Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు
vedika

ఈ సంచికలో >> సీరియల్స్

డెత్ మిస్టరీ

జరిగిన కథ : ప్రైవేట్ డిటెక్టివ్ సిద్ధార్థ దగ్గరికి వెళ్తాడు తేజా...అతడితో మాట్లాడుతూండగా ఒక వ్యక్తి వచ్చి సిద్ధార్థతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తూ తేజాని చూసి ఇబ్బందిగా ఫీలవుతుంటాదు....అతడికోసమని బయటికి వెళ్తాడు తేజా....అతడ్నెక్కడో చూసినట్టుగా అనిపిస్తూంటుంది తేజాకు.....ఆ తర్వాత...

‘‘మొదటిసారి చూసినప్పుడు మాకా థాట్‌ రాలేదు. రెండోసారి  కారు దిగి ఆమె దగ్గరికి వెళ్లేలోపలే కార్లో తుర్రుమంది’’ నిట్టూర్చాడు ఆనందరావు.

‘‘కనీసం కారు నంబరైనా..’’

‘‘ఆ అమ్మాయిని చూసామనే తొందరలో మాకా సంగతే స్ఫురించలేదు’’

‘‘ఇంతకీ...ఈ ఫొటో ఇండికా కారమ్మాయిదేనా?’’

‘‘కాదు...మా బాస్‌ కూతురు ప్రతిమది’’

‘‘మీ అమ్మాయి ఫొటో తెచ్చి ఇండికా కారమ్మాయిని వెతకమంటారేంటీ?’’

‘‘ఇండికా అమ్మాయిని మీరు గుర్తుపట్టేందుకు వీలుగా...’’ ఎదుటివాళ్ల కోర్టులో కన్వీనియంట్‌గా బాల్‌ విసిరేసి నిశ్చింతగా ఉన్నాడతడు.‘‘ఇంతకీ మీ బాస్‌ రాలేదేం?’’

‘‘అవసరమొచ్చినప్పుడు మిమ్మల్నీ కలుస్తారు. ముందు...ఈ ఫొటో ఇచ్చి అమ్మాయిని వెతికిపెట్టమన్నారు. అడ్వాన్స్‌గా ఈ బ్లాంక్‌ చెక్‌ ఇచ్చిరమ్మన్నారు’’ అంటూ చెక్‌ అందించాడతడు.

సిద్దార్థకి మాత్రం నిప్పుల్లో కూచున్నట్లే ఉంది. ఆ సెగ తేజాకి కూడా కాస్త పంచాలనుకున్నాడు కాబోలు...క్యాబిన్‌ బయట తచ్చాడుతున్న అతడిని లోనికి పిలిచాడు సిద్దార్థ.

‘‘‘తప్పుగా అనుకోకండి. ఈయన మా క్లోజ్‌ ఫ్రెండ్‌ తేజ. చానెల్‌ సిక్స్‌టీన్‌లో క్రైం రిపోర్టర్‌గా వర్క్‌ చేస్తున్నాడు. అన్నట్టు...తేజా! ఈయనెవరో గుర్తుపట్టగలవా?’’

‘‘ఎక్కడో చూసినట్లనిపిస్తోంది. కానీ, ఎక్కడో తెలీడం లేదు’’ తల అడ్డంగా ఆడిరచాడు తేజ.

‘‘పోనీ..ఈ ఫొటోలోని అమ్మాయిని ప్రత్యేకించి గుర్తుపట్టక్కర్లేదు. కారణం...నీకు తెలిసిన అమ్మాయే?’’ అంటూ తన చేతిలోని ఫొటోని తేజాకి అందించాడు సిద్దార్థ.

‘‘ప్రతిమ’’ అన్నాడు తేజ ఆ ఫొటోని చూస్తూనే.

‘‘ఆ ప్రతిమ బతికే ఉందట. వెతికిపట్టుకోమంటూ  మనదగ్గరికొచ్చారు’’ చెప్పాడు సిద్దార్థ.

తేజా తేరుకోవడానికి ఓ క్షణం పట్టింది. ఆ తర్వాత అన్నాడు‘‘బతికి ఉంటే కదా...వెతికిపెట్టేది’’

‘‘అదే విషయం నేనూ చెప్పాను. ఆయన నమ్మట్లేదు. ప్రతిమ తమ బాస్‌ కూతురని ఇదే సిటీలో  తిరుగుతోందని భ్రమ పడుతున్నారు’’ వివరిస్తున్నాడు.

‘‘అద్సరే. ఆయన ఆనందరావుగారనీ...’’ సిద్దార్థ ఇంట్రడ్యూస్‌ చేస్తుండగా  అతడినెక్కడ కలిసాడో తేజాకి గుర్తొచ్చింది. ఆరునెలల క్రితం ప్రతిమ చనిపోయినప్పుడు ఎరేంజ్‌ చేసిన మాక్‌లైవ్‌లో ఇతడి రియాక్షన్‌ బైట్‌ ఒకటి తేజా తీసుకున్నాడు. ప్రతిమ చనిపోయినందుకు కన్నీళ్లు పెడుతూ బొంగురుపోయిన గొంతుతో గుండెల్లో బాధనంతా వ్యక్తం చేసాడు. చిన్నతనంలోనే సృజనశీలిగా ఎంతో పేరు తెచ్చుకున్న ప్రతిమ ఇలా అర్ధాంతరంగా చనిపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు చెప్పాడతడు.  వార్తాసేకరణలో భాగంగా  రోజూ ఎంతోమందిని కలుస్తుండడంతో అతడిని వెంటనే తేజా గుర్తుపట్టలేకపోయాడు.

‘‘అద్సరే...లోకంలో తప్పిపోయినవాళ్లనైతే ఎక్కడున్నారో ఆరా తీయగలం. చనిపోయినవాళ్లనెలా తీసుకురాగలం...చెప్పండి? ’’ ప్రశ్నించాడు తేజ.

ఆ మాటలంటున్నప్పుడు కళ్లముందు ప్రతిమ ఒక్కసారి తళుక్కుమంది.  ఇప్పుడు చేతిలో ఉన్న ఫొటోలో...తను చేసిన ఇంటర్వ్యూలో ప్రాణచైతన్యంతో కళకళలాడుతూ కనిపించిన ప్రతిమ చనిపోయిందంటే నమ్మడం అసాధ్యమే? అయినా...నమ్మాల్సిన నిజం.ఆమె మరణవార్త స్వయంగా ఈ చేతుల్తో తనే కంపోజ్‌ చేసాడు.

లోకానికంతటికీ తెలిసేలా లైవ్‌ టెలికాస్ట్‌ చేసాడు.

ఇన్సిడెంట్‌ ఇన్‌ఫర్మేషన్‌ అందిన వెంటనే మరే చానెల్‌ అందుకోలేనంత వేగంతో ఆ ప్రొడక్షన్‌ హౌస్‌ ప్రాంగణంలో వాలిపోయాడు.ఏకాయెకి అక్కడ్నుంచే ‘మాక్‌లైవ్‌’ అరేంజ్‌ చేసాడు. టెర్రస్‌ పైనుంచి పడ్డప్పుడు ఫెటిల్మని విరిగిపోయిన పక్కటెముకల శబ్దాన్నీ కూడా విడిచిపెట్టకుండా రికార్డ్‌ చేసే ప్రయత్నం చేసాడు. ప్రొడక్షన్‌ హౌస్‌లో ప్రతిఒక్కర్ని  కలిసి సంఘటన వివరాలు సేకరించాడు.ప్రతిమ కోలీగ్స్‌ అభిప్రాయాలు, పేరెంట్స్‌ వెర్షన్‌ తీసుకున్నాడు. బాడీని ఉస్మానియా ఆస్పత్రికి తరలించడం దగ్గర్నుంచీ పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చేవరకూ న్యూస్‌ కవర్‌ చేసాడు. అంతేనా!

టెర్రస్‌ పైనుంచి పడడం వల్లే ఆమె మరణించిందని పోస్ట్‌మార్టం నివేదిక వెల్లడిరచిందంటే వైద్యాధికారులు అధికారికంగా ఆమె మరణాన్ని ధృవీకరించినట్లే.

చనిపోయేంతవరకూ గుంపులో ఒకరిగా బతికేసి...మరణించడమే పెద్ద గుర్తింపుగా యావత్‌ ప్రపంచానికి తెలిసేలా వార్తలకెక్కిన ఈ లేత మెరుపుతీగెల్ని తలచుకున్న కొద్దీ అతడి మనసంతా విషాదమవుతుంది. ప్రతిమలాంటి అందాల భరిణెలు ఉన్నారన్న సంగతి ప్రపంచానికి తెలీకపోయినా ఫర్వాలేదు...వాళ్లు బతికుంటే చాలు..అనుకునేవాడు తేజ...అతివల అర్ధాంతర చావు కథనాలు క్రయిం స్టోరీలుగా మలుస్తున్న ఎన్నో సందర్భాల్లో.

‘‘అతి తక్కువ పరిచయం ఉన్న తానే ప్రతిమ చనిపోయిందంటే నమ్మలేకపోతుంటే...ఎంతో ఆత్మీయంగా పెంచుకున్న తల్లితండ్రులు ఎంతలా తల్లడిల్లుతారో ఇటే అర్ధం చేసుకోవచు.్చ బహశా, కన్నకూతుర్ని మరిచిపోలేని ప్రేమ ఆ బాస్‌ చేత కన్న కూతుర్నిలా వెతికిస్తోందేమో?’’ అనుకున్నాడు తేజ మనసులో.

‘‘పోలీస్‌ కంప్లయింట్‌ ఇవ్వాల్సింది...?’’ అన్నాడు తేజ ఏం మాట్లాడాలో తెలీక.

‘‘పోలీసుల దగ్గరకే వెళ్దామనుకున్నాం. కానీ..డిటెక్టివ్‌ సాయం తీసుకోవాల్సిందిగా మా బాస్‌ ఆర్డర్‌’’

‘‘సరే... మీ ఫోన్‌ నంబర్‌, అడ్రస్‌ ఇచ్చి వెళ్లండి. వెతికిపట్టుకోగానే మీకు సమాచారం అందిస్తాం’’ చెప్పాడు సిద్దార్థ.

‘‘ఎంత డబ్బు ఖర్చయినా ఫర్వాలేదు. మా అమ్మాయి ఆచూకీ మాకు తెలియాలి’’ అంటూ తన డిటైల్స్‌ కాగితంపై రాసాడతడు.ఆనందరావు వెళ్లిపోయిన తర్వాత తేజతో అన్నాడు సిద్దార్థ`‘‘ప్రతిమ స్టోరీలో లేటెస్ట్‌గా ఇదో మలుపు. కూతురు బతికేఉందంటూ ఆమె తండ్రే వెతకడం ఆశ్చర్యం. తేజా...! డబుల్‌ ధమాకా. ఎలాగో ప్రతిమ స్టోరీని ఇన్విస్టిగేట్‌ చేయాలనుకుంటున్నావు. పనిలో పని... ఇండికా కారమ్మాయి గురించి కూడా ఇన్విస్టిగేట్‌ చెయ్యి. నీ ఎపిసోడ్‌కి పెప్పర్‌ యాడ్‌ అవుతుంది’’ అన్నాడు సిద్దార్థ నవ్వుతూ.

ఆ మాటలకి చురుగ్గా స్పందించలేదు తేజ. కారణం` అతడి ఆలోచనలన్నీ ఆనందరావు, అతడి బాస్‌ చుట్టూ తిరుగుతుండడమే.ఆరోజు మళ్లీ మీడియాకి పుష్కలంగా ఫుడ్‌ దొరికింది. అపర్ణ అపహరణ కేసులో పోలీసులు పురోగతి సాధించారు. మీడియాలో  వస్తున్న వరుస కథనాలతో ఒత్తిడి పెరిగిన పోలీసుశాఖ అపర్ణ ఆచూకీ తెలుసుకునేందుకు పెద్ద కసరత్తే చేసింది. ఆమె సెల్‌ ఫోన్‌ కాన్వర్వేషన్‌లపై నిఘాపెట్టిన పోలీసు అధికారులు రెండు తెలుగు రాష్ట్రాల్నీ జల్లెడ పట్టారు. టెలీ టవర్ల ఆధారంగా ఆమె కదలికల్ని పసిగట్టారు. విజయవాడలో ఆమె ఉందన్న సమాచారమిచ్చిన కొద్దిగంటల్లోనే ఆమె విశాఖలో తేలిందని మరో ఇన్‌ఫర్మేషన్‌ని మీడియాకి అందించారు. దాంతో, ఉదయం నుంచీ మీడియా మళ్లీ అపర్ణ వార్తాకథనాలు, స్క్రోలింగ్‌లతో బిజీ అయిపోయింది. డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లాల్సిన అపర్ణ ఎక్కడికి వెళ్లిందనే మిస్టరీయే న్యూస్‌చానెల్స్‌లో ఉత్కంఠపెంచే డెయిలీ సీరియల్‌గా మారిపోయింది.

ఎంటర్టయిన్‌మెంట్‌ చానెల్స్‌లో రోజుకు హాఫెనవర్‌ చొప్పున రేపేం జరుగుతుందో తెలీని సస్పెన్స్‌తో ముందుగా సిద్ధం చేసుకున్న సీరియల్‌ రంజుగా సాగితే...న్యూస్‌చానెల్స్‌లో అపర్ణ ఎపిసోడ్‌ గంటగంటకీ రూపు మార్చుకుంటూ ఊపిరాడనీయకుండా చేస్తోంది. గంట ముందు విజయవాడలో కనిపించిన అపర్ణ గంట తర్వాత విశాఖలో ఉందంటూ పోలీసులు చెప్తుంటే ఆమె గురించి తెలుసుకోవాలనే ఆసక్తి వ్యూయర్స్‌లో పెరుగుతోంది. ‘పాపం అపర్ణ! ఆమెకేం కాకూడదు’ అని టీవీ చూస్తూ నిట్టూరుస్తున్నవాళ్లెంతమందో? సాక్షాత్తూ దేశరాజధాని ఢల్లీిలోనే గ్యాంగ్‌రేప్‌కు గురైన పారామెడికల్‌ స్టూడెంట్‌ నిర్భయ గురించి,   హైదరాబాద్‌ లోని మృగాళ్ల అకృత్యానికి బలికాబోయిన అభయ గురించి తెలిసిన జనాలంతా అపర్ణకి ఏ కీడు జరక్కుండా క్షేమంగా బయటపడాలని కోరుకుంటున్నారు.

కొంతమందైతే గుళ్లచుట్టూ ప్రదక్షిణాలు చేసి మొక్కులు మొక్కుతున్నారు. అంతలా అపర్ణ ప్రాచుర్యంలోకి వచ్చింది. అపర్ణ సెల్‌ ఫోన్‌ కదలికల్ని బట్టీ అపర్ణ ఏ ప్రాంతంలో ఉందో అంచనా వేస్తున్నామంటూ పోలీసులు చెప్తుంటే...ఆమె సెల్‌ ఆమె దగ్గరే ఉందా? అనే అనుమానాలు మరోపక్క మీడియా లేవనెత్తుతోంది. ఒకవేళ అపర్ణ కిడ్నాప్‌కే గురై ఉంటే...ఆమె సెల్‌ ఆమె దగ్గర కాకుండా కిడ్నాపర్ల దగ్గర ఉండే అవకాశాన్ని ఎంతమాత్రమూ కొట్టిపారేయలేమనే వాదనా వినిపిస్తోంది. అపర్ణ సెల్‌ఫోన్‌ ఆధారంగా ఆమె ఉనికి తెలుసుకోవడం ఈ ఇన్సిడెంట్‌లో ప్రధానమే అయినా...అదొక్కటే పరిశోధనామార్గం కాదంటున్నారు మేధావులు. కారణం...ఆమె లేకుండా ఆమె సెల్‌ఫోన్‌ని మరొకరెవరో తీసుకుని ఎక్కడెక్కడో తిరుగుతూ పోలీసుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారేమోననే భావన వెల్లువెత్తుతోంది. ఈ సందేహాలన్నింటినీ హాఫెనవర్‌ ప్రోగ్రామ్‌గా మలచి వరలక్ష్మి వాఖ్యాత్రిగా, తేజ స్క్రిప్ట్‌తో చానెల్‌ సిక్స్‌టీన్‌ మళ్లీ ప్రసారం చేసింది. దానికి వ్యూయర్స్‌ నుంచి వచ్చిన రెస్పాన్స్‌ అంతా ఇంతా కాదు. చానెల్‌ కార్యాలయానికే ఫోన్‌లు చేసి మరీ అపర్ణ గురించి ఆరా తీస్తున్న ఆరాధకుల సంఖ్య బాగా పెరిగింది. హడావుడిగా తేజ బయటకి వెళ్తుండగా రిసెప్షనిస్ట్‌ ఆపి మరీ`‘‘సర్‌..చిన్న డౌట్‌’’ అంది.

‘‘అడుగు...’’ అన్నాడు తేజ.

‘‘అపర్ణ ఆచూకీ తెలిసిందా? ఎక్కడుంది. సేఫ్‌గా ఉన్నట్లు ఆమె గురించి ఇన్‌ఫర్మేషన్‌ ఏమైనా అందిందా?’’ అడిగింది ఎర్రెర్రని పెదాల్ని ముద్దుముద్దుగా సవరించుకుంటూ.

‘‘ఆమె ఆచూకీ కోసం పోలీసులు శ్రమిస్తున్నారు. ఈరోజో రేపో ఆమె గురించి తెలిసిపోతుంది’’ అన్నాడు తేజ. ఆ తర్వాత అరగంటకే అపర్ణ గురించి బ్రేకింగ్‌ న్యూస్‌ పడిరది. గ్రాఫిక్‌ ప్లేట్స్‌తో ప్రతి చానెల్‌ హడావుడి చేసింది.

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్