భుజాల చుట్టూ చేతులు వేసి తల మీద ముద్దు పెట్టుకున్నారు.

నాన్నకి  నేనంటే  అంత  ప్రేమని  తెలుసు...‘ఇంతటి నాన్న  ప్రేమ  చాలు  నాకు... నాన్నని  నేను కూడా  ప్రేమగా  చూసుకుంటాను’ అనుకున్నాను.

**

“మీరు వచ్చినట్టే లేదు,,, ఉన్నట్టే లేదు.  ఎల్లుండి వెళ్ళేపోతున్నారు కూడా.  ఇకనుండి ప్రతి యేడు రావాలి మీరు. మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాము.,” అన్నది అమ్మమ్మ భోజనాల దగ్గర.

“వచ్చే యేడు మా పాలెం వెళ్ళి ఇటు వస్తాము లెండి అత్తయ్య గారు.  సిక్ లీవ్ కాక నాకు మూడు వారాలు సెలవు వుంటుంది,” అన్నారు నాన్న.

**

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
death mistery