Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> సీరియల్స్

నా ప్రేయసిని పట్టిస్తే కోటి

జరిగిన కథ : జరుగుతున్నదంతా టీవీలో చూస్తున్న మహదేవ నాయకర్ ఇక ఉండబట్టలేక వెంటనే బయలుదేరి ముందుగా హాస్పిటల్లో ఉన్న ఏ.ఎస్.పి.ప్రకాష్ ని కలుసుకుని గట్టిగా బుద్ధి చెబుతాడు...ఇంకా స్పృహలోకి రాని సహస్ర చెంతనే ఉన్న విరాట్ పరిస్థితులన్నీ గమనిస్తూంటాదు.. ఆ తరవాత..

ఎట్టయప్ప ధోరణి ఆ మాటలు పుండు మీద కారం చల్లినంత ఘాటుగా భగ్గుమన్పించాయి. ఒక్కసారిగా మహ దేవ నాయకర్ ముఖం కోపంతో ఎర్రబారింది. కళ్ళు చింత నిప్పుల్లా మారాయి ‘‘రేయ్ ఎట్టయప్పా ఎవడ్రానువ్వు? నాకే వేలెత్తి చూపించి సవాల్ విసిరేంత మగాడివయ్యావా? నేను వస్తున్నారా ఏ మాత్రం ఆప గలవో ప్రయత్నించు’’ అంటూ అడ్డంగా నిలబడిన రౌడీల్లో ఇద్దర్ని ఎత్తి అవతల పడేసి ముగ్గురి ముఖాలు పిడి గుద్దులతో పగల గొట్టి మెట్ల వెంట పైకి దూసుకెళ్ళాడు. వెనకే ఆయన అనుచరులు అక్కడి గుండాలతో తలపడ్డంతో ఆరంభమే అక్కడ యుద్ధ వాతావరణం నెలకొంది.

ఈలోపల

ఎప్పుడైతే సింహద్వారం లాంటి గేటు తలుపులు మూసి తాళం వేయబడ్డాయో మరు క్షణం బయట వున్న వాళ్ళలో ఒక్కసారిగా అలజడి చెలరేగింది. కార్లలో వాళ్ళందరూ దిగి గేటు వద్దకొచ్చేసారు. ఇంకేముంది లోన మన నాయకర్ గారిని వెంట వెళ్ళిన వాళ్ళని చంపాలని చూస్తున్నారు గేటు విరగొట్టండి అనరిచారెవరో. అంతే బయటి నుంచి దృడమైన ఆ గేటు తలుపుల్ని పగల గొట్టే ప్రయత్నాలు ఆరంభించారు. ఈ లోపల కొందరు గోడకు వేయటానికి నిచ్చెన్ల కోసం పరుగు తీసారు. ఈ గందరగోళ పరిస్థితిలోనే న్యాయం అడగటానికెళ్ళిన మహ దేవ నాయకర్ గార్ని వారి మనుషుల్ని టేకు తోట ఎస్టేట్ లో త్యాగరాజన్ మనుషులు గేటు మూసి చంపబోతున్నారు, అనే వార్త దావనంలా సిటీ అంతా పాకిపోయింది. ఫోన్ల మీద సమాచారం అందగానే దొరికిన ఆయుధం పట్టుకొని నాయకర్ అభిమానులు వీధుల్లోకి బయలుదేరారు. ఇదే సమయంలో అటు నుంచి త్యాగరాజన్ సిటీలో తన వర్గం గుండా నాయకులకి ఫోన్లు కొట్టడంతో మరో పక్క వాళ్ళు కూడ ఆయుధాలతో వీరంగం చేస్తూ వీధుల్లోకి వచ్చేసారు. దాంతో ప్రధాన వీధుల్లో రెండు వర్గాలు మోదుకొని పరిస్థితి అదుపు తప్పి ఘర్షణలకు దారి తీసింది.

అక్కడ మెట్ల వెంట దారి చేసుకొని దొరికిన వాడ్ని దొరికినట్టు విరగ దీస్తూ మహా దేవ నాయకర్ వచ్చేస్తుంటే ఆయన కంట పడే ధైర్యం లేక ఎట్టయప్ప పక్కకు తప్పుకున్నాడు. సరాసరి ఆఫీసు డోర్ ని సమీపిస్తుండగా బయట గొడవ విని ఏం జరగుతుందో తెలుసుకోడానికి తలుపు తీసి బయటి కొచ్చింది కలక్టర్ లక్ష్మి.

మహా దేవ నాయకర్ తో ఆమెకు పరిచయం లేదు గాని గతంలో ఒకటి రెండు సార్లు చూసింది, విని వుంది అయినా సరే తను కలెక్టరన్న అధికార దర్పం అహంకారం తో ధైర్యంగా గుమ్మానికి అడ్డంగా నిలబడి కళ్ళెర్ర చేసింది ‘‘ఎవర్నువ్వు? ఎక్కడికి సరాసరి వచ్చేస్తున్నావ్? ఇది త్యాగరాజన్ గారి ఎస్టేటని తెలిసే వచ్చావా? ప్రాణాలతో తిరిగి వెళ్ళాలనుందా? ఆగు..........అక్కడే ఆగి పో’’ అంటూ హూంకరించింది.

కాని మహ దేవ నాయకర్ ఆగలేదు

గుబురు మీసం దువ్వుతూ బెబ్బులిలా పెద్ద పెద్ద అంగలతో ఆమె ముందుకొచ్చి కళ్ళలోకి ఉరిమి చూసాడు.

‘‘నన్నాగమని చెప్పటానికి నువ్వెవరు? త్యాగరాజన్ పెళ్ళానివా? ఉంపుడు గత్తెవా? లేపు కొచ్చిందానివా? ఎవరే నువ్వు? ఇక్కడ నీకేం పని? ఆడదానివి మర్యాదగా పక్కకి తప్పుకో’’ అంటూ హెచ్చరించాడు.

ఆ మాటలకు లక్ష్మి అహం దెబ్బ తింది.

‘‘ఏయ్ మర్వాద.... నాలుక దగ్గరుంచుకొని మర్యాదగా మాటాడు. నన్నెవరునుకుంటున్నావ్?’’ అనరిచింది.

‘‘ఎవరా !’’ అంటూ నవ్వాడు మహ దేవ నాయకర్.

‘‘మధురై రాజ వంశీకుడ్ని. నువ్వెవరో తెలీకుండా వచ్చాననుకుంటున్నావా? ఎక్కడి వాళ్ళు అక్కడుంటే మర్యాద. కాని చోట వుండి తప్పుడు వేషాలేస్తూ మర్యాద గురించి అడక్కూడదు కలక్టరమ్మా, పక్క జిల్లా దానివి మా జిల్లాతో నీకేం పని ఎందుకిక్కడున్నావని నేనడగను. నీ మొగుడిది ఎక్కడో ఉద్యోగం,  నీ పిల్లలు ఆమెరికాలో, నీ ఉద్యోగం పక్క జల్లాలో కాని నువ్వుండేది నెలకు పది రోజులు మా మధురైలో. నీ పదవిని హోదాని త్యాగరాజన్ కి తాకట్టు పెట్టి వాడికి ఉంపుడు గత్తెగా మారావ్. వాడి భూ కుంభ కోణాల్లో నీకు ప్రధాన పాత్ర ఉంది. ఇదేనా నీ బతుకు?’’ అంటూ కడిగి పారేసాడు. ఆ మాటలకి రెచ్చిపోయి లక్ష్మి ‘‘నన్ను ఉంపుడు గత్తె అంటావా? నిన్నూ’’ అంటూ కొట్టడానికి చేయెత్తింది. మరు క్షణం ఆమె చెంప చెళ్ళుమంది.

‘‘నా మీదికే చేయెత్తే ధైర్యం ఎక్కడిది నీకు? ఛీ డబ్బు పిశాచి. అర్హత లేని నీలాంటి నీతి మాలిన వాళ్ళకి ఉన్నత పదవులు దక్కబట్టే ప్రజాస్వామ్యం యిలా నవ్వుల పాలవుతోంది. నా కూతుర్ని చంపటానికి మీరంతా చెన్నైకి మనుషుల్ని పంపిస్తారా. మీ అంతు చూస్తా తప్పుకో’’ అంటూ ఆమెను పక్కకు ఒక్క తోపు తోసి లోనకెళ్ళిపోయాడు మహ దేవ నాయకర్.


ఆ విసురుకు తూలి కిందపడిన్ది లక్ష్మి. ‘‘రేయ్ నీ కూతురు బతకదురా. మా గురించి పేపర్లకు ఎక్కించి కోర్టులో కేసు వేసాక అదింక బతకదు. చూస్తుండు’’ అనరిచింది ఆవేశం పట్టలేక.

మరు క్షణం సర్రున కత్తిదూసి ఆమె పీక మీద ఉంచాడు మహ దేవ నాయకర్. కళ్ళు నిప్పు కణాల్లా ఎర్రబారాయి. చేతిలో యమ పాశంలా రుస్తున్న ఖడ్గాన్ని, ఆయన ఆవేశాన్ని చూసి ఒక్కసారిగా వణికి పోయింది లక్ష్మి. చంపేస్తాడని భయపడిన్ది.

‘‘ఆడ దానివై పోయావ్. స్త్రీ హత్య పాతకం నాకక్కర్లేదు. బతికి పోయావ్ పో. ఇదే మగాడివైతే ఇప్పుడే నీ తల నరికి తీసుకు పోయే వాడ్ని. నా గురించి ఏమనుకుంటున్నావ్ ?  నా కూతురికి ఏమన్నా జరిగిందంటే చూడు త్యాగరాజన్ తో బాటు మీలో ఒక్కరు ఒక్కరూ ప్రాణాలతో వుండరు. నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో’’ అనరిచాడు. సింహ ఘర్జనలా వున్న ఆ గొంతు విన్నాక ఇక లక్ష్మికి నోరు పెగల్లేదు. అటు పక్క తలుపు తీసుకుని పక్క గదిలోకి వెళ్ళిపోయింది.

వెంటనే త్యాగరాజన్ టేబుల్ తాళం పగల గొట్టి వెతగ్గా లోపలున్న లహరి ఫైల్ దొరికింది. దాన్ని మడిచి జేబులోకి తోసి వెను తిరిగాడు. ఇదే సమయంలో బయట మరో పక్క వున్న ఎట్టయప్ప లక్ష్మిని రహస్య మార్గం వెంట బయటికి పంపించేసి తనో ఇనప రాడ్ అందుకొని మహ దేవ నాయకర్ మనుషుల మీదికి దూసుకెళ్ళాడు.

ఇక మహ దేవ నాయకర్ తనకు త్యాగ రాజన్ కనబడలేదన్న కోపంతో ఖడ్గాన్ని చేత బట్టి వృద్ద కిషోరంలా ఆ భవనమంతా కలతిరిగాడు. తన మీది కొచ్చిన గుండాల్ని కరవాలంతో నిర్దాక్షిణ్యంగా గాయ పరిచాడు. ప్రాణాలు మాత్రం తీయ లేదు. కాని సహస్రను చంపటానికి ధన గిరి బేచ్ ను చెన్నైకు పంపకం చేసిన ఎట్టయప్పను మాత్రం క్షమించే ఉద్దేశం ఆయనకి లేదు. వాడ్ని చంపాలనే వెదుకుతూ మరీ వెళ్ళాడు.

కాని ప్రమాదం గ్రహించిన ఎట్టయప్ప మహ దేవ నాయకర్ కి దొరక్కుండా మేడ పైనుంచి కిందకు దూకేసి తప్పించుకున్నాడు. కాళ్ళు విరిగినంత బాధను కూడ లెక్క చేయకుండా లేచి పరుగెత్తాడు. సరిగ్గా ఇదే సమయంలో బయట వాళ్ళు కాంపౌండ్ ఎంట్రన్స్ గేటు తలుపుల్ని విరగొట్టుకొని ప్రవాహంలా మహ దేవ నాయకర్ కు సాయంగా దూసుకొచ్చేసారు.

ఇక ఆ తర్వాత పరిణామాల్లో టేకు తోటలో అర్ధ గంట పైగా సాగిన పోరాటంలో త్యాగరాజన్ మనుషులు చిత్తుగా ఓడి పోయి పారి పోయారు. వాళ్ళు మరి కొంత మంది కూడ గట్టుకొని వచ్చేలోన మహా దేవ నాయకర్ మనుషులు ఎస్టేట్ భవంతికి నిప్పు పెట్టారు.

సాధారణంగా ఇలాంటి సందర్భాల్లో నాయకులనే వాళ్ళు తప్ప ధనిక కుటుంబాల్లో ఎవరూ కలుగ జేసుకోరు. గోడ మీద పిల్లి వాటంగా తటస్థంగా ఉండిపోతారు. ఏ వర్గం మీద అభిమానం వున్నా అది మనసులోనే గాని బయటకు చూపించరు. కాని మధ్య తరగతి దిగువ స్థాయి ప్రజలు అలా కాదు వారికి అభిమానం వున్నా ఆగ్రహం వున్నా బయట పడతారు వెంటనే.

మధురైలోని పేద మధ్య తరగతి ప్రజల్లో మహా దేవ నాయకరన్నా ఆయనా కూతురు సహస్రన్నా విపరీతమైన అభిమానం వుంది. నగంరలో ఎక్కడ ఏ మూల ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకోడానికి ముందుంటారు. గతంలో ఇళ్ళు తగలబడినప్పుడు, గ్యాస్ సిలిండర్లు పేలి ప్రమాదాలు జరిగినప్పుడు, వరదల్లో లోతట్టు ప్రాంతాలు మునిగి పోయినప్పుడు, విష జ్వరాలు సోకి బాధ పడుతున్నప్పుడు ప్రభుత్వం కన్నా ముందు స్పందించి తమ వంతు సాయం అందించి వారిని ఓదార్చి వచ్చిన  సందర్భాలున్నాయి. అంతే కాదు పేద వాడ్ని నాకీ సాయం చేయండి అంటూ ఎవరు అర్థించినా కాదనకుండా లేదనకుండా సాయం అందిస్తారు. ఎవరికన్నా అన్యాయం జరిగితే ఆ విషయం వెళ్ళి చెప్పుకుంటే చాలు మహ దేవ నాయకర్ తన మనుషుల్ని పంపించి అవసరమైతే తనే వెళ్ళి దగ్గరుండి న్యాయం జరిగించిన సందర్భాలున్నాయి.

నాయకర్ కుటుంబం మీద అక్కడి ప్రజలకున్న అభిమానం అపారమైంది. ఎప్పుడైతే మహ దేవ నాయకర్ టేకు ఎస్టేట్ కు బయలుదేరాడో అప్పుడే అసలు విషయం ప్రజల మధ్యకు వెళ్ళి పోయింది.

సహస్రను చంపించడానికి త్యాగరాజన్ చెన్నైకి మనుషుల్ని పంపించాడని, మహ దేవ నాయకర్ న్యాయం అడగటానికి వెళ్తే టేకు ఎస్టేట్ గేట్లు మూసి లోన చంపాలని ప్రయత్నిస్తున్నారని దొమ్మి జరుగుతోందని నగరమంతా  వార్తలు వ్యాపించాయి. దాంతో ఒక్కసారిగా ప్రజాభిమానం పెల్లుబికింది ఎవరికి వారు చేతికి దొరికిన ఆయుధం అందుకొని వీధుల్లోకొచ్చేస్తున్నారు. ఎదురు పడుతున్న గుండాల్ని భరతం పడుతున్నారు. గొడవ ఆరంభంలో ఆస్పత్రి వద్ద వుండగానే నగర పోలీస్ కమీషనర్ మహ దేవ నాయకర్ కు ఫోన్ చేసి ఎ యస్ పి ప్రకాష్ ను వదిలేయమని అడగ్గా మహ దేవ నాయకర్ ఒక హెచ్చరిక చేసాడు.

ఈ ఒక్క రోజు మీరు కళ్ళు చెవులు నోరు మూసుక్కూచోండి అంటూ. ఆ వెంటనే సిపి హోం మినిస్టర్ కి ఫోన్ చేసి పరిస్థితి వివరించటం జరిగింది. పరిస్థితి విషమించక ముందే అదనపు బలగాల్ని పంపించమనీ అర్ధించాడు.

ఆ ఫోన్ చేసిన కాస్సేపటికే ముఖ్యమంత్రి చెల్వి చెందామరై ఫోన్ కాల్ వచ్చింది. కమీషనర్ ని అడిగి మధురైలో పరిస్థితిని తెలుసుకుంది. మహ దేవ నాయకర్ కమీషనర్ చేసిన హెచ్చరిక గురించి వింది.

సాధారణంగా ఏ రాజకీయనాయకుడైనా సమకాలీన పరిణామాల్లో రాజకీయ లబ్ధిని ఆశించటం సహజం కొన్ని సందర్భాల్లో ప్రజా జీవితం అస్తవ్యస్తమవుతున్నా పట్టించుకోరు. ఇక్కడా అక్షరాలా అదే జరిగింది.

అక్రమార్కుడు కుంభకోణాల పుట్ట అయిన త్యాగరాజన్ సాక్షాత్తు మాజీ సి యం కి మనవడు. పార్టీలో ముఖ్యుడు కూడ కాబట్టి త్యాగరాజన్ ని దెబ్బ తీస్తే మాజీ సి యం ని దెబ్బ తీసినట్టే. ప్రతి పక్ష పార్టీ పరువు మరింత దిగజారుతుంది. ఆ పార్టీ ప్రతిష్ట దెబ్బ తింటుంది. తమ పార్టీకి తిరుగుండదు. కాబట్టి జగన్ మోహన్ ని మరింత ఇరుకున పెట్టే వ్యూహం తోనే స్పెషల్ ఫోర్స్ రావటం ఆలస్యమవుతుంది. ఈ లోపల పరిస్థితిని గమనిస్తుండండి. ఉన్న పోలీసు బలగంతోనే ఇరు వర్గాల్ని అదుపు చేయటానికి ప్రయత్నించండి. మహ దేవ నాయకర్ ని సేఫ్ గా ఇంటికి చేర్చి రెండ్రోజులు హౌస్ అరెస్ట్ లో వుంచండి. మిగిలిన విషయాలు లా అండ్ ఆర్డర్ అదుపు లోకి వచ్చాక చూద్దాం అంటూ ఆదేశించింది.

ఆ ఆదేశాన్నిబట్టి అల్లర్లు వెంటనే అదుపులోకి తేవటం సియం గారికి ఇష్టం లేదని కమీషనర్ కి అర్ధమై పోయింది. ఆ తర్వాత ఏం జరిగి వున్టుందో వూహించు కోవచ్చు.

ఇరు వర్గాలూ స్ట్రీట్ ఫైట్స్ కి తెగ బడ్డంతో మధురై జన జీవనం స్తంభించింది. ఇదే అదనుగా అల్లరి మూకలు చెలరేగాయి.

ఉదయం తెరచిన షాపులే చకచకా మూత పడి షట్టర్లు దించి తాళాలు వేసేసారు. లాఠీలు వూపుకుంటూ వచ్చిన పోలీసులు ప్రేక్షకుల్లా మిగిలి పోయారు తప్ప కత్తులు కర్రలు బరిసెలు ఇనుప రాడ్ ల వంటి మారణాయుధాలతో తలపడుతున్న ఇరు వర్గాల్ని అదుపు చేసే ప్రయత్నాలు చేయలేదు. వారి మారణాయుధాల ముందు తమ లాఠీలు ఎందుకు కొరగావని వాళ్ళకు తెలుసు.

అల్లర్లు మొదలయిన అర్ధ గంట లోపే మిగతా వాళ్ళు రంగం లోకి దిగి వార్తలు పంపించటం ఆరంభించారు. యుద్ధ రంగాన్ని తలపిస్తున్న మధురై మెయిన్ వీధుల్లోకి వేన్ మీద వెళ్ళి వీడియో కెమెరాతో షూట్ చేస్తే ప్రమాదమని వాళ్ళకు తెలుసు. కెమెరా భుజాన వేసుకొని బిల్డింగ్ లు గోడలు కవర్ చేసుకొని షూట్ చేస్తుండగా నేరుగా టీవిల్లో ప్రత్యక్ష ప్రసారం ఆరంభమైంది.

గొడవ మొదలయిన గంట తర్వాత ఎలాగో పోలీసులు మహ దేవ నాయకర్ ను అదుపు లోకి తీసుకొని సురక్షితంగా ఆయన ఇంటికి చేర్చి పటిష్టమైన పోలీసు కాపలాతో హౌస్ అరెస్ట్ లో వుంచారు. ఇక బయట పరిస్థితి నగరంలో ఎక్కడ చూసినా భీభత్సంగా వుంది. అంతకంతకూ పెరిగి పోతున్న ప్రజాభిమానం చూసి త్యాగరాజన్ గుండాలు రెచ్చి పోయారు. వాళ్ళకి అల్లరి మూకలు తోడయ్యాయి.

అరుపులు, కేకలు, ఆర్తనాదాలతో మధురై వీధులు హోరెత్తి పోయాయి. ఈ ఘర్షణల్లో అధిక భాగం నష్ట పోయంది త్యాగ రాజన్ ఆస్తులే. మహా దేవ నాయకర్ ఆస్థుల్ని స్వచ్చందంగా కాపలా వుండి అల్లరి మూకలు గాని గుండాలు గాని అటాక్ చేయకుండా ఆయన అభిమానులే కాపాడుతున్నారు.

సుమారుగా పదకొండు గంటల తర్వాత అంటే ఘర్షణలు ఆరంభమైన సుమారు మూడు గంటల తర్వాత అనేక వేన్ లలో స్పెషల్ ఫోర్సు మధురై వీధుల్లోకి ప్రవేశించాయి. వారి రాక తో స్థానిక పోలీసులకు ధైర్యం చిక్కింది. ఆ తర్వాతనే అల్లరి మూకల పని పట్టే కార్యక్రమం మొదలైంది. ఒంటి గంటకంతా నగరమంతటా కర్ఫ్యూ విధించారు. అయినా సాయంత్రానికి గాని నగరం అదుపులోకి రాలేదు. అప్పటికే అక్కడ నగర శివార్లో వున్న త్యాగరాజన్ సెల్ ఫోన్ ద్వారా ఎప్పటి కప్పుడు పరిస్థితిని తెలుసుకుంటూనే వున్నాడు రిజర్వు పోలీసులు రంగ ప్రవేశం చేసారని తెలీగానే ఇక ఒక్క క్షణం కూడ అక్కడ ఆగకుండా కారు స్టార్ట్ చేసుకొని డైరెక్ట్ గా చెన్నైకి బయలు దేరాడు.

ఈ లోపల

రిజర్వు పోలీసులు రాక ముందు

ఒకటి వి ఛానల్ కు చెందిన వీడియో గ్రాఫర్ మహా దేవ నాయకర్ మీద ప్రజలకున్న అభిమానం చాటే హృదయాన్ని కదిలించే కొన్ని దృశ్యాల్ని షూట్ చేసాడు. అది లైవ్ టెలికాస్ట్ గాబట్టి నేరుగా టివిలోకి వచ్చేసింది.

‘‘ఓ మైగాడ్.............మధురైలో సహస్ర కింత ఫాలోయింగ్ వుందని ఇంత వరకూ నాకే తెలీదు’’ అన్నాడు అంత వరకు టివి వార్తలు చూస్తున్న విరాట్. ‘‘అవున్రా బాబూ’’ అన్నాడు సంభ్రమంతో చందూ.

అప్పటికే మధ్యాహ్నం పన్నెండు గంటలు దాటింది సమయం మధురై పట్టణంలోకి రిజర్వు పోలీసు దళాలు ఎంటరైన విషయాల్ని అప్పుడే టివి స్క్రోలింగ్ లో వేస్తున్నారు. ఎప్పుడు వచ్చారో గాని సహస్ర గది లోంచి వచ్చి విశాల దీక్షలు కూడ ఆసక్తిగా వార్తలు చూస్తున్నారు. విరాట్ లేవటం చూసి విరాట్ నువ్వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకో. నీ బట్టలు అక్కడే ఉంచాను. భోజనం వేళవుతోంది’’ అంది విశాల.

‘‘సహస్ర ఎలా వుంది?’’ అడిగాడు.

‘‘ఇంకా స్పృహలోకి రాలేదు’’ అంది దీక్ష.

‘‘విశాలా నా సెల్ ఫోను ఎక్కడుంది? సహస్ర ఫోను కూడ ఇవ్వు. ఓసారి ఫోన్ మాట్లాడాక స్నానానికెళ్తాను’’ అన్నాడు.

ఫోన్లున్న కవర్లు రెండూ తెచ్చింది విశాల.

ముందుగా సహస్ర సెల్ అందుకొని ఆన్ చేసాడు. సహస్ర తల్లి మూగాంబికై నంబర్ కు ఫోన్ చేసాడు. వెంటనే లైన్ లో కొచ్చిందావిడ. ఫోన్ చేసింది తన కూతురనుకొని అమ్మాయ్ సహస్రా అంది ఆమె గొంతులో ఆందోళన ధ్వనిస్తోంది.

‘‘ఆన్టీ నేను ...... విరాట్ ని’’ అన్నాడు.

టివి సౌండ్ తగ్గించి...

లేచి ఇవతలికొచ్చాడు.

‘‘సహస్ర ఎక్కడ? పక్కనుందా? మీరు క్షేమంగా వున్నారా?’’ ఆత్రంగా అడిగింది మూగాంబికై.

‘‘క్షేమంగా వున్నాం ఆన్టీ. మీరు కంగారు పడకండి. సహస్ర నాతోనే వుంది.’’

‘‘కంగారు పడకుండా ఎలా ఉంటాం విరాట్. ఎన్నిసార్లు ఫోన్ చేసినా మీ యిద్దరి ఫోన్లూ స్విచ్చాఫ్ లోనే వున్నాయి.’’

‘‘అవును ఇక్కడ పరిస్థితులు బాగలేదని ఫోన్ లు స్విచ్చాఫ్ లోనే వుంచాం’’

‘‘ఓసారి సహస్రతో మాట్లాడతాను. ఫోనివ్వు’’

ఫోనివ్వటానికి సహస్రకి స్పృహ వస్తే గదా!

మూగాంబికై అభ్యర్ధన విరాట్ కి ఒకింత గాభరా పుట్టిచ్చింది. ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయక పోతే కంగారు పడతారు.‘‘రాత్రంతా మాకు నిద్ర లేక పోడంతో చాలా అలసిపోయాం. సహస్ర ఇంకా గాఢ నిద్ర లోనే వుంది. ఇప్పుడే టివి వార్తలు చూసాను. మధురైలో గొడవల గురించి వార్తలొస్తున్నాయి. మీరక్కడ క్షేమమే గదా ఆంటీ?’’

‘‘మేం క్షేమమే బాబూ........  చెన్నై గుండాలతో త్యాగ రాజన్ సహస్ర మీద దాడి చేయించుంటాడని ధర్మ చెప్తేనూ........’’

‘‘లేదు లేదు...... ఆ గొడవకి త్యాగరాజన్ కి సంబంధం లేదు ఆన్టీ. ధర్మ టివి వార్తలు చూసి పొరబాటు పడ్డాడు. సహస్రకి బాగా తెలిసిన ఒక ఆన్టీ. శిఖామణి అనే గుండా కిడ్నాప్ చేస్తుండగా సహస్ర అడ్డుకోవటంతో ఆ గొడవ ఆరంభమైంది మేం సేఫ్ గానే తప్పించుకున్నాం’’

‘అలాగా అంతా ఆ మీనాక్షి తల్లి దయ. మీరు క్షేమంగా వున్నారు చాలు. ఇక్కడ ఇవాళ గాక పోతే రేపయినా గొడవలు ఆరంభమయ్యేవే. మా గురించి కంగారు వద్దు. గొడవలు పెరక్కూడదని పోలీసులు అంకుల్ని తీసుకొచ్చి హౌస్ అరెస్ట్ లో ఉంచారు. పక్కనే వున్నారు ఓసారి మాటాడతావా?’’

‘‘వద్దులే ఆన్టీ. అంకుల్ నామీద చాలా కోపంగా వుండుంటారు.’’

‘‘అదేం లేదయ్యా. అయిందేదో అయింది మాటాడు’’ అంది మూగాంబికై. క్షణం తర్వాత అటునుంచి ‘‘హాలో!’’ అంటూ గంభీరంగా వినవచ్చింది మహ దేవ నాయకర్ గొంతు.

‘‘నమస్తే అంకుల్’’ అన్నాడు విరాట్

‘‘చెప్పు విరాట్ రాత్రి అక్కడ ఏం జరిగింది?’’ గాభరాగా అడిగాడు మహా దేవ నాయకర్.

‘‘అంకుల్ ఏం జరిగిందో చెప్పే ముందు మీకు ఓ మాట చెప్పాలి. మీకు నామీద కోపం ఉండొచ్చు సహజం. ముక్కు ముఖం తెలీని ఓ కుర్రాడు తన కూతుర్ని లవ్ చేస్తే ఏ తండ్రికయినా కోపం వస్తుంది. కాని అదేమిటో నాకే తెలీదు. చూడగానే సహస్ర నాకు నచ్చింది. నేనూ తనకు నచ్చాను. ఇక ఈ పాటికే మీకు నా వివరాలు తెలిసి ఉంటాయి. మీకో మాట మాత్రం ఇవ్వగలను నన్ను దాటకుండా సహస్రను ఎవరూ ఏమీ చేయలేరు. సహస్ర నా ప్రాణం. ఎలా కాపాడుకోవాలో నాకు తెలుసు. కాబట్టి మీరు మా ప్రేమను అర్ధం చేసుకొని నన్ను నమ్మితేనే ఇక్కడ ఏం జరిగిందో చెప్పగలను.’’

‘‘నేను నిన్ను నమ్ముతున్నాను. మీ ప్రేమను అర్ధం చేసుకున్నాను. మీ మీద కోపం లేదు. సరేనా? సహస్ర నిజంగా క్షేమంగా ఉంది గదా?’’

‘‘క్షేమంగా ఉంది భయపడాల్సిన పనిలేదు. రాత్రి మేమిద్దరం గొప్ప ప్రమాదం నుంచి బయట పడ్డాం’’ అంటూ ఇక దాచకుండా చకచకా రాత్రి విషయాలు వివరించాడు. అయితే విశాల పేరు చెప్పకుండా. ఫ్రెండు తమను కాపాడినట్టు చెప్పాడు. అంతా విని బాధగా నిట్టూర్చాడు మహ దేవ నాయకర్.

‘‘ఒకె విరాట్ అమ్మాయి స్పృహలోకి రాగానే మాకు ఫోన్ చేయించి మాట్లాడిన్చు. ఈ హౌస్ అరెస్ట్ నుండి బయట పడగానే ఆన్టీ నేను చెన్నై వస్తాం’’ అన్నాడు.

కాస్సేపు ఆయనతో మాటాడి లైన్ కట్ చేసాడు. తర్వాత తన సెల్ ఆన్ చేసి ధర్మా సెల్ కి ఫోన్ చేసాడు.

వెంటనే లైన్ లో కొచ్చాడు ధర్మ

అప్పటికే వాళ్ళంతా మధురై చెన్నైమార్గం మధ్యలో ఎక్కడో బస్ ఆపి హోటల్లో భోంచేస్తున్నారు. విరాట్ ఫోన్ రాగానే ధర్మా భోజనం ఆపి...‘‘ఏమిట్రా విరాట్ మూడు రోజులుగా నీ ఫోన్ లేదు. రాత్రి చెన్నైలో గొడవ టివిలో చూడగానే మీరెలా వున్నారో తెలీక చాలా కంగారు పడ్డాం. అందుకే మన వాళ్ళందరితో బస్ లో బయలు దేరి వస్తున్నాం’’ అన్నాడు ధర్మ.

‘‘వచ్చే వాడివి నేరుగా రాకుండా మహ దేవ నాయకర్ కి ఎందుకు లీక్ చేసావ్...? అక్కడ మధురై గొడవలతో భగ్గుమంటోంది తెలుసా? మహ దేవ నాయకర్ ని పోలీసులు హౌస్ అరెస్ట్ లో వుంచారు. రెండు వర్గాలు వీధిన పడి కొట్టుకుంటున్నారు. త్యాగరాజన్ జాడ తెలీటం లేదంటున్నారు పోలీసులు. చెన్నై పారి పోయాడని కొందరంటున్నారు. టివి వార్తలు చూసావా?’’ అంటూ విరాట్ అడుగుతుంటే అవతల ధర్మ....

‘‘సారీ..... సారీ విరాట్. మేం ఇప్పుడే ఇక్కడ హోటల్లో టివి చూస్తున్నాం. మధురై పరిస్థితి చాలా దారుణంగా వుంది. సందేహం లేదు. ఇలా జరుగుతుందనుకోలేదు. ఇప్పుడు కూడ నాయకర్ కి అసలు విషయం తెలీక పోతే బాగుండదని వెళ్ళి చెప్పాను. త్యాగరాజన్ని ఓసారి హెచ్చరిస్తాడని దీనివలన ప్రయోజనం ఉంటుందని ఆశించాను కాని రెండు వర్గాలు కొట్టుకుంటూ వీధిన పడతాయనుకోలేదు. టేకు ఎస్టేట్ భవనం తగలబడ్డం టివిలో చూసాను.’’

‘‘చూసావ్ గదా, ప్రస్తుతం మీరు చెన్నైరావద్దు మదురైకి వెళ్ళిపొండి’’

‘‘లేదు లేదు మిమ్మల్ని కలవకుండా మీరెలా వున్నారో చూడకుండా వెనక్కి వెళ్ళేప్రసక్తే లేదు. ఎలాగు ఇంత దూరం వచ్చేసాం. చెన్నై వచ్చేస్తాం.’’

ధర్మ నిర్ణయం విన్నాక

ఏం చెప్పాలో విరాట్ కి అర్ధం కాలేదు

అభిమానంతో తన కోసం వస్తున్న మితృ బృందాన్ని రావద్దని అడ్డు చెప్పలేడు. అలాగని వాళ్ళంతా ఇక్కడికొచ్చేస్తే తమ ఉనికి బయట పడిపోతుంది. ఒక పక్క పోలీసులు మరో పక్క శతృవులు తమకోసం గాలిస్తున్నారు.

...............ఈ సస్పెన్స్ వచ్చేవారం దాకా.........

జరిగిన కథ
మరిన్ని సీరియల్స్
vedika