Go Telugu - Telugu Weekly Web Magazine
ఈ సంచికలో కథలు సీరియల్స్ శీర్షికలు సినిమా కార్టూన్లు

ఈ సంచికలో >> శీర్షికలు >>

అవీ ఇవీ - భమిడిపాటి ఫణిబాబు

సాధారణంగా, ఏ వస్తువైనా, అప్పుడప్పుడైనా ఒకసారి వాడకపోతే, అది “ తుప్పు” పట్టొచ్చు, లేదా అవసరానికి ఉపయోగించకపోవచ్చు. ఇదివరకటి రోజుల్లో, అలాటి సందర్భాలు అంతగా ఉండేవి కావు, పెద్దకారణమంటూ ఉండేది కాదు. ముందుగా ఇంట్లోకి అవసరమైన వస్తువులనే కొనుక్కునేవారు. వాటిని సాధ్యమైనంతవరకూ , వాడి, ఓ కండిషన్ లో ఉంచుకునేవారు. Ofcourse,  అవన్నీ పాత పధ్ధతులూ, ఇంకా ఇక్ష్వాకుల కాలంలోనే ఉన్నారూ , అని ఈనాటి తరం వారు అనొచ్చు. ఎవరి అభిప్రాయం వారిదీ..

ఉదాహరణకి, ప్రభుత్వ ఆఫీసుల్లో పనిచేసేవారి సంగతే తీసికోండి. ఆఫీసుని బట్టీ, ఆ వ్యక్తి హోదాను బట్టీ, ఏ కొత్త సంవత్సరాని( జనవరి 1 ) కో, ఏ దీపావళి కో , కొన్ని గిఫ్టులు ఇస్తూంటారు. అలాటివాటిలో  ఓ ఖరీదైన బాల్ పెన్నూ, ఓ కొత్తసంవత్సర డైరీ తప్పకుండా ఉంటాయి. విశాల హృదయం ఉన్న ఆఫీసర్లైతే, ఇలా బహుమతీగా వచ్చిన పెన్నులూ, డైరీలూ, తనకు కావాల్సినవి ఉంచుకుని,, మిగిలినవన్నీ పంచిపెట్టేస్తూంటారు. కానీ, కొంతమందుంటారు, ప్రతీదీ తనకే ఉంచుకోవాలనే “ ఆబ” గాళ్ళు, ఛస్తే ఇంకోరికివ్వరు. పోనీ వాళ్ళైనా ఉపయోగించుకుంటారా అంటే, అదీ లేదూ. అయినా సంతకాలు చేయడానికి ఓ పెన్నుంటే చాలదూ, అయినా సరే, ఆయా సందర్భాలలో వచ్చిన పెన్నులూ, డైరీలూ, తన డ్రాయరులో  దాచుకుంటాడు. అలా ఏళ్ళ తరబడీ, దాచుకున్న బహుమతులన్నిటినీ, ఏదో రోజు తీయాలిగా, ఆరోజు కాస్తా వస్తుంది, ఎప్పుడూ.. ఈయన గారు రిటైరయ్యే రోజు. ఆ  బాల్ పెన్నుల్లోని  రీఫిల్లులు, ఎండిపోయి, ఈయన వయస్సొచ్చేసి, ఎవరికీ ఉపయోగపడకుండా పోతాయి.. కారణం వాటిని వాడాల్సిన సమయంలో వాడకపోవడం.

అలాగే , పెళ్ళిళ్ళల్లో ఇదివరకటి రోజుల్లో, చేతి గడియారాలిచ్చేవారు, అవీ అంతే,  వచ్చాయి కదా అని బీరువాలో దాచుకుంటే, పనికొస్తాయా? అవసరానికి ఒక్కటీ పని చేయదు. మరి అన్నేసి వాచీలెందుకంటా, నెత్తినేసి కొట్టుకోడానికా? ఏ సరుకు తీసికోండి, వాడకం సరీగ్గాలేకపోతే అన్నిటికీ అదే గతి.

అంతదాకా ఎందుకూ,  భవిష్యత్తులో లాభాలొస్తాయని, చాలా మంది, ఎక్కడ పడితే అక్కడ, ఎపార్టుమెంట్లు కొనేస్తూంటారు. కానీ వాటిలో వాళ్ళూ ఉండరూ, ఇంకోరికి అద్దెకూ ఇవ్వరూ. తాళాలు పెట్టేసి, ఏడాదికోసారి ఆస్థిపన్ను కడుతూంటారు. నిజమే, భవిష్యత్తుకోసం కొనడం, మంచిదే, కానీ, ఓ ఇల్లైనా, ఓ వస్తువైనా వాడితేనే కదండీ, కండిషన్ లో ఉండేదీ? కనీసం అప్పుడప్పుడైనా ఏవరో ఒకరు రావడమూ, పోవడమూ చేస్తేనే కదా, ఇల్లెలా ఉందో చూసుకోవడమూ, బూజులు దులుపుకోవడమూ  చేసి, మళ్ళీ గోడలకి రంగులూ అవీవేస్తే శుభ్రంగా ఉంటుంది. మనవైపైతే కొన్ని చోట్ల చెదలు కూడా పడతాయి. ద్వారబంధాలూ, గడపలూ చెదపట్టేస్తే ఏమిటిట గతి?

దేవుడు మనకి బుధ్ధిలాటిదోటి ఇచ్చాడు. జంతువులకీ, మనుషులకీ తేడా అదే కదా. కానీ, ఈరోజుల్లో చూస్తే, అసలు ఆ “ మెదడు” అనేదానికి పనే లేదు. ఎక్కడ చూసినా యాంత్రికం.. ఒకానొకప్పుడు, మనకి ఏదైనా  విషయం గురించి అవగాహన లేనప్పుడు, ఇంట్లో ఉండే ఏ  పెద్దవారినో అడగడం, వాళ్ళకి చెప్పడానికి టైము లేకపోతే, ఏ పుస్తకమో చదివి తెలిసికోడమో, పుస్తకం లేకపోతే, ఏ లైబ్రరీకో వెళ్ళి పుస్తకం తీసికుని, అందులో వివరాలు రాసుకోవడమో చేసేవారు. వీటన్నిటికీ సాయం, కనీసం ఓ “ ఆలోచన” చేసేవారు. ఇలా ప్రతీదానికీ ఓ exercise  ఉండేది. ఆరోగ్యాలుకూడా శుభ్రంగా ఉండేవి. కానీ, ఈరోజుల్లో, టెక్నాలజీ ధర్మమా అని, క్షణాల్లో పనైపోతోంది.. దానితో “మెదడు” కి పనేమీ లేకుండా పోతోంది.  ఇదివరకటిరోజుల్లో, పాల వాడనండి, చాకలి వాడనండి, ఇంకో కిరాణా కొట్టువాడనండి, నోటితో లెక్క కట్టి, వాళ్ళకి రావాల్సినదేదో తీసికెళ్ళేవారు. కారణం, పెద్ద పెద్ద చదువులొచ్చినా, రాకపోయినా, కనీసం ఇరవయ్యో  ఎక్కందాకా నేర్చుకునేవారు. కానీ ఈ రోజుల్లో ఏ కొట్టుకైనా వెళ్ళి సరుకులు తీసికుంటే, ఓ  calculator  లో లెక్క కడితేనే కానీ, చెప్పలేని పరిస్థితి.

ఒకానొకప్పుడు, అంటే విడివిడిగా  ఇళ్ళున్నరోజుల్లో, ఇల్లూ, వాకిలీ ఓ చీపురుతో తుడిచేవారు. ఎంత తుడిచినా, ఆ ఇంటావిడ, “ కొద్దిగా నడుం వంచి చీపురేయమ్మా.. “ అని సతాయించేవారు.. కానీ, ఈరోజుల్లో రెండు రూమ్ములూ/ మూడు రూమ్ములూ మాత్రమే ఉంటున్న, ఎపార్టుమెంట్లలో, పనిమనిషో లేదా ఆధునిక భాషలో  Maid   ముందుగా అడిగేది, “ మీ ఇంట్లో  Vacuum Cleaner “ ఉందా అని. తిన్నతిండి,  అరగడానికి ఆ ఇల్లు  తుడవడాలూ, అంట్లు తోముకోడాలూ  శారీరిక వ్యాయామాలుగా ఉపయోగించేవి. అసలు ఈరోజుల్లో ఒళ్ళే వంగదాయె. అందుకే ఆరోగ్యాలూ అంతంత మాత్రమే..
 

ఇలా చెప్పుకుంటూ పోతే, ఏ విషయం తీసికున్నా షార్టు కట్టే. కానీ , ఈ యాంత్రీకరణం వలన మనం కోల్పోతున్నదేమిటో గ్రహించలేక పోతున్నారు. నిజమే, ప్రతీ పనికీ, ఈరోజుల్లో ఓ “ ఆయుధం “ ఉంది, ఉపయోగించుకుంటే తప్పేమిటీ అనొచ్చు. కానీ మనుషులు ఏదో బాగుపడతారనే కదా, ఓ బుధ్ధీ, మెదడూ ఇచ్చాడూ, దానికి కూడా అప్పుడప్పుడు పని చెప్తూండాలి. లేకపోతే, పాడుపడిపోయిన ఇల్లు లాగానో, తుప్పు పట్టేసిన వస్తువు లాగానో, ఎండిపోయిన బాల్ పెన్నులాగానో తయారవడానికి ఎంతో టైము పట్టదు, ఇలాగే సాగితే.

మన పరిస్థితి ఎలాగూ, “  Beyond economic repairs “   అయిపోయింది, కనీసం మన పిల్లలకైనా, వారి వారి మెదడు పదునుపెట్టేటట్టు చూసుకోవడం, వాళ్ళని కన్నందుకు మన ధర్మం.

సర్వే జనా సుఖినోభవంతూ…

మరిన్ని శీర్షికలు
jyotishyam vijnaanam